పూజ్యనీయులైన ఉత్తరం గారి పాదపద్మాలకు నమస్కారం...!!!
ఉభకుశలోపరి...!!!
చాల రోజుల తరవాత మీకు ఇలా ఉత్తరం రాయడానికి గల ముక్ష కారణం ...
నిన్న పుస్త కాలు సద్దు తుంటే నా స్నేహితురాలు రాసిన ఉత్తరాలు చదివాను ...
20 సంవత్సరాల క్రితం రాసిన ఆ ఉత్తరాలు ఇప్పుడు చదువుతుంటే ...
ఒక్క సారి కాలం వెనకకి వెల్లిపోయింది ..
ఎంత బాగుందో ... ఎన్నో జ్ణాపకాలు ,అనుభూతులు ....
ఆ రోజులు మల్లి రావు కానీ ....చదివినంత సేపు నేను ఆ రోజులకు వెళ్లి వచ్చాను ...
సెల్ టవర్ల దెబ్బకి పిచ్చుకలు మాయమైపోయినట్టు,
సెల్ ఫోన్ల దెబ్బకు తమరు ఎటు వెళ్లిపోయారో జాడ తెలియక అల్లాడుతున్నాం...
మీరున్నప్పుడే బాగుంది ఇక్కడ...
రాసేటప్పుడు చేతికి అబద్ధాలు వచ్చేవి కాదు...
ఇప్పుడన్నీ ఫోన్లో మాటలే కాబట్టి నోటికొచ్చిన అబద్ధాలు ఆడేస్తున్నాం...
'ఎక్కడున్నావ్' అంటే అమలాపురం లో ఉన్నా హైదరాబాద్ ఉన్నా' అని సిగ్గులేకుండా బొంకేస్తున్నాం...
ఈ నెట్ వర్క్లు మనుషుల్ని దగ్గర చేస్తాయంటే నమ్మి మిమ్మల్ని వదిలేసుకున్నాం...
కానీ ఇప్పుడు పక్కపక్కనే ఉన్నా మాట్లాడుకోకుండా, మెడలు వంచి ఫోన్లో తప్ప ముఖాముఖి మనసిప్పి మాట్లాడుకోవడం దాదాపు మానేసామ్...
దయచేసి మళ్ళోకసారి రండి ఉత్తరం గారు...!!!
మీరు లేకపోవడం వల్ల...
బామ్మ-తాతయ్యల ముసలి ప్రాణాలకు ఓదార్పునిచ్చే కుశల సమాచారం కరువైపోయింది...
భార్యాభర్తల వియోగం, విరహాల్లో ఉండే మాధుర్యం మాయమైపోయింది...
బిడ్డల క్షేమం అక్షరాల్లో చూసుకుని ఆప్యాయంగా చెమర్చే తల్లితండ్రుల కన్నీటి తడి ఆవిరైపోయింది...
ఉత్తరం కోసం వీధివాకిలి వైపు ఎదురుచూసి, రాగానే గబగబా చదివేసి, గుండెలు నింపుకుని, తిరిగి జాబు రాయడంలో ఉన్న ఆత్మ సంతృప్తి అడుగంటిపోయింది...
"అమ్మా... అన్నయ్య దగ్గర్నుంచి ఉత్తరం వచ్చిందే అని చెంగున గెంతి చెప్పే చెల్లాయిలకి కరువొచ్చింది...
"ఏమేవ్... అల్లుడు ఉత్తరం రాసాడు...అమ్మాయి నెల తప్పిందట" అని మురిసిపోయే కన్నవాళ్లు కనిపించడం లేదు...
మాటలు పెదాలనుండి తప్ప గుండెల్లో నుండి రావడం ఆగిపోయాయి...
ఈ ఉత్తరం కూడా నేను టైప్ చెయ్యడం వల్ల యధావిధిగా మనసులో ఉన్నదంతా చెప్పలేక, ఇంకా ఏదో ఆవేదన మిగిలిపోయి బాధపడుతున్నాను...!!!
సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా, ఉత్తరాల ఉనికిని కోరుకునే మీ అభిమానిని...!!!



