Pages

15, జూన్ 2021, మంగళవారం

బజ్జీతో అనుబంధం

ఉదయాన్నే అల్పాహారం..
మధ్యాహ్నం సుష్టుగా భోజనం..
అదయ్యాక మళ్ళీ రాత్రెప్పుడో రెండోపూట భోజనం.

మరి ఈ మధ్యలో ఉదయం అల్పాహారం లాగానే తినడానికి ఏదన్నా ఉండాలి కదా. 
ఈవినింగ్ స్నాక్స్ అని ముద్దుగా పిల్చుకోడానికి రకరకాల వంటకాలున్నాయ్. 

నాకు తెలిసి తెలుగువారందరి తొలి ఎంపిక మిరపకాయ బజ్జీ. 

వేడివేడిగా కొంచం కమ్మగా మరికొంచం ఖారంగా నోరూరించే బజ్జీలు కనిపిస్తే తినకుండా ఉండగలమా? 


మిరపకాయ బజ్జీని చూడగానే 'ఈనాటి ఈబంధమేనాటిదో..'
అని పాడేసుకుంటాను నేను. 
అంత అనుబంధం ఉంది నాకీ బజ్జీతో. 


నేను మా ఊరి ఎలిమెంటరీ స్కూల్లో చదివేటప్పుడు,
మా బడి పక్కనే  పాక హోటలుండేది. 
ఉదయం పూట ఇడ్డెన్లూ, మినప రొట్లూ, సర్వకాల సర్వావస్థల్లోనూ టీ, కాఫీలూ అమ్మేవాళ్ళక్కడ. 
మధ్యాహ్నం బళ్ళో మేం లెక్కలు చేసుకుంటుండగానే బజ్జీలు వేగుతున్న వాసన ముక్కుకి తగిలి నోట్లో నీళ్లూరేవి.


ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఐదేళ్ళ పాటు కేవలం ఆ వాసన పీల్చి సంతృప్తి పడ్డాను నేను. 

నాదగ్గర డబ్బులుండేవి.
ఇంట్లో డిబ్బీలో కూడా డబ్బులుండేవి నాకు.
కానీ ఏం లాభం, బయట ఏమీ కొనుక్కోరాదని ఇంట్లో ఆర్డర్. 
తెగించి కొనుక్కున్నా, ఐదో నిమిషంలో ఆ విషయం ఇంట్లో తెలిసిపోతుంది. 
ఇంట్లో అమ్మ అప్పుడప్పుడూ బజ్జీలేసేది.
ఎందుకో గానీ పాక హోటలు బజ్జీల్లో కనిపించే సొగసు వీటికి ఉండేది కాదు.
అందని బజ్జీలదే అందం.


తినగలిగినన్ని బజ్జీలని ఇష్టంగా తిన్నది కాలేజీ రోజుల్లో. 

కాలేజీ దగ్గర  రాముడి  బజ్జీల కొట్టు ఉండేది.
ఆయన బంధువెవరో వేగిస్తూ ఉంటే, 

ఈయన చకచకా ఒక్కో బజ్జీనీ నిలువుగా చీరి, కారం కలిపిన ఉల్లిపాయ ముక్కలు కూరి, పైన నిమ్మరసం పిండి, అందంగా ఓ కాగితంలో పెట్టి మాకు అందించేసే వాడు. 

మిర్చి బజ్జి , వంకాయ బజ్జి , టమోటా బజ్జి ....

వీటితో పాటు అరటికాయ , ఆలు కూడ ఉండేవి ... 

నేను ఎప్పుడు ముందు వంకాయ బజ్జి ప్రాముఖ్యత  ఇచ్చేదానిని ....
కానీ మిత్రులు మాత్రం మిర్చి బజ్జి కి ప్రాముఖ్యత ఇచ్చేవారు .. 


లెక్చరర్లందరూ మా బుర్రల్లో దూరి మరీ పాఠాలు చెప్పెసేవాళ్ళేమో,
క్లాసులయ్యేసరికి కడుపు ఖాళీ అయిపోయేది. 
అందరం కలిసి బజ్జీల కొట్టు మీద  దండయాత్ర.
ఎప్పుడన్నా తొలి వాయి నాలుగు బజ్జీలూ ఖాళీ చేసేశాక,
అన్ని తలో ఒకటి రుచి చేసి   నెమ్మదిగా  ఇంటికి సైకిల్ లు ఎక్కి బయలుదేరేవాళ్ళం 


కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు, ఆ ఆఫీసు కాంటీన్ లో  బజ్జీల ఉండేది.
ఓ సాయంత్రం సన్నగా చినుకులు పడుతుండగా,
ఇంటికెళ్లబోతూ "బజ్జీలు తిందామాండీ?" అనడిగా కొలీగుని. 

మా కొలీగుకి కూడా బజ్జి లమీద మక్కువ ఉండటంతో ...
ఆ కంపెనీ లో పని చేసినన్ని రోజులు 
బాగానే తినేవాళ్ళం ...
కానీ ఏ మాట కా మాట చెప్పుకోవాలి రాముడి  బజ్జీల రుచి వీటికి లేదు !!!!


రాన్రాను ఆ ఆనందం కూడా లేకుండా పోయింది. ........

కొత్త కంపెనీ కాంటీన్ లో  బజ్జీలు ... మెనూ లో లేవు 

ఈ కరోనా టైం లో బైట వి తినకూడదు అని ఒక పక్క .........
కారానికో ఏమో కానీ బజ్జీ తినగానే కడుపు మండుతుంటే ఎసిడిటీ ఏమోనని అనుమానించడం,

డాక్టరిచ్చే సుదీర్ఘ ఉపన్యాసాలు వినడం వల్ల, సరిగ్గా వేడి వేడి బజ్జీని కొరికే వేళ అవి గుర్తు రావడం.. 

ఇలా బజ్జీ అంటే ఇష్టం బదులుగా భయం మొదలవుతోందేమో అనిపిస్తోంది అప్పుడప్పుడూ.. '

భూమి గుండ్రంగా ఉంటుంది' అనే మాట చాలా సార్లు విన్నాను నేను. 

మిరపకాయ బజ్జీకి అన్వయించుకుంటే నిజమే అనిపిస్తోంది..
ఎదురుగా బజ్జీలు నోరూరిస్తున్నా తినలేకపోవడం, చిన్నప్పుడూ, ఇప్పుడూ కూడా...


భయం వేస్తోది కదా అని తినడం ఏమి మానలేము కదా చిన్నప్పటి నుంచి చాల ప్రియమైన ఈవినింగ్ స్నాక్స... 

కొన్ని జాగరతలు తీసుకుంటూ తినేయడమే....😃😃😃😃




3, జూన్ 2021, గురువారం

దోశాయణం

గుండ్రంగా ఉండే వాటిని గురించి తల్చుకోమంటే కొందరికి భూమాత గుర్తు రావచ్చు కానీ, ఎక్కువమందికి మొదట గుర్తొచ్చేది దోశే అవుతుంది. 

అవును మరి, ఎన్ని రకాలుగా తినొచ్చు అసలూ... 

వేడి వేడిగా, చల్ల చల్లగా, మెత్త మెత్తగా, కరకర్లాడుతూ... 

చట్నీతో, సాంబారుతో, సంబారు కారంతో ఇంకా పంచదారతో. 

నూనె పోసుకుని కాల్చుకుని, నూనె లేకుండా కాల్చుకునీ... 

ఎప్పుడు తినొచ్చూ అంటే... ఎప్పుడైనా తినేయచ్చు. 

ఉదయం బ్రేక్ఫాస్ట్ మొదలుకుని, 

మధ్యాహ్నం లంచికి బదులు, 

రాత్రి బోయినానికి బదులుగానూ కూడా ఆరగించగల దక్షిణ భారతదేశపు వంటకం ఇది.


దోశ అసలు పేరు దోసై అట.. 

దీని వెనుక ఓ కథ కూడా ఉంది. 

నేను చదివిన ఆ కథ ఏమిటీ అంటే.. 


"అనగనగా ఓ రాజు గారు.

ఆయనకి ఉదయాన్నే ఇడ్డెన్లు ఉంటే చాలు.. ఇంకేమీ అక్కర్లేదు. 

చట్నీలు, కారప్పొడి, సాంబారు... వీటన్నింటి తోనూ తలో నాలుగూ భోంచేసి బ్రేక్ఫాస్ట్ అయిందీ అనిపిస్తారు. 

పాపం, వంటవాడికి విసుగ్గా ఉన్నా తినేది రాజు గారు కాబట్టి, రోజూ రుచికరంగా వండి వడ్డించక తప్పదు. 

ఒకరోజు, ఓ చిన్న పొరపాటు వల్ల ఇడ్లీ పిండిలో నీళ్ళు కలిసిపోయి పల్చగా అయిపోతుంది.

ఓ పక్క రాజు గారు భోజన శాలకి వస్తున్నట్టు కబురు వచ్చేసింది. 

అప్పటికప్పుడు ఏం చేయడానికీ తోచక, ఓ రేకు కాల్చి దానిమీద ఈ పల్చని పిండి పోయగానే 'సుయ్' మని శబ్దం వస్తుంది.. 

తిరగేసినప్పుడు మళ్ళీ అదే శబ్దం.. 

శిరశ్చేధానికి సిద్ధపడిపోయిన వంటవాడు, శిక్ష తగ్గక పోతుందా అన్న ఆశతో, ఆ కొత్త వంటకం రాజుకి వడ్డిస్తాడు. 

వంటవాడి అదృష్టం బాగుండి రాజుగారికి ఆ వంటకం మహా నచ్చేసి, దాని పేరు ఏమిటని అడుగుతాడు. 

వంటవాడికి రెండు సార్లు సుయ్ మన్న శబ్దం గుర్తొచ్చి, 'దోసై' అంటాడు. 

ఆవేల్టి నుంచీ ఆస్థాన టిఫిన్ గా స్థిరపడ్డ దోసై రాన్రానూ దోశ గా పేరు మార్చుకుందన్న మాట."


దోశల్లో రకాలు కేవలం కాల్చడాన్ని బట్టి మాత్రమే కాక, వాడే పిండిని బట్టీ, మధ్యలో చేర్చే 'స్టఫ్' బట్టీ,వేసే  సైజు ని బట్టి  కూడా మారిపోతూ ఉంటాయి. 

మన అచ్చతెలుగు పెసరట్టుని కాసేపు పక్కన పెట్టి - అవసరమైతే ఈ అట్టుని గురించి ప్రత్యేకం మాట్లాడుకుందాం ఎప్పుడైనా - 

కేవలం దొశలనే తీసుకున్నా సాదా, ఉల్లి, మసాలా ఇలా ఎన్ని రకాలో.

వంట చెయ్యడమే ఒక కళ అనుకుంటే, అందులో దోశలు కాల్చడం మరో ఉప కళ. 

మంచి పెనాన్ని ఎంచుకుని, మరీ ఎక్కువగానూ తక్కువగానూ కాకుండా వేడెక్క నిచ్చి, ఫ్రిజ్ నుంచి నార్మల్ టెంపరేచర్ కి వచ్చిన పిండి ని గరిట తో తీసి, కళాత్మకంగా తిప్పేసి, తిరగేస్తే దోశ రెడీ.


'మాడిపోయిన మసాలా దోశ' అన్నది ఇప్పుడో మంచి తిట్టుగా చెలామణీ అవుతోంది.

దీని నుంచి తెలుసుకోవాల్సింది ఏమిటీ అంటే, దోశ మాడిపోకూడదు. 

అసలు పొగలు కక్కుతూ, బంగారు వర్ణంలో మెరిసిపోయే దోశని చూడగానే ఆకలి, ఆదిశేషుడి లాగా పడగ విప్పుకోదూ? 

ఇక, చట్నీల్లోకి వస్తే..దోశ లోకి అన్ని రకాల చట్నీలూ పనికిరావు. 

 ప్రత్యేకంగా, కమ్మగా, కొంచం కారంగా ఉండాలి.. సాంబారు అయితే పొగలు సెగలుగా ఉండాలి. 

అప్పుడైతేనే దోశ కి రుచి పెరుగుతుంది మరి. పంచదారతో పిల్లలే కాదు, కొందరు పెద్దవాళ్ళూ తింటారు దోశని.


కొన్ని కొన్ని హోటళ్ళు, రెస్టారెంట్లు దోశలకి బాగా ఫేమస్. 

భాగ్యనగర వాసులలో దోశ ప్రియులు 'చట్నీస్' దోశని రుచి చూసే ఉంటారు. 

ఇవి మాత్రమేనా... ఉడిపి హోటళ్ళ మొదలు, గోదారొడ్డున రావి చెట్టుకింద ఉండే పుల్లట్ల 'ఒటేళ్ళ' వరకూ ఎవరి దోశ వాళ్ళదే. 

ఒక్కొక్కరి దోశదీ ఒక్కో ప్రత్యేకత.

 అన్నట్టు, 'అందాల రాముడు' మొదలు 'గోదావరి' వరకూ చాలా సినిమాల్లో అట్లమ్మిలు తగుమాత్రం పాత్ర పోషించారు. 

 ఏతా వాతా చెప్పొచ్చేది ఏమిటంటే... దోశని ఎంతమాత్రం చిన్నచూపు చూడకండి.





31, మే 2021, సోమవారం

బామ్మ రాక్స్ .... మేనేజర్ షాక్

 వర్క్ ఫ్రం హోం లో భాగంగా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంటినుంచి రోజుకు 20 గంటలు పనిచేస్తున్నాడు..

అయినా వాళ్ళ ప్రాజెక్ట్ మానేజర్ సంతృప్తి చెందడం లేదు..

మీటింగ్ మధ్యలో వచ్చే ఇంటి శబ్దాలూ....
పిల్లల అరుపులు......
తల్లి మధ్య మధ్యలో ఇచ్చే కాఫీ......
ఇంకా పడుకోలేదా అంటూ నాయనమ్మ గబాల్న మీటింగు మధ్యలో రూం లోకి రావడం ఇవన్నీ ఆ ప్రాజెక్ట్ మానేజర్ కు చికాకు తెప్పిస్తున్నాయి..

 ఆదివారం సాఫ్ట్వేర్ ఉద్యోగులకు జనరల్ గా సెలవే కానీ ....
ప్రాజెక్ట్ మానేజర్ ఉదయం 7 గంటలకే లైన్లోకి వచ్చేశాడు..
వచ్చేముందే చెప్పాడు ' ఇంట్లో నాయిస్ ' లేకుండా చూసుకో అని..
అబ్బే అస్సలు ఉపయోగం లేదు..ఇంట్లో ఎవరి గోల వాళ్ళదే..

మానేజర్ కొద్దిగా ఇరిటెడ్ అయ్యి
" ఆల్రెడీ చెప్పానుగా " నాయిస్ లేకుండా చూసుకోమని అని మొహం మాడ్చేసుకున్నాడు..
ఆ మాట బామ్మగారు వినేసి "ఒరే నేను మీ మానేజర్ తో ఒకసారి మాట్లాడతా అన్నది"..

అసలే ముక్కోపి పైగా టెన్షన్ లో ఉన్నాడు ......
ఆ మానేజర్ ఇప్పుడు ఈ మాట వింటే నిప్పు తొక్కిన కోతి అవుతాడని ..
వద్దులే నానమ్మా అన్నాడు మనోడు..
కానీ వాడి దురదృష్టవశాత్తూ మైక్ అన్-మ్యూట్ అయ్యుంది మానేజర్ బామ్మగారి మాట వినేశాడు.. ఏకళ నున్నాడో గానీ ' 

ఇదిగో ఆ బామ్మగారు నాతో ఏదో మాట్లాడతానని అంటున్నారు కదా!!
ఒకసారి ఆవిడ చేత మాట్లాడించు ' అన్నాడా మానేజర్..

అప్పుడే కబాసుర కషాయం తాగిందేమో బామ్మగారి గొంతు ఖంగున మోగింది..
ఒరే నువ్వా కుర్చీలోంచి ఇవతలకిరా అంటూ మానవాడ్ని పక్కకు తోసి మానేజర్ తో సంభాషణ మొదలు పెట్టింది పెద్దావిడ..

ఇదిగో మానేజరూ .. ముందుగా నమస్తే..
నువ్వు చూడబోతే బాగా అప్ సెట్ అయినట్టు ఉన్నావు నేను నీకు ఏమైనా హెల్ప్ చేయగలనా?????
అడిగారు పెద్దావిడ..

ఏం లేదమ్మా మీటింగ్ జరుగుతున్నప్పుడు మీ ఇంట్లో కొద్దిగా శబ్ధం ఎక్కువతుంది.....
దానివలన మా ఏకాగ్రత దెబ్బతింటుంది ఇదే మాసమస్య అన్నాడాయన..

నాయనమ్మ చిన్నగా నవ్వి ఒక్క 10 నిమిషాలు నీ టైమ్ నాకిస్తావా నాయనమ్మని కదా చిన్న కధ చెప్తా అన్నది..

పెద్దావిడ పైగా కొద్దిగా రిలీఫ్ గా కూడా ఉంటుంది..
తర్వాత ఆవిడని కన్విన్స్ చేసి disturbance లేకుండా కూడా చూసుకోవచ్చు అని మానేజర్ ఓకే చెప్పాడు..

నానమ్మ కధ మొదలు పెట్టింది..

"ఒక మాంచి మానేజర్ ప్రశాంతత కోసం ధ్యానం చేసుకుందామని ఊరి చివర చెట్టు కిందకి వెళ్ళి కూర్చుని కళ్ళు మూసుకొని ధ్యానం మొదలెట్టగానే చిటారు కొమ్మనున్న కోయిల కూయడం మొదలెట్టింది..

ఈయన ధ్యానానికి ఇబ్బందయింది..కోపంతో కోయిలను అడిగాడు..
కాసేపు కూయడం ఆపుతావా?? నాకు ధ్యానానికి ఇబ్బందిగా ఉంది అని..

కోయిల రెట్టించిన గొంతుతో మరోసారి కూ అని కూసి  ' అరే అబ్బీ నువ్వు నా ఇంటికొచ్చావు..ఇక్కడ ఇలానే ఉంటుంది..నేను ఆపితే మిగతా పక్షులు రాగాలు తీస్తాయి..నేనేమీ నీ ఇంటికొచ్చి కిలకిలలు చేయడం లేదు.. 

నీకిష్టం లేకపోతే వెళ్లిపోవచ్చు అనేసింది..పాపం దానికి తెలియదు కదా!!
అతను పే...ద్ద మానేజర్ అని..

నానమ్మ నవ్వుతూ ముగింపు టచ్ ఇవ్వడానికి గొంతు సవరించుకుంది..

బాబూ మేము మీ ఆఫీస్ కు వచ్చి మీ పని కి ఆటంకం కలిగించామా?? లేదు కదా!!..

ఇల్లు అంటే ఇలానే ఉంటుంది నాయనా!!
ఇంట్లోని మేమంతా సహకరించబట్టే మీ కార్పోరేట్ కార్యకలాపాలు మా ఇళ్ళలోంచి కూడా సజావుగా సాగుతున్నాయి కనుక మీరే అడ్జస్ట్ కావాలి అంటూ మేనేజర్ వంక చూసింది..

లాప్టాప్ లో కెమెరా బాగా పని చేస్తుందేమో!!..
నానమ్మ గారి మొహంలో వెటకారం.......
చిరు కోపం అన్నీ చూసిన మానేజర్ కు జ్ణానోదయం అయింది..

ముందు చిన్నగా మొదలైన నవ్వు 30 సెకన్లలో పెద్దదయింది..

నానమ్మగారూ మీ సందేశం అర్ధమైంది.....
మీ రాజ్యంలో మీరే క్వీన్.....
మీ మాటే శిరోదార్యం ఇకపై మేమే ఒళ్ళు దగ్గరపెట్టుకొని
" చెట్టు కింద ధ్యానం చేసుకుంటాం" అలాగే వర్క్ ఫ్రం హోం కూడా చేసుకుంటాం..
అంటూ ఒక నమస్కారం పెట్టి మీటింగ్ ముగించాడు..


బామ్మా రాక్స్ .... మేనేజర్ షాక్ !!!!!!!!!!!!




30, ఏప్రిల్ 2021, శుక్రవారం

బూడిద గుమ్మడికాయ వడియాలు

 కొబ్బరి తోటకి ఇంజిన్ తో నీళ్ళు పెట్టారు కదా.. మట్టంతా తడితడిగా ఉంది. 

ఎవరూ చూడకుండా నాలుగు దోసిళ్ళ తడి మట్టి తెచ్చి లోపలి పెరడులో  కుండ పెంకులో దాచాను. 

మధ్యాహ్నం భోజనాలు అయ్యాక  నాన్న ఏదో పనుందని బయటికి వెళ్ళిపోయారు. 

అప్పటికే దాచి పెట్టుకున్న బొబ్బాసీ గొట్టాలు   తీసుకుని లోపలి పెరడులోకి   పరిగెత్తాము అన్న ,నేను .తమ్ముడు .

బొబ్బాసీ గొట్టాలతో మొక్కలకు నీటి సదుపాయం కలిపించే ఆలోచనతో ... రోజు నీళ్లు పొసే పనితప్పుతుంది అని 

రాళ్ళు లేకుండా మట్టి అంతా ముద్దగా కలుపుకుని, 

మట్టి మిగిలితే కారు బొమ్మో, రైలు బొమ్మో చేయాలని కూడా ప్లాన్లేసుకున్నాము . 

ఇంతలో అన్నని  వెతుక్కుంటూ బామ్మొచ్చేసింది. గుండెల్లో రాయి పడింది కానీ, నాన్న ఇంట్లో లేరని గుర్తొచ్చి హమ్మయ్య అనుకున్నా. 

అయితే, బామ్మ "మట్టితో ఆడుతున్నారా ? మీ నాన్నకి చెబుతానుండు.." అనకుండా "ఏమిచేస్తునారు ఎండలో ?" అని అడిగింది ప్రేమగా.


బామ్మ కేకలేయక పోవడం కొత్తగా అనిపించింది. 

"బొబ్బాసీ గొట్టాలతో మొక్కలకు నీటి సదుపాయం కలిపిస్తున్నాము .. నీ తులసి మొక్కకి కూడా పెడతాము " అని హామీ ఇచ్చాను. 

బామ్మ అస్సలు సంతోషించలేదు 

"అవ్వని కత్తిపీట పట్టుకురమ్మని చెప్పేశాను.. 


 "కాఫీలు తాగేసి పని మొదలు పెట్టాలి.. ఓమాటు చెయ్యి కడుక్కుని వస్తావా?" అని అడిగింది అన్నని  ప్రేమగా..  ఏదో పని ఉందని అర్ధమయ్యింది.

 "అవును బామ్మా.. కాఫీ తాగితే ఎంత బాగుంటుందో" అన్నాన్నేను.

 నాకు కావాల్సింది నేరుగా అడిగే అలవాటు లేదప్పుడు. 

 మామూలప్పుడు కాఫీ అడిగితే "మీ నాన్నకి చెబుతా" అని బెదిరించే బామ్మ, 

 ఆ పూట "మా తల్లే .. అదేవన్నా బంగారవా? పలకల గ్లాసుతో ఇస్తాను, రా" అంది, మళ్ళీ ప్రేమగా. పలకల గ్లాసంటే పెద్ద గ్లాసన్న మాట.



నేను ఊదుకుంటూ కాఫీ తాగుతున్నానా.. అప్పుడు విప్పింది బామ్మ పొడుపు కథని. 

"బూడిద గుమ్మడికాయలు కడిగి ,నాటెట్టి వెళ్ళమంటే మీ  నాన్నకీ చెయ్యి ఖాళీ లేకపోయింది. 

ఇదన్న మాట సంగతి.. "వడియాలు పెడుతున్నారా? కారం లేకుండా వడియం అట్టు కాల్చుకుంటే ఎంత బాగుంటుందో.." అన్నాన్నేను, తగు మాత్రంగా లొట్టలేస్తూ.

 నిజానికి నాకు 'ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి' అన్న సామెత అప్పటికి తెలీదు. అయినా అన్నీ తెలిసే చేస్తామా ఏంటి?


"ఓస్.. అంతే కదా.. మీ అమ్మకి చెబుతానుండు, కారం కలపకుండా పిండి తియ్యమని.. రేపు మధ్యాహ్నం అన్నంలోకి నీకు అట్టు కాల్చి పెడతాను..సరేనా?" 

హామీ ఇచ్చేసింది బామ్మ. కాఫీలయిపోయాయి కదా, ఇప్పుడు బామ్మ పని మిగిలింది. 

పెరట్లో తులసి కోట చుట్టూ పెద్దవీ, చిన్నవీ కలిపి ఓ డజను బూడిద గుమ్మడి కాయలున్నాయి. 

దేవుడికి కొబ్బరికాయ కొట్టుకునే కత్తి పట్టుకొచ్చింది బామ్మ.  నేను కాయలు కడగడం 

ఆ కత్తితో బామ్మ పర్యవేక్షణలో ఒక్కో కాయ మీదా నాటు పెట్టాడు అన్న , కత్తి బరువనీ, చెయ్యి నొప్పనీ హడావిడి చేసి..


అది మొదలు అమ్మ, బామ్మ, అవ్వ గారూ ఆ గుమ్మడికాయలు ఒక్కోటీ ముక్కలుగా తరగడం. 

సాయంత్రానికి తరగడం పూర్తయ్యింది. ఓ చీరలో ముక్కలన్నీ వేసి,  రాళ్లుప్పు జల్లి, 

 బట్టల మూటంత పెద్ద మూట కట్టి, ఆ మూటని పెద్ద పీట మీద పెట్టారు. 

 ఆ తర్వాత వాళ్ళు ముగ్గురూ కలిసి కుంది రోలు సాయం పట్టి ఆ మూట మీద పెట్టేశారు.

 

 మర్నాడు పొద్దున్నే అమ్మ మినప్పప్పు, పచ్చి మిరపకాయలు విడిగా రుబ్బేసిందా? 

తర్వాత మా కోసం కారం కలపకుండా విడిగా కొంచం పిండి ఉంచి, మిగిలిన పిండిలో కారం కలిపేసింది. 

రాత్రంతా మూట లోనుంచి నీళ్ళు కారిపోడంతో అంత పెద్ద మూటా చిన్నదైపోయింది. 

గుమ్మడి ముక్కల్లో కారంపిండి కలిపేసి అమ్మా, బామ్మా కలిసి వడియాలు పెట్టేశారు. 

మధ్యాహ్నాలు ఇంట్లో అందరూ పడుకున్నప్పుడు వడియాలు కాకులెత్తుకు పోకుండా కాపలా కాసే పనీ, రోజూ సాయంత్రం వడియాలు లేక్కెట్టే పనీ నామీదే పడ్డాయి.


నాలుగోరోజుకి ఫెళఫెళ్ళాడుతూ ఎండిపోయాయి వడియాలు. 

ఆవేళ మధ్యాహ్నం భోజనంలోకి వేగించింది అమ్మ!!

 నాన్న, నేనూ ,అన్న భోజనాలు చేస్తున్నాం. 

"బాగున్నాయ్ వడియాలు.. ఇంకో రెండు ఎండలు ఎండితే నిలవుంటాయ్" అన్నారు నాన్న. 

"రెక్కలు ముక్కలైపోయాయ్.. అవ్వ కూడా సాయం వచ్చింది కాబట్టి సరిపోయింది.. కాస్త పనా, కూస్త పనా.. రాక్షస చాకిరీ,

" అంది అమ్మ, నేను, అన్న కూడా కష్టపడ్డా ఆ విషయం అస్సలు చెప్పకుండా. నాక్కోపం వచ్చేసింది.

 "చూడు నాన్న.. మొన్న అన్న కష్టపడి నాట్లు పెట్టాడు , నేను కాయలు కడగి ,వడియాలు కాకుల నుంచి కాపాడాను  . 

 ఆవిషయం అస్సలు చెప్పడం లేదు," అని కంప్లైంట్ చేసేశాను.

 "నువ్వూ, నేనూ ఎంత చేసినా మీ అమ్మకి కనిపించదు .. ఆవిణ్ణి మెప్పించడం మన వల్ల కాదులే.." అన్నారు నాన్న. 

 బామ్మ నా  బొబ్బాసీ గొట్టాలు , తడి మట్టి విషయం నాన్నకి చెప్పేస్తుందేమో అని భయ పడ్డాను కానీ, మర్చిపోయినట్టుంది.. నావైపు కోపంగా చూసి ఊరుకుంది, అంతే..




27, ఏప్రిల్ 2021, మంగళవారం

కాయగూరల సంస్కృత నామములు !

  • అవాక్పుష్పీ (బెండకాయ)

  • జంబీరమ్ (నిమ్మకాయ)

  • ఆలుకమ్ (బంగాళదుంప)

  • ఉర్వారుక (దోసకాయ)

  • కారవేల్ల (కాకరకాయ)

  • కోశాతకీ (బీరకాయ)

  • బృహతీ (ముళ్ళవంకాయ)

  • మరిచకా (మిరపకాయలు)

  • రాజకోశతకీ (కాప్సికం)

  • లశున (వెల్లుల్లి)

  • వార్తాక (వంకాయ)

  • బింబమ్ (దొండకాయ)

  • శీతలా (సొరకాయ)

  • క్షుద్రశింబి ( గోరుచిక్కుడు)

  • పలాండు (ఉల్లిగడ్డ)

  • కూష్మాండ (గుమ్మడికాయ)

  • తౄణబిందుక (చేమదుంపలు)

  • మూలకమ్ (ముల్లంగి)

  • రంభాశలాటు (పచ్చి అరటికాయ)

  • సూరణ (కంద)

 హేచ్చరిక ::: పొరపాటున కూరగాయల వాళ్ళని ఈ పేర్లతో కూరలు అడగకండి .. ఏదో తిడుతున్నాము అనుకుంటారు .. 

                                                                                          





26, ఏప్రిల్ 2021, సోమవారం

వైకుంఠపాళీ

 వైకుంఠపాళీ ఈ ఆట తెలియని వాళ్ళు ఉండరు .. చాల మందికి ఇష్టమైన ఆట . 

ఇది ఏమిటి ఈ టైం లో దీని గురంచి ఏమి చెపుతాను  కొత్తగా అని అనుకుంటున్నారా ... 

నిన్న ఆదివారం కదా అని మా పాప తో వైకుంఠపాళీ  ఆడాను ..
తన కాయిన్ పావు మింగేసింది అని ఏడిచింది.

చిన్న పిల్ల చెప్పినా అర్ధం చేసుకునే వయసు లేదు..
వైకుంఠపాళీ కి జీవితానికి ఉన్న సంభంధం .. 


జీవితాన్ని వైకుంఠపాళీ తో పోల్చిన పెద్దాయన ఎవరో తెలియదు కాని, ముందుగా ఆయనకి నా వందనాలు.

 వైకుంఠపాళీ లో పాము నోట్లో పడతామో, నిచ్చెన మెట్లెక్కుతామో పందాన్ని నేలపై పరిచేంత వరకూ తెలుసుకోలేనట్టే, 

 జీవితంలో ఎదురయ్యే జయాపజాలనూ ముందుగా పసిగట్టలేము. 

 ఆటలో పందెం సరిగా పడక పాము నోట్లో పడ్డప్పుడు చేయగలిగింది ఏమీ లేదు, 

 నిచ్చెన కోసం ఎదురు చూస్తూ ఆట కొనసాగించడం తప్ప.. జీవితం లోనూ అంతే.


చిన్నప్పుడు నేను చాలా ఇష్టంగా ఆడిన ఆటల్లో వైకుంఠపాళీ ఒకటి. 

ముఖ్యంగా వేసవి మధ్యాహ్నాలు బడికి వెళ్ళక్కర్లేకుండా, 

ఇంటి నుంచి బయటకి కదలడానికి పెద్దవాళ్ళ అనుమతి లభించని సందర్భాలలో నాకు కాలక్షేపం అందించింది ఈ ఆటే. 

మద్యాహ్నం నిద్ర అలవాటు లేకపోవడంతో, పావులు కదుపుతూ గడిపేసేదానిని . 

మరొకరితో ఆడుతున్నప్పుడు, వాళ్ళ పావులు నిచ్చెనల మీద, నావి పాముల నోట్లోనూ ఉన్నప్పుడు భలే ఉక్రోషంగా ఉండేది మొదట్లో. 

ఎంత ఆవేశంగా గవ్వలు విసిరినా కావాల్సిన పందెం పడేది కాదు.


కొన్ని క్షణాలలోనే ఆట తారుమారయ్యేది.

పెద్ద పందేలతో పైకెళ్లిన వాళ్ళు ఒక్కసారిగా పెద్దపాము నోట్లో పడి మొదటికి వచ్చేసే వాళ్ళు. 

కొన్నాళ్ళు ఆడేసరికి ఆట అర్ధం కావడం మొదలుపెట్టింది. 

