మా చిన్నపటి మా ఇంట్లో 'చద్దన్నాల గది' ఒకటి ఉండేది .
అందులో రాచ్చిప్ప లో చద్దన్నం ఉండేది .
చద్దన్నాల గదిలో పిల్లల్ని వరసాగ్గా కూర్చోపెట్టి చద్దన్నాలు పెట్టేసేవాళ్ళ .
అసలు చద్దన్నం తినడం ఒక కళ.
ఈ చద్దన్నాన్ని సాధ్యమైనంత ఎక్కువ సేపు పెరుగులో కలపాలి.
ఈ కలపడంలో పెరుగు మీగడ వేళ్ళకి అంటుకుని వెన్నగా మారుతుంది.
ముందుగా ఆ వెన్న పని పడితే, ఈలోగా పెరుగులో నానిన అన్నం తినడానికి అనువుగా ఉంటుంది.
అందులోకి ఏ మాగాయ టెంకో, ఆవకాయ పెచ్చో నంజుకుని తాపీగా తింటూ ఉంటే,
చివరి ముద్దకి వచ్చేసరికి ఆవులింత వచ్చి, కళ్ళు మూతలు పడాలి,
అయినా బడికెళ్లడం తప్పదనుకో.
ఒక్కోసారి అమ్మే కలిపిచ్చేస్తుందనుకో.
శీతాకాలంలో గడ్డ పెరుగు భలేగా ఉంటుంది కానీ, వేసంకాలం వచ్చేసరికి కొంచం పులుపు తగులుతుంది. ఉప్పేసుకున్నా బాగోదు.
వేసంకాలం తరవాణీ కి ఎక్కువ ప్రాధాన్య( గంజీ ఉప్పూ వేసి ఊరబెట్టి తరవాణీ చేస్తారు ఒక దెబ్బకు వేసి )
పెరుగు లేని రోజు ... గొంగూర పచ్చడి ,ఉల్లిపాయ , నువ్వల నూనె లో తింటే ..
స్లీపింగ్ టాబ్లెట్స్ ఎందుకు పనికి రావు .. అంత నిద్దర వస్తుంది 😴😴😴😴
వేసంకాలం చద్దన్నాల స్పెషలు మావిడిపళ్ళు. పళ్ళు ఎక్కడ ముగ్గేస్తారో తెలుసు కదా.. మనవే కావలసినవి ఏరుకుని తెచ్చుకోడం, చద్దన్నంతో పాటు తినేయడం.
ఇంక, అమ్మ నోరు నొప్పెట్టేలా పిల్చే వరకూ మధ్యాహ్నం భోజనానికి వెళ్ళలేం. ఆకలనిపించదు కదా.
మిగిలిన రోజుల్లో చక్రకేళి అరిటిపళ్ళూ అవీ ఉంటాయి కానీ, మావిడిపండు రుచి దేనికీ రాదు మరి.
అందులోనూ చద్దన్నంతో అయితే ఒకటి తిందామనుకుని రెండు తినేస్తాం.
పైగా ఇంట్లో వాళ్ళు కూడా, "ఇప్పుడు కాకపొతే, ఇంకో నెలపోయాకా తిందావన్నా దొరకవూ" అంజెప్పేసి, తినగలిగినన్ని తినెయ్యమంటారు.
ఇప్పుడు ఇంట్లో 'చద్దన్నాల గది' ,రాచ్చిప్ప లేక పోయిన ...
బాధ పడక్కరలేదు ..ఐదు నక్షత్రాలహోటల్ లో దొరుకుతోంది అంట ....

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి