అప్పుడు నేను మూడో తరగతి.
పండగలు వచ్చాయంటే కొత్త బట్టలు కుట్టిస్తారనీ, పిండి వంటలు చేస్తారనీ, బోయినాలు ఆలస్యమవుతాయనీ,
శివరాత్రి,కార్తీక సోమవారాలు "ఉపోషాలు" ఉంటారనీ మాత్రమే తెలిసిన రోజులు.
"అమ్మా.. రేపు నేనుకూడా మీతోపాటు ఉపోషం ఉంటానమ్మా..
అన్నం తినకూడదు, అంతే కదా.. నేనుండగలనమ్మా..
జొరం వచ్చినప్పుడు అన్నం తినకుండా ఉంటున్నానుకదా.."
రోజంతా బతిమాలగా బతిమాలగా ఎట్టకేలకి సాయంత్రానికి నా శివరాత్రి ఉపవాస వ్రతానికి అమ్మ అనుమతి దొరికేసింది.
"రేపు మళ్ళీ నువ్వు ఉపోషం కదా. అన్నం తినవు కదా.. పొద్దున్నే నీరసం వచ్చేస్తుంది. ఓ రెండు ముద్దలు ఎక్కువ తినాలి మరి.."
అని ఆవేళ రాత్రి ఎప్పుడూ తినేదానికి డబుల్ కోటా తినిపించేసిందా.. ఓ పక్క నాకు ఆవులింతలొచ్చేస్తూ కళ్ళు బరువుగా వాలిపోతుంటే అప్పుడింక ఒకటే జాగ్రత్తలు.
"ఇదిగో.. నువ్వు ఎప్పుడు ఉండలేకపోతే అప్పుడు నాకు చెప్పెయ్యాలి, తెలిసిందా. మధ్యాహ్నం ఆకలేసినా చెప్పెయ్యి. వంట చేసేస్తాను.." అంటూ.. నేను వింటూ వింటూ నిద్రలోకి జారుకున్నాను.
మర్నాడు పొద్దున్నే స్నానం చేసొచ్చేశామా.
ఇంక గుళ్ళోకెళ్ళి అభిషేకం చేయించుకుని రావాలి.
ఎప్పుడూ ఖాళీగా ఉండే శివాలయం ఆవేళ ఒకటే హడావిడిగా ఉంది.
ఊళ్ళో వాళ్ళందరూ గుళ్ళోనే ఉన్నారు.
"గుళ్ళో అభిషేకం ఆలస్యం అయ్యేలా ఉంది కదా చంటి . నువ్వు పాలు తాగెయ్యి," అంది అమ్మ, తను మాత్రం కాఫీ తాగలేదు.
అదే అడిగితే "కాఫీ తాక్కూడదమ్మా.. పాలు పర్వాలేదు.." అని చెప్పిందే కానీ,
తను మాత్రం పాలు కూడా తాగలేదు.
నాన్న నన్ను బడికి పంపాలనుకున్నారు కానీ, అమ్మ ఒప్పుకోలేదు, "ఉపోషం పూటా ఏం వెళ్తుంది .." అని.
గుళ్ళో అభిషేకం చేయించుకుంటే ప్రసాదం ఇవ్వకుండా ఉండరు కదా.
అసలే పూజారిగారు మాకు బాగా తెలుసు కూడాను.
కొబ్బరి చెక్కలు, అరటిపళ్ళు పళ్ళెంలో పెట్టి ఇచ్చారు.
గుడి బయటకి రావడం ఆలస్యం, అమ్మ కొబ్బరి చెక్క ముక్కలుగా కొట్టీ, అరటి పళ్ళు ఒలిచీ నాకు అందించేసింది..
"ప్రసాదం వద్దనకూడదమ్మా, తినాలి" అని కూడా చెప్పింది.
నేను భక్తిగా ప్రసాదాన్ని ఆరగిస్తుండగా,
"ఇవాళ మా చంటి కూడా ఉపోషం" అని మిగిలిన భక్తులకి చెప్పింది అమ్మ.
వాళ్ళంతా నా భక్తిని ఎంతగానో మెచ్చుకున్నారు. అంత చిన్నపిల్లలెవరూ ఉపోషాలు ఉండరుట.
ఇంటికి రాగానే మళ్ళీ బోల్డన్ని పాలు కాచి వాటిలో పంచదార, అటుకులు వేసి ఇచ్చింది నాకు.
"అటుకులు తినొచ్చు, అన్నం తినకూడదు కానీ," అని చెప్పెయ్యడంతో నేను ఆ పాలటుకుల పని పట్టాను.
మధ్యాహ్నం అవుతుండగా చాలా ప్రేమగా మళ్ళీ అడిగింది
"అన్నం వండేయనా? చిన్న పిల్లలు ఉపోషం ఉండకపోయినా పర్వాలేదు" అని.
నేనొప్పుకోలేదు. ఉపోషం ఉండాల్సిందే అనేశాను, కచ్చితంగా.
"పిల్ల ఉపోషం ఉంది , ఎవర్నైనా పిలిచి బొండాలు తీయించండి" అని నాన్నకి పురమాయించేసింది.
బొండాలు చెట్టు దిగడం ఆలస్యం, రెండు బొండాల్లో నీళ్ళు నాచేత తాగించడమే కాదు, కొబ్బరి మీగడ అంతా తినిపించేసింది అమ్మ.
"ఉపోషాలు ఉండేవాళ్ళు బొండాలు తాగొచ్చు" అనడంతో నేనింకేమీ మాట్లాడలేదు.
సాయంత్రం కాఫీల వేళ నాకు పెద్ద గ్లాసుడు పాలిచ్చి, బిస్కట్లైనా, రస్కులైనా ముంచుకుని తినమంది.
నేను "బిస్కట్లు తినొచ్చా?" అని సందేహం వెలిబుచ్చితే,
"అన్నం తినకూడదు కానీ మిగిలినవి ఏవన్నా తినొచ్చు" అని మళ్ళీ హామీ ఇచ్చేసింది. పాలతో పాటు కాసిన్ని బిస్కట్లు నమిలాను.
దీపాల వేళ అయ్యిందో లేదో, నేనేమో మండువాలో మంచం వాల్చుకుని కూర్చుని, నక్షత్రం కనిపిస్తుందేమో అని కొబ్బరాకుల మధ్యనుంచి కళ్ళు చికిలించుకుని ఆకాశంలోకి చూడడం.
అలా చూస్తూ నేను కాసిని పాలు తాగేసరికి అమ్మ కొట్టక బుట్టలు , కొబ్బరి పచ్చడి , తిమ్మనం రడీ చేసింది , నక్షత్రం రావడం జరిగిపోయింది.
ఇంకేముంది, నువ్వుల నూనె వేసుకుని ఫలహారం చేసేశా.
"ఇంతేనా ఉపోషం ఆంటే.. బామ్మెప్పుడూ బోల్డు హడావిడి చేసేస్తుంది.
తను రాగానే చెప్పాలి, నేను ఉపోషం ఉన్నానని" అనుకుంటూ నిద్రపోయా.
మర్నాడు స్కూల్లో మేష్టారు అడిగారు, ముందు రోజు ఎందుకు రాలేదని.
"శివరాత్రి కదండీ, ఉపోషం ఉన్నాను" అని చెప్పగానే ఆయన ఎంతగా మెచ్చుకున్నారంటే, నాకు ఫస్టు మార్కులొచ్చినప్పుడు కూడా ఆయనెప్పుడూ అంతగా మెచ్చుకోలేదు. అది మొదలు నేనెప్పుడూ ఉపోషం మిస్సవ్వలేదు.
లోక సమస్త సుఖినో భవంతు
**** మీ ఉషగిరిధర్ ****
ఈ కిటుకు తెలిస్తే మీ చంటి రోజూ ఉపోషం చేస్తుందేమో
రిప్లయితొలగించండి