Pages

30, మార్చి 2021, మంగళవారం

ఆంధ్ర పిత ఆవకాయ

 

"ఒక్క మాటు ఇలా తోట లోంచి వెళ్లి, మా బామ్మగారు రమ్మంటున్నారు అని అవ్వకి చెప్పు తల్లి .. అందరూ వచ్చేశారు, మీకోసమే చూస్తున్నారు అని కూడా చెప్పేం.. మర్చిపోవద్దు...

" ఓ నాలుగు సార్లు బామ్మచేత ఇలా బతిమాలించుకుని, అడ్డదారిన అవ్వవాళ్ల  ఇంటికి పరిగెత్తాను నేను.

 అప్పటికే అత్త వాళ్ళ  ఇంటికి, అమ్మమ్మ  గారి  ఇంటికి రెండేస్సార్లు వెళ్లి రావడం అయ్యింది, జల్లెడ కోసం.

 ఆ మధ్యలోనే మావిడికాయలన్నీ తుడిచేసి , ఆరబెట్టేశాను.
 చిన్నపిల్ల నన్న పేరే కానీ ఎన్నిపనులో. కొత్తావకాయ ఊరికే వస్తుందా మరి? 

 

నాకసలు అలా ఇంట్లోనుంచి బయటికి తిరగడం అంటే భలే సరదా.

రోజూ అలా తిరగడానికి ఉండదు కదా!!

అలా అని బామ్మ అడిగిన వెంటనే పని చేసేశామనుకో, ఇంక బతిమాలదు మనల్ని. అదే కాసేపు ఆగితే దార్లో తినడానికి ఏదో ఒకటి పెట్టి మరీ పంపిస్తుంది.

ఇట్టే వెళ్లి అట్టే అవ్వ గారిని తీసుకొచ్చేశాను. 

వేసంకాలం సెలవలు కదా, బడి లేదు. 

ఆవకాయ పనులకోసమని మధ్యాహ్నం భోజనాలు తొరగా అయిపోయాయి. 

అమ్మ, బామ్మ వరస చూస్తుంటే టీ  కూడా ఉండేలా లేవు.


కారాలు దంపడానికి మంగమ్మా, సుబ్బలక్ష్మీ వచ్చేశారు. 

అమ్మ అప్పటికే కుంది రోలు, రోకళ్ళు కడిగి పెట్టేసింది. 

పెద్ద పెద్ద పొట్లాల్లో ఉన్న ఎండు మిరపకాయలు, ఆవాలు పళ్ళాల్లో పోసి ఎండలో పెట్టేసింది. 

జాడీలో ఉన్న రాళ్లుప్పు కూడా విడిగా ఎండబెట్టేసింది.

కుంది రోలు తులసి కోట పక్కకి లాక్కుని,
 "ముందర కారం కొట్టేత్తావండి" అంటూ మిరపకాయలు అందుకున్నారు ఆడవాళ్ళిద్దరూ.

అమ్మేమో దంపిన కారం జల్లించడానికి సిద్ధంగా ఉంది.
చూస్తుండగానే ఖణేల్ ఖణేల్ మంటూ రోకలి చప్పుళ్ళు మొదలైపోయాయి పెరట్లో. 

"ఇదిగో మంగమ్మా, భద్రం. గతమాటు నీ విసురుకి రోకలి పొన్ను విరిగిపోయింది,"
 బామ్మ జాగ్రత్తలు మొదలు పెట్టేసింది. 


నాన్న గారు మావిడికాయలు తరగడానికి కూర్చున్నారు. 

నాకేమో తరిగిన ముక్కలు తుడిచే పని. 

అసలు ఆవకాయ పెట్టడంలో అన్ని పనులకన్నా కష్టమైనదీ,
జాగ్రత్తగా చేయాల్సిందీ ఇదే. 

ఓ పాత గుడ్డతో తరిగిన ప్రతీ ముక్కనీ జాగ్రత్తగా తుడవాలా. 

పెచ్చు మీద ఓ చిన్న మైకా కాగితం లాంటి పొర ఉంటుంది. 

అది ఊడి చేతిలోకి వచ్చేదాకా ఊరుకోకూడదు. గోకైనా తీసేయాలి. 

అలా తియ్యలేదనుకో, ఆవకాయ్ పాడైపోతుంది.

 నేనుఒక్కదానినే  అంత ముఖ్యమైన పని చేస్తున్నాననైనా లేకుండా, మధ్య మధ్యలో బామ్మ బోల్డన్ని ఆర్డర్లు. 


కారం ఓ నాలుగు దంపులు దంపేసరికి మంగమ్మ బుగ్గనేసుకోడానికి బెల్లమ్ముక్క అడిగింది. 

అలా వేసుకుంటే దంపడం సులువౌతుందిట. 

ఏమిటో, నా పనికే ఏ సులువులూ లేవు. 

"దేవుడు గదిలో నీలం మూత సీసాలో బెల్లం ముక్కలు ఉంటాయి, నిమ్మళంగా సీసా పట్టుకురా తల్లీ " అంది బామ్మ. 

అసలు ఎవరూ చెప్పకుండానే ఆ సీసా ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు. 

ఎలా తెలుసో ఎవరికీ చెప్పననుకో. 

ఓ బెల్లమ్ముక్క గుటుక్కుమనిపించి, సీసా తెచ్చి బుద్ధిగా బామ్మకిచ్చా. మంగమ్మతో  పాటు  బామ్మ నాకూ ఓ ముక్కిచ్చింది "మా తల్లే " అంటూ. ఈ ముక్క బుగ్గనేసేసుకున్నా. 


నేనెంత తొరగా తుడుస్తున్నా, నాన్న గారు గబాగబా  కోసేస్తున్నారు కదా. 

తుడవాల్సిన ముక్కలు పెరిగిపోతున్నాయి. దంపేవాళ్ళు ఉస్సు అస్సు అంటున్నారు.. అందరికీ చెమటలు కారిపోతున్నాయ్.

 ఇలాంటి పని ఏ రాత్రో పెట్టుకోవాలి కానీ, ఈబామ్మకేంటో ఏవీ తెలీదు, చెప్పినా వినదు. 

 చూస్తుండగానే అన్నేసి మిరపకాయలూ దంపడం అయిపోయింది. 

 మజ్జిగ తేట తాగేసి ఆవాలు రోట్లో పోసుకున్నారు వాళ్ళు. అవ్వ గారు చెప్పినట్టు వాళ్ళంత గబగబా చేయడం మనకి రాదు. 

 బామ్మ కూడా మధ్యలో ముక్కలు తుడవడానికి వచ్చింది కానీ, మళ్ళీ ఏదో పనుందని వెళ్ళింది. 


మొత్తానికి మా ముక్కల పని అయ్యేసరికి, వాళ్ళు ఆవపిండి, ఉప్పు కూడా దంపేసి, కూరా పులుసూ పట్టుకుని వెళ్ళిపోయారు. 

అమ్మ అప్పటికే కడిగి ఆరబెట్టిన పెద్ద జాడీని తులసికోట దగ్గరికి పట్టుకొచ్చింది. 

జాడీ ఎంత ఉంటుందంటే, అందులో నేను ములిగిపోతాను.

 అప్పటికి నీరెండ పడుతోంది. 

 బామ్మ, నేను తుడిచిన మావిడి ముక్కలు, ఉప్పు, కారం, ఆవపిండీ జాడీలోకి దింపి బాగా కలుపుతోంటే, అమ్మ నూని కేన్లు బయటికి పట్టుకొచ్చింది. 

 ఎంతనూనో! ఆ నూనితో ఎన్నేసి జంతికలూ, చేగోడీలూ, పాలకాయలూ చేసుకోవచ్చో నేను లెక్కలేసుకుంటుంటే, 

 అవ్వ గారి పర్యవేక్షణలో అమ్మ, బామ్మ కలిసి ఆ నూనంతా జాడీలోకి వంపేసి, బాగుచేసిన మెంతులు జాడీలో పోసి బాగా కలిపేశారు. 

 అంతే, ఆవకాయ పెట్టడం అయిపోయింది. జాడీని దేవుడి గదిలోకి సాయం పట్టేశారు. 


మూడో రోజు సాయంత్రం నేను అన్నం తింటోంటే "కాస్త రుచ్చూడు" అంటూ కొత్తావకాయ విస్తట్లో వేసింది బామ్మ. 

ఓ ముద్ద తిని, "కొంచం ఉప్పగా ఉంది" అన్నాన్నేను. 

అంతే, బామ్మకి కోపం వచ్చేసింది.
"దీపాలెట్టాక ఉప్పు ఉప్పు అనకూడదు.." అంటూ వాదించేసింది. 

మరి ఉప్పుడుపిండి కావాలంటే ఏమని అడగాలో? ????

రాత్రి అన్నంతిన్న నాన్న, కూడా అదే మాట, ఉప్పు తగులుతోందని. 

ఈసారి బామ్మకి కోపం రాలా. 

సాయంత్రం చంటిది  ఉప్పుంది  కానీ, దాని  మోహం దానికేం  తెలుసులే అనుకున్నాను" అంది, నేను నిద్రపోతున్నాననుకుని.

"రేపు తిరగేశాకా కూడా తగ్గకపోతే, ఓ నాలుక్కాయలు తరిగి పడేద్దావండత్తయ్యగారూ" అని అమ్మ అనడం కూడా వినిపించింది నాకు. 

పెచ్చులకి మాత్రం ఎవరూ పేరు పెట్టలా...
ఏడాదంతా అయ్యింది కానీ, ఒక్కళ్ళకీ విస్తట్లోకి మైకా కాయితంముక్క  రాలేదు.

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి