కోనసీమనీ గోదారినీ తలచుకున్నప్పుడల్లా ఏదో తెలియని ఉద్వేగం.
ఓవైపు గలగలా గోదారి, మరోవైపు గంభీర కెరటాల సముద్రం.. చుట్టూ ఆకుపచ్చని
గొడుగులు పాతినట్టుగా ఆకాశంలో పచ్చాపచ్చని గూళ్ళు అల్లే కొబ్బరి చెట్లు.. 🌴🌴🌴
మధ్య మధ్యలో అరటి చెట్లు, అల్లంత దూరాన సరిహద్దులు గీసే తాడిచెట్లు,
పచ్చని పొలాలకి పాపిడి తీసినట్టుండే గట్లు.. వాటి వెంబడి పూల మొక్కలూ, పళ్ళ
చెట్లూ.. ఎంత భాష సరిపోతుంది కోనసీమని వర్ణించడానికి?!!
ఊహతెలిసినప్పటినుంచీ తెలిసిన ప్రపంచం అంతా సప్తవర్ణ శోభితమే.🌈🌈
నిద్రలేస్తూనే మండువా లోకి వస్తే ఎదురుగా ఉదయించే సూర్యుడు,
తల పక్కకి తిప్పితే ఎత్తైన కొబ్బరి అడవి.
పెరట్లో అరటి చెట్లు, దబ్బ చెట్టు, కూరగాయ మడులు..
దాటి కొంచం ముందుకు వెడితే కొబ్బరి తోట.
ఓ పక్క మావిడి చెట్టు, మరోపక్క వేప చెట్టు, ఇంకోపక్క వెలగచెట్టు.
సరిహద్దులో పాముపుట్టని ఆనుకుని సంపెంగ పొద, అనాస పొదలూ.
ఆవెంటే కనకాంబరాలలాంటి ఆకుపచ్చని పూలు పూసే పేరుతెలియని
మొక్కలు.
అటుగా ఓ అడుగేస్తే పక్క వాళ్ళ తోటలో ఈత చెట్లూ, నేరేడు
చెట్లూ. కాకులు, చిలకలు, పాలపిట్టలతో పాటు పేరు తెలియని పక్షులెన్నో. ఇక
సీతాకోకచిలుకలైతే ఏరకం పూలమీద ఏ చిలుక వాలుతుందో నిద్రలో లేపినా చెప్పేసేంత జ్ఞానం!!
పసుపురంగు కోల రెక్కలుండే సీతాకోకచిలుకలైతే ఎలాంటి పూల మీదైనా
వాలేస్తాయి. అదే నలుపు మీద తెలుపు, ఎరుపు చుక్కలుండే పెద్ద రెక్కలవైతే
మందారాలని విడిచి పక్కకి చూడవు. నల్లరెక్కల మీద తెల్లని చారలుండే బుజ్జి
పిట్టలు సీతాఫలాలని బతకనివ్వవు. పిందె పండుగా మారుతూ ఉండగానే ఈతాకు బుట్టలు కట్టేయాల్సిందే.
దొండ పాదుకి రోజూ కోసినా కాయలు కాస్తూనే ఉంటాయి.
పొట్ల పాదు పూత నిలబడగానే చిన్న చిన్న రాళ్ళకి పురికొస తాళ్ళు కట్టి సిద్ధం
పెట్టుకోవాలి, కాయలు వంకర్లు తిరిగిపోకుండా కాసుకోడం కోసం.
- శీతాకాలపు ఉదయాలు --- మంచు తెరల్ని చీల్చుకుంటూ పచ్చని చెట్ల మీద ఉదయించే సూర్యుడూ
- వేసవికాలపు సాయంత్రాలు --- రోజంతా గాడ్పుల తర్వాత ఒక్కసారిగా చల్లబడే సాయంత్రాలూ.
- వర్షాకాలపు మధ్యాహ్నాలు --- ముసుగేసుకుని పడుకోవాలనిపించే ముసురేసిన మధ్యాహ్నాలూ ఎక్కడైనా బావుంటాయి
కానీ, కోనసీమలో అయితే అద్భుతంగా ఉంటాయి.
మొదటిసారి గోదారిని చూసిన అనుభవం ఎప్పటికీ తడి ఆరని ఓ జ్ఞాపకం.
సైకిలు మీద నాన్నతో కలిసి ఏటిగట్టు మీద ప్రయాణం.
నాన్న సైకిలు తొక్కుతూ ఉంటే చెరువు కన్నా ఎన్నో
రెట్లు పెద్దగా ఉన్న గోదారిని కళ్ళు విప్పార్చుకుని గోదారిని చూడడం బాల్య జ్ఞాపకం .
వినగలగాలే కానీ గోదారి ఎన్నెన్ని కబుర్లు చెబుతుందో.
ఎంత చక్కని వక్తో, అంతకి మించిన శ్రోత కూడా.
చెప్పడం చేతనవ్వాలి ఎటొచ్చీ.. చూడ్డానికి ఎంత ప్రశాంత
గంభీరంగా ఉంటుందో, అంతకు అనేకరెట్లు లోతైన నది కదా మరి.
వినగలగాలే కానీ గోదారి గలగలల్లో సంగీతం వినిపిస్తుంది..
చూడగలిగితే సాహిత్యం కనిపిస్తుంది.
ఓ సంగీత రూపకం లానో, గేయ కావ్యంలాగో అనిపిస్తుంది.
చూసే కళ్ళకి గోదారి నడకల్లో నాట్యం కనిపిస్తుంది.
ఎన్నో పాటలు , కధలు కవితలు పుట్టుకకు స్ఫూర్తి మా గోదారమ్మ , కోనసీమ ..🙏🙏
లోక సమస్త సుఖినో భవంతు
**** మీ ఉషగిరిధర్ ***********

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి