Pages

20, నవంబర్ 2020, శుక్రవారం

పుష్కరుడు పేరుమీద నే పుష్కరాలు వచ్చాయి.

 అందరికి  నమస్కారం  .... 

ఈ రోజు నుంచి  తుంగభద్ర నది పుష్కరాలు కదా అందుకని మనం పుష్కరుడు గురి౦చి తెలుసుకుందాం  ....


పుష్కరుని చరిత్ర :

పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఈశ్వరుడు తందిలునితో ఏమి వరం కావాలో కోరుకోమని అడిగాడు. తందిలుడు ఈశ్వరునితో తనకు శాశ్వతంగా ఈశ్వరునిలో స్థానంకావాలని కోరుకున్నాడు. ఈశ్వరుడు సంతోషించి తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో అతనికి శాశ్వతంగా స్థానం ఇచ్చాడు. అందువలన అతడు మూడున్నర కోట్ల పుణ్యతీర్ధాలకు అధికారి అయ్యాడు. ఇలా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి లభించింది. పోషించే శక్తిని సంస్కృతంలో పుష్కరం అంటారు. అలా తందిలుడు పుష్కరుడైయ్యాడు. 

బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు జలంతో అవసరమేర్పడి జలంకోసం ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుని తనకు ఇవ్వవలసినదని కోరుకున్నాడు. ఈశ్వరుడు అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండంలంలోకి ప్రవేశించాడు.

 బ్రహ్మ కార్యం పూర్తి అయిన తరువాత ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవాధారమైన జలంకావాలని బ్రహ్మదేవుని ప్రార్థించాడు . ఆ కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు కానీ పుష్కరుడు తాను బ్రహ్మదేవుని వదలి వెళ్ళలేనని చెప్పాడు. అప్పుడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరులు కలసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. 

 ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులు మిగిలిన కాలం సంవత్సరమంతా మధ్యాహ్న సమయంలో రెండు మూహూర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించారు. 

 ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి అధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో వస్తారు కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యప్రథమని పురాణాలు చెప్తున్నాయి.

 

 పుష్కరం అంటే:

పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుంది.

బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణంగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. 

పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.


1) గంగా నది                    మేష రాశి

2) రేవా నది (నర్మద)  వృషభ రాశి

3) సరస్వతీ నది        మిథున రాశి

4) యమునా నది         కర్కాట రాశి

5) గోదావరి                 సింహ రాశి

6) కృష్ణా నది                 కన్యా రాశి

7) కావేరీ నది                 తులా రాశి

8) భీమా నది                 వృశ్చిక రాశి

9) పుష్కరవాహిని/రాధ్యసాగ నది      ధనుర్ రాశి

10) తుంగభద్ర నది      మకర రాశి

11) సింధు నది         కుంభ రాశి

12) ప్రాణహిత నది మీన రాశి


తుంగభద్ర నది:

తుంగభద్ర నది కృష్ణా నదికి ముఖ్యమైన ఉపనది. రామాయణ కాలంలో పంపానదిగా పిలువబడిన తుంగభద్ర నది కర్ణాటకలో పడమటి కనుమలలో జన్మించిన తుంగ, భద్ర అను రెండు నదుల కలయిక వలన ఏర్పడినది. 

భౌగోళికంగానే కాకుండా చారిత్రకంగానూ ఈ నదికి ప్రాధాన్యత ఉంది. దక్షిణ భారతదేశ మధ్యయుగ చరిత్రలో వెలిసిన విజయనగర సామ్రాజ్యం ఈ నది ఒడ్డునే వెలిసింది. హంపి, మంత్రాలయం లాంటి పుణ్యక్షేత్రాలు ఈ నది ఒడ్డున వెలిశాయి.

పెద్దలు తుంగభద్రను భారతదేశంలోని పంచగంగల్లో ఒకటిగా పేర్కొన్నారు.

                కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమీ

                భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః


లోక సమస్త సుఖినో భవంతు.....


********* మీ ఉషగిరిధర్ ***********



1 కామెంట్‌: