Pages

మన పురాణాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మన పురాణాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, ఫిబ్రవరి 2022, గురువారం

యక్ష ప్రశ్నలు!


    మహా భారతం లోని అరణ్య పర్వంలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజును పరీక్షించటానికి యమధర్మ రాజు యక్షుని రూపంలో అడిగిన ప్రశ్నలే యక్ష ప్రశ్నలు. వ్యవహారికములో చిక్కు ప్రశ్నలను, సమాధానం కష్టతరమైన ప్రశ్నలకు పర్యాయంగా యక్ష ప్రశ్నలు అనే మాటను వాడతారు.


          పూర్వం మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తన ఆరణి లేడికొమ్ములలో యిరుక్కొని పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నలుగురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడి మాయమైనది. వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు. నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజు బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు తమ్ములను చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు. అంతలో అదృశ్యవాణి పలికినది... ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆధీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పక, నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు


72 ప్రశ్నలు-జవాబులు.!

ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు:


1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)

2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)

3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)

4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)

5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)

6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)

7. మానవునికి సహయపడునది ఏది? (ధైర్యం)

8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన)

9. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును? (అధ్యయనము వలన)

10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధుభావము సంభవించును.)

11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మృత్యు భయమువలన)

12. జీవన్మృతుడెవరు? (దేవతలకూ, అతిధులకూ పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు)

13. భూమికంటె భారమైనది ఏది? (జనని)

14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)

15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)

16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)

17. తృణం కంటె దట్టమైనది ఏది? (చింత)

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)

19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్యచే)

20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? ( యజ్ఞం చేయుటవలన)

21. జన్మించియు ప్రాణంలేనిది (గుడ్డు)

22. రూపం ఉన్నా హృదయం లేనిదేది? (రాయి)

23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన)

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)

25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)

26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)

27. ధర్మానికి ఆధారమేది? (దయ దాక్షిణ్యం)

28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)

29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)

30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)

31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)

32. మనిషికి ఆత్మ ఎవరు? ( కుమారుడు)

33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)

34. మనిషికి దేనివల్ల సంతసించును? (దానం)

35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)

36. సుఖాల్లో గొప్పది ఏది? (సంతోషం)

37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (అహింస)

38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (మనస్సు)

39. ఎవరితో సంధి శిధిలమవదు? (సజ్జనులతో)

40. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండునదేది? (యాగకర్మ)

41. లోకానికి దిక్కు ఎవరు? (సత్పురుషులు)

42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? (భూమి, ఆకాశములందు)

43. లోకాన్ని కప్పివున్నది ఏది? (అజ్ఞానం)

44. శ్రాద్ధవిధికి సమయమేది? (బ్రాహ్మణుడు వచ్చినప్పుడు)

45. మనిషి దేనిని విడచి సర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? ( వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడచినచో)

46. తపస్సు అంటే ఏమిటి? ( తన వృత్తి, కుల ధర్మం ఆచరించడం)

47. క్షమ అంటే ఏమిటి? ( ద్వంద్వాలు సహించడం)

48. సిగ్గు అంటే ఏమిటి? (చేయరాని పనులంటే జడవడం)

49. సర్వధనియనదగు వాడెవడౌ? ( ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు)

50. జ్ఞానం అంటే ఏమిటి? (మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం)

51. దయ అంటే ఏమిటి? ( ప్రాణులన్నింటి సుఖము కోరడం)

52. అర్జవం అంటే ఏమిటి? ( సదా సమభావం కలిగి వుండడం)

53. సోమరితనం అంటే ఏమిటి? (ధర్మకార్యములు చేయకుండుట)

54. దు:ఖం అంటే ఏమిటి? ( అజ్ఞానం కలిగి ఉండటం)

55. ధైర్యం అంటే ఏమిటి? ( ఇంద్రియ నిగ్రహం)

56. స్నానం అంటే ఏమిటి? (మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం)

57. దానం అంటే ఏమిటి? ( సమస్తప్రాణుల్ని రక్షించడం)

58. పండితుడెవరు? ( ధర్మం తెలిసినవాడు)

59. మూర్ఖుడెవడు? (ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు)

60. ఏది కాయం? ( సంసారానికి కారణమైంది)

61. అహంకారం అంటే ఏమిటి? ( అజ్ఞానం)

62. డంభం అంటే ఏమిటి? (తన గొప్పతానే చెప్పుకోవటం)

63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (తన భార్యలో, తన భర్తలో)

64. నరకం అనుభవించే వారెవరు? (ఆశపెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితృదేవతల్నీ, ద్వేషించేవాడు, దానం చెయ్యనివాడు)

65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (ప్రవర్తన మాత్రమే)

66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (మైత్రి)

67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? (అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు)

68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు? (సుఖపడతాడు)

69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు)

70. ఏది ఆశ్చర్యం? (ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం)

71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? (ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు)

72. స్ధితప్రజ్ఞుడు అని ఎవరిని ఆంటారు? (నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందూ, కలిమి లేములందూ, సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతృప్తుడై అభిమానాన్ని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడుగా ఎవరైతే ఉంటాడో వానినే స్థితప్రజ్ఞుడంటారు)



12, జులై 2021, సోమవారం

పంచ మహా కావ్యములు


తెలుగు భాషలో పంచ మహా కావ్యాలు 


1. మను చరిత్రము - (అల్లసాని పెద్దన) :

 మను చరిత్రము లేదా స్వారోచిష మనుసంభవము.

 అల్లసాని పెద్దన రచించిన ఒక ప్రబంధ కావ్యము. 

ఇది వరూధినీ, ప్రవరాఖ్యుల ప్రేమ కథతో మొదలై స్వారోచిషునితో ముగుస్తుంది. 

 

2. పాండురంగ మాహాత్మ్యము - (తెనాలి రామకృష్ణుడు)

 తెనాలి రామలింగడు రచించిన ఐదు అశ్వాసాల గద్య పద్య కావ్యము.

 ఈ కావ్యంలో గత కవులు ఎవరూ వాడని కొత్త వర్ణనలు, అందునా తాను గతంలో వాడినవి మళ్ళీ వాడకుండా కవిత్వం చెప్పడంతో రామలింగడికి వికటకవి అన్న పేరువచ్చింది.

ఇందు ఇతివృత్తము పాండురంగని కథ.

 

3. ఆముక్త మాల్యద - (కృష్ణదేవరాయలు)

  విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ఈ "ఆముక్తమాల్యద" గ్రంథం. దీనికే "విష్ణుచిత్తీయం" అని మరోపేరు. 

ఈ ప్రబంధంలో గోదాదేవి పెంపుడు తండ్రియైన విష్ణుచిత్తుడు శ్రీవిల్లిపుత్తూరులో మన్ననారుస్వామి కోవెలలో అర్చకుడిగా జీవిస్తున్నాడు. విష్ణుచిత్తునకు తులసీవనంలో స్త్రీశిశువు లభిస్తుంది.  సంతానం లేని తనకు విష్ణువే కరుణించి తనకీ శిశువును ఇచ్చాడని ఆమెకు గోదాదేవి అని నామకరణం చేసి పెంచుకోసాగాడు. ఆమె పూర్వజన్మలో భూదేవి.  తన తండ్రి స్వామి కోసం అల్లిన పూలమాలను చాటుగా ధరించి గోదాదేవి తన నీడను చూచుకొని ఆనందించి తిరిగి ఆ మాలను యథాస్థానంలో పెట్టేది.  ఆ మాలనే విష్ణుచిత్తుడు స్వామికి అర్పించేవాడు. ఆ కారణంగానే గోదాదేవికి ఆముక్తమాల్యద అను పేరు వచ్చింది.  తాను పూర్వజన్మలో సత్యభామా దేవిననే విషయం తెలుసుకుంది. అలనాటి శ్రీకృష్ణుడు ఇప్పుడు శ్రీరంగంలో వెలిసాడని, ఆ శ్రీరంగేశుని తన భర్తగా వలచింది. ఆ స్వామి ఆమెను వలచాడు. ఇరువురికి వివాహం జరుగుతుంది.

 

4. వసు చరిత్రము - (రామరాజ భూషణుడు.)


   రామరాజభూషణుడు గా పేరుగాంచిన భట్టుమూర్తి, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజాల లో ఒకడు.   వసు చరిత్రము భారతములోని ఉపరిచర వసువు కథ, ఇది కవిత్రయము రాసిన మహా భారతంలో 45 పద్యాలలో ఉన్నది,

   దీనిని రామరాజభూషణుడు విస్తరిస్తూ ఆరు ఆశ్వాసాలు కల ఒక ప్రత్యేక గ్రంథంగా మలిచారు, తిరుమల నాయునికి ఈ కృతి అంకితమివ్వబడింది.

   

5. పారిజాతాపహరణం - (నంది) ముక్కు తిమ్మన.


ఐదు అశ్వాసాలు గల ప్రబంధం. సంస్కృత భాగవతములోని మూడు పద్యాల కథని అద్భుతముగా పెంచి రచించాడు.

నారదుడు పారిజాతం కృష్ణులవారికి ఇవ్వడం, ఆ సమయములో వారు రుక్మిణీదేవి మందిరములో ఉండటం, ఆ పారిజాతాన్ని రుక్మిణికి ఇవ్వడం, దానిని తెలుసుకొని సత్య ఆగ్రహించడం, అటుపై రకరకాల మలుపులు, పాద పీడనం, చివరకు దేవతలతో యుద్ధం, పారిజాత వృక్షం సత్య తీసుకొని రావడం, తులాభారంతో కథ సుఖాంతం.


సంస్కృత భాషలో పంచ మహా కావ్యాలు 


1.రఘువంశము ( కాళిదాసు రచన):

మహాకవి కాళిదాసు రాసిన సంస్కృత మహాకావ్యం. ఈ గ్రంథంలో 19 సర్గలలో రఘు రాజవంశానికి సంబంధించిన కథలు, దిలీపుని కుటుంబం, అగ్నివర్ణుని వరకు అతని వారసుల గూర్చి వివరించబడినది. వీరిలో రఘుమహరాజు, దశరథ మహారాజు, రాముడు ఉన్నారు.


2.కుమారసంభవము ( కాళిదాసు రచన):

పార్వతితో పరమేశ్వరుని వివాహం, అనంతరం కుమారస్వామి జననం తారకాసురుని వధ మొదలయిన విషయాలు మహాకవి కాళిదాసు చాలా చక్కగా వర్ణించాడు.


3.మేఘసందేశము ( కాళిదాసు రచన):

 కాళిదాసు రచించిన కావ్యత్రయం అని పేరు పొందిన మూడు కావ్యాలలో ఇది ఒకటి.కేవలం 111 శ్లోకాలతో కూడిన ఈ చిన్నకావ్యము కాళిదాసు రచనలలోను, సంస్కృత సాహిత్యంలోను విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది. 

 కుబేరుని కొలువులో ఉన్న ఒక యక్షుడు కొలువునుండి ఒక సంవత్సరం పాటు బహిష్కారానికి గురవుతాడు. ఆ యక్షుడు హిమాలయాలలోని కైలాసగిరికి పైన, అలకాపురిలో ఉన్న తన ప్రియురాలికి ఒక మేఘం ద్వారా సందేశం పంపుతాడు. మార్గసూచకంగా యక్షుడు ఆ మేఘానికి హిమాలయాలకు పోయే దారిలోనున్న పెక్కు దృశ్యాలను వర్ణిస్తాడు.మేఘ సందేశం కావ్యంలో కాళిదాసు వర్ణనా నైపుణ్యము, అలంకార పటిమ, పాత్ర చిత్రణ, శృంగార ప్రస్తావన అద్భుతంగా కనిపిస్తాయి. ఇంకా వివిధ భౌగోళిక అంశాలు చెప్పబడ్డాయి.


4.కిరాతార్జునీయము (భారవి రచన):

ఈ కావ్యం అర్జునుడు, మారు వేషంలో ఉన్న శివుని మధ్య జరిగిన యుద్ధాన్ని తెలుపుతూ రాయబడింది.ఇందులో కవి మహాభారతంలో వనపర్వంలోని ఒక చిన్న భాగాన్ని తీసుకుని వర్ణించాడు. 

5.శిశుపాలవధ (మాఘుని రచన)


శిశుపాల వధ 7 లేదా 8 వ శతాబ్దంలో మాఘ స్వరపరిచిన శాస్త్రీయ సంస్కృత కవితల రచన. ఇది సుమారు 1800 అత్యంత అలంకరించబడిన చరణాలలో 20 సర్గాలలో ఒక ఇతిహాసం.

1, జులై 2021, గురువారం

అల్లసాని వాని అల్లిక జిగిబిగి

ఈ టపా లో నేను స్కూల్ లో బాగా చెప్పి .....
మా తెలుగు మాస్టారు చేత మెప్పు పొందిన ..
ప్రసిద్ధమైన అల్లసాని పెద్దన గారి పద్యం గురంచి చెపుతాను :

అప్పుడు పద్యం మాత్రమే వచ్చు ... దాని అర్ధం ఇప్పుడు బాగా తెలిసింది .. 


అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ

పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన

స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్

గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్


మనుచరిత్ర అనగానే అందరికీ గుర్తొచ్చే పద్యం ఇది. 

అర్థం తెలిసినా తెలియకపోయినా, చదవగానే (వినగానే) "ఓహో!" అనిపించే పద్యం.


నిజానికి మనుచరిత్ర మనుచరిత్ర కాదు -
మను సంభవ చరిత్ర, "స్వారోచిష మను సంభవము". 

మనువుల్లో ఒకడైన స్వారోచిషుడి జన్మ వృత్తాంతం. 

అయితే మనుచరిత్ర అనగానే గుర్తొచ్చేది వరూధినీ ప్రవరాఖ్యులు.

వీళ్ళకీ ఆ స్వారోచిష మనువుకి ఉన్న సంబంధం యేమిటి? 

ఆ మనువు నాన్నమ్మ వరూధిని! అల్లసాని అక్కడనుంచి ప్రారంభించాడు కథని. 

ఆ భాగాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దాడంటే, అదే అసలు కథేమో అన్నంతగా ప్రచారం పొందింది. 

ఇదొక తమాషా అయిన కథ. ఇంతకీ ప్రవరుడెవరయ్యా, ఆ మనువు తాతగారేనా అంటే, కాదు. ఒక రకంగా అవును! అందికే ఇది విచిత్రమైన కథ అయ్యింది. 


ప్రవరుడి ఊరు అరుణాస్పదపురం. 

 అతను "ఆ పురి బాయకుండు", అంటే ఆ ఊరిని విడిచి ఎప్పుడూ వేరే ఊరికి వెళ్ళలేదు! 

అదేంటి, మరీ బొత్తిగా ఏ పెళ్ళికో పేరంటానికో అయినా పొరుగూరు వెళ్ళి ఉండడా అంటే అలా కాదు. 

వేరే ఊళ్ళో ఉద్యోగానికి కానీ tourist గా చూడ్డానికి కానీ ఎప్పుడూ వెళ్ళలేదని. 

కానీ యాత్రలు చెయ్యాలనే కోరిక మాత్రం ఉంది. 

యాత్రలంటే ప్రణయ యాత్రలో విహార యాత్రలో అనుకునేరు! తీర్థ యాత్రలు. 

మరి ఆ రోజుల్లో ఇప్పట్లా విమానాలూ అవీ లేవాయె, ఉన్నాయనుకొన్నా మానవులకి మాత్రం అందుబాటులో లేవాయె. 

తీర్థయాత్రలు చెయ్యడమంటే మాటలా మరి? కాబట్టి అతని కోరిక కోరికగానే ఉండిపోయింది. 

ఒక రోజు అనుకోకుండా ఓ సిద్ధుడు అతనింటికి వచ్చి, "నేను భూమంతా చుట్టేసాను, ఇది చూసాను అది చూసాను" అని ఓ చెప్పేసరికి,

పాపం ఈ ప్రవరుడికి కోరిక మరింత పెరిగిపోతుంది. 

ఎదోలాగ అతని దగ్గరనుంచి ఒక పాద లేపనం సంపాదిస్తాడు. 

సంపాదించిందే తడవుగా హుటాహుటిని హిమాలయాలకి బయలుదేరేస్తాడు, 

ఇంట్లో చెప్పకుండానే! మొదటిసారిగా, ఊరిని కూడా విడిచి వెళ్ళని ఆ ప్రవరుడు, హిమాలయాలని చూసినప్పుడు అవి ఎలా కనిపించాయో చెప్పే వర్ణన ఈ పద్యం.


ఈ పద్యం లో  అర్థం ముఖ్యం కాదు. పదాలూ, పదాల పొహళింపూ, శబ్ద సౌందర్యం, ఇవన్నీ మనలని మంత్రముగ్ధులని చేస్తాయి!

శబ్దం ప్రధానమైన ఇలాటి కవిత్వం అన్ని చోటలా అందాన్నివ్వదు. ఎక్కువైతే అజీర్తి చేస్తుంది కూడా! 

