Pages

30, నవంబర్ 2020, సోమవారం

శ్రీ మహావిష్ణు ప్రతిష్ఠించిన రామలింగేశ్వరుడు ---క్షీరారామము

అందరికి  నమస్కారం  .... 


                          విశ్వరూపుడు, పార్వతీ మనోహరుడు, నాగాభరణుడు, సూర్యచంద్రాగ్ని లోచనుడు,  ముకుంద ప్రియుడు భక్తజనమందారుడైన పరమేశ్వరుడు ఆశ్రితజన వరదుడు. తన భక్తుడు  ఏ వరాన్ని అడిగినా  కాదనకుండా ఇచ్చే కరుణార్ధ్రహృదయుడు మన భోళాశంకరుడు . అందుకే ఆసేతు హిమాచల పర్యంతం ఆ పార్వతీ నాథుణ్ణి ద్వాదశ జ్యోతిర్లింగాల లోను, కాశీ రామేశ్వరాది మహాపుణ్య క్షేత్రాల్లోను, పంచారామ క్షేత్రాల్లోను  కనులార దర్శించి, చేతులారా పూజించి, భక్తులు ముక్తసంగులౌతున్నారు.

అలాంటి పార్వతీ మనోహరుడు మన రామలింగేశ్వరుడు

 స్థల పురాణం ...           

                పూర్వం వజ్రాంగుని కుమారు డైన తారకాసురుడు శివుణ్ణి గురించి ఘోరతపస్సు చేశాడు. శివుని అనుగ్రహం పొంది,  శివుని కుమారుని చేత మాత్రమే మరణం సంభవించేటట్లు గా వరం పొంది, తన రాజథానియైన శోణిత పురానికి చేరాడు. అనంతరం  క్షీరసాగర మథన సమయం లో  ఆ పాల సముద్రం నుండి ఆవిర్భవించిన అమృతలింగాన్ని హస్తగతం చేసుకొని,వర గర్వితుడై, ఇంద్రాది దేవతలను బాధించసాగాడు. అప్పుడు ఇంద్రాది దేవతలు   బ్రహ్మను ప్రార్ధించగా, శివ పార్వతులకు జన్మించే కుమారస్వామి వలననే  తారకాసుర సంహారం సాథ్యమని చెప్పాడు. నంతరం దక్షయజ్ఞధ్వంసం, సతీదేవి మరణం, పార్వతీ జననం, శివుని  గూర్చి పార్వతి తపస్సు, అనంతరం లోకకళ్యాణ కారకంగా శివపార్వతుల కళ్యాణం, అంగరంగవైభవంగా జరిగింది. ఆ ఆది దంపతులకు దివ్యతేజస్సంపన్నుడైన షణ్ముఖుడు జన్మించాడు.                                      

                   అనంతర కాలం  లో కుమారస్వామి తారకాసురుని తో  జరిగిన యుద్ధం లోథన దివ్యశక్తి  ఆయుథం తో తారకుని కంఠహారం లోని అమృతలింగాన్ని భేదించాడు. అది ఐదు పంచఖండాలై, దివ్యకాంతుల తో ఓంకారనాదం చేస్తూ, ఐదు ఆరామ స్థలాల్లో పడ్డాయి.శివుని పంచముఖ స్వరూపాలే నేటి ఈ పంచారామ క్షేత్రాలు.

                            ఈ ఐదు అమృతలింగ ఖండాలను ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు ఏక కాలం లో-దివ్య ముహూర్తం లొ వరుసగా – ఇంద్ర, సూర్య, కుమార, చంద్ర, విష్ణువులు విశ్వ కళ్యాణార్థమై ప్రతిష్ఠించి,పంచామృతాలతో అభిషేకించినట్లు పురాణాలు చెపు తున్నాయి. ఈ  తారకాసుర సంహార ఘట్టాన్ని స్కాంద, శివ పురాణాలు విశేషంగా వర్ణించాయి.

పంచారామ ప్రాథాన్యాలు

 1. అమరావతి  ( అమరేశ్వరుడు) దేవేంద్ర ప్రతిష్ఠ  (అఘోర స్వరూపం )— అమరావతి       

 2. దక్షారామం  (భీమేశ్వరుడు ) సూర్య ప్రతిష్ఠ      (తత్పురుష రూపం )--ద్రాక్షారామం

 3. కుమారారామం ( కుమార భీమేశ్వరుడు ) కుమారస్వామి  ప్రతిష్ఠ (వామదేవరూపం )  సామర్లకోట.

 4. సోమారామం   ( సోమేశ్వరుడు ) చంద్ర ప్రతిష్ఠ  (సద్యోజాత రూపం) గునుపూడి,బీమవరం.

 5. క్షీరారామం  (శ్రీ క్షీరా రామలింగేశ్వరుడు )  శ్రీ మహావిష్ణు ప్రతిష్ఠ (ఈశాన రూపం) పాలకొల్లు .                                                         

  రామలింగేశ్వరుడు- క్షీరారామము (పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా)

                 కుమారస్వామి చేత భేదించబడిన అమృతలింగ శిరోభాగాన్ని వశిష్ట గోదావరీ తీరానికి పశ్చిమం గాబ్రహ్మాది దేవతలు వెంటరాగా శ్రీమహావిష్ణువు శ్రీక్షీరా రామలింగేశ్వరుని, త్రిపుర సుందరీ  సమేతం గా ప్రతిష్ఠించి, శివుని కోర్కె మేరకు శ్రీమహావిష్ణువు  క్షేత్రపాలకుడిగా  శ్రీలక్ష్మీసమేతుడై జనార్ధనస్వామి రూపం తో శంఖ,చక్ర,గదా, పద్మ ధారియై  .ఈ క్షీరారామం లో కొలువు తీరాడు.

          పంచారామ క్షేత్రాలలో ఒకటైన క్షీరారామం పార్వతీ సమేతుడై 'శ్రీ రామలింగేశ్వరుడు' వెలసిన పరమ పావనమైన పుణ్య క్షేత్రం. ఇక్కడి శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుచే శివలింగం ప్రతిష్టించబడిన ఈ పుణ్య క్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్రపాలకుడు. ఆదిశంకరాచార్యులవారు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీ చక్రం ప్రతిష్ఠించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ క్షేత్రాన్ని క్షీరపురి పాలకొలను, ఉపమన్యుపురం, అనే పేర్లతో కూడా పిలుస్తూ వుంటారు. 

శివలింగం పైభాగం మొనదేలి ఉండటం వలన ఇక్కడి స్వామివారిని 'కొప్పు రామలింగేశ్వరుడు' అని కూడా పిలుస్తారు. ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పైభాగమని విశ్వసిస్తున్నారు. స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రాకార మంటపంలో పార్వతీ దేవి కొలువై వుంటుంది. 

ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ... రుణహర గణపతి ఆలయాలు కనిపిస్తాయి. ఈ రుణహర గణపతిని దర్శించడం వలన అప్పుల బాధల నుంచి బయటపడటం జరుగుతుందని భక్తులు భావిస్తుంటారు. ఇక్కడి రాజగోపురం 9 అంతస్తులను కలిగి 120 అడుగుల ఎత్తులో అద్భుతమైన శిల్ప కళతో అలరారుతూ వుంటుంది.

స్థలపురాణం 

పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలకుడి కోసం శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడి నుంచి పాలధారలు పొంగి పొర్లాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపురి, పాలకొలను ఉపమన్యుపురంగా ప్రసిద్ధి చెందినట్లు స్థలపురాణం చెబుతోంది.


                                             లోక సమస్త సుఖినో భవంతు

**** మీ ఉషగిరిధర్ ***********





24, నవంబర్ 2020, మంగళవారం

అమరేంద్రుడు చేత ప్రతిష్ఠించబడిన --- అమరారామం

  అందరికి  నమస్కారం  ....                            

                              అమరేంద్రుడు చేత ప్రతిష్ఠించబడిన --- అమరారామం

                     కలిదోష నివృత్తి కొఱకు శౌనకాది మహామునులకు నారద మహర్షి  భూలోకమునందు గల  పవిత్ర పుణ్య స్థలాలను గూర్చి వివరిస్తూ  అమరేశ్వరుని  గురించి చెప్పినట్లు  స్కాంద పురాణం లో  కన్పిస్తోంది.అదే పంచారామాల్లో ఒకటైన అమరారామం


 స్థలపురాణం  :   ఈ అమరారామాన్ని  గురించిన విశేషాలు, స్కాంద పురాణం లో సహ్యాద్రి ఖండం లోను ,బ్రహ్మపురాణం పూర్వ ఖండం లోను. పద్మపురాణం ఉత్తర భాగం లోను ప్రస్తావించబడినట్లు స్థలపురాణం చెపుతోంది. 

                                 తారాకాసుర సంహారం పూర్తి చేశాడు కార్తికేయుడు. యుద్ధ సమయం లో తారకుని కంఠమందలి అమృతలింగం కుమారస్వామి శక్తి ఘాతాలకు ఐదు గా విడి పోయి ఆంధ్ర దేశం లో ఐదు ప్రదేశాల్లో పడ్డాయి.వాటినే మనం పంచారామాలని పిలుస్తున్నాము.

            ఆ పంచారామాల్లో ఒకటైన  ఈ అమరారామం లోని అమరేశ్వరుడైన ఇంద్రుని చేత ప్రతిష్ఠించబడటం వలన ఈ స్వామిని  అమరేశ్వరుడని, ఆ స్వామి కొలువైన ఈ నగరాన్ని ఇంద్రుని నగరం పేరున అమరావతి యని పిలుస్తున్నారు.  దీనిని” దక్షిణ కాశి”  యని  కూడ అంటారు.. 

                       దేవగురువైన బృహస్పతి ఆదేశానుసారం  ఇంద్రుడు  ఆశ్వయుజ శుద్ధదశమి నాడు  సమస్త దేవతా గణము జయజయధ్వానము లు చేయుచూ వెంటరాగా,    తారకాసురుని గళమందలి అమృత లింగము నుండి చెదిరిన ఒక శకలమును ఈ క్రౌంచగిరి పై ప్రతిష్ఠించినాడు              

                   శుద్ధ ధవళ కాంతులతో  ప్రకాశించుచున్న ఆ అమరేశ్వరుడు ప్రతిష్ఠించిన వెంటనే పైపైకి పెరిగి పోవటం ప్రారంభించాడట. అంత దేవేంద్రుడు అభిషేకములు చేసి, వివిధ దేవతాకుసుమములతోను,  బిల్వ పత్రములతోను పూజించినను స్వామి పెరుగుదల ఆగక పోవటంచేత  లింగాగ్రముపై  సీల కొట్టి, కృష్ణవేణీ జలం తో అభిషేకించగా స్వామి పెరుగుదల ఆగిందట.   ఇప్పటికీ లింగాగ్రంలో  తలపై నుండి జాలువారిన నెత్తుటి చారలు కన్పిస్తాయని భక్తులు చెప్పుకుంటుంటారు. 

             తారకాసురుని మరణానంతరం ఇంద్రుడు స్వామి ని  ప్రతిష్ఠించిన తర్వాతే   మహేంద్ర పదవిని మరల పొందాడు.  ఆ ఇంద్రుని చే ప్రతిష్ఠించబడిన స్వామి అమరేశ్వరుడిగా ఆరాథించబడుతున్నాడు.

      ఈ విషయాన్ని విన్న రాక్షస గురువు శుక్రాచార్యుడు బృహస్పతి చెంతకు వచ్చాడు.  “ కృష్ణానదికి వరదలొస్తే అమరేశ్వరుడు మునిగి పోయే ప్రమాదం ఉంది గదా! అటువంటి ప్రదేశం లో స్వామిని ఎలా ప్రతిష్ఠ చేయించారనే సందేహాన్ని” వెలిబుచ్చాడు బృహస్పతి తో శుక్రాచార్యుడు. అందుకు ” ఆత్మలింగం పడినచోట భూభాగం క్రింద పాతాళం వరకు క్రౌంచ పర్వతం ఉంది. దానిపై నున్న ఆమహాలింగం పెరగటం వల్ల, ఎంత వరదలొచ్చినా ఆ మహాలింగానికి వచ్చిన ముప్పు ఏమీలేదు.కృష్ణా ప్రవాహమే స్వామికి నమస్కరించి  ప్రక్కకు తిరిగింది కదా.  ఉత్తర దక్షిణాలు గా నది ప్రవహించడాన్ని మీరు గమనించారు కదా!” అన్నారట బృహస్పతి. ఆ యనంతరం దేవ గురువుల సూచనల మేరకు   అమరేశ్వరుని చుట్టుఅంబిక మొదలైన శివపరివారమంతా  కొలువు తీరింది . 


                                         లోక సమస్త సుఖినో భవంతు

**** మీ ఉషగిరిధర్ ***********

మాట గదరా శివ... పాట గదరా శివ

                                     

అందరికి  నమస్కారం  .... 

                                   ఓం నమఃశ్శివాయ.. ఇదే పంచాక్షరీమహా మంత్రం. 

ఈ మంత్రం యజుర్వేదం రుద్రాధ్యాయం లోనిది. అన్ని కోర్కెలనూ నెరవేర్చే కల్పవృక్షం ఈ మంత్రం. దీని ఉచ్చరణ వల్ల చిత్తశుద్ధి, జ్ఞానప్రాప్తి లభిస్తాయని పురాణాల్లో తెలిపారు. ఈ మంత్రంలో ‘ఓం’తో సహా ఆరు అక్షరాలున్నాయి. ప్రతి మంత్రానికి ముందు ఓం ఉంటుంది. కాబట్టి, దాన్ని వదిలేసి లెక్కిస్తే ఐదక్షరాలే. అలా అని ఓంకారాన్ని వదలరాదు.

‘న, మ, శి, వ, య. మంత్రం’ ‘ఓం’ కారంతో ప్రారంభం అవుతుంది. ఓం... మహాబీజాక్షరం. దీని నుంచే మిగిలిన అక్షరాలన్నీ ఆవిర్భవించాయని చెబుతారు. ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు ‘అర్థం, పరమార్థం’ రెండూ ఉన్నాయి.


 శ్లో    ఓంకారంచ పరబ్రహ్మ యావదొంకార సంభవః|                                                                                            అకారోకారమాకార ఏతే సంగీత సంభవాః ||    

   ఓంకారము పరబ్రహ్మ  స్వరూపము . ఆ  ఓంకారమునందు   యావత్తు జగము పుట్టెను. అందులో అకార, ఉకార, మకారము లనే మూడక్షరముల వలన సంగీతం పుట్టెనని భావము

శ్లో    అకారో విష్ణ రూపంచ ఉకారో బ్రహ్మ రూపకం ||

     మకారో భర్గ రూపంచ సర్వ మోంకార రూపకం ||   

 అకారము విష్ణు స్వరూపము ,ఉకారము బ్రహ్మ స్వరూపము ,మకారము రుద్ర స్వరూపము   .ఈ త్రిమూర్తుల స్వరూపమే ఓంకారం


               ఈ మంత్రం ఆధ్యాత్మికతకు ఉపయోగపడుతుందని, ఈ మంత్రోచ్చారణ వల్ల నాడులు పరిశుభ్రమై, మనసులో ప్రశాంతత నెలకుంటుందని పండితులు చెబుతారు. దీనిని పదేపదే ఉచ్చరించడం వల్ల మనిషిలో ఉండే తమో, రజోగుణం పోయి ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని కూడా ఆధ్యాత్మికవేత్తలు బోధిస్తున్నారు.

            ఈ మంత్రం వెనుక ఎంతో పరమార్థం ఉంది. మానవ శరీరం పంచభూతాత్మకం. నమశ్శివాయ అనే అయిదు అక్షరాలను పలికినప్పుడు పంచ భూతాలతో నిండిన శరీరం శుభ్రమవుతుంది. ఒక్కో అక్షరం ఒక్కో భూతాన్ని శుభ్రం చేస్తుంది.

‘న’ భూమికి సంబంధించిన భాగాలను,

‘మ’ నీటికి సంబంధించిన భాగాలను, 

‘శి’ అగ్నికి సంబంధించిన భాగాలను,

‘వ’ గాలికి సంబంధించిన భాగాలను, 

‘య’ ఆకాశానికి సంబంధించిన భాగాలను పరిశుభ్రం చేస్తాయి.

              మనసు, శరీరం పరిశుభ్రంగా లేనంతవరకు మనిషిలో ఆధ్యాత్మిక భావన స్వచ్ఛంగా నిలబడదు. అందువల్లే ఓం నమశ్శివాయ అనే పదాన్ని పదేపదే ఉచ్చరిస్తే, మానసిక ప్రశాంతత ఏర్పడుతుందనడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదని పౌరాణికులు చెబుతారు.

                    నమశివాయలు పాట

              మన పెద్దవాళ్ళు ఏ విషయాన్ని  అయినా  ఒక పద్యం రూపంలో  కానీ ఒక పాట రూపంలో కానీ చెప్పేవారు ..  అలా మా పెద్ద మేనత్త దగ్గర నేను నేర్చుకున్న ఒక పాట  నమశ్శివాయ లు

 ఈ పాట ఎవరు రాశారు నాకు తెలియదు  కానీ దీనిలో చాలా గొప్ప అర్ధం ఉంది దానిని మీ కోసం ఈ క్రింద రాస్తున్నా


.                   కాశీలో విశ్వేశ్వర మా జనని అన్నపూర్ణాదేవి తో 

          కలభైరవ ఈశ్వర జీవులను కరుణించు    

           || నమశివాయ||

 .                 గంగ యమున నడుమను సరస్వతి సంగమ యుండగాను 

.               నాసిక త్రివేణి లో నాణ్యము గా చూడుము                   || నమశివాయ||

 

 జనన మరణములన గా ఈ జన్మలో పుట్టించొచ్చు చందురు 

 మీ నామ పంచాక్షరి స్థిరముగా నిలుపు మీ         || నమశివాయ||


 కుక్క వలే తిరుగుతూ చాడీలు చక్కగా చెప్పుచుందురు 

 ఒకవేళ ఉన్న బుద్ధి ఒకవేళ ఉండదు                 || నమశివాయ||


 గంతలు  తొమ్మిది ఆలోపల దంతాలు వేయి ఉండును

పంచ క్రోధముల బట్టి నీ యందు పసలేదు       || నమశివాయ||


 మలమూత్రములు గుంటలు ఆ లోపల మాంసపు  నెత్తురు కండలు

 మురికి ప్రేగుల దండతో పైతోలు బహు తీపి      || నమశివాయ||


 వేదములు చదివిన ఎన్నెన్ని వేషాలు వేసినా

 నీ భక్తి లేని వారు కాశీలో కొరగారు                      || నమశివాయ||


 కామ క్రోధములు లకే మానవులు కాలమంతయు గడుపుచూ 

 మోహజ్వాలములగుచూ  మీకంటే వెలలేదు      || నమశివాయ||


పగలు నాలుగు ఝూములు  పోకిరీలు పోవుచు తిరుగుచుందురు 

 రాత్రి పొద్దు వేళ నా అతి కేలి భోగములు అనుభవిస్తారు 

 ఆమీద కను నిద్రతో మిమ్మలను తలువరు         || నమశివాయ||

 

 పెక్కు మాటలాడుతూ పెద్దలను వింతగా దూషించు 

 సజ్జలు చూచి నవ్వి చప్పట్లు తలువారు         || నమశివాయ||

 

 ఈశ్వరా నీ నామము యిలలోన ఎవరూ పాడి వినను

 కైవల్యము తో ముక్తి పొందుతారు             || నమశివాయ||


                                              లోక సమస్త సుఖినో భవంతు

**** మీ ఉషగిరిధర్ ***********


23, నవంబర్ 2020, సోమవారం

చంద్రుడు ప్రతిష్ఠించిన సోమేశ్వరుడు--భీమారామము

 అందరికి  నమస్కారం  .... 

                  మన  గోదావరి జిల్లా ఎన్నో పురాణ గాధలకు, చారిత్రిక విశేషాలకూ నిలయం..అందులో ఒకటి భీమారామము .. ఇది పంచారామాల్లో ఒకటి.  


పురాణ కధలు:

                  తారకాసురుడు అనే రాక్షసుడు శివభక్తుడు. ఈ తారకుని మెడలోని అమృతలింగం అతనికి ప్రాణరక్ష గా  ఉండేది. ఆ గర్వం తో ఆ రాక్షసుడు  ముల్లోకాలను అతలాకుతలం చేయసాగాడు. ఆ రాక్షసుని బాధలను తాళలేక దేవతలు వాని బారి నుండి కాపాడమని బ్రహ్మదేవుని ప్రార్ధించారు. అప్పుడు  బ్రహ్మదేవుడు శివభక్తుడైన    అతనిని సంహరించాడానికి శంకరుడే సమర్దుడని చెప్పి, అతన్ని ప్రసన్నం చేసుకోవలసిందిగా దేవతలను పంపించాడు.   దేవతల ప్రార్దన ను మన్నించి  తారకుని ఎదుర్కోవడానికి కుమారస్వామి ని   సేనాథిపతి గా నియమించి,యుద్ధానికి పంపించాడు శంకరుడు.       తారకాసురుని తో జరిగిన యుద్దం లో కుమారస్వామి తన ఆయుధం తో తారకాసురుని కంఠమాలలో ఉన్న అమృతలింగాన్ని ఛేదించాడు. ఆ ఉపాసనాలింగం ఐదుముక్కలై ఆంధ్రదేశం లోని ఐదుప్రదేశాల్లో పడింది. వాటినే పంచారామ క్షేత్రాలు గా  పిలుస్తున్నాం. అవి వరుసగా 


సోమేశ్వరుడు- భీమారామము (భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా)

రామలింగేశ్వరుడు- క్షీరారామము (పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా)

అమరేశ్వరుడు- అమరారామము (అమరావతి, గుంటూరు జిల్లా) . 

భీమేశ్వరుడు- ద్రాక్షారామము(ద్రాక్షారామము, తూర్పు గోదావరి జిల్లా)

భీమేశ్వరుడు- కుమారారామము (సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా)


భీమారామము :

              ఆంధ్రదేశంలోని పంచారామ క్షేత్రాల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పాతనగరం లోని గునుపూడి లో వెలసిన సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయం ఒకటి. ఈ ప్రాంతం  ఇక్ష్వాకుల, తూర్పు చాళుక్యుల,గజపతుల,  విష్ణుకుండినుల, రెడ్డిరాజుల, శాలంకాయనుల వంటి రాజుల ఏలుబడి లో మహోన్నత సంస్కృతి ని సంతరించుకున్నది.

   

స్థలపురాణం  :     

  తారకాసురుని వథానంతరం  గునుపూడి లో ఒక అమృతలింగ శకలం పడింది. స్వయంవృద్ధి లక్షణం కల్గిన ఆ శకలాన్ని అప్పటికే గురుపత్నీ అనుగమనదోషం తో పీడించబడుతున్న చంద్రుడు  వెంటనే ఆలింగాన్ని గునుపూడి లో ప్రతిష్ఠించి, లింగం యొక్క పెరుగుదలను నిరోధించి  పూజాదికాలు నిర్వహించాడు. చంద్రునిచేత ప్రతిష్ఠించబడిన ఈశ్వరుడు కావున ఈయన సోమేశ్వరుడు గాను, ఈ ఆరామము  సోమారామము గాను కీర్తించబడుతున్నాయి.

ఆలయప్రత్యేకత :  

                 చంద్రుడు ప్రతిష్ఠించడం వలన ఈ సోమేశ్వరుడు అమావాస్య రోజున గోధుమ వర్ణం లోను ,పౌర్ణమి రోజున శుద్ధస్పటిక వర్ణం గాను రంగులు మారుతుంటాడు. ఇది ఒక అద్భుతమైనవిషయం.

  మరొకప్రత్యేకత ఏమిటంటే దేశం లో ఎక్కడాలేని విధంగా సోమేశ్వరలింగం  గర్భాలయం పైన నిర్మించబడిన రెండవఅంతస్తులో ఖచ్చితం గా స్వామివారి తలపై భాగాన అన్నపూర్ణాదేవి విగ్రహం ప్రతిష్ఠించబడిఉంది. పైకి వెళ్లడానికి చక్కగామెట్లు, పైన విశాలమైన ముఖమండపము నిర్మించబడ్డాయి. ఇది ఈ సోమారామం యొక్కప్రత్యేక విశిష్టత గా  పండితులు చెపుతున్నారు. ఈశ్వరుని శిరస్సుపై  గంగను ధరించాడనటానికి ఇది ప్రతీకయని భక్తులు భావిస్తున్నారు

మరొక ప్రత్యేకత ఏమిటంటే దేవాలయానికి ఎదురుగా 15 అడుగుల ధ్వజస్థంభం ప్రతిష్ఠించబడిఉంది.ధానిపై నందీశ్వరుడు ఆసీనుడై భక్తలకు ఆనంద, ఆశ్చర్యాలను కల్గిస్తుంటాడు. అంత ఎత్తులో నంది ఉండటం ఈ ఆలయం లోనే మనకు కన్పిస్తుంది. అన్నపూర్ణాదేవి పై అంతస్తులో ఉన్న  కారణం గానే నంది ద్వజస్థంభం ఎక్కి కూర్చున్నాడని జనశృతి.

 ఈ సోమారామానికి క్షేత్రపాలకుడు శ్రీ జనార్ధనస్వామి. అందువలనే ఇచ్చట ప్రతి ఏటా ఎన్నోవివాహాలు జరుగుతుంటాయి. 

                 స్వామి వారి ఆలయానిక తూర్పు వైపు 7 అంతస్తుల గాలి గోపురం ఉంది స్వామివారికి ఎడమవైపు ఉత్తరముఖం గా పార్వతీదేవి,  ఈశాన్యం లో నవగ్రహాలయం, ఎడమవైపు ఉపాలయం లో జనార్ధనస్వామి , ప్రక్కనే ఉన్న ఉపాలయం లో ఆదిలక్ష్మి, దర్శనమిస్తారు. గాలిగోపురానికి ఇరువైపులా స్వామి వారికి అభిముఖం గా కుడివైపు  సూర్యభగవానుడు, ఎడమవైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువు తీరారు .ఈ ఆలయానికి తూర్పువైపున” చంద్రపుష్కరిణి” అనే తటాకం ఉంది. దీనినే” సోమగుండం “అని కూడ పిలుస్తారు. దీనిలో స్నానం చేయడం సర్వపాపహరమని భక్తుల నమ్మకం.


లోక సమస్త సుఖినో భవంతు

**** మీ ఉషగిరిధర్ ***********


20, నవంబర్ 2020, శుక్రవారం

పుష్కరుడు పేరుమీద నే పుష్కరాలు వచ్చాయి.

 అందరికి  నమస్కారం  .... 

ఈ రోజు నుంచి  తుంగభద్ర నది పుష్కరాలు కదా అందుకని మనం పుష్కరుడు గురి౦చి తెలుసుకుందాం  ....


పుష్కరుని చరిత్ర :

పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఈశ్వరుడు తందిలునితో ఏమి వరం కావాలో కోరుకోమని అడిగాడు. తందిలుడు ఈశ్వరునితో తనకు శాశ్వతంగా ఈశ్వరునిలో స్థానంకావాలని కోరుకున్నాడు. ఈశ్వరుడు సంతోషించి తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో అతనికి శాశ్వతంగా స్థానం ఇచ్చాడు. అందువలన అతడు మూడున్నర కోట్ల పుణ్యతీర్ధాలకు అధికారి అయ్యాడు. ఇలా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి లభించింది. పోషించే శక్తిని సంస్కృతంలో పుష్కరం అంటారు. అలా తందిలుడు పుష్కరుడైయ్యాడు. 

బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు జలంతో అవసరమేర్పడి జలంకోసం ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుని తనకు ఇవ్వవలసినదని కోరుకున్నాడు. ఈశ్వరుడు అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండంలంలోకి ప్రవేశించాడు.

 బ్రహ్మ కార్యం పూర్తి అయిన తరువాత ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవాధారమైన జలంకావాలని బ్రహ్మదేవుని ప్రార్థించాడు . ఆ కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు కానీ పుష్కరుడు తాను బ్రహ్మదేవుని వదలి వెళ్ళలేనని చెప్పాడు. అప్పుడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరులు కలసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. 

 ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులు మిగిలిన కాలం సంవత్సరమంతా మధ్యాహ్న సమయంలో రెండు మూహూర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించారు. 

 ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి అధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో వస్తారు కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యప్రథమని పురాణాలు చెప్తున్నాయి.

 

 పుష్కరం అంటే:

పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుంది.

బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణంగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. 

పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.


1) గంగా నది                    మేష రాశి

2) రేవా నది (నర్మద)  వృషభ రాశి

3) సరస్వతీ నది        మిథున రాశి

4) యమునా నది         కర్కాట రాశి

5) గోదావరి                 సింహ రాశి

6) కృష్ణా నది                 కన్యా రాశి

7) కావేరీ నది                 తులా రాశి

8) భీమా నది                 వృశ్చిక రాశి

9) పుష్కరవాహిని/రాధ్యసాగ నది      ధనుర్ రాశి

10) తుంగభద్ర నది      మకర రాశి

11) సింధు నది         కుంభ రాశి

12) ప్రాణహిత నది మీన రాశి


తుంగభద్ర నది:

తుంగభద్ర నది కృష్ణా నదికి ముఖ్యమైన ఉపనది. రామాయణ కాలంలో పంపానదిగా పిలువబడిన తుంగభద్ర నది కర్ణాటకలో పడమటి కనుమలలో జన్మించిన తుంగ, భద్ర అను రెండు నదుల కలయిక వలన ఏర్పడినది. 

భౌగోళికంగానే కాకుండా చారిత్రకంగానూ ఈ నదికి ప్రాధాన్యత ఉంది. దక్షిణ భారతదేశ మధ్యయుగ చరిత్రలో వెలిసిన విజయనగర సామ్రాజ్యం ఈ నది ఒడ్డునే వెలిసింది. హంపి, మంత్రాలయం లాంటి పుణ్యక్షేత్రాలు ఈ నది ఒడ్డున వెలిశాయి.

పెద్దలు తుంగభద్రను భారతదేశంలోని పంచగంగల్లో ఒకటిగా పేర్కొన్నారు.

                కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమీ

                భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః


లోక సమస్త సుఖినో భవంతు.....


********* మీ ఉషగిరిధర్ ***********



18, నవంబర్ 2020, బుధవారం

నాగుల చవితి

పాము  .... ఈపేరు  వినిపించిన ... 

పాము ...  కనిపించిన  ... అందరు భయ పడతారు ... 


కానీ మన సంస్కృతి లో పాము ని ఒక దేవత గా పూజిస్తాం 


మనం రోజు పూజించే దేవతలకి పాము కి మధ్య సన్నిహిత సంబంధం ఉంది


పాము ని మెడలో  వేసుకుని  శివుడు ...  నాగ భూషణుడు అయ్యాడు , 

పాము ని తన తల్ప గా చేసుకుని విష్ణువు.....   శేష తల్ప సాయి అయ్యాడు ,

పాము ని యజ్ఞోపవీతగా వేసుకుని వినాయకుడు .....    నాగ యజ్ఞోపవీతను డు అయ్యాడు  , 

 కుమార స్వామిని నాగ స్వరూపంగా పిలుస్తారు.. 


అలాంటి పాము ని నాగ దేవత  గా ఆరాధించే పండుగ నాగుల చవితి.


నాగుల చవితి రోజు ఆవు పాలు వాల్మీకం లేదా పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి (నువ్వులతో చేస్తారు) అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు.


నాగుల పేర్లు అనంత, వాసుకి, శేష, పద్మనాబ్, కంబల్, శంఖపాల్, ధ్రుత్రాష్ట్ర, తక్షక మరియు కలియా


**** మీ ఉషగిరిధర్ ***********


17, నవంబర్ 2020, మంగళవారం

నాటి దక్షారామమే నేటి ద్రాక్షారామం.......

 మన తూర్పు గోదావరి జిల్లా ఎన్నో పురాణ గాధలకు, చారిత్రిక విశేషాలకూ నిలయం..అందులో ఒకటి ద్రాక్షారామం .. ఇది పంచారామాల్లో ఒకటి.  

పురాణ కధలు

తారకాసురుని మెడలోని శివ లింగాన్ని కుమారస్వామి ఛేదించగా  ఐదు చోట్ల పడ్డ ఆ లింగ ముక్కలను వివిధ దేవతలు ప్రతిష్ఠ చేశారు

భీమేశ్వరుడు- ద్రాక్షారామము(ద్రాక్షారామము, తూర్పు గోదావరి జిల్లా)

భీమేశ్వరుడు- కుమారారామము (సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా)

రామలింగేశ్వరుడు- క్షీరారామము (పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా)

సోమేశ్వరుడు- భీమారామము (భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా)

అమరేశ్వరుడు- అమరారామము (అమరావతి, గుంటూరు జిల్లా) . 


ద్రాక్షారామము: దీని పురాణ గాద మీ అందరికి తెలుసు ...

పూర్వం దక్షప్రజాపతి నివసించిన ప్రదేశం ఇది.  అందుకే ద్రాక్షారామం అయింది. 

దక్షుడు ఒక యజ్ఞం చేయ తలపెట్టడం... ఆ యజ్ఞానికి తన అల్లుడైన శివుణ్ణి  ఆహ్వానించకపోవడం ...ఆ యజ్ఞం గురించి పార్వతీ దేవికి తెలియడం...  పరమేశ్వరుడిని ఒప్పించి, పుట్టింట్లో జరిగే యజ్ఞానికి వెళ్లడం... ఎవరూ ఆవిడని పలకరించకపోవడం ... ఆ అవమానం భరించలేక  తనని తను కాల్చుకుని బూడిద అవడం ....  ఈ విషయం తెలిసిన శివుడు ప్రళయ రుద్రుడై.  తన జటాజూటంనుంచి వీరభద్రుణ్ణి సృష్టించడం.  ఆయన వెళ్ళి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడం జరిగింది.   

పత్నీ వియోగాన్ని భరించలేని శివుడు పార్వతి  సూక్ష్మ శరీరాన్ని భుజంమీద పెట్టుకుని ఆవేశంతో ప్రళయ తాండవం చేశాడు.

 శివుణ్ణి ఆపటానికి విష్ణువు పార్వతీ దేవి సూక్ష్మ శరీరాన్ని తన చక్రాయుధంతో ముక్కలు చేశాడు.  ఆ శరీరం 18 ముక్కలయి 18 చోట్ల పడ్డాయి.  అవే అష్టాదశ శక్తి పీఠాలు. 

 వీటిని జగద్గురువు శంకరాచార్యుల వారు పున  ప్రతిష్టించి అన్ని చోట్లా శ్రీ చక్రాలను కూడా స్ధాపించారు.    దాక్షాయణి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశంలోనే శివుడు భీమరూపంలో స్వయంభువుడిగా వెలిశాడు.


నేను చదివిన ఇంకొక చిన్న కథ కూడా మీతో చెపుదామనుకుంటున్నాను... 

 పూర్వం వేదవ్యాసుల వారు కాశీలో నివసించేవారు.  ఒకసారి కాశీ విశ్వేశ్వరుడు ఆయన్ని పరీక్షించదలచి  ఎక్కడా భిక్ష దొరక్కుండా చేశాడుట. 

 దానికి  వేదవ్యాసుడు కోపించి కాశీని శపించబోయాడుట.  అప్పుడ అన్నపూర్ణాదేవి ఆయనకీ, శిష్యులకీ భిక్ష పెట్టిందట.  వేదవ్యాసుడు కాశీని శపించబోవటం శివుడికి కోవం తెప్పించింది.  

 వెంటనే శివుడు వేదవ్యాసుణ్ణి శిష్యసమేతంగా కాశీ విడిచి వెళ్ళమని ఆజ్ఞాపించాడు.  దానికి వేదవ్యాసుడు బాధపడగా అన్నపూర్ణాదేవి  

 ఆయనకు దక్షారామము పోయి అక్కడ భీమేశ్వరుని  సేవించమనీ, అక్కడ వుంటే కాశీలో వున్నట్లే వుంటుందనీ  చెప్పగా వ్యాసుడు తన 300 మంది శిష్యులను వెంటబెట్టుకుని దాక్షారామం వచ్చి అక్కడ నివసించాడు.  దీనికి గుర్తుగా ఆలయంలో ఒక స్తంబంమీద వ్యాసుని విగ్రహం చెక్కబడింది.


మరి కొన్ని విశేషాలు  క్లుప్తంగా......

  •  భీమేశ్వరుడు లింగం 2.5 మీటర్ల  ఎత్తులో నలుపు తెలుపు రంగులలో ఉంటుంది.. ఆలయం రెండవ అంతస్తులో ఉంది...
  • ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబ.  అష్టాదశ శక్తిపీఠాలలో 12వ పీఠమిది.
  • ఇక్కడ క్షేత్ర పాలకుడు లక్ష్మీ నారాయణ స్వామి.  ఈయన్ని శ్రీ రామచంద్రుడు ప్రతిష్ఠించాడు.
  •  ఇక్కడ వెలసిన భీమేశ్వరునికి అభిషేకం చేయటానికి  సప్త ఋషులు సప్తగోదావరులను తీసుకువచ్చారు.  ఇవి అంతర్వాహినులు.
  •  గుడి లోపలి ప్రాంగణంలో వీరముడి ఆంజనేయ స్వామి విగ్రహం వుంది.  ఈయనకి జుట్టు ముడి వేసి కొప్పులాగా వుంటుంది.  అందుకే ఆ పేరు. గద ఉండదు.  నమస్కార ముద్రలో వుంటారు. 
  • మన దేశంలో దాక్షారామం, శ్రీ శైలం, శ్రీ కాళహస్తి మధ్య వున్న ప్రదేశాన్ని త్రిలింగ దేశమన్నారు.  త్రిలింగ దేశానికి ఉత్తర సరిహద్దుగా దాక్షారామం ప్రసిధ్ధికెక్కింది.   
  • ప్రక్కనే ఒకే పానువట్టంమీద 108 చిన్న చిన్న శివ లింగాలు వుంటాయి.  దాన్ని దర్శిస్తే అన్ని శివాలయాలూ చూసినంత ఫలమట.
  •  ఇక్కడ నవగ్రహ మండపమే కాక  అష్ట దిక్పాలకులకూ మండపం వుంది.  బహుశా దీన్ని ఇక్కడే చూస్తామేమో.
  • ఇంకా శ్రీ కృష్ణ దేవరాయలు ప్రతిష్ఠించిన విరూపాక్ష స్వామి, రెండు తలల అష్టబంధ నాగేశ్వర స్వామి,  కైలాస గణపతి  దర్శనీయ  దేవతా మూర్తులు.
  • ఏక  శిలలో మలచిన  నమూనా దేవాలయం ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు.
  • అష్టదిక్పాల మండపానికి ఎదురుగా వున్న స్వామి ప్రధాన ఆలయ మార్గాన్ని చీకటికోణం అని పిలుస్తారు.  ఇందులో మూడు ప్రాకారాలున్నాయి.  అందులో మొదటి రెండు ప్రాకారాలలో గోడలకి బొడిపలు కనబడతాయి.  పూర్వం అక్కడ నవరత్నాలు పొదగబడి వుండటంవల్ల  ఆ ప్రదేశమంతా కాంతిమయంగా వుండేదట.
  • వాడ్రేవు జమీందారులిచ్చిన 125 ఎకరాల భూమిమీద ఆదాయం నేటికీ ఆలయాభివృధ్ధికి తోడ్పడుతోంది.
  •  భీష్మ ఏకాదశినాడు భీమేశ్వరస్వామి, లక్ష్మీ నారాయణ స్వామి, సూర్యనారాయణ స్వామిల కళ్యాణం ఒకే వేదికపై జరపడం కూడా ఇక్కడి విశేషమే.
ఇన్ని విశేషాలున్న ఆలయం ఉన్న మన ఊరు ధన్యం .... మన సంస్కృతి  ధన్యం .... మనం ధన్యం 

ఆ ఆది దంపతుల కృప కటాక్షాలు మనఅందరి మీద ఉండాలని కోరుకుంటునాను...

లోక సమస్త సుఖినో భవంతు   ఓం నమః శివాయ


పంచారామాల్లోని మిగతా దేవాలయాల గురించిన విషయాలతో మీ ముందుకు వస్తాను.

**** మీ ఉషగిరిధర్ ***********

16, నవంబర్ 2020, సోమవారం

మన గోదావరి జిల్లాలు - మన శివాలయాలు

అందరికి నమస్కారం అండి..

ఇది కార్తికమాసం కద  అందుకని మన గోదావరి జిల్లాలో ఉన్న 108 శివాలయాల గురించి మనం తెలుసుకుందాం

వీటిలో ఎక్కువ శాతం స్వయంబూ లింగాలు.... కొన్ని దేవతలు పూజించినవి....కొన్ని దేవతలు ప్రతిష్టించినవి...
పంచారామలలో నాలుగు మన గోదావరి జిల్లాలో ఉన్నాయి...

1-ద్రాక్షారామం-శ్రీ భీమేశ్వరు స్వామి ఆలయం-పూర్వం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశమే నేడు ద్రాక్షారామంగా పిలువబడుతుంది.ద్రాక్షారామంలో శివుడు భీమేశ్వరుడిగా స్వయంభువుగా అవతరించాడు
2-పాలకొల్లు:- శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి-శ్రీ రామచంద్రమూర్తి ప్రతిష్ఠించాడు కాబట్టి క్షీరారామలింగేశ్వరస్వామి ' గా వెలిసెను
3-భీమవరం- శ్రీ  సోమేశ్వరస్వామి-చంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి 'సోమేశ్వరస్వామి ' గా వెలిసెను.
4-సామర్లకోట- శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి-ఆత్మలింగాన్ని ఛేదించిన దోషం తనకు రాకూడదని కుమారస్వామే స్వయంగా ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించెను కాబట్టి 'కుమారారామ భీమేశ్వరస్వామి 'గా వెలిసెను.
5-పలివెల-శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి -ఇక్కడి శివలింగ ప్రతిష్థ అగస్త్య మహర్షి ద్వారా జరిగింది అని ప్రతీతి.
6-వ్యాఘ్రేశ్వరం-శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వర స్వామీ-వ్యాఘ్రరూపమున వెలసిన శివలింగం స్వయం భూ 
7-మురమళ్ళ-శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి-స్వామి వారు నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతుంన్నారు
8- అమలాపురం -శ్రీ అమలేశ్వర స్వామి దేవాలయం-ఈ స్వామి  పేరు మీదనే  అమలాపురం కి ఆ పేరు వచ్చింది
9- అమలాపురం - శ్రీ చంద్ర మౌలేశ్వర స్వామి ఆలయం-
10- అమలాపురం - శ్రీ చెన్నమల్లేశ్వర స్వామిటెంపుల్-
11- అమలాపురం - శ్రీ కృష్ణేశ్వర స్వామి ఆలయం-
12- అమలాపురం - శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం-
13-పాశర్లపూడి లంక -శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం-
14- బందారులంక - శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి ఆలయం-
15- బండారులంక - శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం-
16- భట్నవిల్లి - సఖిలేశ్వర స్వామి ఆలయం-
17- గోపవరం - శ్రీ రాజలింగేశ్వర స్వామిటెంపుల్-
18- ఇమ్మడివరప్పడు - శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం-
19- ఇందుపల్లి - శ్రీ సోమ్ ఈశ్వర స్వామి ఆలయం-
20- జానుపల్లి - శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం-
21- నల్లమేలి - శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం-
22- పాలగుమ్మీ - శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి ఆలయం-
23- పెరూరు - శ్రీ సోమేశ్వర స్వామిటెంపుల్-
24- సకుర్రు - శ్రీ సత్యేశ్వర స్వామిటెంపుల్-
25- సమనస - శ్రీ సోమేశ్వర స్వామిటెంపుల్-
26- వి అగ్రహరాం - శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం-
27- చిరతాపుడి - శ్రీ బ్రహ్మేశ్వర స్వామి ఆలయం-
28- జి.అగ్రహరం - శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం-
29- గంగలకుర్రు - శ్రీ చెన్నా మల్లేశ్వర స్వామి ఆలయం-
30- ముక్తేశ్వరం - శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయం-
31- బెండమురలనక - శ్రీ చంద్రశేఖర స్వామి ఆలయం-
32- బోడస్కుర్రు - శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయం-
33- దేవగుప్తుం - శ్రీ మల్లేశ్వర స్వామిటెంపుల్-
34- గోడి - శ్రీ రాజలింగేశ్వర స్వామి ఆలయం-
35- గోడిలంక - శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం-
36- గుడాల - శ్రీ ఉమా అగస్తేశ్వర స్వామి ఆలయం-
37- కొమరగిరిపట్నం - శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం-
38- కొమరగిరిపట్నం - శ్రీ లక్ష్మనేశ్వర స్వామి ఆలయం-
39- సమంతకుర్రు - శ్రీ రామేశ్వర స్వామిటెంపుల్-
40- తడికోన - శ్రీ సీతారామలింగేశ్వర స్వామి ఆలయం-
41- యెంట్రు కోన - శ్రీ లక్ష్మనేశ్వర స్వామి ఆలయం-
42- ఒక వేమవరం - శ్రీ రాజేశ్వర స్వామి ఆలయం-
43- బాలభద్రపురం - శ్రీ ఉమరమలింగేశ్వర స్వామి ఆలయం-
44- బిక్కవోలు - చంద్రశేఖరస్వామి ఆలయం;   గోలింగేశ్వరస్వామి ఆలయం;  రాజరాజేశ్వరస్వామి ఆలయం; విరాభద్ర ఆలయం;  -
45- కాకినాడ - శ్రీ భేమేశ్వర స్వామి ఆలయం-
46- కాకినాడ - శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం-
47- రామరోపేట - శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం.-
48- కాకినాడ నగరం - శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం.-
49- కాకినాడ నగరం - శ్రీ భానులింగేశ్వర స్వామి ఆలయం.-
50- పితాపురం - కుక్కుటేశ్వరస్వామి ఆలయం, -
51- అంతర్వేది - శ్రీ నీలకాంతేశ్వర స్వామి ఆలయం-
52- ఇరుసుమండలు - శ్రీ ఆనందేశ్వర & ఓంకరేశ్వర స్వామిటెంపుల్-
53- ఇసుకాపుడి - శ్రీ లోకేశ్వర స్వామి ఆలయం-
54- కె.పేడపుడి - శ్రీ రామలింగేశ్వర, చౌదేశ్వర స్వామి ఆలయం,శ్రీ మేనకేశ్వర స్వామి ఆలయం-
55- మాచవరం - శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం-
56- మచవరం - శ్రీ రాజేశ్వర స్వామిటెంపుల్-
57- మోసలపల్లి - శ్రీ బోగేశ్వర స్వామిటెంపుల్-
58- ముక్కమల - శ్రీ రాఘవేశ్వర స్వామి ఆలయం-
59- నందంపూడి - శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం-
60- పుల్లెటికుర్రు - శ్రీ రామలింగ చౌదేశ్వర స్వామి ఆలయం-
61- తోండవరం - శ్రీ తోండేశ్వర స్వామి ఆలయం-
62- సంగమేశ్వరం - శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం-
63- అనపర్తి - శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం-
64- దుప్లాపుడి - శ్రీ చంద్ర శేఖర స్వామి ఆలయం-
65- కొప్పవరం - శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం-
66- కుతుకులూరు - శ్రీ కుటేశ్వర స్వామి ఆలయం-
67- మహేంద్రవాడ - శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం-
68- పెడపతి - శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం-
69- పోలమూరు - శ్రీ ఉమరమలింగేశ్వర స్వామి ఆలయం-
70- పులుగుర్థ - శ్రీ అగతేశ్వర స్వామి ఆలయం-
71- ఆత్రయపురం - శ్రీ రాజేశ్వర స్వామి ఆలయం-
72- కటుంగ - శ్రీ సఖిలేశ్వర స్వామి ఆలయం-
73- మెర్లాపలేం - శ్రీ బాలేశ్వర స్వామి ఆలయం-
74- పెరవరం - శ్రీ పసుపతేశ్వర స్వామి ఆలయం-
75- రాజవరం - శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం-
76- రియాలి - శ్రీ ఉమా కామండలేశ్వర స్వామి ఆలయం-
77- వడపల్లి - శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం-
78- వడ్డీపర్ - శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం-
79- వసంతవాడ - శ్రీ రామ లింగేశ్వర స్వామి ఆలయం-
80- వెలిచేరు - శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయం-
81- అరికరేవుల - శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం-
82- కండికుప్ప - శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం-
83- కుండలేశ్వరం - శ్రీ కుండలేశ్వర స్వామి ఆలయం-
84- అవిడి - శ్రీ కైలాసేశ్వర స్వామి ఆలయం-
85- బిల్లకుర్రు - శ్రీ మహాదేవ స్వామి ఆలయం-
86- కోతపేట - శ్రీ రాజేశ్వర స్వామి ఆలయం-
87- యెడిత - శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం.-
88- ద్వారపుడి - శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం.-
89- మరేడుబాక - శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం-
90- పెద్దాపురం - శ్రీ విశ్వేశ్వర చంద్రశేఖర స్వామి ఆలయం.-
91- కంద్రకోట - శ్రీ కోటేశ్వర స్వామి ఆలయం.-
92- కొండగుంటూరు - శ్రీ కాశి విశ్వేశ్వర స్వామి ఆలయం-
93- పతుతుంగపాడు - శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం-
94- రాజనగరం - శ్రీ రాజా గోపాల స్వామి & -
95- సంపనాగరం - శ్రీ పార్వతవర్ధిని సమేత నాగేశ్వర స్వామి ఆలయం-
96- రామచంద్రపురం - శ్రీ అగతేశ్వర స్వామి ఆలయం-
97- రామచంద్రపురం - శ్రీ అగతేశ్వర స్వామి ఆలయం-
98- ఉండురు - శ్రీ మార్కండేయ స్వామి ఆలయం-
99- ఉట్రుమిల్లి - శ్రీ ఉమగోవరేశ్వర స్వామి ఆలయం-
100- ముకుందవరం - శ్రీ వీరభద్రస్వామి ఆలయం-
101- పెదరాయవరం - శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం-
102- రంగంపేట - శ్రీ రామలింగేశ్వర & సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం-
103- వడిసలేరు - శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం-
104- దేవరపల్లి - శ్రీ నాగేశ్వర స్వామి ఆలయం-
105- గోపాలపురం - శ్రీ బాలేశ్వర స్వామి ఆలయం-
106- కొమరాజులంక - శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం-
107- లక్ష్మి పోలవరం - శ్రీ రామ లింగేశ్వర స్వామి ఆలయం-
108- పి.రామచంద్ర పురం - శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం-



ఇవే  కాక ఇంకా ఎన్నో శివాలయాలతో మన గోదావరి జిల్లాలు వెలుగొందు తున్నాయి...
వీటిలో  చాల శివాలయాలు  పురాతన  రాతి కట్టడాలు.... మన సంస్కృతి కి ప్రతి బింబాలుగా నిలిచాయి ... 

ఆ ఆది దంపతుల కృప కటాక్షాలు మనఅందరి మీద ఉండాలని కోరుకుంటునాను...

లోక సమస్త సుఖినో భవంతు   ఓం నమః శివాయ

**** మీ ఉషగిరిధర్ ***********

Note:  మీ ఊరి శివాలయం గురించి మరిన్సి విషయాలు  కామెంట్స్  సెక్షన్ లో రాయ  వలసిందిగా  కోరుతున్నాను 🙏🙏




14, నవంబర్ 2020, శనివారం

RIP SPB SIR

 నిన్నటి నుంచి ఆకాశం గాంబిరం గా గర్జిస్తోంది గర్వంతో గంధర్వుడు తన చెంత చేరాడు అని

పుడమి మౌనం వహించింది తను బిడ్డ దూరం అయ్యాడు అని

ఆకాశానికి తెలియదు గంధర్వుడి గానం గాత్రం గళం..  పుడమి గుండెల్లో ఎపుడు భద్రంగా ఉంటాయి అని...

ఏమో ఎవరికి తెలుసు అందరూ RIP(Return If Possible)  అని చెప్పారు కదా..... మల్లి వస్తారు ఏమో...

                                                                            RIP SPB SIR (26/09/2020)

ఆడ.... పిల్ల



కొందరు ఇంటి మహాలక్ష్మీ అంటారు

కొందరు వంటింట్లో కుందేలు అంటారు

కొందరు హోమ్ మినిస్టర్ అంటారు

కొందరు శక్తి స్వరూపం అంటారు


ఎవరి ఆలోచన వాల్లది.... కాని వాల్లు చేయలేని పని లేదు


కర్ర తిప్పి సాము చేయగలరు

కర్ర కోట్టి కోలాటం ఆడగలరు


గరిట పట్టి వంట వండగలరు

గంటం పట్టి కవిత రాయగలరు


లక్షలు సంపాదించ గలరు

లక్షలు షాపింగ్ చేయగరు


అమ్మ లా ప్రేమించ గలరు

అత్త లా సాదించగలరు


వినయం తో తల వంచగలరు

విజేతలు గా తల ఎత్తగలరు

ఎప్పుడు  వారిని చిన్న చూపు  చూడకండి 

    లోకా సమస్తా సుఖినోభవంతు

*****మీ ఉషగిరిధర్***

                                                                                         

దీపావళి శుభాకాంక్షలు...💐💐

 అందరికి నమస్కారం అండి ....మమ్మల్ని గుర్తు పట్టార ....మేము అండి పంచ పాండవులం


మీ చిన్నపుడు దీపావళి కి మీరు మీ చేతులతో మమ్మల్ని తయారు చేసే వారు...మనం చాలా బాగా అడుకునెవారం...

నేను మొదటి వాడిని... శాంత మూర్తిని ...వెలుగు తప్ప చప్పుడు చెయ్యను....  నా పేరు మతబా


నేను రెండవ వాడిని....నా శబ్దం భీముడి గథా దండం లాంటిదే....నా పేరు తాటకు టపకాయ


నేను మూడవ వాడిని... నా వేగం అర్జునుడి బాణం లాంటిది.... నా పేరు పేక జువ్వ


నేను నాలుగో వాడిని... కాంతులను చిరుజల్లు  లాగా చిమ్ముతూ ఉంటాను...... నా పేరు చిచ్చుబుడ్డి


నేను ఐదవ వాడిని.... చిన్న వాడిని ...కానీ చాలా హుషారు ఐన వాడినే.... నా పేరు సిసింద్రీ 


మా తో పాటు మా బావ శ్రీ కృష్ణుడు సూదర్శనం తిప్పి నట్లు

మీరు తిప్పు తారు కదా... అదే నండి తిపుడు పొట్లం తను కూడా వచ్చింది


ఏదొ సరదాగా మీ అందరిని పలకరించి  వెలదామని వచ్చాము

మేము పెద్ద వాలము అయ్యాము ఈ సారి కరోన కదా అందుకని రావటం లేదు....మీరు అందరూ మా next generation తో సంతోషంగా దీపావళి జరుపు కొండి.


అందరికి దీపావళి శుభాకాంక్షలు...💐💐


****మీ ఉషగిరిధర్****

13, నవంబర్ 2020, శుక్రవారం

ఆయ్...మాది కోనసీమ అండి...

 హలో అండి మాది కోనసీమ... ఏదో మూల(కోన) ప్రదేశం(సీమ) కదా మాకు ఏమీ తెలీదు అని అనుకోకండి....

ప్రపంచంలో ఏ మూల ఏమీ జరిగినా మాకు తెలుస్తుంది...

అమెరికా ఎన్నికల దగ్గర నుంచి.... అమలాపురం ఎన్నికల వరకు...

నాసా రాకెట్ దగ్గర నుంచి.... దీపావళి రాకెట్ వరకు...

వేదాల దగ్గర నుంచి.... డేటా సైన్స్స్ వరకు....

ఏ విషయం ఐన... ఎక్కడ ఐన...ఎపుడూ ఐన..  మాట్లాడే గళం....


అది అంతా మా గోదారమ్మ  చలవ....


మా కోనసీమ కొబ్బరి నీళ్లు తాగితేఎంత చల్లగా ఉంటుందో... మా మాట కూడా వినడానికి అంత చక్కగా ఉంటుంది.... 

ఆయ్...మాది కోనసీమ అండి...


**** మీ ఉషగిరిధర్ ***********


12, నవంబర్ 2020, గురువారం

అందరికి నమస్కరం అండి 🙏🙏

 అందరికి  నమస్కరం అండి 🙏🙏


నా పేరు ....  ఉషగిరిధర్ ......


మా ఊరు గోదావరి జిల్లా లో పచ్చని పల్లెటూరు....


మాకు మా బాష మీద అబి మానము ... మా ఊరు మీద మమ కారము కొంచం ఎక్కువ ....


మా ఊరు గురంచి  .. మా పద్ధతులు గురంచి... మా అలవాట్లు గురంచి మీ అందరితో పంచు కుందాము అని..

ఇలా మీ ముందుకు వచ్చాను ....


**** మీ ఉషగిరిధర్ ***********