Pages

30, మార్చి 2021, మంగళవారం

ఐ క్నో -ఐ క్నో ( హాస్య కథ)

  (సేకరణ )

గోకవరం సుబ్బారావు ( గో.సు)

 అరుగుమీద ప్రయివేట్లు చెప్తున్న సూన్నాణ మాష్టారి దగ్గరకు  వచ్చి, 

" మాష్టారు! చిన్న సందేహం.

మొన్న పి. యు.టి అంటే put అన్నారు. మరి c.u.t కుట్ అవ్వాలికదా! కట్ అంటున్నారేంటండి?  అని చాలా తెలివిగా ప్రశ్నించానని సంబరపడ్డాడు.


"నీ తలకాయ్! ఇంగ్లీషు వాడు 

ఇలాగే చెప్పేడిచాడు 

నీ వెధవ తెలివి ఉపయోగించి

ఆ ఇంగ్లీషు పరిక్ష చెడదొప్పుకోకు.

మీ నాన్న మా వాడికి నాలుగు ఇంగ్లీషు ముక్కలు నేర్పి 

అమెరికా కాకపోయినా , బంగ్లాదేశ్ ఐనా పంపమన్నాడు.

నా పరువు తియ్యకు"..అని తిడుతూ బుర్రబాదుకున్నాడు.

 

బుర్ర గోక్కున్న గో.సు  

మళ్ళీ తన పుస్తకంలో ఐదుపైసల నాణెంలాంటి మొహాన్ని దూర్చాడు.


కాసేపయ్యకా, "మాష్టారండి!

కె ఎన్ ఓ డబ్ల్యు (know)

"క్నో " కదండి! మరి రోజా 

నో అంటోందండి.

 

"సైలెంట్రా   ! సైలెంటు.

నేను సైలెంటు గానే ఉన్నానండి. అల్లరి చేయడం లేదండి". 


"ఒరేయ్! సైలంట్ అన్నది నీ కె.ఎన్. ఓ.డబ్యూ లో 

"కె " నాయన.!"

 నీరసం వచ్చేసింది సూన్నాణ మాష్టారికి.


"ఓహో! అని  అక్షరం అక్షరం  కూడ బలుక్కుని

చదవడం మొదలెట్టాడు.

క్నో కాదు! నో.

క్నాలెడ్జి కాదు! నాలెడ్జి!

 చదవడం మొదలు పెట్టగానే,   'లాఫ్' అనే పదం రాగానే అదెలా చదవాలో తెలియక

నాలికని ఎలా తిప్పాలో తెలియక, లా... అంటుంటే,

పక్కన కూర్చున్న మాష్టారి కూతురు

రోజ "లాఫ్" రా ! మొద్దు అంది. 


"ఎఫ్ లేదు కదే!"  అని మళ్ళీ బుర్ర గోక్కున్నాడు అర్ధం 

గాక.


"ఈ ఇంగ్లీషు ఎవడు కనపెట్టాడబ్బా! అంతా పితలాటకం లా ఉంది.

స్కాటు మాస్టారు వేసే ఏనుగు మెలిక లా.." జుత్తు పీక్కున్నాడు.


గో.సు నాన్న ఆ ఊరి పంచాయితి బోర్డు ప్రెసిడెంట్.

రాజకీయాలతో ఏదైనా సాధించేయవచ్చనే వంద ఆలోచనలు,   వందెకరాలు గల బ్రతక నేర్చిన మోతుబరి.

కొడుకు. గో.సు టెన్తె లో కి వచ్చాడు 

అప్పటి వరకు వాడ్ని అడ్డపెట్టే ధైర్యం ఎవ్వరికి లేక పోవడం వల్ల 

క్లాసులన్నీ  కుక్కదూకుళ్ళు చేసుకుంటూ  'పది' కి వచ్చి పడ్డాడు.


అప్పటి వరకు మాష్టర్లని మేనేజ్ చేసిన ఆంజినేయులికి  టౌన్లౌ టెన్త్ పరిక్ష పెట్టడం

అతనికి నచ్చలేదు.


చాలా హై లెవెల్లో,  మినిష్టర్

లెవెల్లో ట్రైచేసాడు 

సెంటర్ తన పల్లెటూర్లో పెట్టిద్దామని. 


" సూడు! ఆంజినేలు! 

ఇది అంత అర్రీ బుర్రీగా తేలే ఎవ్వారం కాదు.

ఇద్యాశాకా మంత్రి 

కత్తిపూడి కనకం సేత రికమెండేసన్ సేయించినా, పని జరగదు.ఎందుకంటే అన్నీ అయ్యాకా నా దగ్గరకు వచ్చేవు మరి.

మీ ఓణ్ణి ఈ ఏటికి ఇలా కానిచ్చేయమను. ప్యాసయ్యడా! టౌను కాలేజీ మనదే! ఆడికో సీటేయించేత్తాను.

అవలేదనుకో వచ్చే ఏడు 

నాదీ గారంటీ!" ...అని బొజ్జతడుముకుంటూ.

 లంకపుగాకు గుప్పు గుప్పు మని ఊదుకుంటూ కారెక్కేసాడు.


ఆంజినేయులికి బెంగ వచ్చింది. తర్వాత  కోపంవచ్చింది , కాసేపయ్యకా బుర్రలో కొత్త ఆలోచన వచ్చింది.


" మాష్టారు! తమరు ఓపిగ్గా మాఓడ్ని తిట్టో కొట్టో పరిచ్చ పాసు సేయించాల!.

ఆడ్ని ఫారిన్ పంపాలని మా సెడ్డ ఇది! " అన్నాడు. కాలు మీద కాలేసుకుని ఊపుతూ.

సూన్నాణ మాష్టారికి భయం వేసింది. వాడికి చదువు చెప్తే తనకున్నది మర్చి పోతానేమోనని కంగారొచ్చొంది.


తన రిటార్మెంట్ డబ్బులకి నామినేషన్ ఇచ్చానా లేదా జ్ఞాపకం రాలేదు.


తడబడుతు..."మీ వ్యవసాయం,  వ్యాపారాలన్ని చూసుకోడానికి ఎవరో ఒకరు ఉండాలి కదండి.

ఒఖ్ఖగాని ఒఖ్ఖ నలుసు కదా! 

ఏం పంపుతారండి ఫారిన్.

అక్కడ ఇక్కడ లాగ ఆదుకోడానికి మీరుండరు కదా!

అదీగాక, తిండానికి ఆవకాయ, కొబ్బరి లౌజు, రాసుకోడానికి

ఆవదం దొరకువుటండి! ఆయ్'" 

అని ఏదో రకంగా పెను ప్రమాదం నుంచి తప్పుకోడానికి ప్రయత్నించాడు.


"అబ్బెబ్బే! మా ఓడు ఏదో రకంగా పదో క్లాసు పాసై 

ఈ ఊరు దాటి ఫారిన్ ఎల్లాల!

నిఖ్ఖచ్చిగా చెప్పి జేబులో చెయ్యిపెట్టాడు. 

మాష్టారు తనకి ఆంజినేయులు డబ్బులు ఇవ్వబోతున్నాడేమో నని,

"అబ్బెబ్బె, తరోత ఇద్దురుగాని!

అంటూంటే,

ముక్కుపొడుం డబ్బా మాష్టారి

చేతిలో పెడుతూ హాచ్! అని తుమ్మాడు.

"పాఠాలు సెప్పాలి!  మా సుబ్బుగాడికి

తప్పదు!  అని విచిత్రంగా  నవ్వి. అవకాశం ఇవ్వకుండా డుబ్ డుబ్ మంటూ బుల్లెట్ లాగించేసాడు. 


మాష్టారికి తింగర వాటం వచ్చేసింది.

'సుబ్బిగాడి చదువు నా చావుకొచ్చిందనుకుంటా' . గాలివానకి అల్లల్లాడిపోతున్న 

ఎండు కొబ్బరాకులా  ఊగుతూ  ఉసూరుమంటూ

ఇంటి దారి పట్టాడు ఆ బక్క ప్రాణి. 

అలా రోజూ మాష్టారింట్లో నే మకాం పెట్టిన గో.సు గాడికి ముప్పొద్దులా 

తిండి కూడా మేప లేక అల్లల్లాడి పోతున్నాడు.

సూణ్ణాణ మాష్టారు.

**

పరిక్షలు మొదలయ్యాయి.

మాష్టారికి గుండెల్లో వంద బుల్లెట్లు పరిగెడుతున్నాయి. గో.సు ని 

సానబెట్టగా  అత్తీసరు మార్కులు వచ్చే వరకు ఫర్వాలేదని పించేడు. ఒక్క ఇంగ్లీషు పరిక్ష రోజున మాత్రం,

మాష్టారి టెన్షన్ తగ్గడానికి పది

మాత్రల్లేసుకుని వాడితో సెంటర్ కి వెళ్ళాడు.


దూరంగా చెట్టుక్రింద నెత్తిమీద గుడ్డేసుకుని కూర్చున్నాడు.


గో.సు ముఖం నిండా వీభూది.

బొట్లు పులుముకున్నాడు. చేతికి తాయత్తులు కట్టుకున్నాడు. డాలు లాంటి అట్ట, కత్తిలాంటి పెన్నుతో 

మాష్టారికి వాడు యుధ్ధానికి వెళ్తున్నట్టు కనిపించింది.

వీడు ఏం చీల్చి చెండాడుతాడో ఆ ఆంగ్ల పేపర్ని అని భయపడ్డాడు.

*

రిజల్ట్స్ వచ్చేరోజున వంద లంఖణాలు చేసిన వాడిలా ఉన్నారు మాష్టారు.

వంద కొబ్బరికాయలు 

ఐనవిల్లి గుళ్ళో మొక్కు కున్నారు.

ఎట్టకేలకు గో.సు కరక్టుగా 35 శాతంతో గట్టెక్కాడు.

కూతురు రోజా స్కూల్ ఫస్టు వచ్చిన ఆనందం కన్న గో.సు 

గాడు ప్యాసవ్వడం గొప్ప ఆనందం వచ్చిందాయనకు.

ఇంటర్లో జాయిన్ అయిన

గో.సు అంతకన్నా ముందుకి వెళ్ళ లేక చతికిల పడిపోయాడు. 

కానీ రాజకీయాల్లో మంచి పట్టు సంపాదించాడు.

**

ఒకరోజు రిటైరై పోయి పడక్కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్న మాష్టారు 

ఆ వార్త చూసి   స్పృహతప్పిపడిపోయారు.

భార్య కంగారు పడుతూ

ముఖం మీద నీళ్ళు జల్లి 

లేపింది.

"ఏవైందండి!  

నోట మాట రాక, అలా ఉండి పోయాడు. కాసేపయ్యాకా తేరుకుని.

మన గో.సు గాడికి విద్యాశాఖ మంత్రి పదవి ఇచ్చారుట. 

అంటూ...

ఐ క్నో ! ఐ క్నో. 

అంటూ వెర్రిగా నవ్వాడు.

పెళ్ళం అతనికి పిచ్చి పట్టిందేమోనని కంగారు పడుతోంది ఇప్పటికి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి