Pages

24, నవంబర్ 2020, మంగళవారం

అమరేంద్రుడు చేత ప్రతిష్ఠించబడిన --- అమరారామం

  అందరికి  నమస్కారం  ....                            

                              అమరేంద్రుడు చేత ప్రతిష్ఠించబడిన --- అమరారామం

                     కలిదోష నివృత్తి కొఱకు శౌనకాది మహామునులకు నారద మహర్షి  భూలోకమునందు గల  పవిత్ర పుణ్య స్థలాలను గూర్చి వివరిస్తూ  అమరేశ్వరుని  గురించి చెప్పినట్లు  స్కాంద పురాణం లో  కన్పిస్తోంది.అదే పంచారామాల్లో ఒకటైన అమరారామం


 స్థలపురాణం  :   ఈ అమరారామాన్ని  గురించిన విశేషాలు, స్కాంద పురాణం లో సహ్యాద్రి ఖండం లోను ,బ్రహ్మపురాణం పూర్వ ఖండం లోను. పద్మపురాణం ఉత్తర భాగం లోను ప్రస్తావించబడినట్లు స్థలపురాణం చెపుతోంది. 

                                 తారాకాసుర సంహారం పూర్తి చేశాడు కార్తికేయుడు. యుద్ధ సమయం లో తారకుని కంఠమందలి అమృతలింగం కుమారస్వామి శక్తి ఘాతాలకు ఐదు గా విడి పోయి ఆంధ్ర దేశం లో ఐదు ప్రదేశాల్లో పడ్డాయి.వాటినే మనం పంచారామాలని పిలుస్తున్నాము.

            ఆ పంచారామాల్లో ఒకటైన  ఈ అమరారామం లోని అమరేశ్వరుడైన ఇంద్రుని చేత ప్రతిష్ఠించబడటం వలన ఈ స్వామిని  అమరేశ్వరుడని, ఆ స్వామి కొలువైన ఈ నగరాన్ని ఇంద్రుని నగరం పేరున అమరావతి యని పిలుస్తున్నారు.  దీనిని” దక్షిణ కాశి”  యని  కూడ అంటారు.. 

                       దేవగురువైన బృహస్పతి ఆదేశానుసారం  ఇంద్రుడు  ఆశ్వయుజ శుద్ధదశమి నాడు  సమస్త దేవతా గణము జయజయధ్వానము లు చేయుచూ వెంటరాగా,    తారకాసురుని గళమందలి అమృత లింగము నుండి చెదిరిన ఒక శకలమును ఈ క్రౌంచగిరి పై ప్రతిష్ఠించినాడు              

                   శుద్ధ ధవళ కాంతులతో  ప్రకాశించుచున్న ఆ అమరేశ్వరుడు ప్రతిష్ఠించిన వెంటనే పైపైకి పెరిగి పోవటం ప్రారంభించాడట. అంత దేవేంద్రుడు అభిషేకములు చేసి, వివిధ దేవతాకుసుమములతోను,  బిల్వ పత్రములతోను పూజించినను స్వామి పెరుగుదల ఆగక పోవటంచేత  లింగాగ్రముపై  సీల కొట్టి, కృష్ణవేణీ జలం తో అభిషేకించగా స్వామి పెరుగుదల ఆగిందట.   ఇప్పటికీ లింగాగ్రంలో  తలపై నుండి జాలువారిన నెత్తుటి చారలు కన్పిస్తాయని భక్తులు చెప్పుకుంటుంటారు. 

             తారకాసురుని మరణానంతరం ఇంద్రుడు స్వామి ని  ప్రతిష్ఠించిన తర్వాతే   మహేంద్ర పదవిని మరల పొందాడు.  ఆ ఇంద్రుని చే ప్రతిష్ఠించబడిన స్వామి అమరేశ్వరుడిగా ఆరాథించబడుతున్నాడు.

      ఈ విషయాన్ని విన్న రాక్షస గురువు శుక్రాచార్యుడు బృహస్పతి చెంతకు వచ్చాడు.  “ కృష్ణానదికి వరదలొస్తే అమరేశ్వరుడు మునిగి పోయే ప్రమాదం ఉంది గదా! అటువంటి ప్రదేశం లో స్వామిని ఎలా ప్రతిష్ఠ చేయించారనే సందేహాన్ని” వెలిబుచ్చాడు బృహస్పతి తో శుక్రాచార్యుడు. అందుకు ” ఆత్మలింగం పడినచోట భూభాగం క్రింద పాతాళం వరకు క్రౌంచ పర్వతం ఉంది. దానిపై నున్న ఆమహాలింగం పెరగటం వల్ల, ఎంత వరదలొచ్చినా ఆ మహాలింగానికి వచ్చిన ముప్పు ఏమీలేదు.కృష్ణా ప్రవాహమే స్వామికి నమస్కరించి  ప్రక్కకు తిరిగింది కదా.  ఉత్తర దక్షిణాలు గా నది ప్రవహించడాన్ని మీరు గమనించారు కదా!” అన్నారట బృహస్పతి. ఆ యనంతరం దేవ గురువుల సూచనల మేరకు   అమరేశ్వరుని చుట్టుఅంబిక మొదలైన శివపరివారమంతా  కొలువు తీరింది . 


                                         లోక సమస్త సుఖినో భవంతు

**** మీ ఉషగిరిధర్ ***********

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి