Pages

23, నవంబర్ 2020, సోమవారం

చంద్రుడు ప్రతిష్ఠించిన సోమేశ్వరుడు--భీమారామము

 అందరికి  నమస్కారం  .... 

                  మన  గోదావరి జిల్లా ఎన్నో పురాణ గాధలకు, చారిత్రిక విశేషాలకూ నిలయం..అందులో ఒకటి భీమారామము .. ఇది పంచారామాల్లో ఒకటి.  


పురాణ కధలు:

                  తారకాసురుడు అనే రాక్షసుడు శివభక్తుడు. ఈ తారకుని మెడలోని అమృతలింగం అతనికి ప్రాణరక్ష గా  ఉండేది. ఆ గర్వం తో ఆ రాక్షసుడు  ముల్లోకాలను అతలాకుతలం చేయసాగాడు. ఆ రాక్షసుని బాధలను తాళలేక దేవతలు వాని బారి నుండి కాపాడమని బ్రహ్మదేవుని ప్రార్ధించారు. అప్పుడు  బ్రహ్మదేవుడు శివభక్తుడైన    అతనిని సంహరించాడానికి శంకరుడే సమర్దుడని చెప్పి, అతన్ని ప్రసన్నం చేసుకోవలసిందిగా దేవతలను పంపించాడు.   దేవతల ప్రార్దన ను మన్నించి  తారకుని ఎదుర్కోవడానికి కుమారస్వామి ని   సేనాథిపతి గా నియమించి,యుద్ధానికి పంపించాడు శంకరుడు.       తారకాసురుని తో జరిగిన యుద్దం లో కుమారస్వామి తన ఆయుధం తో తారకాసురుని కంఠమాలలో ఉన్న అమృతలింగాన్ని ఛేదించాడు. ఆ ఉపాసనాలింగం ఐదుముక్కలై ఆంధ్రదేశం లోని ఐదుప్రదేశాల్లో పడింది. వాటినే పంచారామ క్షేత్రాలు గా  పిలుస్తున్నాం. అవి వరుసగా 


సోమేశ్వరుడు- భీమారామము (భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా)

రామలింగేశ్వరుడు- క్షీరారామము (పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా)

అమరేశ్వరుడు- అమరారామము (అమరావతి, గుంటూరు జిల్లా) . 

భీమేశ్వరుడు- ద్రాక్షారామము(ద్రాక్షారామము, తూర్పు గోదావరి జిల్లా)

భీమేశ్వరుడు- కుమారారామము (సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా)


భీమారామము :

              ఆంధ్రదేశంలోని పంచారామ క్షేత్రాల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పాతనగరం లోని గునుపూడి లో వెలసిన సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయం ఒకటి. ఈ ప్రాంతం  ఇక్ష్వాకుల, తూర్పు చాళుక్యుల,గజపతుల,  విష్ణుకుండినుల, రెడ్డిరాజుల, శాలంకాయనుల వంటి రాజుల ఏలుబడి లో మహోన్నత సంస్కృతి ని సంతరించుకున్నది.

   

స్థలపురాణం  :     

  తారకాసురుని వథానంతరం  గునుపూడి లో ఒక అమృతలింగ శకలం పడింది. స్వయంవృద్ధి లక్షణం కల్గిన ఆ శకలాన్ని అప్పటికే గురుపత్నీ అనుగమనదోషం తో పీడించబడుతున్న చంద్రుడు  వెంటనే ఆలింగాన్ని గునుపూడి లో ప్రతిష్ఠించి, లింగం యొక్క పెరుగుదలను నిరోధించి  పూజాదికాలు నిర్వహించాడు. చంద్రునిచేత ప్రతిష్ఠించబడిన ఈశ్వరుడు కావున ఈయన సోమేశ్వరుడు గాను, ఈ ఆరామము  సోమారామము గాను కీర్తించబడుతున్నాయి.

ఆలయప్రత్యేకత :  

                 చంద్రుడు ప్రతిష్ఠించడం వలన ఈ సోమేశ్వరుడు అమావాస్య రోజున గోధుమ వర్ణం లోను ,పౌర్ణమి రోజున శుద్ధస్పటిక వర్ణం గాను రంగులు మారుతుంటాడు. ఇది ఒక అద్భుతమైనవిషయం.

  మరొకప్రత్యేకత ఏమిటంటే దేశం లో ఎక్కడాలేని విధంగా సోమేశ్వరలింగం  గర్భాలయం పైన నిర్మించబడిన రెండవఅంతస్తులో ఖచ్చితం గా స్వామివారి తలపై భాగాన అన్నపూర్ణాదేవి విగ్రహం ప్రతిష్ఠించబడిఉంది. పైకి వెళ్లడానికి చక్కగామెట్లు, పైన విశాలమైన ముఖమండపము నిర్మించబడ్డాయి. ఇది ఈ సోమారామం యొక్కప్రత్యేక విశిష్టత గా  పండితులు చెపుతున్నారు. ఈశ్వరుని శిరస్సుపై  గంగను ధరించాడనటానికి ఇది ప్రతీకయని భక్తులు భావిస్తున్నారు

మరొక ప్రత్యేకత ఏమిటంటే దేవాలయానికి ఎదురుగా 15 అడుగుల ధ్వజస్థంభం ప్రతిష్ఠించబడిఉంది.ధానిపై నందీశ్వరుడు ఆసీనుడై భక్తలకు ఆనంద, ఆశ్చర్యాలను కల్గిస్తుంటాడు. అంత ఎత్తులో నంది ఉండటం ఈ ఆలయం లోనే మనకు కన్పిస్తుంది. అన్నపూర్ణాదేవి పై అంతస్తులో ఉన్న  కారణం గానే నంది ద్వజస్థంభం ఎక్కి కూర్చున్నాడని జనశృతి.

 ఈ సోమారామానికి క్షేత్రపాలకుడు శ్రీ జనార్ధనస్వామి. అందువలనే ఇచ్చట ప్రతి ఏటా ఎన్నోవివాహాలు జరుగుతుంటాయి. 

                 స్వామి వారి ఆలయానిక తూర్పు వైపు 7 అంతస్తుల గాలి గోపురం ఉంది స్వామివారికి ఎడమవైపు ఉత్తరముఖం గా పార్వతీదేవి,  ఈశాన్యం లో నవగ్రహాలయం, ఎడమవైపు ఉపాలయం లో జనార్ధనస్వామి , ప్రక్కనే ఉన్న ఉపాలయం లో ఆదిలక్ష్మి, దర్శనమిస్తారు. గాలిగోపురానికి ఇరువైపులా స్వామి వారికి అభిముఖం గా కుడివైపు  సూర్యభగవానుడు, ఎడమవైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువు తీరారు .ఈ ఆలయానికి తూర్పువైపున” చంద్రపుష్కరిణి” అనే తటాకం ఉంది. దీనినే” సోమగుండం “అని కూడ పిలుస్తారు. దీనిలో స్నానం చేయడం సర్వపాపహరమని భక్తుల నమ్మకం.


లోక సమస్త సుఖినో భవంతు

**** మీ ఉషగిరిధర్ ***********


1 కామెంట్‌:

  1. చాలా బావుంది ఉషా. ఈ సారి క్షేత్ర మాహాత్మ్యం తో పాటు, అక్కడికి ఎలా వెళ్లాలో కూడా చెబితే బావుంటుంది. కొన్ని ఫోటోలు కూడా పెట్టమని మనవి.

    రిప్లయితొలగించండి