Pages

31, మే 2021, సోమవారం

బామ్మ రాక్స్ .... మేనేజర్ షాక్

 వర్క్ ఫ్రం హోం లో భాగంగా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంటినుంచి రోజుకు 20 గంటలు పనిచేస్తున్నాడు..

అయినా వాళ్ళ ప్రాజెక్ట్ మానేజర్ సంతృప్తి చెందడం లేదు..

మీటింగ్ మధ్యలో వచ్చే ఇంటి శబ్దాలూ....
పిల్లల అరుపులు......
తల్లి మధ్య మధ్యలో ఇచ్చే కాఫీ......
ఇంకా పడుకోలేదా అంటూ నాయనమ్మ గబాల్న మీటింగు మధ్యలో రూం లోకి రావడం ఇవన్నీ ఆ ప్రాజెక్ట్ మానేజర్ కు చికాకు తెప్పిస్తున్నాయి..

 ఆదివారం సాఫ్ట్వేర్ ఉద్యోగులకు జనరల్ గా సెలవే కానీ ....
ప్రాజెక్ట్ మానేజర్ ఉదయం 7 గంటలకే లైన్లోకి వచ్చేశాడు..
వచ్చేముందే చెప్పాడు ' ఇంట్లో నాయిస్ ' లేకుండా చూసుకో అని..
అబ్బే అస్సలు ఉపయోగం లేదు..ఇంట్లో ఎవరి గోల వాళ్ళదే..

మానేజర్ కొద్దిగా ఇరిటెడ్ అయ్యి
" ఆల్రెడీ చెప్పానుగా " నాయిస్ లేకుండా చూసుకోమని అని మొహం మాడ్చేసుకున్నాడు..
ఆ మాట బామ్మగారు వినేసి "ఒరే నేను మీ మానేజర్ తో ఒకసారి మాట్లాడతా అన్నది"..

అసలే ముక్కోపి పైగా టెన్షన్ లో ఉన్నాడు ......
ఆ మానేజర్ ఇప్పుడు ఈ మాట వింటే నిప్పు తొక్కిన కోతి అవుతాడని ..
వద్దులే నానమ్మా అన్నాడు మనోడు..
కానీ వాడి దురదృష్టవశాత్తూ మైక్ అన్-మ్యూట్ అయ్యుంది మానేజర్ బామ్మగారి మాట వినేశాడు.. ఏకళ నున్నాడో గానీ ' 

ఇదిగో ఆ బామ్మగారు నాతో ఏదో మాట్లాడతానని అంటున్నారు కదా!!
ఒకసారి ఆవిడ చేత మాట్లాడించు ' అన్నాడా మానేజర్..

అప్పుడే కబాసుర కషాయం తాగిందేమో బామ్మగారి గొంతు ఖంగున మోగింది..
ఒరే నువ్వా కుర్చీలోంచి ఇవతలకిరా అంటూ మానవాడ్ని పక్కకు తోసి మానేజర్ తో సంభాషణ మొదలు పెట్టింది పెద్దావిడ..

ఇదిగో మానేజరూ .. ముందుగా నమస్తే..
నువ్వు చూడబోతే బాగా అప్ సెట్ అయినట్టు ఉన్నావు నేను నీకు ఏమైనా హెల్ప్ చేయగలనా?????
అడిగారు పెద్దావిడ..

ఏం లేదమ్మా మీటింగ్ జరుగుతున్నప్పుడు మీ ఇంట్లో కొద్దిగా శబ్ధం ఎక్కువతుంది.....
దానివలన మా ఏకాగ్రత దెబ్బతింటుంది ఇదే మాసమస్య అన్నాడాయన..

నాయనమ్మ చిన్నగా నవ్వి ఒక్క 10 నిమిషాలు నీ టైమ్ నాకిస్తావా నాయనమ్మని కదా చిన్న కధ చెప్తా అన్నది..

పెద్దావిడ పైగా కొద్దిగా రిలీఫ్ గా కూడా ఉంటుంది..
తర్వాత ఆవిడని కన్విన్స్ చేసి disturbance లేకుండా కూడా చూసుకోవచ్చు అని మానేజర్ ఓకే చెప్పాడు..

నానమ్మ కధ మొదలు పెట్టింది..

"ఒక మాంచి మానేజర్ ప్రశాంతత కోసం ధ్యానం చేసుకుందామని ఊరి చివర చెట్టు కిందకి వెళ్ళి కూర్చుని కళ్ళు మూసుకొని ధ్యానం మొదలెట్టగానే చిటారు కొమ్మనున్న కోయిల కూయడం మొదలెట్టింది..

ఈయన ధ్యానానికి ఇబ్బందయింది..కోపంతో కోయిలను అడిగాడు..
కాసేపు కూయడం ఆపుతావా?? నాకు ధ్యానానికి ఇబ్బందిగా ఉంది అని..

కోయిల రెట్టించిన గొంతుతో మరోసారి కూ అని కూసి  ' అరే అబ్బీ నువ్వు నా ఇంటికొచ్చావు..ఇక్కడ ఇలానే ఉంటుంది..నేను ఆపితే మిగతా పక్షులు రాగాలు తీస్తాయి..నేనేమీ నీ ఇంటికొచ్చి కిలకిలలు చేయడం లేదు.. 

నీకిష్టం లేకపోతే వెళ్లిపోవచ్చు అనేసింది..పాపం దానికి తెలియదు కదా!!
అతను పే...ద్ద మానేజర్ అని..

నానమ్మ నవ్వుతూ ముగింపు టచ్ ఇవ్వడానికి గొంతు సవరించుకుంది..

బాబూ మేము మీ ఆఫీస్ కు వచ్చి మీ పని కి ఆటంకం కలిగించామా?? లేదు కదా!!..

ఇల్లు అంటే ఇలానే ఉంటుంది నాయనా!!
ఇంట్లోని మేమంతా సహకరించబట్టే మీ కార్పోరేట్ కార్యకలాపాలు మా ఇళ్ళలోంచి కూడా సజావుగా సాగుతున్నాయి కనుక మీరే అడ్జస్ట్ కావాలి అంటూ మేనేజర్ వంక చూసింది..

లాప్టాప్ లో కెమెరా బాగా పని చేస్తుందేమో!!..
నానమ్మ గారి మొహంలో వెటకారం.......
చిరు కోపం అన్నీ చూసిన మానేజర్ కు జ్ణానోదయం అయింది..

ముందు చిన్నగా మొదలైన నవ్వు 30 సెకన్లలో పెద్దదయింది..

నానమ్మగారూ మీ సందేశం అర్ధమైంది.....
మీ రాజ్యంలో మీరే క్వీన్.....
మీ మాటే శిరోదార్యం ఇకపై మేమే ఒళ్ళు దగ్గరపెట్టుకొని
" చెట్టు కింద ధ్యానం చేసుకుంటాం" అలాగే వర్క్ ఫ్రం హోం కూడా చేసుకుంటాం..
అంటూ ఒక నమస్కారం పెట్టి మీటింగ్ ముగించాడు..


బామ్మా రాక్స్ .... మేనేజర్ షాక్ !!!!!!!!!!!!




1 కామెంట్‌: