Pages

31, డిసెంబర్ 2020, గురువారం

చిన్ననాటి పడవ ప్రయాణం

చిన్ననాటి పడవ ప్రయాణం

పడవ ప్రయాణం అంటే అందరూ కేరళ... గురించి చెప్తారు
కాని మా గోదావరి జిల్లాలో పడవ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుందండి.


 నా చిన్నతనంలో నేను చేసిన ఒక పడవ ప్రయాణం గురించి మీతో పంచుకుంటున్నాను.



  నాకు బాగా గుర్తు అది సంక్రాంతి పండగకు ముందు. ఇంటి నిండా చుట్టాలున్నారు అమ్మ  నన్ను పిలిచి రేపు ఉదయం మనంఊరు వెళ్ళాలి అని చెప్పింది.( ఊరంటే ఏ అమెరికాలో అనుకునేరు అప్పనపల్లి మా ఇంటికి చాలా దగ్గర లేండి) పొద్దున్నే లేచి పిల్లలందరూ చాలా  ఉత్సాహంగా రెడీ అయ్యి వీధిలోకి వచ్చా.

  నాన్న గుర్రబ్బండి ని పిలిచారు  (ఆ రోజుల్లో ఆటోలు లేవు లెండి) నేను ఎంతో ఉత్సాహంతో చివరికి కూర్చున్నాను .అన్ని చూడొచ్చని  ,అమ్మ చిన్న పిల్లవి పడిపోతావ్  అని నన్ను లోపలికి గెంటేసింది.
 గుర్రబ్బండి నడుపుతున్న ఆ తాత పక్కన కూర్చుని  నా సందేహాలు అడగడం మొదలు పెట్టాను
 గుర్రానికి కళ్ళు మూసి ఉన్నాయి కదా మరి ముందు ఎలా కనిపిస్తుంది.
గుర్రం మెల్లో ఆ రంగు రంగుల తాళ్లు ఎందుకు కట్టారు .........
   


 అమ్మ  నా ప్రశ్నలన్నీ విని... నువ్వు కొంచెం సేపు నీ ప్రశ్నలు ఆపుతావా అంది  కోపంగా.

 ఇంతలో  రేవు వచ్చింది ... అందరూ నెమ్మదిగా గుర్రబ్బండి  దిగి
 తప్పిపోకుండా ఒకరి చేయి ఒకరు పట్టుకుని  లాంచీ టికెట్ల అమ్మే దగ్గరికి వెళ్ళాము. నాన్న అందరికీ లాంచీ టిక్కెట్లు తీసుకున్నారు.( టిక్కెట్లు అంటే వందలు ఉంటాయి అనుకునేరు ఐదు రూపాయలు ఉండేవి) లాంచీ రెడీగా ఉంది  వెళ్ళమని చెప్పాడు ఆ టికెట్లు  ఇచ్చే వ్యక్తి.

  
 ఈ లోపు నేను నాన్నని రంగు సోడా కావాలి అని అడిగాను . పోనీ అని పిల్లలందరికీ  నాన్న సోడా కొనిపెట్టింది. అందరు తాగడం అయిపోయింది కానీ నాది ఇంకా అవలేదు ఈలోపల  లాంచీ వెళ్ళిపోయింది .నాన్న నా కేసి చాలా కోపంగా చూశారు .
నేను అమ్మ వెనకాల నుంచుని  నా సోడా తాగడం పూర్తి చేశాను నెమ్మదిగా....
నాన్న వెళ్లి ఆ టికెట్లు ఇచ్చిన వ్యక్తిని అడిగారు 
మళ్ళీ ఇంకో  లాంచీ ఎప్పుడు వస్తుంది అని
  ఒక అరగంటలో వస్తుంది కూర్చోమని చెప్పాడు.


         
 నేను కూర్చుని ఇంటి నుండి తెచ్చుకున్న జంతికలు తినడం మొదలు పెట్టాను. ఈలోపు లాంచీ వచ్చింది తొందరగా వెళ్ళమని చెప్పాడు టిక్కెట్లు ఇచ్చే వ్యక్తి. అందరం వెళ్లి లాంచీ ఎక్కి కూర్చున్నాము.పైకి ఎంతో సంతోషంగా ఉన్నా లోపల ఎందుకో కొంచెం భయంగా ఉంది. 
లాంచీ బయల్దేరింది నది మధ్యలో వెళ్ళేసరికి అమ్మ నా చేతికి డబ్బులు ఇచ్చి  దండం పెట్టుకుని నదిలో వేయమంది. ఎందుకు అని అడిగాను నేను? ప్రశ్నలు అడక్కుండా చెప్పిన పని చెయ్యి అని చెప్పింది అమ్మ.
 నాన్న దగ్గరకు పిలిచి ఇలా చెప్పారు  పూర్వకాలంలో డబ్బులు రాగితో చేసేవారు ... రాగి కి నీటిని శుద్ధి చేసే గుణం ఉంది. అందుకని రాగి డబ్బులు నీళ్లల్లో వేసేవారు. ఇప్పుడు డబ్బుల్ని స్టీల్ తోనూ ఇనుముతో చేస్తున్నారు అయినా పాత పద్ధతి మారలేదు అని  ఒక నవ్వు  నవ్వారు.



లాంచి వడ్డుకు చేరింది...మళ్ళీ గుర్రబ్బండి ఎక్కి వెంకన్న గుడికి చేరుకున్నాము..దేవుడు మీద భక్తి... ప్రసాదం మీద భుక్తి ఉన్న వాల్లం కాబట్టి... ఆ రెండు ముగించుకొని... ఆ ఊరు లోనే ఉన్న మా మేనత్త గారి ఇంటికి వెళ్లి  బోజనాలు ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణ అయ్యాము.

ఇది  చదివి  మీరు ఇప్పుడు  ఇలా  ప్రయాణం చేదం అనుకునేరు ....

గురంబండి  పోయి  ఆటో  వచ్చి  డాం  డాం  డాం 

లాంచీ   పోయి  బ్రిడ్జ్  వచ్చి  డాం డాం డాం 

సోడా  పోయి  కూల్ డ్రింక్ వచ్చి  డాం డాం డాం 

కానీ మా అప్పనపల్లి  వెంకటేస్వర స్వామి గుడి కి మాత్రం వెలండి 



                                                        లోకా సమస్తా సుఖినోభవంతు                     

                                                              ఓం నమో వెంకటేశాయ 

                                               ************మీ ఉషగిరిధర్********



28, డిసెంబర్ 2020, సోమవారం

పగిలిన పలక హృదయం

 పగిలిన పలక హృదయం

నా పేరు పలక నా మిత్రుడు బలపం 

మేము చాలా మంచి స్నేహితులు 


 మీరు దిద్దిన మొదటి అక్షరానికి సాక్ష్యం మేము 

మీరు వేసిన మొదటి ముగ్గుకు సాక్ష్యం మేము 

 మీరు వేసిన మొదటి బొమ్మ కు సాక్ష్యం మేము

 ఎన్నటికీ సాక్షులైన మేము  ఇప్పుడు లేము


 ఒకప్పుడు పిల్లలు చక్కగా రాసుకుని దాచుకున్న మేము

 ఇప్పుడు ఫల్ల బండ్ల మీద ప్రైస్ ట్యాగ్ లా మారిపోయాము


 ఏం చేస్తాం  అన్నప్రాసన రోజు ఆవకాయ అన్నంలాగా  ....

అక్షరాభ్యాసం రోజు పుస్తకం ఇచ్చేస్తున్నారు......

 పైగా   వృక్షో రక్షతి రక్షితః అంటున్నారు 


 

BC(Before covid)(2019)


ఒక తండ్రి పిల్ల ని తీసుకుని మేము ఉన్న షాప్ కి వచ్చాడు.... 

పిల్ల తనకు పలక ,బలపం కావాలి అంది....

తండ్రి అవి వద్దని పుస్తకము పెన్సిల్ కొన్నాడు  


AC(After covid)(2020)


ఒక తండ్రి పిల్ల ని తీసుకుని మేము ఉన్న షాప్ కి వచ్చాడు.... 

పిల్ల తనకు పుస్తకము పెన్సిల్ కావాలి అంది....

తండ్రి సెల్ కొన్నాడు.....

ఇదే మార్పు...మాకు మంచి రోజులు వస్తాయి....


ఇది  చదివిన తరువాత మీకు

పలక పగులగొట్టి నందుకు అమ్మ వేసిన మెట్టికాయ గాని....

పగిలిన పలక ముక్క తో ఆడిన తోక్కుడు బిల్ల గాని ....

గుర్తుకు వస్తె మనం కలిసి తిరిగి న వాల్లం



                                                     లోకా సమస్తా సుఖినోభవంతు

                                                           వృక్షో రక్షతి రక్షితః

                                              ***********మీ ఉషగిరిధర్********


24, డిసెంబర్ 2020, గురువారం

గీతార్ధం



గీత అను రెండు అక్షరాలను అర్థం చేసుకోవడానికి  రెండు యుగాలు పడుతుంది


 సీతమ్మ తల్లి గీత దాటడం వల్ల రామరావణ యుద్ధం జరిగింది....

 శ్రీకృష్ణపరమాత్ముడు గీత బోధించడం వల్ల కురుక్షేత్ర సంగ్రామం ముందుకు నడిచింది...


 ఒక పండితుని గీత గురించి అడిగితే ......భగవద్గీత గురించి చెప్తారు

 ఒక మాస్టర్ ని గీత గురించి అడిగితే . .......లెక్కల్లో గీత గురించి చెప్పారు

 ఒక జ్యోతిష్యుని గీత గురించి అడిగితే .........చేతిలో గీతలు గురించి చెప్పారు

 ఎవరు ఎలా చెప్పినా  మనిషి తలరాతను మార్చే శక్తి గీత కు ఉంది 


 కొందరికి గీత ఒక పుస్తకం

 కొందరికి గీత ఒక నమ్మకం

 కొందరికి గీతే దైవం

 కొందరికి గీత ఒక పరిశోధనా గ్రంథం

 కొందరి ప్రశ్నలకు సమాధానం గీత 

 కొందరి సమస్యలకు పరిష్కారం గీత


గీత  .....మనలో ధైర్యం నింపుతుంది

గీత  ..... మనలో అహంకారం తగ్గిస్తుంది


అందరూ భగవద్గీత చదవండి.... చదివించండి


     లోకా సమస్తా సుఖినోభవంతు

*****మీ ఉషగిరిధర్***

20, డిసెంబర్ 2020, ఆదివారం

తీర్థం పోదామా తిమ్మప్ప


తీర్థం పోదామా తిమ్మప్ప

 తీర్థం అంటే గుడిలో ఇచ్చే తీర్థం అనుకునేరు మా గోదావరి జిల్లాల్లో లో జరిగే ఒక గొప్ప వేడుక ఇది. .... ముఖ్యంగా  ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి కదా  అందుకని  మా గోదావరి జిల్లాల్లో షష్టి తీర్థం జరుగుతుంది.

 ఇప్పట్లాగా ఆన్లైన్ షాపింగ్ లు వుండేవి కాదు ఆ రోజుల్లో.... అందుకని ఇంట్లో వాళ్ళందరూ కలిసి చక్కగా తీర్థానికి వెళ్లి దైవదర్శనం చేసుకొని షాపింగ్ చేసే వాళ్ళు.
 మా ఊరు తీర్థాలు  ఇప్పటి అమెజాన్ కి ఏమాత్రం తీసిపోవండోయ్ .... ఇక్కడ దొరకని వస్తువంటూ ఉండదు.... ఇంటి సామాన్లు, వంటసామాన్లు ,వంటి సామాన్లు అన్నీ దొరుకుతాయి ఇక్కడ.

 నేను ముఖ్యంగా  నాకు ఎంతో ఇష్టమైన జీల్లు గురించి మీకు ఇప్పుడు చెప్తాను.
 జీల్లు ఎప్పుడైనా చూశారా.
 అవునులెండి పిజ్జాలు ,చాక్లెట్లు ,కేకులు అలవాటైపోయింది అందరికీ. 
ఇంక జీల్లు గురించి ఏం తెలుస్తుంది.

 జీల్లు చాలా రకాలు ఉన్నాయి  అండి

బెల్లం జీల్లు
పంచదార జీల్లు
వియ్యపురాలి జీల్లు( దీనికి ఆ పేరు ఎందుకు పెట్టారు అని అమ్మని  అడిగితే చిన్న పిల్లవి నీకు ఎందుకు జీల్లు తిను అంది )సైజులు చాలా పెద్దగా ఉంటాయి అందుకే అలా పిలుస్తారు అనుకుంటాను నాకు తెలీదు.....!

 బెల్లం జీల్లు వంటికి ....పంటికి మంచివి అని.... అమ్మ ఉవాచ !


ఈసారి ఊరికి వెళ్లినప్పుడు జీల్లు దొరికితే తినడం మరిచిపొకండి.....

ముఖ్య గమనిక:::: జీల్లు తినప్పుడు  మీ పల్లకీ ఏ విధమైన ఇబ్బంది కలిగిన.... అనగా పల్లు ఊడటం, కదలడం లాంటివి జరిగితే నా బాధ్యత ఏమీ లేదు.🤓

నా ఆలోచన ఏమిటి అంటే...జీల్లు కూడా Amazon ,bigbasket లో పెడితే అందరికీ వీటి గురించి తెలిసే అవకాశం ఉంది🤔🤔....ఏమంటారు

తిమ్మప్ప::: మా నాన్నఅమ్మ గారు మా చిన్నప్పుడు  బద్దకంగా కూర్చుంటే తిమ్మప్ప లా కుర్చునావు అనేవారు.మీకు ఇప్పడు అర్థం అయింది ఎందుకు ఆ పదం వాడేనో......





లోక సమస్త సుఖినో భవంతు

                                                *********** మీ ఉషగిరిధర్ ***********

16, డిసెంబర్ 2020, బుధవారం

అరుగు విలాపం

అరుగు  విలాపం

నా పేరు అరుగు... మీ లో చాలా మంది నన్ను చూసి ఉండరు.గోదావరి జిల్లాల్లో  ఎక్కడ చూసినా   విశాలమైన పెంకుటిల్లు  పెద్దపెద్ద అరుగులతో దర్శనమిస్తాయి.

ఒకప్పుడు నిండా జనం తో ఎంతో సందడిగా ఉన్న మేము ఇప్పుడు ఒంటరి వాల్లం అయిపోయాము.

ఎన్నో సమస్యలు  సృష్టించిన ఘనత పరిష్కరంచూపించిన ఘనత మాది...

ఇప్పుడు ఉన్న 3G ,4G  స్పీడ్ కి ఏ మాత్రం తగ్గని స్పీడ్ మాది... వార్తలు ప్రచారం చేయడంలో..

మేము ముఖ్యంగా మూడు రకాలు...

1.వీధి అరుగు....ఊరి పెద్దలు చేరి కష్ట సుఖాలు చెర్చిచు కోవడానికి చాలా  అనువైన ప్రదేశం. ఇప్పటిలాగా  అప్పటి రోజుల్లో కోర్టులో పోలీస్స్టేషన్లో లేవు కదండీ  ఏ సమస్య అయినా నా దగ్గరే పరిష్కారం అయ్యేది.ఎంతో మంది బాటసారులకు ఆతిధ్యం ఇచ్చిన ఘనత నాది.

2. పెరటి అరుగు ...ఎన్నో పాటలకు పుట్టినిల్లు ఈ పెరటి అరుగు... అప్పగింతల పాట, లక్ష్మీదేవి సారీ, నమశ్శివాయ లు, పార్వతీదేవి ఉపదేశం... ఇంకా ఎన్నో పాటలను ఒక తరం నుంచి మరొక తరానికి అందించిన పాఠశాల కూడా ఈ పెరటి అరుగు .

3.మండువా అరుగు....ఎన్నో పెళ్లిళ్ల కు కళ్యాణ వేదిక ఈ మండువా...పెళ్లి వారికి ఆతిధ్యం ఇచ్చిన ఘనత నాది.ఎన్నో సంతర్పనలు (అంటే  ఇప్పటి బఫే కాదు లెండి) జరిగిన ప్రదేశం ఇది. 
ఒకప్పుడు పిల్లలు చదువు కొనే రీడింగ్ రూమ్ ఇదే....
పిల్లలు ఆడుకొనె (ఆటలు అంటే మీరు ఆడే క్రికెట్ కాదు ....నేల బండ...స్థంబాలాట లాంటివి)ఆటస్థలం ఇది.

ఇలా ఎన్నో తరాలతో అనుభందం ఉన్న మేము ఇప్పుడు ఒంటరి  వాల్లం అయిపోయాము

ఎవరు వీధి అరుగు మీద కుర్చుని కబుర్లు చెప్పుకోవటంలేదు...సెల్ ఫోన్ వచ్చాక

ఎవరు పెరటి అరుగు మీద కుర్చుని  పాటలు  నేర్చుకోవడం లేదు.... టివి సీరియల్స్ వచ్చాక

ఎవరు మండువా అరుగు మీద కూర్చుని సహ పంక్తి బోజనాలు చేయడం లేదు ...బఫే వచ్చాక

అందుకనే మేము ఇలా ఒంటరి వాల్లం అయిపోయాము.

ఈసారి ఊరు వచ్చినప్పుడు ...ఒక గంట మా దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకోండి ..మేము ఎంతో సంతోషిస్తాం.





                                                    లోక సమస్త సుఖినో భవంతు
                                               ******* మీ ఉషగిరిధర్ ***********

14, డిసెంబర్ 2020, సోమవారం

ఓ(తేగ లో)చందమామ ఎంత పని చేసావు

తేగ తెచ్చిన తంట

మా ఊరిలో పొలంలో తేగలపాతర వేసేవారు .
అంటే తాటి టెంక లన్నీ ఒక చోట పాతిపెడతారన్నమాట .
అవి అన్నీ ఊరి తేగలు తయారయ్యాక తంపట వేస్తారు .అంటే ఒక కుండలో తేగలు వేసి చుట్టూ మంట వేస్తే లోపలి తేగలు చక్కగా ఉడుకుతాయన్నమాట .
వాటిలో లావుపాటి తేగలు పోటీపడి ఏరుకొని తినేవాళ్ళం        దానికి తోడు కురిడి కొబ్బరి ముక్క
వాటి రుచి చెప్పక్కర్లేదనుకోండి .

తేగని రెండుగా చీలిస్తే మధ్యలో చందమామని తినొద్దని ,తింటే చదువు రాదనీ చెప్పేవాళ్ళు .
మేం భయపడి తినేవాళ్ళం కాదు .కాని అప్పుడప్పుడు అమ్మ చూడకుండా తిన్న నాకు చదువు కోచం బాగానే అబింది

ఇంతకూ నాకొచ్చిన తంటా ఏవిటంటారా ? అక్కడికే వస్తున్నా !ఈ రోజు మా పాప కి  తేగలు పెట్టా .పెట్టి ఊరుకోకుండా చందమామ తినకూడదు అన్నా .అంతే మొదలైంది నాకు తంటా ...ఎందుకు తినకూడదు ? ఎందుకు చదువు రాదు ? నీకెవరు చెప్పారు ? అంటూ వదలకుండా వెంట పడింది .మా రోజులు కావు కదా పెద్దాళ్ళు చెప్పారు కదాని వినటానికి .పిల్లల దగ్గర నోరు జారితే ప్రతీదానికి రీజన్ చెప్పాల్సి వస్తోంది .ఒక పట్టాన వదలరు నాకు తెలీదని అంటే మరెందుకు చెప్పావ్ అంటూ అందర్లో పరువు తీస్తారు.
సరే ఇక తప్పదు అనుకొని నా మేదో ళక్తి  పదును పెట్టి  కథ మొదలు పెట్టాను

అనగనగా చాలా సంవత్సరాల క్రితం అంటే కొన్ని వందల ఏళ్ల క్రిందట రాసుకోవడానికి పుస్తకాలు ,పేపర్లు ....ఉండేవి కాదు .అప్పుడు తాటి ఆకుల్ని కోసి వాటిపైనే రాసుకోనేవారు .వాటినే తాళపత్ర గ్రంధాలంటారు . అంటే మన పుస్తకం లాగే తాటి ఆకులు కూడా సరస్వతీ దేవి అన్నా మాట .మరి చందమామ మొలిస్తే తాటి చెట్టవుతుంది కదా .అందుకే చందమామ తింటే సరస్వతీ దేవికి కోపం వస్తుంది .చదువు రాదు అందుకే తినొద్దని అంటారన్న మాట .అని చెప్పి ఉపిరి పీల్చుకున్నా.

మాపాప కన్విన్స్ అయ్యింది అని అనిపించింది ...అప్పటి వరకు ఊపిరి బిగబట్టి వింటున్న మా ఆయన .....ఇలా అంతా హాశ్చర్యంగా చూసి నిజమా  ...నాకింతవరకు తెలీదు .....
చిన్నప్పుడు నాకెప్పుడూ చెప్పలేదే ...అంటూ .....ఒకటే ప్రశ్నలు .ఏం చెప్పను నా ఇబ్బంది ?ఇంతలో మా పాప అడిగింది ..నువ్వు చెప్పింది కరక్టే కాని ఇప్పుడు మేం బుక్స్ మీదే రాస్తున్నాంగా ...మేమెందుకు తినకూడదు ? అని .
హా ..........హతవిధీ ......
ఇంతకూ చందమామెందుకు తినకూడదంటారూ? మీకేమైనా తెలుసా ?


                                                     లోక సమస్త సుఖినో భవంతు

                                        *********** మీ ఉషగిరిధర్ ***********

నంది లేని శివాలయం .. నందంపూడి

అందరికి  నమస్కారం  .... 

 శివుడి వాహనం నందీశ్వరుడు అని అందరికీ తెలుసు మనం ఏ శివాలయానికి వెళ్ళిన
                      
                               నందీశ్వర నమస్తుభ్యం మహా నంద ప్రదాయకం
                               మహాదేవస్య సేవ అర్థం అను జ్ఞాంత మర్హసి

 అని ముందు నందీశ్వరునికి నమస్కారం చేసుకుని తరువాత శివుని దర్శనం చేసుకుంటాను
 కానీ నందీశ్వరుడుశ్వరుడు లేని శివాలయం గురించి మీకు తెలుసా ..మా తూర్పుగోదావరి జిల్లాలో  నందంపూడి గ్రామంలో  ఉంది.  బహుశా దేశంలోనే నంది లేని శివాలయం ఇదొక్కటే కావచ్చు
             
                             ఇక్కడ పరమశివుడు రామలింగేశ్వరుడు గా  అమ్మవారు సంతాన పార్వతీదేవిగా పూజలందుకుంటున్నారు.

 ఆలయ చరిత్ర
 
                            త్రేతాయుగంలో పరశురాముడు  ఈ ఆలయాన్ని ప్రతిష్టించినట్లు లింగ పురాణం ద్వారా తెలుస్తోంది ఇక్కడ శివుడు పశ్చిమాభిముఖంగా ఉంటాడు గర్భాలయంలో పానపట్టం ఉండదు ముఖ్యంగా అమ్మవారు గర్భాలయంలో ఉండరు అంతరాలయంలో ఉత్తరాభిముఖంగా ఉంటారు.

 సంతాన పార్వతి అమ్మవారు ప్రతిష్ట 

 పరశురాముడు ఆలయంలో రామలింగేశ్వరుని మాత్రమే  ప్రతిష్టించడం తో  నందంపూడి గ్రామంలో ఆ రోజుల్లో దంపతులు ఎవ్వరికీ సంతానం లేకపోయింది.
 చాలా సంవత్సరాల తర్వాత అమ్మవారిని ప్రతిష్టించడం జరిగింది. తర్వాత నుంచి ఆ గ్రామంలో అందరికీ సంతాన ప్రాప్తి కలిగింది అందుకని అమ్మవారు సంతాన పార్వతి దేవి గా ప్రసిద్ధి చెందారు

 నంది వాహనం ఎందుకు ఉండదు అంటే

 సాధారణంగా ప్రతి శివాలయంలో  పరమేశ్వరుని  అభిముఖంగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు మనం శివ దర్శనానికి ముందు నందీశ్వరుని అనుజ్ఞ తీసుకొని దర్శనం చేసుకుంటాము.

 అయితే నందీశ్వరుడు పరమేశ్వరుని ఒక కోరిక  కోరాడట  తన అనుమతి లేకుండా నేరుగా భక్తులకు   శివ దర్శనం  కలిగించాలని  అందుకనే ఈ ఆలయంలో  నందీశ్వరుడు ఉండదు.అందుకనే  ఈ రామలింగేశ్వరుని భక్తిశ్రద్ధలతో పూజిస్తే  నూరురెట్లు ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
 అందరికీ ఆదిదంపతుల కృపాకటాక్షాలు  కలగాలని కోరుకుంటూ






                                                     లోక సమస్త సుఖినో భవంతు
                                           *********** మీ ఉషగిరిధర్ ***********

13, డిసెంబర్ 2020, ఆదివారం

శరణు.... శరణు....శ్రీనివాస



గోవింద ...గోవింద... అంటు నీ కొండ లెక్క లేదు..
గోవింద ...గోవింద.... అంటు నీ దర్శనం చేయలేదు...

భూమిదేవి పతి అయిన పురుషోత్తముడవి
భూమి మీద నీ బిడ్డల ను రక్ష్యించు....

వాయుసుతు నేలినట్టి వనజనాభుడవే...
ఏ చెడు వాయువు తాకకుండా నీ బిడ్డల ను రక్ష్యించు...

కలియుగ ప్రత్కక్ష్య దైవానివి....
కలి విలయతాండవం ఆపు...

ఆలివేలు మంగమ్మ..... ఆదరించమ్మ
పద్మావతి అమ్మ......పసుపు కుంకుమ లిచ్చి రక్ష్యించు

మీ దర్శనం లేని ఈ శార్వరి నామ సంవత్సర.... 
శున్య నామ సంవత్సర లా ఉంది శ్రీనివాస..


 శరణు.... శరణు....శ్రీనివాస



                      లోక సమస్త సుఖినో భవంతు
*********** మీ ఉషగిరిధర్ ***********

8, డిసెంబర్ 2020, మంగళవారం

శరణు......శరణు.....శంకరా

            

 శివ  నీ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా
 ఎందుకు ఇలా ఆజ్ఞాపించావయ్యా తండ్రి

 శివ నీతాండవం చూసి ఆనందించ గలం కానీ
 ఈ కరోన తాండవం భరించలేం అయ్యా

శివ అని తలవని రోజు లేదు
శివ అని తలవని మనస్సు లేదు

నీ పిల్లలకు ఎందుకు ఇంత పెద్ద పరీక్ష పెట్టావు తండ్రి
ఒక గంగ స్నానంలేదు
ఒక లింగ దర్శనం లేదు

ఓ గంగాధర ఎప్పుడు ని లింగ దర్శనం కలిపిస్తావు
ఇలా అడిగాను అని కొపగించు కోకు....
శంకరా .... శరణు ...శరణు

          లోక సమస్త సుఖినో భవంతు

**** మీ ఉషగిరిధర్ ***********





6, డిసెంబర్ 2020, ఆదివారం

కరోనా ఇయర్స్ ...👂👂


ఒకప్పుడు ఏనుగు చెవులు(ఇయర్స్)ఉంటే అదృష్టవంతులు అనేవాళ్ళు....

ఈ కరోనా ఇయర్స్ అయ్యాక అందరూ అదృష్టవంతులే అయిపోతారు....

మాస్కులు పెట్టుకొని పెట్టుకుని ఏనుగు చెవుల వచ్చేసి మరి...

ఏవంటారు నిజమే కదా 😛😛😛

***మీ ఉషగిరిధర్***