మీకు ఈ రోజు ఒక కథ చెపుతాను
కథ అంటే పెద్దబాలశిక్ష అంత పెద్దది కాదు
ఎక్కాల పుస్తకం అంత చిన్నదే !!!!!
'పదమూడు' అని వినగానే చాలా మంది కంగారు పడతారు.
ఎందుకో ఈ సంఖ్య అంత శుభసూచకం కాదని చాలామంది నమ్మకం.
ఈ సంగతి నాకు తెలియడానికి చాలా రోజుల ముందే, అంటే నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడే 'పదమూడు' నాతో ఆడుకుంది.
చాలా తిప్పలు పెట్టించింది..ఎన్నో దెబ్బలు కొట్టించింది. 😢😢😢
చిన్నప్పుడు నాకు బళ్ళో చదువు కన్నా ఇంట్లో చదువు ఎక్కువగా ఉండేది.
అమ్మ బాలశిక్ష నేర్పించి, నాన్న బళ్ళో చెరిపించారు .
మామూలుగానే నాన్నకి సహనం కొంచం తక్కువ.
తను చెప్పింది చెప్పినట్టు చెయ్యకపోతే విపరీతమైన కోపం వచ్చేది.
అలా చేస్తే ఇంక నా గొప్పదనం ఏముంది?
అమ్మ వేసిన పునాది పుణ్యమా అని ఒకటి, రెండు తరగతులు ఆడుతూ పాడుతూ గడిచి పోయాయి.
మూడో తరగతి కి వచ్చేసరికి ఎక్కాల బాధ మొదలయ్యింది.
ఓ రోజు సాయంత్రం నాన్న ఎక్కాల పుస్తకం తెచ్చి, దానికో అట్ట వేసి నా చేతికిచ్చారు.
తెలుగు వాచకం కన్నా చాలా చాలా చిన్నది.. దీనిని చదవడం పెద్ద పనా? అనుకున్నాను.
దిగితేనే కదా లోతు తెలిసేది!!!!
ఒక రెండు రెండు...
రెండ్రెళ్ళు నాలుగు..
మూడ్రెళ్ళు ఆరు... మొదటి ఎక్కం కదా..సరదాగానే ఉంది. పన్నెండు రెళ్ళు ఇరవైనాలుగు వరకు అప్పచెబితే చాలు.
ఇది కూడా రోజుకో ఎక్కం లెక్క కాదు.
ఉన్నట్టుండి ఓ రోజు పొద్దున్నే నాన్నకి నా చదువు గురించి గుర్తొస్తుంది. 'ఎక్కాల పుస్తకం తియ్యమన్నారు' ఎక్కడివరకు వచ్చిందో అడిగి,
ఏదో ఒక ప్రశ్న అడుగుతారు.. అంటే ఏ ఏడు రెళ్ళు యెంత అనో అన్నమాట.
సరిగ్గా సమాధానం చెబితే తర్వాతి ఎక్కం చదవమని ఆర్డరేసి బయటికి వెళ్తారు.
తను బయటినుంచి రాగానే ముందుగా ఎక్కం అప్పచెప్పించుకుని కానీ మంచి నీళ్ళు కూడా తాగేవాళ్లు కాదు.
పన్నెండైదులు అరవై వరకు నల్లేరు మీద బండిలా సాగిపోయింది.
నేను చాలా సులువుగా చదివేస్తున్నాన్న విషయం నాన్నకి అర్ధమై ఇంకో కొత్త పని అప్పచెప్పారు.
అప్పట్లో ఎక్కాల పుస్తకాలు ఎలా ఉండేవంటే, ఒక పేజి లో రెండు ఎక్కాలు, వాటికింద సుమతి, వేమన శతకాల నుంచి ఒక్కొక్క పద్యం ప్రచురించేవారు.
ఎక్కం తో పాటు ఒక పద్యం కూడా చదవమని ఆర్డరు. చేసేదేముంది..
'ఉప్పు కప్పురంబు..' 'కూరిమి గల దినములలో..' కూడా బట్టీ కొట్టడం, అప్పజెప్పడం.
ఆరో ఎక్కం నుంచి సమస్యలు మొదలయ్యాయి. అప్పజెప్పడం లో తడబాట్లు రావడంతో..
నాన్న ఇంటికి రాగానే మంచి నీళ్ళ గ్లాసు, ఎక్కాల పుస్తకం, ఒక చీపురు పుల్ల పట్టికెళ్ళి ఇవ్వాలి. నీళ్ళు తాగగానే ఎక్కం అప్పచెప్పాలి
ఎక్కడైనా నట్టు పడిందంటే చీపురు పుల్ల గాలి లో విదిలించేవారు....
తప్పులు ఎక్కువయ్యాయంటే రెండోరోజూ అదే ఎక్కం చదవాలి.
రెండోసారి కూడా తప్పులోస్తే చీపురు పుల్ల బదులు వెదురు పుల్ల అందుకునే వాళ్ళు.
ఇది కొంచం గట్టిగా తగులుతుంది. దద్దురు కూడా బాగా తేలుతుంది.
రానురాను ఈ పద్యాలు నాకు తలనొప్పిగా తయారయ్యాయి.
ఎక్కం తప్పుల్లేకుండా అప్పచెప్పానన్న ఆనందాన్ని పద్యం మింగేసేది. 😢😢😢😢
పన్నెండు పన్నెండ్లు నూట నలభై నాలుగు తో మూడో తరగతి పూర్తయ్యింది. !!!!!!!!!!!
నాలుగో తరగతిలో పదమూడో ఎక్కం. 13❌13 = ?
పైగా ఇరవై పదమూళ్ళు వరకు.. చీపురు పుల్ల, వెదురు బెత్తం అయిపోయాయి..
నిద్రగన్నేరు కొమ్మ వంతూ వచ్చింది. ఊదా రంగు అందమైన పూలు పూసే ఈ చెట్టులో నాకు నచ్చనిది కొమ్మే.
దెబ్బ కొంచం గట్టిగానే తగులుతుంది, పైగా దెబ్బ పడగానే మన చేతిమీదే కొమ్మ రెండుగా చీలిపోతుంది.
సైకలాజికల్ గా 'చాలా గట్టి దెబ్బ' అనిపించేది.
చేతిలో బెత్తంతో, ఎర్రటి పెద్ద కళ్ళతో నాన్నని చూడగానే సగం ఎక్కం మర్చిపోయే దానిని . పద్నాలుగు పదమూళ్ళు దగ్గర కొన్నాళ్ళు, 14❌13 = ?
పదహారు పదమూళ్ళు దగ్గర కొన్నాళ్ళు ఆగాను. 16❌13 = ?
గజనీ దండయాత్రలు కొనసాగించి, మొత్తానికి ఓ మద్యాహ్నం వెక్కిళ్ళ మధ్య పదమూడో ఎక్కం అప్పచేప్పేశాను.
కానీ తర్వాత ఎప్పుడు లెక్కల్లో పదమూడో ఎక్కం అవసరం వచ్చినా పేజి లో పక్కన గుణకారం చేసుకోవాల్సి వచ్చేది, ఎక్కం గుర్తు రాక.
అదేమిటో తెలీదు కాని పద్నాలుగు, పదిహేను ఎక్కాలు నన్నేమీ ఇబ్బంది పెట్టలేదు.
అక్కడితో నా ఎక్కాల చదువు ముగిసింది.
మిగిలిన నాలుగు ఎక్కాలు చదివాను కాని, అప్పజెప్ప మని నాన్న అడగలేదు, నాకు నేనుగా అలాంటి ప్రయత్నం చెయ్యలేదు.
తెలిసి తెలిసి అంత రిస్కు నేనెందుకు తీసుకుంటాను?
లోక సమస్త సుఖినో భవంతు
**** మీ ఉషగిరిధర్ ****
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి