Pages

మా ఊరి వంట లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మా ఊరి వంట లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, ఏప్రిల్ 2021, శుక్రవారం

బూడిద గుమ్మడికాయ వడియాలు

 కొబ్బరి తోటకి ఇంజిన్ తో నీళ్ళు పెట్టారు కదా.. మట్టంతా తడితడిగా ఉంది. 

ఎవరూ చూడకుండా నాలుగు దోసిళ్ళ తడి మట్టి తెచ్చి లోపలి పెరడులో  కుండ పెంకులో దాచాను. 

మధ్యాహ్నం భోజనాలు అయ్యాక  నాన్న ఏదో పనుందని బయటికి వెళ్ళిపోయారు. 

అప్పటికే దాచి పెట్టుకున్న బొబ్బాసీ గొట్టాలు   తీసుకుని లోపలి పెరడులోకి   పరిగెత్తాము అన్న ,నేను .తమ్ముడు .

బొబ్బాసీ గొట్టాలతో మొక్కలకు నీటి సదుపాయం కలిపించే ఆలోచనతో ... రోజు నీళ్లు పొసే పనితప్పుతుంది అని 

రాళ్ళు లేకుండా మట్టి అంతా ముద్దగా కలుపుకుని, 

మట్టి మిగిలితే కారు బొమ్మో, రైలు బొమ్మో చేయాలని కూడా ప్లాన్లేసుకున్నాము . 

ఇంతలో అన్నని  వెతుక్కుంటూ బామ్మొచ్చేసింది. గుండెల్లో రాయి పడింది కానీ, నాన్న ఇంట్లో లేరని గుర్తొచ్చి హమ్మయ్య అనుకున్నా. 

అయితే, బామ్మ "మట్టితో ఆడుతున్నారా ? మీ నాన్నకి చెబుతానుండు.." అనకుండా "ఏమిచేస్తునారు ఎండలో ?" అని అడిగింది ప్రేమగా.


బామ్మ కేకలేయక పోవడం కొత్తగా అనిపించింది. 

"బొబ్బాసీ గొట్టాలతో మొక్కలకు నీటి సదుపాయం కలిపిస్తున్నాము .. నీ తులసి మొక్కకి కూడా పెడతాము " అని హామీ ఇచ్చాను. 

బామ్మ అస్సలు సంతోషించలేదు 

"అవ్వని కత్తిపీట పట్టుకురమ్మని చెప్పేశాను.. 


 "కాఫీలు తాగేసి పని మొదలు పెట్టాలి.. ఓమాటు చెయ్యి కడుక్కుని వస్తావా?" అని అడిగింది అన్నని  ప్రేమగా..  ఏదో పని ఉందని అర్ధమయ్యింది.

 "అవును బామ్మా.. కాఫీ తాగితే ఎంత బాగుంటుందో" అన్నాన్నేను.

 నాకు కావాల్సింది నేరుగా అడిగే అలవాటు లేదప్పుడు. 

 మామూలప్పుడు కాఫీ అడిగితే "మీ నాన్నకి చెబుతా" అని బెదిరించే బామ్మ, 

 ఆ పూట "మా తల్లే .. అదేవన్నా బంగారవా? పలకల గ్లాసుతో ఇస్తాను, రా" అంది, మళ్ళీ ప్రేమగా. పలకల గ్లాసంటే పెద్ద గ్లాసన్న మాట.



నేను ఊదుకుంటూ కాఫీ తాగుతున్నానా.. అప్పుడు విప్పింది బామ్మ పొడుపు కథని. 

"బూడిద గుమ్మడికాయలు కడిగి ,నాటెట్టి వెళ్ళమంటే మీ  నాన్నకీ చెయ్యి ఖాళీ లేకపోయింది. 

ఇదన్న మాట సంగతి.. "వడియాలు పెడుతున్నారా? కారం లేకుండా వడియం అట్టు కాల్చుకుంటే ఎంత బాగుంటుందో.." అన్నాన్నేను, తగు మాత్రంగా లొట్టలేస్తూ.

 నిజానికి నాకు 'ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి' అన్న సామెత అప్పటికి తెలీదు. అయినా అన్నీ తెలిసే చేస్తామా ఏంటి?


"ఓస్.. అంతే కదా.. మీ అమ్మకి చెబుతానుండు, కారం కలపకుండా పిండి తియ్యమని.. రేపు మధ్యాహ్నం అన్నంలోకి నీకు అట్టు కాల్చి పెడతాను..సరేనా?" 

హామీ ఇచ్చేసింది బామ్మ. కాఫీలయిపోయాయి కదా, ఇప్పుడు బామ్మ పని మిగిలింది. 

పెరట్లో తులసి కోట చుట్టూ పెద్దవీ, చిన్నవీ కలిపి ఓ డజను బూడిద గుమ్మడి కాయలున్నాయి. 

దేవుడికి కొబ్బరికాయ కొట్టుకునే కత్తి పట్టుకొచ్చింది బామ్మ.  నేను కాయలు కడగడం 

ఆ కత్తితో బామ్మ పర్యవేక్షణలో ఒక్కో కాయ మీదా నాటు పెట్టాడు అన్న , కత్తి బరువనీ, చెయ్యి నొప్పనీ హడావిడి చేసి..


అది మొదలు అమ్మ, బామ్మ, అవ్వ గారూ ఆ గుమ్మడికాయలు ఒక్కోటీ ముక్కలుగా తరగడం. 

సాయంత్రానికి తరగడం పూర్తయ్యింది. ఓ చీరలో ముక్కలన్నీ వేసి,  రాళ్లుప్పు జల్లి, 

 బట్టల మూటంత పెద్ద మూట కట్టి, ఆ మూటని పెద్ద పీట మీద పెట్టారు. 

 ఆ తర్వాత వాళ్ళు ముగ్గురూ కలిసి కుంది రోలు సాయం పట్టి ఆ మూట మీద పెట్టేశారు.

 

 మర్నాడు పొద్దున్నే అమ్మ మినప్పప్పు, పచ్చి మిరపకాయలు విడిగా రుబ్బేసిందా? 

తర్వాత మా కోసం కారం కలపకుండా విడిగా కొంచం పిండి ఉంచి, మిగిలిన పిండిలో కారం కలిపేసింది. 

రాత్రంతా మూట లోనుంచి నీళ్ళు కారిపోడంతో అంత పెద్ద మూటా చిన్నదైపోయింది. 

గుమ్మడి ముక్కల్లో కారంపిండి కలిపేసి అమ్మా, బామ్మా కలిసి వడియాలు పెట్టేశారు. 

మధ్యాహ్నాలు ఇంట్లో అందరూ పడుకున్నప్పుడు వడియాలు కాకులెత్తుకు పోకుండా కాపలా కాసే పనీ, రోజూ సాయంత్రం వడియాలు లేక్కెట్టే పనీ నామీదే పడ్డాయి.


నాలుగోరోజుకి ఫెళఫెళ్ళాడుతూ ఎండిపోయాయి వడియాలు. 

ఆవేళ మధ్యాహ్నం భోజనంలోకి వేగించింది అమ్మ!!

 నాన్న, నేనూ ,అన్న భోజనాలు చేస్తున్నాం. 

"బాగున్నాయ్ వడియాలు.. ఇంకో రెండు ఎండలు ఎండితే నిలవుంటాయ్" అన్నారు నాన్న. 

"రెక్కలు ముక్కలైపోయాయ్.. అవ్వ కూడా సాయం వచ్చింది కాబట్టి సరిపోయింది.. కాస్త పనా, కూస్త పనా.. రాక్షస చాకిరీ,

" అంది అమ్మ, నేను, అన్న కూడా కష్టపడ్డా ఆ విషయం అస్సలు చెప్పకుండా. నాక్కోపం వచ్చేసింది.

 "చూడు నాన్న.. మొన్న అన్న కష్టపడి నాట్లు పెట్టాడు , నేను కాయలు కడగి ,వడియాలు కాకుల నుంచి కాపాడాను  . 

 ఆవిషయం అస్సలు చెప్పడం లేదు," అని కంప్లైంట్ చేసేశాను.

 "నువ్వూ, నేనూ ఎంత చేసినా మీ అమ్మకి కనిపించదు .. ఆవిణ్ణి మెప్పించడం మన వల్ల కాదులే.." అన్నారు నాన్న. 

 బామ్మ నా  బొబ్బాసీ గొట్టాలు , తడి మట్టి విషయం నాన్నకి చెప్పేస్తుందేమో అని భయ పడ్డాను కానీ, మర్చిపోయినట్టుంది.. నావైపు కోపంగా చూసి ఊరుకుంది, అంతే..




30, మార్చి 2021, మంగళవారం

ఆంధ్ర పిత ఆవకాయ

 

"ఒక్క మాటు ఇలా తోట లోంచి వెళ్లి, మా బామ్మగారు రమ్మంటున్నారు అని అవ్వకి చెప్పు తల్లి .. అందరూ వచ్చేశారు, మీకోసమే చూస్తున్నారు అని కూడా చెప్పేం.. మర్చిపోవద్దు...

" ఓ నాలుగు సార్లు బామ్మచేత ఇలా బతిమాలించుకుని, అడ్డదారిన అవ్వవాళ్ల  ఇంటికి పరిగెత్తాను నేను.

 అప్పటికే అత్త వాళ్ళ  ఇంటికి, అమ్మమ్మ  గారి  ఇంటికి రెండేస్సార్లు వెళ్లి రావడం అయ్యింది, జల్లెడ కోసం.

 ఆ మధ్యలోనే మావిడికాయలన్నీ తుడిచేసి , ఆరబెట్టేశాను.
 చిన్నపిల్ల నన్న పేరే కానీ ఎన్నిపనులో. కొత్తావకాయ ఊరికే వస్తుందా మరి? 

 

నాకసలు అలా ఇంట్లోనుంచి బయటికి తిరగడం అంటే భలే సరదా.

రోజూ అలా తిరగడానికి ఉండదు కదా!!

అలా అని బామ్మ అడిగిన వెంటనే పని చేసేశామనుకో, ఇంక బతిమాలదు మనల్ని. అదే కాసేపు ఆగితే దార్లో తినడానికి ఏదో ఒకటి పెట్టి మరీ పంపిస్తుంది.

ఇట్టే వెళ్లి అట్టే అవ్వ గారిని తీసుకొచ్చేశాను. 

వేసంకాలం సెలవలు కదా, బడి లేదు. 

ఆవకాయ పనులకోసమని మధ్యాహ్నం భోజనాలు తొరగా అయిపోయాయి. 

అమ్మ, బామ్మ వరస చూస్తుంటే టీ  కూడా ఉండేలా లేవు.


కారాలు దంపడానికి మంగమ్మా, సుబ్బలక్ష్మీ వచ్చేశారు. 

అమ్మ అప్పటికే కుంది రోలు, రోకళ్ళు కడిగి పెట్టేసింది. 

పెద్ద పెద్ద పొట్లాల్లో ఉన్న ఎండు మిరపకాయలు, ఆవాలు పళ్ళాల్లో పోసి ఎండలో పెట్టేసింది. 

జాడీలో ఉన్న రాళ్లుప్పు కూడా విడిగా ఎండబెట్టేసింది.

కుంది రోలు తులసి కోట పక్కకి లాక్కుని,
 "ముందర కారం కొట్టేత్తావండి" అంటూ మిరపకాయలు అందుకున్నారు ఆడవాళ్ళిద్దరూ.

అమ్మేమో దంపిన కారం జల్లించడానికి సిద్ధంగా ఉంది.
చూస్తుండగానే ఖణేల్ ఖణేల్ మంటూ రోకలి చప్పుళ్ళు మొదలైపోయాయి పెరట్లో. 

"ఇదిగో మంగమ్మా, భద్రం. గతమాటు నీ విసురుకి రోకలి పొన్ను విరిగిపోయింది,"
 బామ్మ జాగ్రత్తలు మొదలు పెట్టేసింది. 


నాన్న గారు మావిడికాయలు తరగడానికి కూర్చున్నారు. 

నాకేమో తరిగిన ముక్కలు తుడిచే పని. 

అసలు ఆవకాయ పెట్టడంలో అన్ని పనులకన్నా కష్టమైనదీ,
జాగ్రత్తగా చేయాల్సిందీ ఇదే. 

ఓ పాత గుడ్డతో తరిగిన ప్రతీ ముక్కనీ జాగ్రత్తగా తుడవాలా. 

పెచ్చు మీద ఓ చిన్న మైకా కాగితం లాంటి పొర ఉంటుంది. 

అది ఊడి చేతిలోకి వచ్చేదాకా ఊరుకోకూడదు. గోకైనా తీసేయాలి. 

అలా తియ్యలేదనుకో, ఆవకాయ్ పాడైపోతుంది.

 నేనుఒక్కదానినే  అంత ముఖ్యమైన పని చేస్తున్నాననైనా లేకుండా, మధ్య మధ్యలో బామ్మ బోల్డన్ని ఆర్డర్లు. 


కారం ఓ నాలుగు దంపులు దంపేసరికి మంగమ్మ బుగ్గనేసుకోడానికి బెల్లమ్ముక్క అడిగింది. 

అలా వేసుకుంటే దంపడం సులువౌతుందిట. 

ఏమిటో, నా పనికే ఏ సులువులూ లేవు. 

"దేవుడు గదిలో నీలం మూత సీసాలో బెల్లం ముక్కలు ఉంటాయి, నిమ్మళంగా సీసా పట్టుకురా తల్లీ " అంది బామ్మ. 

అసలు ఎవరూ చెప్పకుండానే ఆ సీసా ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు. 

ఎలా తెలుసో ఎవరికీ చెప్పననుకో. 

ఓ బెల్లమ్ముక్క గుటుక్కుమనిపించి, సీసా తెచ్చి బుద్ధిగా బామ్మకిచ్చా. మంగమ్మతో  పాటు  బామ్మ నాకూ ఓ ముక్కిచ్చింది "మా తల్లే " అంటూ. ఈ ముక్క బుగ్గనేసేసుకున్నా. 


నేనెంత తొరగా తుడుస్తున్నా, నాన్న గారు గబాగబా  కోసేస్తున్నారు కదా. 

తుడవాల్సిన ముక్కలు పెరిగిపోతున్నాయి. దంపేవాళ్ళు ఉస్సు అస్సు అంటున్నారు.. అందరికీ చెమటలు కారిపోతున్నాయ్.

 ఇలాంటి పని ఏ రాత్రో పెట్టుకోవాలి కానీ, ఈబామ్మకేంటో ఏవీ తెలీదు, చెప్పినా వినదు. 

 చూస్తుండగానే అన్నేసి మిరపకాయలూ దంపడం అయిపోయింది. 

 మజ్జిగ తేట తాగేసి ఆవాలు రోట్లో పోసుకున్నారు వాళ్ళు. అవ్వ గారు చెప్పినట్టు వాళ్ళంత గబగబా చేయడం మనకి రాదు. 

 బామ్మ కూడా మధ్యలో ముక్కలు తుడవడానికి వచ్చింది కానీ, మళ్ళీ ఏదో పనుందని వెళ్ళింది. 


మొత్తానికి మా ముక్కల పని అయ్యేసరికి, వాళ్ళు ఆవపిండి, ఉప్పు కూడా దంపేసి, కూరా పులుసూ పట్టుకుని వెళ్ళిపోయారు. 

అమ్మ అప్పటికే కడిగి ఆరబెట్టిన పెద్ద జాడీని తులసికోట దగ్గరికి పట్టుకొచ్చింది. 

జాడీ ఎంత ఉంటుందంటే, అందులో నేను ములిగిపోతాను.

 అప్పటికి నీరెండ పడుతోంది. 

 బామ్మ, నేను తుడిచిన మావిడి ముక్కలు, ఉప్పు, కారం, ఆవపిండీ జాడీలోకి దింపి బాగా కలుపుతోంటే, అమ్మ నూని కేన్లు బయటికి పట్టుకొచ్చింది. 

 ఎంతనూనో! ఆ నూనితో ఎన్నేసి జంతికలూ, చేగోడీలూ, పాలకాయలూ చేసుకోవచ్చో నేను లెక్కలేసుకుంటుంటే, 

 అవ్వ గారి పర్యవేక్షణలో అమ్మ, బామ్మ కలిసి ఆ నూనంతా జాడీలోకి వంపేసి, బాగుచేసిన మెంతులు జాడీలో పోసి బాగా కలిపేశారు. 

 అంతే, ఆవకాయ పెట్టడం అయిపోయింది. జాడీని దేవుడి గదిలోకి సాయం పట్టేశారు. 


మూడో రోజు సాయంత్రం నేను అన్నం తింటోంటే "కాస్త రుచ్చూడు" అంటూ కొత్తావకాయ విస్తట్లో వేసింది బామ్మ. 

ఓ ముద్ద తిని, "కొంచం ఉప్పగా ఉంది" అన్నాన్నేను. 

అంతే, బామ్మకి కోపం వచ్చేసింది.
"దీపాలెట్టాక ఉప్పు ఉప్పు అనకూడదు.." అంటూ వాదించేసింది. 

మరి ఉప్పుడుపిండి కావాలంటే ఏమని అడగాలో? ????

రాత్రి అన్నంతిన్న నాన్న, కూడా అదే మాట, ఉప్పు తగులుతోందని. 

ఈసారి బామ్మకి కోపం రాలా. 

సాయంత్రం చంటిది  ఉప్పుంది  కానీ, దాని  మోహం దానికేం  తెలుసులే అనుకున్నాను" అంది, నేను నిద్రపోతున్నాననుకుని.

"రేపు తిరగేశాకా కూడా తగ్గకపోతే, ఓ నాలుక్కాయలు తరిగి పడేద్దావండత్తయ్యగారూ" అని అమ్మ అనడం కూడా వినిపించింది నాకు. 

పెచ్చులకి మాత్రం ఎవరూ పేరు పెట్టలా...
ఏడాదంతా అయ్యింది కానీ, ఒక్కళ్ళకీ విస్తట్లోకి మైకా కాయితంముక్క  రాలేదు.

 


30, జనవరి 2021, శనివారం

'పెసరట్లు పలు విధములు...'

 'పెసరట్లు పలు విధములు...' అంటూ  మొదలు పెడితే జరిగేవి రెండు.. 

మొదటిది, చదివే వారి ముఖంలో చిరునవ్వైతే, 😄😄

రెండోది వారి నోట్లో ఊరే లాలాజలం. 😋😋😋😋

 ఏమని చెప్పుదునో పెసరట్టు గురించీ అనుకున్నా కానీ, ఇలా  మొదలు పెడుతూనే ఎన్నో కబుర్లు మేమున్నాం అంటూ గుర్తొచ్చేస్తున్నాయి.

 షాపు నుంచి తెచ్చుకున్న పెసల్లో రాళ్ళూ, రప్పలూ ఏరుకుని, ఓ సారి కడిగేసి, అటుపై నీళ్ళలో నానబోసేసి.. 

 బాగా నానాక ఓ చిన్న అల్లంముక్క జతచేసి జారుగా పిండి రుబ్బి పక్కన పెట్టేసుకుంటే పెసరట్టు మహాయజ్ఞం లో మొదటి అంకం పూర్తయినట్టే. 

పెసరట్టు అంటూ అనుకున్నాక, కేవలం సాదా పెసరట్టుతో సరిపెట్టుకునే ప్రాణాలు కావు కదా మనవి.. 

అందుకని ఉల్లి పాయలు, అల్లం, పచ్చి మిర్చీ సన్నగా తరిగేసి పక్కన పెట్టేసుకుంటాం.

సరిగ్గా ఇదే సమయంలో 'ఆ చేత్తోనే కాస్త ఉప్మా కలియబెట్టెయ్య రాదూ' అని ఆత్మారాముడో, సీతో వినీ వినిపించనట్టు మూలుగుతారు.

 'అదెంత పని కనుకా' అనిపించి తీరుతుంది. 

పావుగంటలో ఉప్మా రెడీ అవ్వనే అవుతుంది. 

పెనం పొయ్యి మీదకి ఎక్కించి, బాగా వేడెక్కనిచ్చి కాసిన్ని నీళ్ళు జల్లి చూసుకుని, వేడి సరిపోతుంది అనిపించగానే ఉప్పు కలిపిన పెసరపిండితో అట్టు పోసేసి, 

అటుపై కొంచం జీలకర్ర, అల్లం ముక్కలు, ఉల్లి, పచ్చి మిర్చి ముక్కలూ ఒకదాని తర్వాత ఒకటో, అన్నీ కలిపేసో మన ఓపికని బట్టి జల్లేస్తాం కదా.. ఇక్కడితో రెండో అంకం పరిసమాప్తం.

సగం కాలిన అట్టు చుట్టూనూ, మధ్యలోనూ నెయ్యో నూనో చల్లేసి, అట్టు సుతలు పైకి లేస్తున్నాయనగా ఓ గరిటెడు ఉప్మా అట్టు మధ్యలో పెట్టేసి, మన చెయ్యి తిరగడాన్ని బట్టి రెండు మడతలో, మూడు మడతలో వేసేసి 

అల్లప్పచ్చడి, కొబ్బరి పచ్చడి ఉన్న ప్లేట్లోకి బదలాయించేశామంటే పెసరట్టు వంటకం పూర్తైపోయినట్టే.

పెనం, పిండీ సిద్ధంగా ఉన్నాయి.. మొదటి అట్టు వాసన ముక్కుకి తగలడంతోనే కనీసం నాలుగైదు అట్లన్నా కావాల్సిందే అని కడుపు ఆదేశాలు జారీ చేసేస్తుంది.. 

కాబట్టి అట్టు వెనుక అట్టు.. అట్టు పై అట్టు... అట్లా అట్ల వంటకం కొనసాగుతుందన్నమాట. 

దోస ని  పల్చగా, క్రిస్పీ గా తినడానికి ఇష్టపడే ప్రాణులు సైతం పెసరట్టు దగ్గరికి వచ్చేసరికి 'ఎలా ఉన్నా సరే' అనేస్తారు. 

అవును మరి, పెసరట్టు పల్చగా ఉన్నా, మందంగా ఉన్నా రుచే. 

ఉల్లి పచ్చి మిర్చి వగయిరాలతో పాటు వేయించిన జీడిపప్పు పలుకులు పెసరట్టు మీద జల్లి, కనీసం నాలుగు చట్నీలతో వడ్డిస్తే ఆ పెసరట్టు పేరు 'ఎమ్మెల్యే' పెసరట్టు.

 మందంగా వేసిన పెసరట్టుతో 'పెసరట్టు కూర' అని చేస్తారు. 

 పెసరట్టు ముక్కలని పోపులో వేసేసి, చింతపండు రసం కూడా పోస్తారు పైన.. ఏ ఇల్లాలో ఉదయం మిగిలిపోయిన పెసరట్లతో ఈ కూర సృష్టించి ఉంటుంది బహుశా.. కేవలం కూర కోసమని పెసరట్లు చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు.

 మామూలుగా టిఫిను పుచ్చుకున్నాక కాఫీయో, టీవో సేవించడం రివాజు. 

అదే పెసరట్టు తిన్నాక అయితే, వీటికి బదులుగా పల్చటి మజ్జిగ పుచ్చుకుంటే (వీలయితే నిమ్మరసం పిండింది) రెండు మూడు గంటలన్నా గడవక ముందే కడుపు ఆకలితోకణకణ మంటుంది. 

తెలివైన ఇల్లాళ్ళు ఆదివారం పొద్దున్నే పెసరట్టుప్మా టిఫిన్ పని పెట్టుకుంటారు. 

 అప్పుడైతే ఎక్కువ వంటకాలు చెయ్యకుండానే మధ్యాహ్నం బోయినాలు కానిచ్చేయవచ్చు కదా.. మామూలు పెసరట్టు కన్నా, ఉప్మాతో కలిసిన పెసరట్టు కొంచం బరువుగానే అనిపిస్తుంది మరి. 

 అదేవిటో, పెసరట్టు కబుర్లు మాత్రం ఎన్ని చెప్పుకున్నా బరువుగా అస్సలు అనిపించవు.. 

 ఆ భరోసాతోనే ఈ కబుర్లు ముగిస్తున్నాను... 




అన్నదాత సుఖీభవా 

లోక సమస్త సుఖినో భవంతు

**** మీ ఉషగిరిధర్ ****




27, జనవరి 2021, బుధవారం

మెట్ట వంకాయతో ...ముద్ద పచ్చడి

ఆకుపచ్చ రంగులో మిలమిలా మెరుస్తూ, గుండ్రంగా, గుండుచెంబుల్లా ఉండే వంకాయలకి మెట్ట వంకాయలు అని పేరు.  

వీటిని అల్లం, పచ్చిమిర్చి,  కొత్తిమీర కారంతో కూర చేసుకోవచ్చు.

 అలాగే కాల్చి పచ్చడి కూడా చేసుకోవచ్చు. 

 ముద్ద పచ్చడి,బండ పచ్చడి, పులుసు పచ్చడి, పచ్చి పులుసు.. 

ఇలా కొద్దిపాటి మార్పులతో రకరకాల పచ్చళ్ళు చేసుకునే వీలు కూడా ఉంది. 

 జుట్టున్నమ్మ ఏకొప్పు చుట్టినా అందమే అన్నట్టుగా,!!!!!!!!!!!!!!

 అసలంటూ నవనవలాడే వంకాయలు దొరకాలే కానీ ఏ పచ్చడి చేసుకున్నా రుచే. 

మా చిన్నప్పుడు పెరట్లో నీళ్ళపొయ్యి మీద ఇంటిల్లిపాదికీ స్నానాలకి వేడి నీళ్లు కాచడం రోజూ ఓ మహా యజ్ఞం. 

పొద్దున్నే తోటకి వెళ్లిన నాన్న వస్తూ వస్తూ కూరలు తెచ్చేవాళ్ళు. 

వాటిలో ఈ వంకాయలు కనక ఉంటే, వాటిని పొయ్యిలో కాల్చే డ్యూటీ కూడా నీళ్లు కాచే వాళ్లదే. 

నీళ్ళపొయ్యి స్థానంలో గ్యాస్ స్టవ్ వచ్చినా, 

రోలు-రోకలి బండల్ని మిక్సీ రీప్లేస్ చేసినా

 మెట్ట వంకాయలు దొరికినప్పుడల్లా పచ్చడి చేసుకోవాల్సిందే. 

ముందుగా వంకాయలకి కాస్త నూనె పట్టించి, చిన్న బర్నర్ల ని లో ఫ్లేమ్ లో పెట్టి సమంగా కాల్చుకోవాలి. 

వంకాయ ఎంత వైనంగా కాలితే పచ్చడి అంత రుచిగా వస్తుందన్న మాట. 

వంకాయతో చేసే ఏ పచ్చడికైనా కాల్చడం కామనే.  

కాల్చిన వంకాయల్ని చల్లార్చి, 

మాడిన పైపొరని జాగ్రత్త తీసి,

 ముచికలు కోసేసి, గుజ్జుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.

 కాలిన నుసి పొరపాటున గుజ్జులో కలిసిపోకుండా చూసుకోడంతో పాటు,

 వంకాయలు చూడ్డానికి ఎంత అందంగా ఉన్నా పొట్టలో పురుగూ పుట్రా ఉండే ప్రమాదం ఉంది కాబట్టి, గుజ్జుని కొంచం జాగ్రత్తగా మెదిపి పరిశీలించుకోవడం అవసరం. 

 గుజ్జు మీద కాస్త పసుపు చల్లి, చెంచా సాయంతో మెత్తగా చేసుకోవాలి. 

ఈ  గుజ్జుని ఓ పక్కన పెట్టుకుని, ఏ రకం పచ్చడి చేసుకోవాలి అన్నది అప్పుడు తీరికగా ఆలోచించుకోవచ్చు. 

నేను ఇప్పుడు  ముద్ద పచ్చడి చేస్తూ నాను...పైన  చేసి పెట్టుకున్న గుజ్జుకి 

చక్కగా పోపు ===శనగ పప్పు , పొట్టు మినపప్పు , పచ్చిమిరపకాయలు ముఖ్యముగా గుమ్మడి వడియాలు  పెట్టుకుని . 

వారం వర్ధం ఏమి లేని రోజు  ఉల్లిపాయలు  చక్కగా వేయించి కలుపుకుంటే .....

ఆ రుచి అద్భుతః 😋😋😋😋😋

  చిన్నప్పుడు చేసే రోటి పచ్చడి ఎలా ఉండేదంటే కాల్చి, తొక్కతీసిన వంకాయలు రోట్లో వేసి బండతో నూరేవారు. 

  రుచిలో ప్రధానమైన తేడా ఇక్కడే వస్తుంది. 

మనం ఈ చెంచాలు అవీ వాడి ఎంత జాగ్రత్తగా చేసినా ఆ బండ తాలూకు రుచి రాదుగాక రాదు. 

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, రోళ్లలో వాడే పచ్చడి బండలు ఎర్ర చందనపు దుంగల నుంచి చేసేవాళ్ళు. 

  పైగా రోకలికి ఉన్నట్టుగా బండకి పొన్ను ఉండదు కాబట్టి, వద్దన్నా కాస్త ఎర్ర చందనం ఈ పచ్చళ్లలో కలుస్తూ ఉంటుంది. 

నాటి పచ్చళ్ళ రుచి తెలియని వాళ్లకి నేటి పచ్చడి రుచి మేటిగానే ఉంటుంది. 

తెలిసిన వాళ్ళు కూడా చేసేదేమీ ఉండదు,

 చిన్న నిట్టూర్పుతో సరిపెట్టేసుకోడం తప్ప!!!!!!!!!!!!!!!

ఇంతకు  ఇప్పుడు ఇది అంతా ఎందుకు చెపుతున్నాను అనుకుంటున్నారా .. 

ఈ  రోజే ఊరు నుంచి నాన్నగారు  మెట్ట వంకాయలు పంపారు 

నేను ముద్ద పచ్చడి చేసుకుంటు ఇలా మీతో కూడా పంచుకుంటున్నాను !!!!!!!!!!

మీకు కూడా దొరికితే కొంచం చేసుకుని రుచి చూడండి ...ముఖ్యముగా గుమ్మడి వడియాలు పోపు  పెట్టుకోవడం మరచి పోకండి . 





అన్నదాత సుఖీభవా 

లోక సమస్త సుఖినో భవంతు

**** మీ ఉషగిరిధర్ ****