Pages

సేకరణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సేకరణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, జులై 2021, సోమవారం

పంచ మహా కావ్యములు


తెలుగు భాషలో పంచ మహా కావ్యాలు 


1. మను చరిత్రము - (అల్లసాని పెద్దన) :

 మను చరిత్రము లేదా స్వారోచిష మనుసంభవము.

 అల్లసాని పెద్దన రచించిన ఒక ప్రబంధ కావ్యము. 

ఇది వరూధినీ, ప్రవరాఖ్యుల ప్రేమ కథతో మొదలై స్వారోచిషునితో ముగుస్తుంది. 

 

2. పాండురంగ మాహాత్మ్యము - (తెనాలి రామకృష్ణుడు)

 తెనాలి రామలింగడు రచించిన ఐదు అశ్వాసాల గద్య పద్య కావ్యము.

 ఈ కావ్యంలో గత కవులు ఎవరూ వాడని కొత్త వర్ణనలు, అందునా తాను గతంలో వాడినవి మళ్ళీ వాడకుండా కవిత్వం చెప్పడంతో రామలింగడికి వికటకవి అన్న పేరువచ్చింది.

ఇందు ఇతివృత్తము పాండురంగని కథ.

 

3. ఆముక్త మాల్యద - (కృష్ణదేవరాయలు)

  విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ఈ "ఆముక్తమాల్యద" గ్రంథం. దీనికే "విష్ణుచిత్తీయం" అని మరోపేరు. 

ఈ ప్రబంధంలో గోదాదేవి పెంపుడు తండ్రియైన విష్ణుచిత్తుడు శ్రీవిల్లిపుత్తూరులో మన్ననారుస్వామి కోవెలలో అర్చకుడిగా జీవిస్తున్నాడు. విష్ణుచిత్తునకు తులసీవనంలో స్త్రీశిశువు లభిస్తుంది.  సంతానం లేని తనకు విష్ణువే కరుణించి తనకీ శిశువును ఇచ్చాడని ఆమెకు గోదాదేవి అని నామకరణం చేసి పెంచుకోసాగాడు. ఆమె పూర్వజన్మలో భూదేవి.  తన తండ్రి స్వామి కోసం అల్లిన పూలమాలను చాటుగా ధరించి గోదాదేవి తన నీడను చూచుకొని ఆనందించి తిరిగి ఆ మాలను యథాస్థానంలో పెట్టేది.  ఆ మాలనే విష్ణుచిత్తుడు స్వామికి అర్పించేవాడు. ఆ కారణంగానే గోదాదేవికి ఆముక్తమాల్యద అను పేరు వచ్చింది.  తాను పూర్వజన్మలో సత్యభామా దేవిననే విషయం తెలుసుకుంది. అలనాటి శ్రీకృష్ణుడు ఇప్పుడు శ్రీరంగంలో వెలిసాడని, ఆ శ్రీరంగేశుని తన భర్తగా వలచింది. ఆ స్వామి ఆమెను వలచాడు. ఇరువురికి వివాహం జరుగుతుంది.

 

4. వసు చరిత్రము - (రామరాజ భూషణుడు.)


   రామరాజభూషణుడు గా పేరుగాంచిన భట్టుమూర్తి, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజాల లో ఒకడు.   వసు చరిత్రము భారతములోని ఉపరిచర వసువు కథ, ఇది కవిత్రయము రాసిన మహా భారతంలో 45 పద్యాలలో ఉన్నది,

   దీనిని రామరాజభూషణుడు విస్తరిస్తూ ఆరు ఆశ్వాసాలు కల ఒక ప్రత్యేక గ్రంథంగా మలిచారు, తిరుమల నాయునికి ఈ కృతి అంకితమివ్వబడింది.

   

5. పారిజాతాపహరణం - (నంది) ముక్కు తిమ్మన.


ఐదు అశ్వాసాలు గల ప్రబంధం. సంస్కృత భాగవతములోని మూడు పద్యాల కథని అద్భుతముగా పెంచి రచించాడు.

నారదుడు పారిజాతం కృష్ణులవారికి ఇవ్వడం, ఆ సమయములో వారు రుక్మిణీదేవి మందిరములో ఉండటం, ఆ పారిజాతాన్ని రుక్మిణికి ఇవ్వడం, దానిని తెలుసుకొని సత్య ఆగ్రహించడం, అటుపై రకరకాల మలుపులు, పాద పీడనం, చివరకు దేవతలతో యుద్ధం, పారిజాత వృక్షం సత్య తీసుకొని రావడం, తులాభారంతో కథ సుఖాంతం.


సంస్కృత భాషలో పంచ మహా కావ్యాలు 


1.రఘువంశము ( కాళిదాసు రచన):

మహాకవి కాళిదాసు రాసిన సంస్కృత మహాకావ్యం. ఈ గ్రంథంలో 19 సర్గలలో రఘు రాజవంశానికి సంబంధించిన కథలు, దిలీపుని కుటుంబం, అగ్నివర్ణుని వరకు అతని వారసుల గూర్చి వివరించబడినది. వీరిలో రఘుమహరాజు, దశరథ మహారాజు, రాముడు ఉన్నారు.


2.కుమారసంభవము ( కాళిదాసు రచన):

పార్వతితో పరమేశ్వరుని వివాహం, అనంతరం కుమారస్వామి జననం తారకాసురుని వధ మొదలయిన విషయాలు మహాకవి కాళిదాసు చాలా చక్కగా వర్ణించాడు.


3.మేఘసందేశము ( కాళిదాసు రచన):

 కాళిదాసు రచించిన కావ్యత్రయం అని పేరు పొందిన మూడు కావ్యాలలో ఇది ఒకటి.కేవలం 111 శ్లోకాలతో కూడిన ఈ చిన్నకావ్యము కాళిదాసు రచనలలోను, సంస్కృత సాహిత్యంలోను విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది. 

 కుబేరుని కొలువులో ఉన్న ఒక యక్షుడు కొలువునుండి ఒక సంవత్సరం పాటు బహిష్కారానికి గురవుతాడు. ఆ యక్షుడు హిమాలయాలలోని కైలాసగిరికి పైన, అలకాపురిలో ఉన్న తన ప్రియురాలికి ఒక మేఘం ద్వారా సందేశం పంపుతాడు. మార్గసూచకంగా యక్షుడు ఆ మేఘానికి హిమాలయాలకు పోయే దారిలోనున్న పెక్కు దృశ్యాలను వర్ణిస్తాడు.మేఘ సందేశం కావ్యంలో కాళిదాసు వర్ణనా నైపుణ్యము, అలంకార పటిమ, పాత్ర చిత్రణ, శృంగార ప్రస్తావన అద్భుతంగా కనిపిస్తాయి. ఇంకా వివిధ భౌగోళిక అంశాలు చెప్పబడ్డాయి.


4.కిరాతార్జునీయము (భారవి రచన):

ఈ కావ్యం అర్జునుడు, మారు వేషంలో ఉన్న శివుని మధ్య జరిగిన యుద్ధాన్ని తెలుపుతూ రాయబడింది.ఇందులో కవి మహాభారతంలో వనపర్వంలోని ఒక చిన్న భాగాన్ని తీసుకుని వర్ణించాడు. 

5.శిశుపాలవధ (మాఘుని రచన)


శిశుపాల వధ 7 లేదా 8 వ శతాబ్దంలో మాఘ స్వరపరిచిన శాస్త్రీయ సంస్కృత కవితల రచన. ఇది సుమారు 1800 అత్యంత అలంకరించబడిన చరణాలలో 20 సర్గాలలో ఒక ఇతిహాసం.

27, ఏప్రిల్ 2021, మంగళవారం

కాయగూరల సంస్కృత నామములు !

  • అవాక్పుష్పీ (బెండకాయ)

  • జంబీరమ్ (నిమ్మకాయ)

  • ఆలుకమ్ (బంగాళదుంప)

  • ఉర్వారుక (దోసకాయ)

  • కారవేల్ల (కాకరకాయ)

  • కోశాతకీ (బీరకాయ)

  • బృహతీ (ముళ్ళవంకాయ)

  • మరిచకా (మిరపకాయలు)

  • రాజకోశతకీ (కాప్సికం)

  • లశున (వెల్లుల్లి)

  • వార్తాక (వంకాయ)

  • బింబమ్ (దొండకాయ)

  • శీతలా (సొరకాయ)

  • క్షుద్రశింబి ( గోరుచిక్కుడు)

  • పలాండు (ఉల్లిగడ్డ)

  • కూష్మాండ (గుమ్మడికాయ)

  • తౄణబిందుక (చేమదుంపలు)

  • మూలకమ్ (ముల్లంగి)

  • రంభాశలాటు (పచ్చి అరటికాయ)

  • సూరణ (కంద)

 హేచ్చరిక ::: పొరపాటున కూరగాయల వాళ్ళని ఈ పేర్లతో కూరలు అడగకండి .. ఏదో తిడుతున్నాము అనుకుంటారు .. 

                                                                                          





14, ఏప్రిల్ 2021, బుధవారం

వసంత నవరాత్రులు

🌻. ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు 🌻

(సేకరణ )

చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి...అంటే ‘ఉగాది’ నుంచి మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. 

అలాగే ఋతువులలో తొలి ఋతువైన వసంతఋతువు మొదలవుతుంది.
ఈ వసంతఋతువుకు ఎంతో ప్రముఖ్యత ఉంది.
శిశిరంలో .... ఆకులు రాల్చి సర్వస్వం కోల్పోయిన ప్రకృతికాంత...నవ పల్లవాలతో చిగిర్చి , పూల సోయగాలతో కనువిందులు చేస్తూ , సుగంథాల  సేవలతో ప్రకృతి పురుషునకు మకరందాల విందులు అందించే..

 ఈ వసంతఋతువు అంటే గుణరహితుడైన ఆ పరమాత్మనకు కూడా ఇష్టమే. 

 అందుకే... ‘ఋతూనా కుసుమాతరః’ అని ‘గీత’లో చెప్పాడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు.

 అనంతమైన కాలంలో , కేవలం ఏడాదికో రెండు నెలలు ఆయుష్షు ఉండే ఈ వసంతఋతువుకు ఎందుకంత ప్రాధాన్యత ?


ఈ వసంత ఋతువులోనే దేవదేవుడైన శ్రీమహావిష్ణువు పరిపూర్ణ మానవునిగా అవనిపై అవతరించాడు.
అదే శ్రీరామావతారం. 

అంతవరకూ రాక్షసుల యుద్ధాలతో విసిగి వేసారిన సర్వలోకాలు శ్రీరామ జననంతో మంచి రోజులు వచ్చాయని సంతోషించాయి. 

పుడుతునే సకల జీవకోటికీ ఆనందాన్ని కలిగించినవాడు శ్రీరాముడు. 

అందుకే.. సంవత్సరంలో తొలి పండుగ అయిన ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ ‘వసంత నవరాత్రులు’ సంబరంగా జరుపుకోవడం ఆచారమైంది. 

భగవంతుని ఆరాధనలో ‘భక్తి’ తొమ్మిది రకాలు


   శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం

   అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనం


శ్రవణం - కీర్తనం - స్మరణం - పాదసేవనం - అర్చనం - వందనం - దాస్యం - సఖ్యం - ఆత్మనివేదనం. ఇవి నవవిధ భక్తిమార్గాలు. భాగవతోత్తములుగా ప్రసిద్ధిగాంచిన ఎందరో భక్తులు ఈ నవవిధ భక్తి మార్గలలో ఏదో ఒక మార్గాన్ని ఎంచకుని పరమాత్మని సన్నిధి చేరుకున్నవారే.   


నవరాత్రులు తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు , ఒక్కొక్క భక్తి మర్గాన్ని ఎంచుకుని , అలా తొమ్మిది రోజులు తొమ్మిది భక్తి మార్గాలతో భగవంతుని సేవించి తరించడానికే... ఈ నవరాత్రులను ఏర్పాటు చేసారు మన ఋషులు.


సంవత్సర చక్రంలో వసంత శరదృతువులు రెండూ ప్రాణులకు రోగకారకమైనవి. 

కోరలతో భయంకరంగా ఉన్న తన నోరు తెరుచుకొని వికటాట్టాహాసం చేస్తూ , ప్రాణులను మృత్యుదేవత కబళించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. 

అలా మృత్యుముఖంలో పడకుండా తప్పించుకోదలచిన వారు పరమేశ్వరిని సేవించి ఆమె అనుగ్రహాన్ని పొందాలి. 

అపమృత్యు వినాశినియై , సర్వాపద్లినివారిణియై విరాజిల్లే ఆ జగన్మాతను ప్రార్థించిన వారు ఆ యా ఋతువుల్లో రోగభాధలను , మృత్యుభయాన్ని జయించగలుగుతారని ,

 ఇందుకై నవరాత్రులలో పరమేశ్వరిని పూజించాలని వ్యాసుడు జనమేజయునకు నవరాత్రి పూజా విధానాన్ని వివరించాడు.


సంవత్సరారంభంలో చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులూ వసంత నవరాత్రాలు అని , 

అర్థ సంవత్సరం గడచిన తర్వాత శరదృతువు ఆరంభంలో ఆశ్వయుజు శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులూ శరన్నవరాత్రులు అని వ్యవహరింప బడతాయి.

 వసంత నవరాత్రులలో శ్రీరామచంద్రుని మనం ఆరాధిస్తాం. 

 రామచంద్రుడు పురుష రూపంలో ఉన్న లలిలతాదేవి అని సాధకుల విశ్వాసం. 

 "శ్రీరామో లలితాంబికా" అని పురాణాలు వివరిస్తున్నాయి. 

 నేటికీ ఉత్తర భారతదేశంలో రామలీలా మహోత్సవాలు అనే పేరుతో వసంత నవరాత్రులలో దేవీ పూజలు నిర్వహించే సంప్రదాయం ఆచరణలో ఉన్నది. 

శరన్నవరాత్రులలో దేవిని ఆరాధించడం అనూచారంగా వస్తున్న ఆచారం.


వసంత నవరాత్రులలో , శరన్నవరాత్రులలో పరాశక్తిని అరాధించి అబీష్టసిద్ధిని పొందినవారు ఎందరో ఉన్నారు.


రామచంద్రమూర్తి సీతాన్వేషణ ప్రయత్నంలో ఉండగా ఋష్యమూక పర్వతంపై సుగ్రీవునితో స్నేహం కలిసిన తర్వాత దేవిని ఆరాధించి సత్ఫలితం పొందాడు. 

అజ్ఞాతవాసం ఆరంభించబోతూ , పాండవులు విరాట నగరంలో ప్రవేశించే ముందు జగన్మాతను సేవించి నిర్విఘ్నంగా అజ్ఞాతవాసం నిర్వహించి కృతార్థులయ్యారు.


కనుక వసంత నవరాత్రులలో , శరన్నవరాత్రులలో మానవుడు ఆ పరాశక్తిని ఆరాధించి , ఐహిక , ఆముష్మిక సుఖ సంపదలను పొందవచ్చునని వ్యాసమహర్షి వివరించారు.


                                   సర్వే జనా సుఖినోభవంతు

30, మార్చి 2021, మంగళవారం

ఐ క్నో -ఐ క్నో ( హాస్య కథ)

  (సేకరణ )

గోకవరం సుబ్బారావు ( గో.సు)

 అరుగుమీద ప్రయివేట్లు చెప్తున్న సూన్నాణ మాష్టారి దగ్గరకు  వచ్చి, 

" మాష్టారు! చిన్న సందేహం.

మొన్న పి. యు.టి అంటే put అన్నారు. మరి c.u.t కుట్ అవ్వాలికదా! కట్ అంటున్నారేంటండి?  అని చాలా తెలివిగా ప్రశ్నించానని సంబరపడ్డాడు.


"నీ తలకాయ్! ఇంగ్లీషు వాడు 

ఇలాగే చెప్పేడిచాడు 

నీ వెధవ తెలివి ఉపయోగించి

ఆ ఇంగ్లీషు పరిక్ష చెడదొప్పుకోకు.

మీ నాన్న మా వాడికి నాలుగు ఇంగ్లీషు ముక్కలు నేర్పి 

అమెరికా కాకపోయినా , బంగ్లాదేశ్ ఐనా పంపమన్నాడు.

నా పరువు తియ్యకు"..అని తిడుతూ బుర్రబాదుకున్నాడు.

 

బుర్ర గోక్కున్న గో.సు  

మళ్ళీ తన పుస్తకంలో ఐదుపైసల నాణెంలాంటి మొహాన్ని దూర్చాడు.


కాసేపయ్యకా, "మాష్టారండి!

కె ఎన్ ఓ డబ్ల్యు (know)

"క్నో " కదండి! మరి రోజా 

నో అంటోందండి.

 

"సైలెంట్రా   ! సైలెంటు.

నేను సైలెంటు గానే ఉన్నానండి. అల్లరి చేయడం లేదండి". 


"ఒరేయ్! సైలంట్ అన్నది నీ కె.ఎన్. ఓ.డబ్యూ లో 

"కె " నాయన.!"

 నీరసం వచ్చేసింది సూన్నాణ మాష్టారికి.


"ఓహో! అని  అక్షరం అక్షరం  కూడ బలుక్కుని

చదవడం మొదలెట్టాడు.

క్నో కాదు! నో.

క్నాలెడ్జి కాదు! నాలెడ్జి!

 చదవడం మొదలు పెట్టగానే,   'లాఫ్' అనే పదం రాగానే అదెలా చదవాలో తెలియక

నాలికని ఎలా తిప్పాలో తెలియక, లా... అంటుంటే,

పక్కన కూర్చున్న మాష్టారి కూతురు

రోజ "లాఫ్" రా ! మొద్దు అంది. 


"ఎఫ్ లేదు కదే!"  అని మళ్ళీ బుర్ర గోక్కున్నాడు అర్ధం 

గాక.


"ఈ ఇంగ్లీషు ఎవడు కనపెట్టాడబ్బా! అంతా పితలాటకం లా ఉంది.

స్కాటు మాస్టారు వేసే ఏనుగు మెలిక లా.." జుత్తు పీక్కున్నాడు.


గో.సు నాన్న ఆ ఊరి పంచాయితి బోర్డు ప్రెసిడెంట్.

రాజకీయాలతో ఏదైనా సాధించేయవచ్చనే వంద ఆలోచనలు,   వందెకరాలు గల బ్రతక నేర్చిన మోతుబరి.

కొడుకు. గో.సు టెన్తె లో కి వచ్చాడు 

అప్పటి వరకు వాడ్ని అడ్డపెట్టే ధైర్యం ఎవ్వరికి లేక పోవడం వల్ల 

క్లాసులన్నీ  కుక్కదూకుళ్ళు చేసుకుంటూ  'పది' కి వచ్చి పడ్డాడు.


అప్పటి వరకు మాష్టర్లని మేనేజ్ చేసిన ఆంజినేయులికి  టౌన్లౌ టెన్త్ పరిక్ష పెట్టడం

అతనికి నచ్చలేదు.


చాలా హై లెవెల్లో,  మినిష్టర్

లెవెల్లో ట్రైచేసాడు 

సెంటర్ తన పల్లెటూర్లో పెట్టిద్దామని. 


" సూడు! ఆంజినేలు! 

ఇది అంత అర్రీ బుర్రీగా తేలే ఎవ్వారం కాదు.

ఇద్యాశాకా మంత్రి 

కత్తిపూడి కనకం సేత రికమెండేసన్ సేయించినా, పని జరగదు.ఎందుకంటే అన్నీ అయ్యాకా నా దగ్గరకు వచ్చేవు మరి.

మీ ఓణ్ణి ఈ ఏటికి ఇలా కానిచ్చేయమను. ప్యాసయ్యడా! టౌను కాలేజీ మనదే! ఆడికో సీటేయించేత్తాను.

అవలేదనుకో వచ్చే ఏడు 

నాదీ గారంటీ!" ...అని బొజ్జతడుముకుంటూ.

 లంకపుగాకు గుప్పు గుప్పు మని ఊదుకుంటూ కారెక్కేసాడు.


ఆంజినేయులికి బెంగ వచ్చింది. తర్వాత  కోపంవచ్చింది , కాసేపయ్యకా బుర్రలో కొత్త ఆలోచన వచ్చింది.


" మాష్టారు! తమరు ఓపిగ్గా మాఓడ్ని తిట్టో కొట్టో పరిచ్చ పాసు సేయించాల!.

ఆడ్ని ఫారిన్ పంపాలని మా సెడ్డ ఇది! " అన్నాడు. కాలు మీద కాలేసుకుని ఊపుతూ.

సూన్నాణ మాష్టారికి భయం వేసింది. వాడికి చదువు చెప్తే తనకున్నది మర్చి పోతానేమోనని కంగారొచ్చొంది.


తన రిటార్మెంట్ డబ్బులకి నామినేషన్ ఇచ్చానా లేదా జ్ఞాపకం రాలేదు.


తడబడుతు..."మీ వ్యవసాయం,  వ్యాపారాలన్ని చూసుకోడానికి ఎవరో ఒకరు ఉండాలి కదండి.

ఒఖ్ఖగాని ఒఖ్ఖ నలుసు కదా! 

ఏం పంపుతారండి ఫారిన్.

అక్కడ ఇక్కడ లాగ ఆదుకోడానికి మీరుండరు కదా!

అదీగాక, తిండానికి ఆవకాయ, కొబ్బరి లౌజు, రాసుకోడానికి

ఆవదం దొరకువుటండి! ఆయ్'" 

అని ఏదో రకంగా పెను ప్రమాదం నుంచి తప్పుకోడానికి ప్రయత్నించాడు.


"అబ్బెబ్బే! మా ఓడు ఏదో రకంగా పదో క్లాసు పాసై 

ఈ ఊరు దాటి ఫారిన్ ఎల్లాల!

నిఖ్ఖచ్చిగా చెప్పి జేబులో చెయ్యిపెట్టాడు. 

మాష్టారు తనకి ఆంజినేయులు డబ్బులు ఇవ్వబోతున్నాడేమో నని,

"అబ్బెబ్బె, తరోత ఇద్దురుగాని!

అంటూంటే,

ముక్కుపొడుం డబ్బా మాష్టారి

చేతిలో పెడుతూ హాచ్! అని తుమ్మాడు.

"పాఠాలు సెప్పాలి!  మా సుబ్బుగాడికి

తప్పదు!  అని విచిత్రంగా  నవ్వి. అవకాశం ఇవ్వకుండా డుబ్ డుబ్ మంటూ బుల్లెట్ లాగించేసాడు. 


మాష్టారికి తింగర వాటం వచ్చేసింది.

'సుబ్బిగాడి చదువు నా చావుకొచ్చిందనుకుంటా' . గాలివానకి అల్లల్లాడిపోతున్న 

ఎండు కొబ్బరాకులా  ఊగుతూ  ఉసూరుమంటూ

ఇంటి దారి పట్టాడు ఆ బక్క ప్రాణి. 

అలా రోజూ మాష్టారింట్లో నే మకాం పెట్టిన గో.సు గాడికి ముప్పొద్దులా 

తిండి కూడా మేప లేక అల్లల్లాడి పోతున్నాడు.

సూణ్ణాణ మాష్టారు.

**

పరిక్షలు మొదలయ్యాయి.

మాష్టారికి గుండెల్లో వంద బుల్లెట్లు పరిగెడుతున్నాయి. గో.సు ని 

సానబెట్టగా  అత్తీసరు మార్కులు వచ్చే వరకు ఫర్వాలేదని పించేడు. ఒక్క ఇంగ్లీషు పరిక్ష రోజున మాత్రం,

మాష్టారి టెన్షన్ తగ్గడానికి పది

మాత్రల్లేసుకుని వాడితో సెంటర్ కి వెళ్ళాడు.


దూరంగా చెట్టుక్రింద నెత్తిమీద గుడ్డేసుకుని కూర్చున్నాడు.


గో.సు ముఖం నిండా వీభూది.

బొట్లు పులుముకున్నాడు. చేతికి తాయత్తులు కట్టుకున్నాడు. డాలు లాంటి అట్ట, కత్తిలాంటి పెన్నుతో 

మాష్టారికి వాడు యుధ్ధానికి వెళ్తున్నట్టు కనిపించింది.

వీడు ఏం చీల్చి చెండాడుతాడో ఆ ఆంగ్ల పేపర్ని అని భయపడ్డాడు.

*

రిజల్ట్స్ వచ్చేరోజున వంద లంఖణాలు చేసిన వాడిలా ఉన్నారు మాష్టారు.

వంద కొబ్బరికాయలు 

ఐనవిల్లి గుళ్ళో మొక్కు కున్నారు.

ఎట్టకేలకు గో.సు కరక్టుగా 35 శాతంతో గట్టెక్కాడు.

కూతురు రోజా స్కూల్ ఫస్టు వచ్చిన ఆనందం కన్న గో.సు 

గాడు ప్యాసవ్వడం గొప్ప ఆనందం వచ్చిందాయనకు.

ఇంటర్లో జాయిన్ అయిన

గో.సు అంతకన్నా ముందుకి వెళ్ళ లేక చతికిల పడిపోయాడు. 

కానీ రాజకీయాల్లో మంచి పట్టు సంపాదించాడు.

**

ఒకరోజు రిటైరై పోయి పడక్కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్న మాష్టారు 

ఆ వార్త చూసి   స్పృహతప్పిపడిపోయారు.

భార్య కంగారు పడుతూ

ముఖం మీద నీళ్ళు జల్లి 

లేపింది.

"ఏవైందండి!  

నోట మాట రాక, అలా ఉండి పోయాడు. కాసేపయ్యాకా తేరుకుని.

మన గో.సు గాడికి విద్యాశాఖ మంత్రి పదవి ఇచ్చారుట. 

అంటూ...

ఐ క్నో ! ఐ క్నో. 

అంటూ వెర్రిగా నవ్వాడు.

పెళ్ళం అతనికి పిచ్చి పట్టిందేమోనని కంగారు పడుతోంది ఇప్పటికి.

18, మార్చి 2021, గురువారం

బామ్మ గారా మజాకా!

ఒక చిన్న టౌన్ లో వున్న కోర్ట్ లో ,

ఒక కేసు విచారణ సందర్భంగా ఒక బామ్మ గారిని సాక్షిగా పిలిచి బోనెక్కించారు. 

పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆవిడ దగ్గరికి వెళ్ళి , 

" మామ్మ గారు నేనెవరో మీకు తెలుసా ?" అని అడిగాడు దర్పంగా నల్ల కోటు సర్దుకుంటూ...

ఆవిడ వెంటనే ," అయ్యో ,తెలియక పోవడమేంటీ..?

బాగా తెలుసును..

పెద్దపిచ్చయ్యగరి రెండో అబ్బాయి గోవిందానివి కదూ......

నీ చిన్నప్పటి నుండీ నిన్నూ ,మీ కుటుంబాన్నీ ఎరుగుదును నాయనా..! నిజంచెప్పాలంటే 
చిన్నప్పుడు నిన్ను ఎందుకూ పనికిరావు అనుకునేదాన్ని . 

అబధ్ధాలాడేవాడివి,జనాన్ని మోసం చేసేవాడివి ,

ఆఖరుకి నీ భార్యని కూడా మోసం చేసావ్ ..పైసాకా పనికిరాకపోయినా , 

గొప్పలు పోయేవాడివి .నాకు బాగా తెలుసు ను కదా !"  అంది.

P.P. గారు హడిలి పోయి ,బిక్క చచ్చి పోయారు. ఏం మాట్లాడాలో తెలియక , డిఫెన్సు లాయరు గారిని చూపించి , " వారు తెలుసా ..? "అని అడిగాడు.

బామ్మగారు ఠక్కున , "మాబాగా తెలుసును..జేబులు కత్తిరించే వీరదాసు కొడుకు

కుమారదాసు కదా .. చిన్నప్పుడు పనీ పాటాలేకుండా వీధులెంట బలాదూర్ తిరిగేవాడు.లేని దురలవాటులేదు..తాగుబోతు, తిరుగుబోతు కూడానూ !ఇతనిది 

అందరి కంటే చెత్త ప్రాక్టీసు అని ఊరంతా చెప్పుకుంటారు. పైగా ముగ్గురు స్త్రీలతో అక్రమ సంబంధం ..అందులోఒకరు మీ ఆవిడే కదా ! నాకు తెలీకేం , బాగా తెలుసు ...

" అంది గుక్క తిప్పుకోకుండా ."

డిఫెన్స్ గారికి చచ్చినంత పనైంది . 

జడ్జి గారు ఇద్దరు లాయర్లని తన దగ్గరికి పిలిచి ,రహస్యంగా , "మీ ఇద్దర్లో ఎవరైనా

తెలివి తక్కువగా , జడ్జి గారు తెలుసా అని ఆవిడని అడిగారంటే ,కోర్టు ధిక్కారం కేసు

కింద జైల్లో తోయించేస్తా ,జాగ్రత్త !!"అని బెదిరించాడు.

లాయర్లు షాక్ !! బామ్మ రాక్స్ !!



                                                                                                    (సేకరణ )