Pages

8, ఫిబ్రవరి 2021, సోమవారం

సామజవరగమన.. అంటే ??

శ్రీ గురుభ్యోనమః 

“సామజవరగమనా” అనే పదం వినగానే.., 
కొంతమందికి త్యాగరాయ కీర్తన గుర్తొస్తుంది..
కొంతమందికి “శారద” అని గట్టిగా అరిచే “శంకరశాస్త్రి” గారు గుర్తొస్తారు..

కానీ అసలు “సామజవరగమనా” అంటే ఏంటో తెలుసా....


'సామజ' అనగా "ఏనుగు" అని.. 
'వరగమనా' అనగా "చక్కని నడక" అని అర్థం... 

"సామజవరగమన" అంటే ఏనుగు లా గంభీరంగా, హుందాగా  నడిచేవారు అని అర్థం..
 మరి అసలైన "సామజవరగమన" ఎవరు ??

అసలైన "సామజవరగమన.." శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుడు... 
వాల్మీకి తన రామాయణంలో 'అరణ్యవాసం'లో 
ఒకచోట రాముడిని "గజవిక్రాంతగమను" డంటారు... 
అంటే ఏనుగులా హుందాగా నడిచే వాడు అని...
ఇదే అర్థం వచ్చేలా త్యాగరాజు తన కీర్తనలో 'సామజవరగమన' అంటూ శ్రీరాముణ్ణి స్తుతించారు.._

 "సామజవరగమన" కీర్తన, దాని అర్థం ఒకసారి తెలుసుకుందాం.._


సామజవరగమనా ! సాధుహృత్సారసాబ్జపాల ! కాలాతీతవిఖ్యాత ! ॥ సామజ॥
సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల ! దయాలవాల ! మాంపాలయ ! ॥ సామజ॥
వేదశిరోమాతృజ సప్తస్వర నాదాచలదీపా।
స్వీకృత యాదవకులమురళీ !
గానవినోదన మోహనకర త్యాగరాజ వందనీయ ॥ సామజ॥


ఈ కీర్తనలోని ప్రతి పదం శ్రీకృష్ణుడిని వర్ణిస్తూ ఉంటుంది..._ 


ప్రతి పదార్ధం :

సామజ(ఏనుగు) వర(వంటి) గమనా(నడక కలిగిన వాడ) – ఏనుగు నడక లాంటి గంభీరమైన నడక కలవాడా

సాధుహృత్సారసాబ్జపాల – సాధువులు, సజ్జనుల హృదయపద్మములను పాలించేవాడా

కాలాతీతవిఖ్యాత – అన్నికాలములలోనూ కీర్తింపబడేవాడా

సామనిగమజ సుధామయగానవిచక్షణ – సామ వేదానికి మొదలు గా ఆ సంగీతముని నిత్యం పరిశీలిస్తూ పర్యవేక్షించేటి వాడ

గుణశీలదయాలవాల – గుణముకు దయకు ఉదాహరణగా నిలిచేటి వాడ

మాంపాలయ – నన్ను పాలించు

వేదశిరోమాతృజ – వేదములలో గొప్పదైన సామవేదమునుండి పుట్టిన

సప్తస్వరనాదాచలదీప – సప్తస్వరముల లయము వలన కలిగిన కదలని దీపమువంటి నాదమువలె ప్రకాశించువాడా

స్వీకృతయాదవకుల – యాదవకులములో జన్మించినవాడా

మురళీగానవినోదనమోహనకర – మురళీగానముచే వినోదించుచూ అందరిని ఆనదింప జేసేవాడా;

త్యాగరాజ వందనీయ – త్యాగరాజుచే నమస్కరింపబడినవాడా

              
                      ఇదీ 'సామజవరగమన'కు సంబంధించిన అసలు భావం !

మా గురువు గారు శ్రీమతి గిరిజ కుమారి గారు ఆలపించిన త్యాగరాయ కీర్తన             "సామజవరగమన"  మీకోసం 





 🙏ఎందరో మహానుభావులు అందరికి వందనములు 🙏

               జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి