మాఘ మాసం శుక్ల పక్షం లో సూర్యుని ఉత్తరాయణ ప్రవేశం జరిగిన ఏడవ రోజు (సప్తమి) సూర్య జయంతి.
ఇదే రథ సప్తమి
ఈ రోజు ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు ఏడు గుర్రాల రథంలో గగన వీధిన పయనిస్తాడు.
ఏడు గుర్రాలు ఇంద్ర ధనుస్సు లోని ఏడు రంగులకు, వారం లోని ఏడు రోజులకు ప్రతీకలు.
సూర్యుని రథ సారథి అరుణుడు. సూర్యోదయానికి ముందు వచ్చే అరుణకాంతి భానుని ఆగమనానినికి గుర్తు. అరుణుడు కశ్యప మహర్షి-వినత ల పుత్రుడు. తల్లి తొందరపాటు వలన అర్ధదేహం తో జన్మించాడు. ఊరువులు (తొడలు) లేనివాడు గనుక అరుణుడిని 'అనూరుడు' అని కూడా అంటారు.
రథ సప్తమి నాడు జిల్లేడు ఆకు, రేగు పండు తలపై పెట్టుకుని ఉదయాన్నే స్నానం చేస్తారు.
చిక్కుడు కాయలతో రథాలు చేసి, పరవాణ్ణం వండి చిక్కుడు ఆకులలో పెట్టి సూర్య భగవానునికి నివేదిస్తారు.
సప్తాశ్వ రథమారూఢమ్ ప్రచండం కశ్యపాత్మజం
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
తాత్పర్యం: ఏడు గుర్రాల రథాన్ని అధిరోహించిన, మిక్కిలి తేజోవంతుడు, కశ్యప మహాముని పుత్రుడు, తెల్లని పద్మాన్ని ధరించిన సూర్య దేవా నీకు నేను నమస్కరిస్తున్నాను.
ప్రత్యక్షదేవుడు అయిన సూర్యుడు కశ్యప మహర్షి-అదితి ల పుత్రుడు.
అందువలన ఆదిత్యుడు అని కశ్యపాత్మజుడు లేదా కాశ్యపేయం అని అంటారు.
తెలుగు వారికి చిరపరిచితమైన ప్రముఖ సూర్య దేవాలయం శ్రీకాకుళం జిల్లా లో శ్రీకాకుళం పట్టణానికి ఒక కిలోమీటరు దూరంలో గల "అరసవిల్లి".
ఇక్కడ శ్రీ సూర్య నారాయణ మూర్తి ఉషా, ఛాయా, పద్మినీ సమేతంగా వెలిశాడు. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు "రామలింగ స్వామి" గా వెలసిన పరమ శివుడు. ఈ క్షేత్ర వర్ణన ఈ శ్లోకంలో చూడండి.
హర్షవల్లీ పురీవాసం చాయోషా పద్మినీయుతం
సూర్యనారాయణ దేవం నౌమి సర్వార్థదాయకం
ఒకప్పటి "హర్షవల్లి" ఈ నాడు "అరసవిల్లి" గా పిలువబడుతున్నది.
ఈ అరసవిల్లి దేవాలయం విశిష్టత ఏమిటంటే ఆలయ నిర్మాణం జరిగిన తీరు అపూర్వం.
ఎందుకంటే ప్రతి ఏడాది కేవలం ఆరు నెలల వ్యవధిలో రెండు సార్లు మాత్రం ప్రభాత సూర్యుని తొలి కిరణాలు ఆలయ గోపురం నుండి ధ్వజ స్థంభం మీదుగా వచ్చి నేరుగా స్వామివారి పాదాలను తాకుతాయి.
వేరే రోజులలో ఇటువంటి ఘటన జరగదు. ఈ వింత చూడటానికి భక్తులు తండోపతండాలుగా అరసవిల్లి దేవాలయాన్ని ప్రాతః కాలమే దర్శిస్తారు. సూర్య నారాయణ స్వామి వారికి భక్తులు 'వెండి కన్ను', 'బంగారు కన్ను' సమర్పిస్తారు.
అలా చేస్తే చర్మ మరియు నేత్ర సంబంధమైన జబ్బులు దూరమై ఆరోగ్యవంతులుతారని నమ్మకం.
అరసవిల్లి దేవాలయం గోడలపై అగస్త్య మహర్షి శ్రీ రామునికి ఉపదేశించిన ఆదిత్య హృదయం మరియు గ్రహస్తుతిని తెలిపే నవగ్రహ స్తోత్రం భక్తులకు అనువుగా వ్రాయబడ్డాయి. నవగ్రహ స్తోత్రం లో కూడా సూర్య దేవుని వర్ణన వుంది.
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం
తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం
రథ సప్తమి మొదలుకుని సగటు ఉష్ణోగ్రత రోజు రోజుకూ పెరుగుతూ వసంత ఋతువుకు దారి తీసి మనకు మరో ఉగాది నిస్తుంది..
ఎందరో మహానుభావులు అందరికి వందనములు ఈ మధురమైన కీర్తన తెలియని మానవుడు ! అనేవాడు ఉండడే మో ? బహుశ : !
తెలుగు వాగ్గేయకార త్రయంలో ధాతు , మాతువులకు ప్రాధాన్యత నిచ్చి , రచన చేయడంలో దిట్ట ,స్వర రాగ బ్రహ్మ "త్యాగ రాజు."
అలాంటి !కమనీయమైన కవిత !పరిపూర్ణమైన భక్తి ! సరస సంగీతం !ఈ మూడూ త్రివేణి గా తన గాన సుధా మధు రసాన్ని,ప్రవహింప చేశాడు "నాదబ్రహ్మ త్యాగయ్య."
ఎన్నో భక్తిపరమైన కృతులను రచించి, దాక్షిణాత్య కర్నాటక సంగీతానికి తెలుగును సంగీత భాషగా తీర్చిదిద్దిన మహనీయుడు త్యాగయ్య.
స్వర సాహిత్య సమ్మేళనం అద్భుతంగా సృష్టించిన ఆయన. తమిళదేశంలో పుట్టి పెరిగినా త్యాగయ్య తెలుగువాడు.
ఆయన పలికినది తెలుగు పలుకు. "పలుకువేమి నా దైవమా రామ!" - అంటూ, అచ్చ తెలుగులో ఆత్మనివేదన చేసుకున్న త్యాగయ్య తెలుగుకు సంగీత సుభగత్వం సమకూర్చిన మహనీయుడు.
నాట, వరాళి, గౌళ, అరభి, శ్రీరాగాలలో గల పంచరత్నాలు-నాటికీ, నేటికీ, రేపటికీ ఇది పంచరత్నాలే.
తెలుగు భాషా సుమ సుగంధాలు జగద్వ్యాప్తం కావడానికి నాదసుధారస ధారలు కురిపించిన శ్రీ త్యాగరాజ స్వామి కీర్తనలు తెలుగు వారి పుణ్యఫలాలుగా చెప్పుకోవచ్చు.
ఆయన భక్తిరసం జగదానందకారుకుడు, జానకీప్రాణనాయకుడు, కరుణారససింధువైన రామచంద్రునిలో ఐక్యమైంది. ఆ రోజు... ఈ రోజు ...పుష్య బహుళ పంచమి...(2/2/2021)
నాటి నుండి నేటి వరకూ అజరామరంగా ఆయన రచించి ఆలపించిన ఘనరాగ పంచరత్న కీర్తనలు దశదిశలా, వాడవాడలా మారుమోగుతూనే వున్నాయి.
ప్రత్యేకంగా ఆరాధనోత్సవాలలో తిరువాయూరులోని ఆయన సమాధి వద్ద గాత్ర, వివిధ వాద్య సంగీత విద్వాంసులు కీర్తిస్తూ... స్తుతిస్తూ... ఆయన పంచరత్నాలను ఆలపిస్తూ, పంచరత్నసేవతో ఘనంగా నివాళులర్పిస్తూ నే వున్నారు.
సూర్యచంద్రులు వున్నంతవరకూ ఆయన కీర్తనలు వినిపిస్తూనే వున్నాయి... వుంటాయి కూడా.
సంగీతాకాశంలో నిండు జాబిల్లిలా ప్రకాశించిన త్యాగయ్య ఆ సంగీతం వినబడినంతకాలం చిరంజీవియే!🙏🙏
పల్లవి
ఎందరో మహానుభావులు అందరీకి వందనములు ॥ఎందరో॥
అనుపల్లవి
చందురు వర్ణుని అందచందమును హృదయార
విందమున జూచి బ్రహ్మానంద మనుభవించువా ॥రెందరో॥
సామగానలోల మనసిజ లావణ్య ధన్యమూర్దన్యు
మానసవనచర వరసంచారము నిలిపి మూర్తి బాగుగా పొగడనేవా ॥రెందరో॥