Pages

ఎందరో మహానుభావులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఎందరో మహానుభావులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, ఫిబ్రవరి 2021, బుధవారం

చిలకమర్తి వారు పకోడీపై కొన్ని పద్యాలు

 చిలకమర్తి వారు పకోడీపై కొన్ని పద్యాలు ఆశువుగా చెప్పారు.

 పద్యాలు చదివి పకోడీ రుచి ఆస్వాదించండి.


వనితల పలుకులయందున
ననిముష లోకమున నున్న దమృతమటంచున్
జనులనుటె గాని, లేదట
కనుగొన నీయందమృతము గలదు పకోడీ !

ఎందుకు పరమాన్నంబులు
ఎందుకు పలు పిండివంటలెల్లను నాహా ! నీ
ముందర దిగదుడుపున కని
యందును సందియము కలుగ దరయ పకోడీ !

ఆ కమ్మదనము నా రుచి
యా కర కర యా ఘుమ ఘుమ, యా పొమకములా
రాకలు పోకలు వడుపులు
నీకేదగు నెందులేవు పకోడీ !

నీ కర కర నాదంబులు
మా కర్ణామృతములు, నీదు మహితాకృతియే
మా కనుల చందమామగ
నే కొనియాడెదను సుమ్ము నిన్ను పకోడీ!

ఆ రామానుజు డాగతి
పోరున మూర్చిల్ల దెచ్చె మును సంజీవిన్
మారుతి ఎరుగడు, గాక, య
య్యారె నిను గొనిన బ్రతుకడట పకోడీ !

హరపురుడు నిన్ను దిను నెడ
గరుగదె యొక వన్నె నలుపు గళమున, మరి చం
దురుడున్ దినిన కళంకము
గరుగక యిన్నాళ్లు నుండగలదె పకోడీ!


కోడికి బదులు పకోడీ తినమని బ్రాహ్మణులకు బ్రహ్మ వరమిచ్చాడని,
లక్ష్మణుడు మూర్చకు మారుతికి పకోడీ వుందని తెలియక సంజీవని కోసం పరిగెత్తాడని, చమత్కారంగా హాస్యంగా రచన చేశారు.
కందం చెప్పినవాడే కవి అన్న వాడుకను సార్ధకం చేశారు.

ఈ పకోడీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు గుర్తు తెచ్చుకుని రుచి ఆస్వాదించవచ్చు.. కానీయండి మరి.



14, ఫిబ్రవరి 2021, ఆదివారం

దాశరథీ కరుణాపయోనిధీ

దాశరథీ కరుణాపయోనిధీ అని శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసు గా సుప్రసిద్ధుడైన మన  కంచెర్ల గోపన్న తెలుగులో కీర్తనలకు ఆద్యుడు. 

దాశరధి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము - ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు.

ఆనందభైరవి రాగాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వాగ్గేయకారుడు ఆయన.

 కీర్తనలు రాసి దానికి సంగీత స్వర రచన చేసి ఆలపించిన ఘనత ఆయనదే..  

‘ అంతా రామమయం, పలుకే బంగారుమాయనా, నను బ్రోవమని చెప్పవే,  ఇక్ష్వాకు కుల  తిలకా..గరుడ గమన రారా... అదిగో భద్రాద్రి .. వంటి  గేయాలు అత్యంత ప్రాచుర్యమయ్యాయి. 

‘దాశరథి శతకం’ పేరుతో 103 కీర్తనలు రచించారు. 

59 రచనల్లో ఉత్పలమాల, 44 రచనల్లో చంపకమాల వినియోగించారు. 

జానకీపతి శతకం ,  సంస్కృతంలో శ్రీమద్రామాయణ కథా చూర్ణము రచించారు

దాశరధి శతకము లో ని ఒక పద్యం మీ కోసం

శ్రీ రఘురామ చారు తులసీదళ దామ శమక్షమాది శృం

గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు

ర్వార కబంధరాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో

త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ


భావం: రఘువంశమున బుట్టినవాడవు, సొంపైన తులసీదండలు గలవాడవు, శాంతి, ఓరిమి మొదలు గుణములచే నొప్పువాడవు, ముల్లోకముల బొగడదగిన పరాక్రమలక్ష్మికి ఆభరణమైనవాడా! వారింపనలవికాని కబంధుడను రాక్షసుని సంహరించినవాడా, జనుల పాపములను సముద్రమును దాటించు నామము గలవాడా! దయకు సముద్రమువంటివాడా! భద్రాచలమందుండు శ్రీరామా!


“క్షీరసాగర శయనం’ అనే త్యాగరాజ కీర్తనలో త్యాగరాజు రామదాసును గురించి ప్రస్తావించడం విశేషం..

రామదాసు కీర్తనలలో 9 కీర్తనలు నవరత్నాలు గా ప్రాచుర్యం పొందాయి

రామదాసు జయంతి సందర్భంగా అవి మీకోసం....,,👇

http://bhadrachalaramadasu.com/navaratna-keerthanas/



 అందరికీ శ్రీరాముని కరుణా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ

 జై శ్రీరామ్  జై శ్రీరామ్.   జై శ్రీరామ్

8, ఫిబ్రవరి 2021, సోమవారం

సామజవరగమన.. అంటే ??

శ్రీ గురుభ్యోనమః 

“సామజవరగమనా” అనే పదం వినగానే.., 
కొంతమందికి త్యాగరాయ కీర్తన గుర్తొస్తుంది..
కొంతమందికి “శారద” అని గట్టిగా అరిచే “శంకరశాస్త్రి” గారు గుర్తొస్తారు..

కానీ అసలు “సామజవరగమనా” అంటే ఏంటో తెలుసా....


'సామజ' అనగా "ఏనుగు" అని.. 
'వరగమనా' అనగా "చక్కని నడక" అని అర్థం... 

"సామజవరగమన" అంటే ఏనుగు లా గంభీరంగా, హుందాగా  నడిచేవారు అని అర్థం..
 మరి అసలైన "సామజవరగమన" ఎవరు ??

అసలైన "సామజవరగమన.." శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుడు... 
వాల్మీకి తన రామాయణంలో 'అరణ్యవాసం'లో 
ఒకచోట రాముడిని "గజవిక్రాంతగమను" డంటారు... 
అంటే ఏనుగులా హుందాగా నడిచే వాడు అని...
ఇదే అర్థం వచ్చేలా త్యాగరాజు తన కీర్తనలో 'సామజవరగమన' అంటూ శ్రీరాముణ్ణి స్తుతించారు.._

 "సామజవరగమన" కీర్తన, దాని అర్థం ఒకసారి తెలుసుకుందాం.._


సామజవరగమనా ! సాధుహృత్సారసాబ్జపాల ! కాలాతీతవిఖ్యాత ! ॥ సామజ॥
సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల ! దయాలవాల ! మాంపాలయ ! ॥ సామజ॥
వేదశిరోమాతృజ సప్తస్వర నాదాచలదీపా।
స్వీకృత యాదవకులమురళీ !
గానవినోదన మోహనకర త్యాగరాజ వందనీయ ॥ సామజ॥


ఈ కీర్తనలోని ప్రతి పదం శ్రీకృష్ణుడిని వర్ణిస్తూ ఉంటుంది..._ 


ప్రతి పదార్ధం :

సామజ(ఏనుగు) వర(వంటి) గమనా(నడక కలిగిన వాడ) – ఏనుగు నడక లాంటి గంభీరమైన నడక కలవాడా

సాధుహృత్సారసాబ్జపాల – సాధువులు, సజ్జనుల హృదయపద్మములను పాలించేవాడా

కాలాతీతవిఖ్యాత – అన్నికాలములలోనూ కీర్తింపబడేవాడా

సామనిగమజ సుధామయగానవిచక్షణ – సామ వేదానికి మొదలు గా ఆ సంగీతముని నిత్యం పరిశీలిస్తూ పర్యవేక్షించేటి వాడ

గుణశీలదయాలవాల – గుణముకు దయకు ఉదాహరణగా నిలిచేటి వాడ

మాంపాలయ – నన్ను పాలించు

వేదశిరోమాతృజ – వేదములలో గొప్పదైన సామవేదమునుండి పుట్టిన

సప్తస్వరనాదాచలదీప – సప్తస్వరముల లయము వలన కలిగిన కదలని దీపమువంటి నాదమువలె ప్రకాశించువాడా

స్వీకృతయాదవకుల – యాదవకులములో జన్మించినవాడా

మురళీగానవినోదనమోహనకర – మురళీగానముచే వినోదించుచూ అందరిని ఆనదింప జేసేవాడా;

త్యాగరాజ వందనీయ – త్యాగరాజుచే నమస్కరింపబడినవాడా

              
                      ఇదీ 'సామజవరగమన'కు సంబంధించిన అసలు భావం !

మా గురువు గారు శ్రీమతి గిరిజ కుమారి గారు ఆలపించిన త్యాగరాయ కీర్తన             "సామజవరగమన"  మీకోసం 





 🙏ఎందరో మహానుభావులు అందరికి వందనములు 🙏

               జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ 

2, ఫిబ్రవరి 2021, మంగళవారం

ఎందరో మహానుభావులు అందరికి వందనములు 🙏🙏

 ఎందరో మహానుభావులు అందరికి వందనములు  
ఈ  మధురమైన కీర్తన తెలియని మానవుడు !
అనేవాడు ఉండడే మో ? బహుశ : ! 

తెలుగు వాగ్గేయకార త్రయంలో ధాతు , మాతువులకు ప్రాధాన్యత నిచ్చి ,
రచన చేయడంలో దిట్ట ,స్వర రాగ బ్రహ్మ "త్యాగ రాజు."

