కొబ్బరి తోటకి ఇంజిన్ తో నీళ్ళు పెట్టారు కదా.. మట్టంతా తడితడిగా ఉంది.
ఎవరూ చూడకుండా నాలుగు దోసిళ్ళ తడి మట్టి తెచ్చి లోపలి పెరడులో కుండ పెంకులో దాచాను.
మధ్యాహ్నం భోజనాలు అయ్యాక నాన్న ఏదో పనుందని బయటికి వెళ్ళిపోయారు.
అప్పటికే దాచి పెట్టుకున్న బొబ్బాసీ గొట్టాలు తీసుకుని లోపలి పెరడులోకి పరిగెత్తాము అన్న ,నేను .తమ్ముడు .
బొబ్బాసీ గొట్టాలతో మొక్కలకు నీటి సదుపాయం కలిపించే ఆలోచనతో ... రోజు నీళ్లు పొసే పనితప్పుతుంది అని
రాళ్ళు లేకుండా మట్టి అంతా ముద్దగా కలుపుకుని,
మట్టి మిగిలితే కారు బొమ్మో, రైలు బొమ్మో చేయాలని కూడా ప్లాన్లేసుకున్నాము .
ఇంతలో అన్నని వెతుక్కుంటూ బామ్మొచ్చేసింది. గుండెల్లో రాయి పడింది కానీ, నాన్న ఇంట్లో లేరని గుర్తొచ్చి హమ్మయ్య అనుకున్నా.
అయితే, బామ్మ "మట్టితో ఆడుతున్నారా ? మీ నాన్నకి చెబుతానుండు.." అనకుండా "ఏమిచేస్తునారు ఎండలో ?" అని అడిగింది ప్రేమగా.
బామ్మ కేకలేయక పోవడం కొత్తగా అనిపించింది.
"బొబ్బాసీ గొట్టాలతో మొక్కలకు నీటి సదుపాయం కలిపిస్తున్నాము .. నీ తులసి మొక్కకి కూడా పెడతాము " అని హామీ ఇచ్చాను.
బామ్మ అస్సలు సంతోషించలేదు
"అవ్వని కత్తిపీట పట్టుకురమ్మని చెప్పేశాను..
"కాఫీలు తాగేసి పని మొదలు పెట్టాలి.. ఓమాటు చెయ్యి కడుక్కుని వస్తావా?" అని అడిగింది అన్నని ప్రేమగా.. ఏదో పని ఉందని అర్ధమయ్యింది.
"అవును బామ్మా.. కాఫీ తాగితే ఎంత బాగుంటుందో" అన్నాన్నేను.
నాకు కావాల్సింది నేరుగా అడిగే అలవాటు లేదప్పుడు.
మామూలప్పుడు కాఫీ అడిగితే "మీ నాన్నకి చెబుతా" అని బెదిరించే బామ్మ,
ఆ పూట "మా తల్లే .. అదేవన్నా బంగారవా? పలకల గ్లాసుతో ఇస్తాను, రా" అంది, మళ్ళీ ప్రేమగా. పలకల గ్లాసంటే పెద్ద గ్లాసన్న మాట.
నేను ఊదుకుంటూ కాఫీ తాగుతున్నానా.. అప్పుడు విప్పింది బామ్మ పొడుపు కథని.
"బూడిద గుమ్మడికాయలు కడిగి ,నాటెట్టి వెళ్ళమంటే మీ నాన్నకీ చెయ్యి ఖాళీ లేకపోయింది.
ఇదన్న మాట సంగతి.. "వడియాలు పెడుతున్నారా? కారం లేకుండా వడియం అట్టు కాల్చుకుంటే ఎంత బాగుంటుందో.." అన్నాన్నేను, తగు మాత్రంగా లొట్టలేస్తూ.
నిజానికి నాకు 'ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి' అన్న సామెత అప్పటికి తెలీదు. అయినా అన్నీ తెలిసే చేస్తామా ఏంటి?
"ఓస్.. అంతే కదా.. మీ అమ్మకి చెబుతానుండు, కారం కలపకుండా పిండి తియ్యమని.. రేపు మధ్యాహ్నం అన్నంలోకి నీకు అట్టు కాల్చి పెడతాను..సరేనా?"
హామీ ఇచ్చేసింది బామ్మ. కాఫీలయిపోయాయి కదా, ఇప్పుడు బామ్మ పని మిగిలింది.
పెరట్లో తులసి కోట చుట్టూ పెద్దవీ, చిన్నవీ కలిపి ఓ డజను బూడిద గుమ్మడి కాయలున్నాయి.
దేవుడికి కొబ్బరికాయ కొట్టుకునే కత్తి పట్టుకొచ్చింది బామ్మ. నేను కాయలు కడగడం
ఆ కత్తితో బామ్మ పర్యవేక్షణలో ఒక్కో కాయ మీదా నాటు పెట్టాడు అన్న , కత్తి బరువనీ, చెయ్యి నొప్పనీ హడావిడి చేసి..
అది మొదలు అమ్మ, బామ్మ, అవ్వ గారూ ఆ గుమ్మడికాయలు ఒక్కోటీ ముక్కలుగా తరగడం.
సాయంత్రానికి తరగడం పూర్తయ్యింది. ఓ చీరలో ముక్కలన్నీ వేసి, రాళ్లుప్పు జల్లి,
బట్టల మూటంత పెద్ద మూట కట్టి, ఆ మూటని పెద్ద పీట మీద పెట్టారు.
ఆ తర్వాత వాళ్ళు ముగ్గురూ కలిసి కుంది రోలు సాయం పట్టి ఆ మూట మీద పెట్టేశారు.
మర్నాడు పొద్దున్నే అమ్మ మినప్పప్పు, పచ్చి మిరపకాయలు విడిగా రుబ్బేసిందా?
తర్వాత మా కోసం కారం కలపకుండా విడిగా కొంచం పిండి ఉంచి, మిగిలిన పిండిలో కారం కలిపేసింది.
రాత్రంతా మూట లోనుంచి నీళ్ళు కారిపోడంతో అంత పెద్ద మూటా చిన్నదైపోయింది.
గుమ్మడి ముక్కల్లో కారంపిండి కలిపేసి అమ్మా, బామ్మా కలిసి వడియాలు పెట్టేశారు.
మధ్యాహ్నాలు ఇంట్లో అందరూ పడుకున్నప్పుడు వడియాలు కాకులెత్తుకు పోకుండా కాపలా కాసే పనీ, రోజూ సాయంత్రం వడియాలు లేక్కెట్టే పనీ నామీదే పడ్డాయి.
నాలుగోరోజుకి ఫెళఫెళ్ళాడుతూ ఎండిపోయాయి వడియాలు.
ఆవేళ మధ్యాహ్నం భోజనంలోకి వేగించింది అమ్మ!!
నాన్న, నేనూ ,అన్న భోజనాలు చేస్తున్నాం.
"బాగున్నాయ్ వడియాలు.. ఇంకో రెండు ఎండలు ఎండితే నిలవుంటాయ్" అన్నారు నాన్న.
"రెక్కలు ముక్కలైపోయాయ్.. అవ్వ కూడా సాయం వచ్చింది కాబట్టి సరిపోయింది.. కాస్త పనా, కూస్త పనా.. రాక్షస చాకిరీ,
" అంది అమ్మ, నేను, అన్న కూడా కష్టపడ్డా ఆ విషయం అస్సలు చెప్పకుండా. నాక్కోపం వచ్చేసింది.
"చూడు నాన్న.. మొన్న అన్న కష్టపడి నాట్లు పెట్టాడు , నేను కాయలు కడగి ,వడియాలు కాకుల నుంచి కాపాడాను .
ఆవిషయం అస్సలు చెప్పడం లేదు," అని కంప్లైంట్ చేసేశాను.
"నువ్వూ, నేనూ ఎంత చేసినా మీ అమ్మకి కనిపించదు .. ఆవిణ్ణి మెప్పించడం మన వల్ల కాదులే.." అన్నారు నాన్న.
బామ్మ నా బొబ్బాసీ గొట్టాలు , తడి మట్టి విషయం నాన్నకి చెప్పేస్తుందేమో అని భయ పడ్డాను కానీ, మర్చిపోయినట్టుంది.. నావైపు కోపంగా చూసి ఊరుకుంది, అంతే..








