'పెసరట్లు పలు విధములు...' అంటూ మొదలు పెడితే జరిగేవి రెండు..
మొదటిది, చదివే వారి ముఖంలో చిరునవ్వైతే, 😄😄
రెండోది వారి నోట్లో ఊరే లాలాజలం. 😋😋😋😋
ఏమని చెప్పుదునో పెసరట్టు గురించీ అనుకున్నా కానీ, ఇలా మొదలు పెడుతూనే ఎన్నో కబుర్లు మేమున్నాం అంటూ గుర్తొచ్చేస్తున్నాయి.
షాపు నుంచి తెచ్చుకున్న పెసల్లో రాళ్ళూ, రప్పలూ ఏరుకుని, ఓ సారి కడిగేసి, అటుపై నీళ్ళలో నానబోసేసి..
బాగా నానాక ఓ చిన్న అల్లంముక్క జతచేసి జారుగా పిండి రుబ్బి పక్కన పెట్టేసుకుంటే పెసరట్టు మహాయజ్ఞం లో మొదటి అంకం పూర్తయినట్టే.
పెసరట్టు అంటూ అనుకున్నాక, కేవలం సాదా పెసరట్టుతో సరిపెట్టుకునే ప్రాణాలు కావు కదా మనవి..
అందుకని ఉల్లి పాయలు, అల్లం, పచ్చి మిర్చీ సన్నగా తరిగేసి పక్కన పెట్టేసుకుంటాం.
సరిగ్గా ఇదే సమయంలో 'ఆ చేత్తోనే కాస్త ఉప్మా కలియబెట్టెయ్య రాదూ' అని ఆత్మారాముడో, సీతో వినీ వినిపించనట్టు మూలుగుతారు.
'అదెంత పని కనుకా' అనిపించి తీరుతుంది.
పావుగంటలో ఉప్మా రెడీ అవ్వనే అవుతుంది.
పెనం పొయ్యి మీదకి ఎక్కించి, బాగా వేడెక్కనిచ్చి కాసిన్ని నీళ్ళు జల్లి చూసుకుని, వేడి సరిపోతుంది అనిపించగానే ఉప్పు కలిపిన పెసరపిండితో అట్టు పోసేసి,
అటుపై కొంచం జీలకర్ర, అల్లం ముక్కలు, ఉల్లి, పచ్చి మిర్చి ముక్కలూ ఒకదాని తర్వాత ఒకటో, అన్నీ కలిపేసో మన ఓపికని బట్టి జల్లేస్తాం కదా.. ఇక్కడితో రెండో అంకం పరిసమాప్తం.
సగం కాలిన అట్టు చుట్టూనూ, మధ్యలోనూ నెయ్యో నూనో చల్లేసి, అట్టు సుతలు పైకి లేస్తున్నాయనగా ఓ గరిటెడు ఉప్మా అట్టు మధ్యలో పెట్టేసి, మన చెయ్యి తిరగడాన్ని బట్టి రెండు మడతలో, మూడు మడతలో వేసేసి
అల్లప్పచ్చడి, కొబ్బరి పచ్చడి ఉన్న ప్లేట్లోకి బదలాయించేశామంటే పెసరట్టు వంటకం పూర్తైపోయినట్టే.
పెనం, పిండీ సిద్ధంగా ఉన్నాయి.. మొదటి అట్టు వాసన ముక్కుకి తగలడంతోనే కనీసం నాలుగైదు అట్లన్నా కావాల్సిందే అని కడుపు ఆదేశాలు జారీ చేసేస్తుంది..
కాబట్టి అట్టు వెనుక అట్టు.. అట్టు పై అట్టు... అట్లా అట్ల వంటకం కొనసాగుతుందన్నమాట.
దోస ని పల్చగా, క్రిస్పీ గా తినడానికి ఇష్టపడే ప్రాణులు సైతం పెసరట్టు దగ్గరికి వచ్చేసరికి 'ఎలా ఉన్నా సరే' అనేస్తారు.
అవును మరి, పెసరట్టు పల్చగా ఉన్నా, మందంగా ఉన్నా రుచే.
ఉల్లి పచ్చి మిర్చి వగయిరాలతో పాటు వేయించిన జీడిపప్పు పలుకులు పెసరట్టు మీద జల్లి, కనీసం నాలుగు చట్నీలతో వడ్డిస్తే ఆ పెసరట్టు పేరు 'ఎమ్మెల్యే' పెసరట్టు.
మందంగా వేసిన పెసరట్టుతో 'పెసరట్టు కూర' అని చేస్తారు.
పెసరట్టు ముక్కలని పోపులో వేసేసి, చింతపండు రసం కూడా పోస్తారు పైన.. ఏ ఇల్లాలో ఉదయం మిగిలిపోయిన పెసరట్లతో ఈ కూర సృష్టించి ఉంటుంది బహుశా.. కేవలం కూర కోసమని పెసరట్లు చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు.
మామూలుగా టిఫిను పుచ్చుకున్నాక కాఫీయో, టీవో సేవించడం రివాజు.
అదే పెసరట్టు తిన్నాక అయితే, వీటికి బదులుగా పల్చటి మజ్జిగ పుచ్చుకుంటే (వీలయితే నిమ్మరసం పిండింది) రెండు మూడు గంటలన్నా గడవక ముందే కడుపు ఆకలితోకణకణ మంటుంది.
తెలివైన ఇల్లాళ్ళు ఆదివారం పొద్దున్నే పెసరట్టుప్మా టిఫిన్ పని పెట్టుకుంటారు.
అప్పుడైతే ఎక్కువ వంటకాలు చెయ్యకుండానే మధ్యాహ్నం బోయినాలు కానిచ్చేయవచ్చు కదా.. మామూలు పెసరట్టు కన్నా, ఉప్మాతో కలిసిన పెసరట్టు కొంచం బరువుగానే అనిపిస్తుంది మరి.
అదేవిటో, పెసరట్టు కబుర్లు మాత్రం ఎన్ని చెప్పుకున్నా బరువుగా అస్సలు అనిపించవు..
ఆ భరోసాతోనే ఈ కబుర్లు ముగిస్తున్నాను...
అన్నదాత సుఖీభవా
లోక సమస్త సుఖినో భవంతు
**** మీ ఉషగిరిధర్ ****














