Pages

3, జూన్ 2021, గురువారం

దోశాయణం

గుండ్రంగా ఉండే వాటిని గురించి తల్చుకోమంటే కొందరికి భూమాత గుర్తు రావచ్చు కానీ, ఎక్కువమందికి మొదట గుర్తొచ్చేది దోశే అవుతుంది. 

అవును మరి, ఎన్ని రకాలుగా తినొచ్చు అసలూ... 

వేడి వేడిగా, చల్ల చల్లగా, మెత్త మెత్తగా, కరకర్లాడుతూ... 

చట్నీతో, సాంబారుతో, సంబారు కారంతో ఇంకా పంచదారతో. 

నూనె పోసుకుని కాల్చుకుని, నూనె లేకుండా కాల్చుకునీ... 

ఎప్పుడు తినొచ్చూ అంటే... ఎప్పుడైనా తినేయచ్చు. 

ఉదయం బ్రేక్ఫాస్ట్ మొదలుకుని, 

మధ్యాహ్నం లంచికి బదులు, 

రాత్రి బోయినానికి బదులుగానూ కూడా ఆరగించగల దక్షిణ భారతదేశపు వంటకం ఇది.


దోశ అసలు పేరు దోసై అట.. 

దీని వెనుక ఓ కథ కూడా ఉంది. 

నేను చదివిన ఆ కథ ఏమిటీ అంటే.. 


"అనగనగా ఓ రాజు గారు.

ఆయనకి ఉదయాన్నే ఇడ్డెన్లు ఉంటే చాలు.. ఇంకేమీ అక్కర్లేదు. 

చట్నీలు, కారప్పొడి, సాంబారు... వీటన్నింటి తోనూ తలో నాలుగూ భోంచేసి బ్రేక్ఫాస్ట్ అయిందీ అనిపిస్తారు. 

పాపం, వంటవాడికి విసుగ్గా ఉన్నా తినేది రాజు గారు కాబట్టి, రోజూ రుచికరంగా వండి వడ్డించక తప్పదు. 

ఒకరోజు, ఓ చిన్న పొరపాటు వల్ల ఇడ్లీ పిండిలో నీళ్ళు కలిసిపోయి పల్చగా అయిపోతుంది.

ఓ పక్క రాజు గారు భోజన శాలకి వస్తున్నట్టు కబురు వచ్చేసింది. 

అప్పటికప్పుడు ఏం చేయడానికీ తోచక, ఓ రేకు కాల్చి దానిమీద ఈ పల్చని పిండి పోయగానే 'సుయ్' మని శబ్దం వస్తుంది.. 

తిరగేసినప్పుడు మళ్ళీ అదే శబ్దం.. 

శిరశ్చేధానికి సిద్ధపడిపోయిన వంటవాడు, శిక్ష తగ్గక పోతుందా అన్న ఆశతో, ఆ కొత్త వంటకం రాజుకి వడ్డిస్తాడు. 

వంటవాడి అదృష్టం బాగుండి రాజుగారికి ఆ వంటకం మహా నచ్చేసి, దాని పేరు ఏమిటని అడుగుతాడు. 

వంటవాడికి రెండు సార్లు సుయ్ మన్న శబ్దం గుర్తొచ్చి, 'దోసై' అంటాడు. 

ఆవేల్టి నుంచీ ఆస్థాన టిఫిన్ గా స్థిరపడ్డ దోసై రాన్రానూ దోశ గా పేరు మార్చుకుందన్న మాట."


దోశల్లో రకాలు కేవలం కాల్చడాన్ని బట్టి మాత్రమే కాక, వాడే పిండిని బట్టీ, మధ్యలో చేర్చే 'స్టఫ్' బట్టీ,వేసే  సైజు ని బట్టి  కూడా మారిపోతూ ఉంటాయి. 

మన అచ్చతెలుగు పెసరట్టుని కాసేపు పక్కన పెట్టి - అవసరమైతే ఈ అట్టుని గురించి ప్రత్యేకం మాట్లాడుకుందాం ఎప్పుడైనా - 

కేవలం దొశలనే తీసుకున్నా సాదా, ఉల్లి, మసాలా ఇలా ఎన్ని రకాలో.

వంట చెయ్యడమే ఒక కళ అనుకుంటే, అందులో దోశలు కాల్చడం మరో ఉప కళ. 

మంచి పెనాన్ని ఎంచుకుని, మరీ ఎక్కువగానూ తక్కువగానూ కాకుండా వేడెక్క నిచ్చి, ఫ్రిజ్ నుంచి నార్మల్ టెంపరేచర్ కి వచ్చిన పిండి ని గరిట తో తీసి, కళాత్మకంగా తిప్పేసి, తిరగేస్తే దోశ రెడీ.


'మాడిపోయిన మసాలా దోశ' అన్నది ఇప్పుడో మంచి తిట్టుగా చెలామణీ అవుతోంది.

దీని నుంచి తెలుసుకోవాల్సింది ఏమిటీ అంటే, దోశ మాడిపోకూడదు. 

అసలు పొగలు కక్కుతూ, బంగారు వర్ణంలో మెరిసిపోయే దోశని చూడగానే ఆకలి, ఆదిశేషుడి లాగా పడగ విప్పుకోదూ? 

ఇక, చట్నీల్లోకి వస్తే..దోశ లోకి అన్ని రకాల చట్నీలూ పనికిరావు. 

 ప్రత్యేకంగా, కమ్మగా, కొంచం కారంగా ఉండాలి.. సాంబారు అయితే పొగలు సెగలుగా ఉండాలి. 

అప్పుడైతేనే దోశ కి రుచి పెరుగుతుంది మరి. పంచదారతో పిల్లలే కాదు, కొందరు పెద్దవాళ్ళూ తింటారు దోశని.


కొన్ని కొన్ని హోటళ్ళు, రెస్టారెంట్లు దోశలకి బాగా ఫేమస్. 

భాగ్యనగర వాసులలో దోశ ప్రియులు 'చట్నీస్' దోశని రుచి చూసే ఉంటారు. 

ఇవి మాత్రమేనా... ఉడిపి హోటళ్ళ మొదలు, గోదారొడ్డున రావి చెట్టుకింద ఉండే పుల్లట్ల 'ఒటేళ్ళ' వరకూ ఎవరి దోశ వాళ్ళదే. 

ఒక్కొక్కరి దోశదీ ఒక్కో ప్రత్యేకత.

 అన్నట్టు, 'అందాల రాముడు' మొదలు 'గోదావరి' వరకూ చాలా సినిమాల్లో అట్లమ్మిలు తగుమాత్రం పాత్ర పోషించారు. 

 ఏతా వాతా చెప్పొచ్చేది ఏమిటంటే... దోశని ఎంతమాత్రం చిన్నచూపు చూడకండి.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి