Pages

30, నవంబర్ 2020, సోమవారం

శ్రీ మహావిష్ణు ప్రతిష్ఠించిన రామలింగేశ్వరుడు ---క్షీరారామము

అందరికి  నమస్కారం  .... 


                          విశ్వరూపుడు, పార్వతీ మనోహరుడు, నాగాభరణుడు, సూర్యచంద్రాగ్ని లోచనుడు,  ముకుంద ప్రియుడు భక్తజనమందారుడైన పరమేశ్వరుడు ఆశ్రితజన వరదుడు. తన భక్తుడు  ఏ వరాన్ని అడిగినా  కాదనకుండా ఇచ్చే కరుణార్ధ్రహృదయుడు మన భోళాశంకరుడు . అందుకే ఆసేతు హిమాచల పర్యంతం ఆ పార్వతీ నాథుణ్ణి ద్వాదశ జ్యోతిర్లింగాల లోను, కాశీ రామేశ్వరాది మహాపుణ్య క్షేత్రాల్లోను, పంచారామ క్షేత్రాల్లోను  కనులార దర్శించి, చేతులారా పూజించి, భక్తులు ముక్తసంగులౌతున్నారు.

అలాంటి పార్వతీ మనోహరుడు మన రామలింగేశ్వరుడు

 స్థల పురాణం ...           

                పూర్వం వజ్రాంగుని కుమారు డైన తారకాసురుడు శివుణ్ణి గురించి ఘోరతపస్సు చేశాడు. శివుని అనుగ్రహం పొంది,  శివుని కుమారుని చేత మాత్రమే మరణం సంభవించేటట్లు గా వరం పొంది, తన రాజథానియైన శోణిత పురానికి చేరాడు. అనంతరం  క్షీరసాగర మథన సమయం లో  ఆ పాల సముద్రం నుండి ఆవిర్భవించిన అమృతలింగాన్ని హస్తగతం చేసుకొని,వర గర్వితుడై, ఇంద్రాది దేవతలను బాధించసాగాడు. అప్పుడు ఇంద్రాది దేవతలు   బ్రహ్మను ప్రార్ధించగా, శివ పార్వతులకు జన్మించే కుమారస్వామి వలననే  తారకాసుర సంహారం సాథ్యమని చెప్పాడు. నంతరం దక్షయజ్ఞధ్వంసం, సతీదేవి మరణం, పార్వతీ జననం, శివుని  గూర్చి పార్వతి తపస్సు, అనంతరం లోకకళ్యాణ కారకంగా శివపార్వతుల కళ్యాణం, అంగరంగవైభవంగా జరిగింది. ఆ ఆది దంపతులకు దివ్యతేజస్సంపన్నుడైన షణ్ముఖుడు జన్మించాడు.                                      

                   అనంతర కాలం  లో కుమారస్వామి తారకాసురుని తో  జరిగిన యుద్ధం లోథన దివ్యశక్తి  ఆయుథం తో తారకుని కంఠహారం లోని అమృతలింగాన్ని భేదించాడు. అది ఐదు పంచఖండాలై, దివ్యకాంతుల తో ఓంకారనాదం చేస్తూ, ఐదు ఆరామ స్థలాల్లో పడ్డాయి.శివుని పంచముఖ స్వరూపాలే నేటి ఈ పంచారామ క్షేత్రాలు.

                            ఈ ఐదు అమృతలింగ ఖండాలను ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు ఏక కాలం లో-దివ్య ముహూర్తం లొ వరుసగా – ఇంద్ర, సూర్య, కుమార, చంద్ర, విష్ణువులు విశ్వ కళ్యాణార్థమై ప్రతిష్ఠించి,పంచామృతాలతో అభిషేకించినట్లు పురాణాలు చెపు తున్నాయి. ఈ  తారకాసుర సంహార ఘట్టాన్ని స్కాంద, శివ పురాణాలు విశేషంగా వర్ణించాయి.

పంచారామ ప్రాథాన్యాలు

 1. అమరావతి  ( అమరేశ్వరుడు) దేవేంద్ర ప్రతిష్ఠ  (అఘోర స్వరూపం )— అమరావతి       

 2. దక్షారామం  (భీమేశ్వరుడు ) సూర్య ప్రతిష్ఠ      (తత్పురుష రూపం )--ద్రాక్షారామం

 3. కుమారారామం ( కుమార భీమేశ్వరుడు ) కుమారస్వామి  ప్రతిష్ఠ (వామదేవరూపం )  సామర్లకోట.

 4. సోమారామం   ( సోమేశ్వరుడు ) చంద్ర ప్రతిష్ఠ  (సద్యోజాత రూపం) గునుపూడి,బీమవరం.

 5. క్షీరారామం  (శ్రీ క్షీరా రామలింగేశ్వరుడు )  శ్రీ మహావిష్ణు ప్రతిష్ఠ (ఈశాన రూపం) పాలకొల్లు .                                                         

  రామలింగేశ్వరుడు- క్షీరారామము (పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా)

                 కుమారస్వామి చేత భేదించబడిన అమృతలింగ శిరోభాగాన్ని వశిష్ట గోదావరీ తీరానికి పశ్చిమం గాబ్రహ్మాది దేవతలు వెంటరాగా శ్రీమహావిష్ణువు శ్రీక్షీరా రామలింగేశ్వరుని, త్రిపుర సుందరీ  సమేతం గా ప్రతిష్ఠించి, శివుని కోర్కె మేరకు శ్రీమహావిష్ణువు  క్షేత్రపాలకుడిగా  శ్రీలక్ష్మీసమేతుడై జనార్ధనస్వామి రూపం తో శంఖ,చక్ర,గదా, పద్మ ధారియై  .ఈ క్షీరారామం లో కొలువు తీరాడు.

          పంచారామ క్షేత్రాలలో ఒకటైన క్షీరారామం పార్వతీ సమేతుడై 'శ్రీ రామలింగేశ్వరుడు' వెలసిన పరమ పావనమైన పుణ్య క్షేత్రం. ఇక్కడి శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుచే శివలింగం ప్రతిష్టించబడిన ఈ పుణ్య క్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్రపాలకుడు. ఆదిశంకరాచార్యులవారు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీ చక్రం ప్రతిష్ఠించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ క్షేత్రాన్ని క్షీరపురి పాలకొలను, ఉపమన్యుపురం, అనే పేర్లతో కూడా పిలుస్తూ వుంటారు. 

శివలింగం పైభాగం మొనదేలి ఉండటం వలన ఇక్కడి స్వామివారిని 'కొప్పు రామలింగేశ్వరుడు' అని కూడా పిలుస్తారు. ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పైభాగమని విశ్వసిస్తున్నారు. స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రాకార మంటపంలో పార్వతీ దేవి కొలువై వుంటుంది. 

ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ... రుణహర గణపతి ఆలయాలు కనిపిస్తాయి. ఈ రుణహర గణపతిని దర్శించడం వలన అప్పుల బాధల నుంచి బయటపడటం జరుగుతుందని భక్తులు భావిస్తుంటారు. ఇక్కడి రాజగోపురం 9 అంతస్తులను కలిగి 120 అడుగుల ఎత్తులో అద్భుతమైన శిల్ప కళతో అలరారుతూ వుంటుంది.

స్థలపురాణం 

పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలకుడి కోసం శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడి నుంచి పాలధారలు పొంగి పొర్లాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపురి, పాలకొలను ఉపమన్యుపురంగా ప్రసిద్ధి చెందినట్లు స్థలపురాణం చెబుతోంది.


                                             లోక సమస్త సుఖినో భవంతు

**** మీ ఉషగిరిధర్ ***********





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి