ఉదయాన్నే అల్పాహారం..
మధ్యాహ్నం సుష్టుగా భోజనం..
అదయ్యాక మళ్ళీ రాత్రెప్పుడో రెండోపూట భోజనం.
మరి ఈ మధ్యలో ఉదయం అల్పాహారం లాగానే తినడానికి ఏదన్నా ఉండాలి కదా.
ఈవినింగ్ స్నాక్స్ అని ముద్దుగా పిల్చుకోడానికి రకరకాల వంటకాలున్నాయ్.
నాకు తెలిసి తెలుగువారందరి తొలి ఎంపిక మిరపకాయ బజ్జీ.
వేడివేడిగా కొంచం కమ్మగా మరికొంచం ఖారంగా నోరూరించే బజ్జీలు కనిపిస్తే తినకుండా ఉండగలమా?
మిరపకాయ బజ్జీని చూడగానే 'ఈనాటి ఈబంధమేనాటిదో..'
అని పాడేసుకుంటాను నేను.
అంత అనుబంధం ఉంది నాకీ బజ్జీతో.
నేను మా ఊరి ఎలిమెంటరీ స్కూల్లో చదివేటప్పుడు,
మా బడి పక్కనే పాక హోటలుండేది.
ఉదయం పూట ఇడ్డెన్లూ, మినప రొట్లూ, సర్వకాల సర్వావస్థల్లోనూ టీ, కాఫీలూ అమ్మేవాళ్ళక్కడ.
మధ్యాహ్నం బళ్ళో మేం లెక్కలు చేసుకుంటుండగానే బజ్జీలు వేగుతున్న వాసన ముక్కుకి తగిలి నోట్లో నీళ్లూరేవి.
ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఐదేళ్ళ పాటు కేవలం ఆ వాసన పీల్చి సంతృప్తి పడ్డాను నేను.
నాదగ్గర డబ్బులుండేవి.
ఇంట్లో డిబ్బీలో కూడా డబ్బులుండేవి నాకు.
కానీ ఏం లాభం, బయట ఏమీ కొనుక్కోరాదని ఇంట్లో ఆర్డర్.
తెగించి కొనుక్కున్నా, ఐదో నిమిషంలో ఆ విషయం ఇంట్లో తెలిసిపోతుంది.
ఇంట్లో అమ్మ అప్పుడప్పుడూ బజ్జీలేసేది.
ఎందుకో గానీ పాక హోటలు బజ్జీల్లో కనిపించే సొగసు వీటికి ఉండేది కాదు.
అందని బజ్జీలదే అందం.
తినగలిగినన్ని బజ్జీలని ఇష్టంగా తిన్నది కాలేజీ రోజుల్లో.
కాలేజీ దగ్గర రాముడి బజ్జీల కొట్టు ఉండేది.
ఆయన బంధువెవరో వేగిస్తూ ఉంటే,
ఈయన చకచకా ఒక్కో బజ్జీనీ నిలువుగా చీరి, కారం కలిపిన ఉల్లిపాయ ముక్కలు కూరి, పైన నిమ్మరసం పిండి, అందంగా ఓ కాగితంలో పెట్టి మాకు అందించేసే వాడు.
మిర్చి బజ్జి , వంకాయ బజ్జి , టమోటా బజ్జి ....
వీటితో పాటు అరటికాయ , ఆలు కూడ ఉండేవి ...
నేను ఎప్పుడు ముందు వంకాయ బజ్జి ప్రాముఖ్యత ఇచ్చేదానిని ....
కానీ మిత్రులు మాత్రం మిర్చి బజ్జి కి ప్రాముఖ్యత ఇచ్చేవారు ..
లెక్చరర్లందరూ మా బుర్రల్లో దూరి మరీ పాఠాలు చెప్పెసేవాళ్ళేమో,
క్లాసులయ్యేసరికి కడుపు ఖాళీ అయిపోయేది.
అందరం కలిసి బజ్జీల కొట్టు మీద దండయాత్ర.
ఎప్పుడన్నా తొలి వాయి నాలుగు బజ్జీలూ ఖాళీ చేసేశాక,
అన్ని తలో ఒకటి రుచి చేసి నెమ్మదిగా ఇంటికి సైకిల్ లు ఎక్కి బయలుదేరేవాళ్ళం
కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు, ఆ ఆఫీసు కాంటీన్ లో బజ్జీల ఉండేది.
ఓ సాయంత్రం సన్నగా చినుకులు పడుతుండగా,
ఇంటికెళ్లబోతూ "బజ్జీలు తిందామాండీ?" అనడిగా కొలీగుని.
మా కొలీగుకి కూడా బజ్జి లమీద మక్కువ ఉండటంతో ...
ఆ కంపెనీ లో పని చేసినన్ని రోజులు బాగానే తినేవాళ్ళం ...
కానీ ఏ మాట కా మాట చెప్పుకోవాలి రాముడి బజ్జీల రుచి వీటికి లేదు !!!!
రాన్రాను ఆ ఆనందం కూడా లేకుండా పోయింది. ........
కొత్త కంపెనీ కాంటీన్ లో బజ్జీలు ... మెనూ లో లేవు
ఈ కరోనా టైం లో బైట వి తినకూడదు అని ఒక పక్క .........
కారానికో ఏమో కానీ బజ్జీ తినగానే కడుపు మండుతుంటే ఎసిడిటీ ఏమోనని అనుమానించడం,
డాక్టరిచ్చే సుదీర్ఘ ఉపన్యాసాలు వినడం వల్ల, సరిగ్గా వేడి వేడి బజ్జీని కొరికే వేళ అవి గుర్తు రావడం..
ఇలా బజ్జీ అంటే ఇష్టం బదులుగా భయం మొదలవుతోందేమో అనిపిస్తోంది అప్పుడప్పుడూ.. '
భూమి గుండ్రంగా ఉంటుంది' అనే మాట చాలా సార్లు విన్నాను నేను.
మిరపకాయ బజ్జీకి అన్వయించుకుంటే నిజమే అనిపిస్తోంది..
ఎదురుగా బజ్జీలు నోరూరిస్తున్నా తినలేకపోవడం, చిన్నప్పుడూ, ఇప్పుడూ కూడా...
భయం వేస్తోది కదా అని తినడం ఏమి మానలేము కదా చిన్నప్పటి నుంచి చాల ప్రియమైన ఈవినింగ్ స్నాక్స...
కొన్ని జాగరతలు తీసుకుంటూ తినేయడమే....😃😃😃😃