అలాంటి !కమనీయమైన కవిత !పరిపూర్ణమైన భక్తి ! సరస సంగీతం !ఈ మూడూ త్రివేణి గా తన గాన సుధా మధు రసాన్ని,ప్రవహింప చేశాడు "నాదబ్రహ్మ త్యాగయ్య."  

ఎన్నో భక్తిపరమైన కృతులను రచించి, దాక్షిణాత్య కర్నాటక సంగీతానికి తెలుగును సంగీత భాషగా తీర్చిదిద్దిన మహనీయుడు త్యాగయ్య. 

స్వర సాహిత్య సమ్మేళనం అద్భుతంగా సృష్టించిన ఆయన.
తమిళదేశంలో పుట్టి పెరిగినా త్యాగయ్య తెలుగువాడు. 

ఆయన పలికినది తెలుగు పలుకు. "పలుకువేమి నా దైవమా రామ!" - అంటూ, అచ్చ తెలుగులో ఆత్మనివేదన చేసుకున్న త్యాగయ్య తెలుగుకు సంగీత సుభగత్వం సమకూర్చిన మహనీయుడు.

నాట, వరాళి, గౌళ, అరభి, శ్రీరాగాలలో గల పంచరత్నాలు-నాటికీ, నేటికీ, రేపటికీ ఇది పంచరత్నాలే.   

తెలుగు భాషా సుమ సుగంధాలు జగద్వ్యాప్తం కావడానికి నాదసుధారస ధారలు కురిపించిన శ్రీ త్యాగరాజ స్వామి కీర్తనలు తెలుగు వారి పుణ్యఫలాలుగా చెప్పుకోవచ్చు.

ఆయన భక్తిరసం జగదానందకారుకుడు, జానకీప్రాణనాయకుడు, కరుణారససింధువైన రామచంద్రునిలో ఐక్యమైంది.   ఆ రోజు... ఈ రోజు ...పుష్య బహుళ పంచమి...(2/2/2021)

నాటి నుండి నేటి వరకూ అజరామరంగా ఆయన రచించి ఆలపించిన ఘనరాగ పంచరత్న కీర్తనలు దశదిశలా, వాడవాడలా మారుమోగుతూనే వున్నాయి. 

ప్రత్యేకంగా ఆరాధనోత్సవాలలో తిరువాయూరులోని ఆయన సమాధి వద్ద గాత్ర, వివిధ వాద్య సంగీత విద్వాంసులు కీర్తిస్తూ... స్తుతిస్తూ... ఆయన పంచరత్నాలను ఆలపిస్తూ, పంచరత్నసేవతో ఘనంగా నివాళులర్పిస్తూ నే వున్నారు. 

సూర్యచంద్రులు వున్నంతవరకూ ఆయన కీర్తనలు వినిపిస్తూనే వున్నాయి... వుంటాయి కూడా. 

సంగీతాకాశంలో నిండు జాబిల్లిలా ప్రకాశించిన త్యాగయ్య ఆ సంగీతం వినబడినంతకాలం చిరంజీవియే!🙏🙏

    


పల్లవి

ఎందరో మహానుభావులు అందరీకి వందనములు ॥ఎందరో॥

అనుపల్లవి

చందురు వర్ణుని అందచందమును హృదయార

విందమున జూచి బ్రహ్మానంద మనుభవించువా ॥రెందరో॥

సామగానలోల మనసిజ లావణ్య ధన్యమూర్దన్యు

మానసవనచర వరసంచారము నిలిపి మూర్తి బాగుగా పొగడనేవా ॥రెందరో॥

సరగుస బాదములకు స్వాంతమను

సరోజమును సమర్పణము సేయువా ॥రెందరో॥

పతితపావనుడనే పరాత్పరు గురించి

బరమార్థమగు నిజమార్గముతోను బాడుచును,

సల్లాపముతో స్వరలయాది రాగముల తెలియువా ॥రెందరో॥

హరి గుణమణులగు సరములు గళమున

శోభిల్లు భక్తకోటు లిలలో తెలివితో చెలిమితో

గరుణగల్గి జగమెల్లను సుధాదృష్టిచే బ్రోచువా ॥రెందరో॥

హోయలుమీఱ నడులుగల్గు సరసుని సదా

గనుల జూచుచును, పులకశరీరులయి ముదంబునను యశముగలవా

పయోధి నిమగ్నులయి ముదంబునను యశముగలవా ॥రెందరో॥

ప్రేమ ముప్పిరిగొను వేళ నామమును దలచేవారు

రామభక్తుడైన త్యాగరాజ సుతునికి నిజరామ ॥రెందరో॥


     



            🙏🙏🙏ఎందరో మహానుభావులు అందరికి వందనములు 🙏🙏🙏