దీన్ని తగిన సందర్భంలో తగిన పాళ్ళలో వాడేడు కాబట్టే పెద్దన ఆంధ్రకవితా పితామహుడయ్యాడు.


 ఈ పద్యంలో ఛందస్సుకి సంబంధించిన విశేషాలు కూడా కొన్ని ఉన్నాయి.

 ఈ పద్యాన్ని చంపకమాలలో ఎందుకు రాసుంటాడు పెద్దన అని ఆలోచిస్తే, 

 "అటజని కాంచె" అన్న ప్రారంభం కోసం అని అనిపిస్తుంది. మొదటి నాలుగు లఘువులూ ఆ వెళ్ళడంలోని వేగాన్ని సూచించడం లేదూ! 

 ఇక మొదటి పాదంలో "అంబర చుంబి" దాకా చంపకమాల నడకతో సాగిన పద్యం,

 హఠాత్తుగా "శిరస్సరజ్ఝరీ" (తడక్-తడక్-తడక్) అన్న నడకలోకి మారిపోడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

 చంపకమాలతో ఇలాటి నడక సాధించవచ్చా అనిపిస్తుంది. అలానే రెండవ పాదంలో "అభంగ తరంగ మృదంగ" (తధింత-తధింత-తధింత) అన్న నడకకూడా!

ఇక ఇందులోని అర్థం విషయానికి వస్తే - 

"అటజని కాంచె భూమిసురుడు". ఏమిటి చూసాడు?

 "శీతశైలమున్" - హిమాలయాన్ని. ఎలాంటిదా హిమాలయం అన్నది మొత్తం పద్యం, రెండు పొడవైన సమాసాలు!

"అంబర చుంబి శిరః" - ఆకాశాన్ని ముద్దాడుతున్న శిఖరాలనుండి, 

"సరత్ ఝరీ పటల" - ప్రవహిస్తున్న సెలయేళ్ళ (జలపాతాల) గుంపులో, 

"ముహుర్ ముహుర్ లుఠత్" - మాటిమాటికీ దొరలుతున్న, 

"అభంగ తరంగ మృదంగ" - ఎడతెగని తరంగాలనెడి మద్దెలలు చేసే, 

"నిస్వన స్ఫుట నటన అనుకూల" - ధ్వనికి తగినట్లు నాట్యం చేసే, 

"పరిఫుల్ల కలాప" - విప్పారిన పింఛం కలిగిన, 

"కలాపి జాలమున్" - నెమళ్ళ గుంపుతో కూడినది. ఆకాశాన్నంటే పర్వత శిఖరాలనుంచి కిందకి ఉరుకుతున్న జలపాతాల తరంగాలు అనే మృదంగాలు చేసే ధ్వనికి అనుకూలంగా పురి విప్పి నాట్యం చేస్తున్న నెమ్మళ్ళ గుంపుతో ఉన్నది ఆ హిమాలయం. 

ఈ వర్ణనలో గొప్పతనం ఏమిటంటే, కవి హిమాలయ శిఖరాలనీ, జలపాతాలనీ, నెమళ్ళనీ అన్నిటినీ ఇక్కడ చిత్రించాడు. 

ఏదో వేరే వేరేగా చూపెట్టడం కాకుండా వాటన్నిటినీ చక్కగా లింక్ చేసాడు. అదీ కవి ఊహ అంటే! ఇంతకన్నా గొప్ప విషయం మరోటి ఉంది. 

నెమళ్ళు సాధారణంగా పురివిప్పి యెప్పుడాడతాయి? ఉరుముల శబ్దం విన్నప్పుడు, వాన పడేటప్పుడు. 

ఇక్కడ ఈ జలపాతాలు చేసే శబ్దానికి నాట్యం చేస్తున్నాయంటే, ఆ జలపాతాల హోరు మేఘ గర్జనలా ఉందన్నమాట! 

శిఖరాలు ఆకాశమంత యెత్తున్నాయి కాబట్టి, ఆకాశంలోని మేఘాలే వర్షిస్తున్నట్లుగా ఆ జలపాతాలున్నాయన్న మాట! ఇవేవీ పద్యంలో సూటిగా చెప్పలేదు, స్ఫురింప చేసాడు! దీనినే మనవాళ్ళు "అలంకార ధ్వని" అంటారు.

ఒక విషయాన్ని చెప్పకుండా చెప్పడమూ, చూపించకుండా చూపించడమే కదా కవిత్వమంటే!

ఇక, అక్కడ నెమళ్ళే కాక ఏనుగులు కూడా ఉన్నాయి. "కటక చరత్" - ఆ పర్వతాల మధ్యలో తిరిగే, "కరేణు కర" - ఏనుగుల తొండాల చేత, 

"కంపిత సాలము" - కదిలించి వెయ్యబడ్డ చెట్లు కలది, ఆ హిమాలయం. 

ఇక్కడకూడా కవి మనకి ఒక still photograph కాకుండా videoని చూపిస్తున్నాడు. ఏనుగులని మాత్రం చెప్పి ఊరుకుంటే అది still photograph అయి ఉండేది. 

అవి కదిపి కుదిపేస్తున్న చేట్లని కూడా చూపించి దీన్ని videoగా మార్చాడు అల్లసాని.

ఇదే "అల్లసాని వాని అల్లిక జిగిబిగి"!

25, జనవరి 2021, సోమవారం

అతిరథ మహారథులు..అంటే..ఎవరు?

అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం. 

అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం 

మనకు అర్థమవుతుంది. 

అయితే ఆ పదాలకు సరైన అర్థం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. 

మహామహా గొప్పవాళ్ళు వచ్చారనే అర్థంలో వాడతామనేది అందరికీ తెలుసు. 

ఆ పదాలకు అర్థాలేమిటో చూద్దాం.

యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి. 

ఇందులో 5 స్థాయులున్నాయి. అవి..

రథి, అతిరథి, మహారథి, అతి మహారథి, మహామహారథి.


1) రథి..ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలడు.

సోమదత్తుడు, 

సుదక్షిణ, 

శకుని, 

శిశుపాల, 

ఉత్తర, 

కౌరవుల్లో 96మంది, 

శిఖండి, 

ఉత్తమౌజులు, 

ద్రౌపది కొడుకులు ---------------------వీరంతా..రథులు.


2) అతి రథి (రథికి 12రెట్లు)..60,000మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.


లవకుశులు, 

కృతవర్మ, 

శల్య, 

కృపాచార్య, 

భూరిశ్రవ, 

ద్రుపద, 

యుయుత్సు, 

విరాట, 

అకంపన, 

సాత్యకి, 

దృష్టద్యుమ్న, 

కుంతిభోజ, 

ఘటోత్కచ, 

ప్రహస్త, 

అంగద, 

దుర్యోధన, 

జయద్రథ, 

దుశ్శాసన, 

వికర్ణ, 

విరాట, 

యుధిష్ఠిర, 

నకుల, 

సహదేవ, 

ప్రద్యుమ్నులు--------------.వీరంతా..అతిరథులు.


3) మహారథి (అతిరథికి 12రెట్లు)....7,20,000 మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.


రాముడు, 

కృష్ణుడు, 

అభిమన్యుడు, 

వాలి, 

అంగద, 

అశ్వత్థామ, 

అతికాయ, 

భీమ, 

కర్ణ, 

అర్జున, 

భీష్మ, 

ద్రోణ, 

కుంభకర్ణ, 

సుగ్రీవ, 

జాంబవంత, 

రావణ, 

భగదత్త, 

నరకాసుర, 

లక్ష్మణ, 

బలరామ, 

జరాసంధులు ---------------వీరంతా..మహారథులు.


4) అతి మహారథి (మహారథికి 12రెట్లు)...86,40,000 (ఎనభై ఆరు లక్షల నలభైవేలు) మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు.


ఇంద్రజిత్తు, 

పరశురాముడు, 

ఆంజనేయుడు, 

వీరభద్రుడు, 

భైరవుడు ----------------వీరు..అతి మహారథులు.


రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతి మహారథులు, 

అటు ఇంద్రజిత్తు - 

ఇటు ఆంజనేయుడు. 

రామలక్ష్మణ రావణ కుంభకర్ణులు మహారథులు మాత్రమే.


5) మహామహారథి (అతిమహారథికి 24రెట్లు) ...ఏకకాలంలో 207,360,000

(ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేలు) మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలడు.


బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, 

దుర్గా దేవి, 

గణపతి మరియు 

సుబ్రహ్మణ్య స్వామి, -----------------వీరంతా..మహామహారథులు.




                                                          🙏🙏🙏🙏🙏


                                      జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్