**********
ఎనిమిదేళ్ళ చంటి కి తలంటి,
కొత్త బట్టలేసి, దేవుడికి దణ్ణం పెట్టించి,
అమ్మ ఉగాది పచ్చడి పెట్టి తినమని పంపి
పిండి వంటలకి కావలసిన పదార్థాలు రెడీ చేసుకుంటోంది .
చంటి చటుక్కున ఏడుపుతో తిరిగి వచ్చింది..
నాన్న గారాల కూతురు డెందుకు ఎడుస్తోందో అర్థం కాలేదు అమ్మకి.
“ఉగాది పచ్చడి నువ్వు చేస్తే బాగుండేది.
ఈ మాటు అంతా చేదుగా ఉంది...” అని విషయం చెప్పి మళ్ళీ ఏడవ సాగింది చంటి.
“పోనీలే, మహా నైవేద్యం అవగానే నీకు బూర్లు పెడతాను”,
అంది అనునయంగా.
చంటి ఏడుపు విని పూజ చేసుకుంటున్న మామ్మ గారు బయటికొచ్చి కారణమడిగారు.
“ఏం లేదండీ,
చంటికి ఉగాది పచ్చడి కొంచెం చేదుగా ఉందట”,
అని సర్ది చెప్పబోయింది అమ్మ.
“ఏం కాదు మామ్మా,
పచ్చడి తిన్నపుడు మొదట ఏ టేస్ట్ వస్తుందో,
ఏడాది అంతా అలాగే ఉంటుందని నువ్వేగా చెప్పావ్?” అని కోపంగా అంది చంటి.
అవునన్నట్టు మామ్మగారు తల ఊపారు.
“చూడు, నేను చేదుని ఫస్ట్ టేస్ట్ చేశా. నెక్స్ట్ ఇయర్ అంతా చేదే!”
అని మళ్ళీ ఏడుపు మొదలెటింది .
ఆవిడ, “ఊరుకోరా వెర్రి తల్లి !
నీకు కాకరకాయంటే ఇష్టం కదూ!
దానివల్ల నీ జీవితమేమీ పాడవలేదుకదా!
ఏదో వేపపువ్వు కానీ ఖర్చు లేకుండా మనింట్లోంచే వచ్చింది
గనుక కాస్త ఎక్కువ వేశాను.
దానికే ఇంత రాద్ధాంతం చేయాలా?
నీ అమాయకత్వం గానీ,
తలరాతని ఉగాది పచ్చడేం మర్చలేదురా!
ఇంతోటి దీనికోసమా ఇంత ఏడుపు?” అని మళ్ళీ పూజ గదిలోకి వెళ్ళారు.
ఆవిడన్న మాటలకి ఏదో స్ఫురించిన దానిలా వంటింట్లోకి వెళ్ళి,
అమ్మ చంటితో,
“పెద్ద వాళ్ళ తిట్లు మనకి ఆశీర్వాదాలు.
అలాగే మామ్మగారు, నాన్నని, అత్తని పెంచి గొప్పవాళ్ళని చేశారు.
ఆవిడ చేతి పచ్చడి తిని వాళ్ళు ఫస్ట్ రాంక్ తెచ్చుకున్నారు.
అయినా నువ్వు ఏడుస్తున్నావని దీన్ని తీపి చేయమని దేవుడికి దణ్ణం పెట్టుకున్నాను.
ఇప్పుడు చూడు,
దేవుడు పచ్చడిని తీపి చేశాడో, లేదో?”
అని ఒక గిన్నెలో పచ్చడి పెట్టి చంటికిచ్చింది.
“అవునమ్మా, దేవుడు దీన్ని తీపి చేశాడు.
నా నెక్స్ట్ ఇయర్ తియ్యగా ఉంటుందోచ్”,
అని చంటి చకచకా తినేసి, ఆటకి పక్కింటికి వెళ్ళాడు.
మహానైవేద్యం అయ్యిన తరువాత ఉగాది పచ్చడిని నోట్లో వేసుకున్న మామ్మగారు “ఇదేం చోద్యమే తల్లి!
ఇంత తియ్యగా ఉంటే చంటిది చేదని గోల చేసింది ?” అన్నారు.
“అత్తయ్యా,
మీరన్నట్టు పచ్చడి తలరాతను ఎలాగూ మార్చలేదు కనుక
అందులో డజను అరటిపళ్ళ గుజ్జూ,
పావు కిలో బెల్లమూ కలిపానులెండి.
మరీ ఎక్కువయ్యిందంటారా?”, జవాబిచ్చింది కోడలు .
“నైవేద్యం పెట్టిన పచ్చట్లోనా నువ్వు మార్పులు చేసింది?”
అని ముక్కు మీద వేలేసుకున్నారావిడ.