ఆడడానికి ఎవరూ లేనప్పుడు నేనే రెండు పావులతో ఆడేదానిని .

 తెలియకుండానే గెలుస్తున్న పావు నాది అనిపించేది. 

 బహుశా విజయానికి ఆ ఆకర్షణ ఉందేమో. 

 కొన్నాళ్ళు వైకుంఠపాళీ ఆడడం ఓ వ్యసనమైపోయింది. 

 ఈ ఆటలో గెలుపోటములు మన చేతిలో అస్సలు ఉండవనే విషయం పూర్తిగా అర్ధమైంది.


జీవితంలో మొదటి వైఫల్యం ఎదురైనప్పుడు నాకు వైకుంఠపాళీ లో పెద్దపాము 'అరుకాషురుడు' గుర్తొచ్చాడు. 

వచ్చి వచ్చి వీడి నోట్లో పడ్డాను కదా అని బాధ పడ్డాను. 

విజయం కోసం కసిగా ప్రయత్నాలు చేశాను..కానీ వైఫల్యాలే ఎదురయ్యాయి. 

విజయానికీ, వైఫల్యానికీ ఎంత భేదం ఉందో స్పష్టంగా అర్ధమైంది. 

విజయం వస్తూ వస్తూ మిత్రులని తీసుకొస్తే, 

వైఫల్యం మిత్రులు అనుకుంటున్నా వాళ్ళని దూరం చేస్తుందని తెలిసింది. 

కొన్ని వైఫల్యాల తర్వాత ఒక విజయం దొరికింది. 

కానీ, నాకది అద్భుతమైన ఆనందాన్ని ఇవ్వలేదు.

 వైఫల్యం కారణంగా నాకు దూరమైన వాళ్ళు నాకు చేరువయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడు మాత్రం బాగా నవ్వొచ్చింది.


విజయాలనూ, వైఫల్యాలనూ ఒకేలా తీసుకోగలిగే స్థితప్రజ్ఞత రాలేదు కానీ,

 వైఫల్యాలని తట్టుకోగలిగే స్థైర్యం బాగానే అలవడింది. 

 వైకుంఠపాళీ లో పాములు, నిచ్చెనలు యెంత సహజమో జీవితంలో కూడా అపజయాలు, విజయాలు అంతే సహజమని అనుభవపూర్వకంగా తెలిసింది. 

 పాము నోట్లో పడ్డప్పుడు పందెపు గవ్వలను నేలకి విసిరి కొట్టడం వల్ల ఉపయోగం లేదని, 

 కొంచం ఓపికగా ఆట కొనసాగిస్తే నిచ్చెన తప్పక వస్తుందన్న సత్యం బోధ పడ్డాక జీవితపు వైకుంఠపాళీ కూడా ఆసక్తికరంగా మారింది. 

 ముఖ్యంగా పాము నోట్లో పడ్డ ప్రతిసారీ, ఓ నిచ్చెన నా కోసం ఎదురు చూస్తోందన్న భావన నాకు బలాన్ని ఇస్తోంది..




20, ఏప్రిల్ 2021, మంగళవారం

గోదారి రాముడి కళ్యణమ్

**************************

ఊరంతా తాటాకు పందిర్లు.. మామిడాకు తోరణాలు .. 

ప్రతి  ఇంట్లో చుట్టాలు .. అందరూ పెళ్ళివారే .. 

సీత రాముల కళ్యాణం కదూ  ... అందుకని 

మా ఊరి రామాలయం చూడటానికి చిన్నది ఐనా పక్కనే  కౌశిక .. 

కంటికి కనిపించే  అంత మేర కొబ్బరి తోట .. చూడటానికి రెండు కళ్ళు చాలవు .


మా ఊరి లో  శ్రీ రామ నవమి హడావిడి రెండు రోజుల ముందు మొదలవుతుంది . 

పెద్ద వాళ్ళు ...పందిర్లు.. తోరణాలు గురంచి చూసుకుంటే .. 

పిల్లలు ..  గుడిని రంగు రంగుల కాగితాలతో అలంకరించడం..

ఇత్తడి పల్లకి  , కంచు గంట , పల్లాలు,కాగడాలు , కోల తోమడం  .. ..ఇలా ఎన్ని పనులో

ఆడ పిల్లలు అందరం చింత పండు , ఉప్పు తో తోమడం .. 

మగ పిల్లలు నూతిలో నీళ్లు తోడటం అనమయతి గా వస్తోంది 

ఒకరోజు ముందే అందరం సుబ్బరంగా పల్లకి, గంట, పల్లాలు అన్ని తోమేసి మండువాలో పేట్టేసే వాళ్ళం ..

మా రాముడి పల్లకి(ఇత్తడిది ) చాల బరువు .. 





ప్రతి సవత్సరం కావలసిన వస్తువులు ఐనా .. 

గురువు గారు ఒక రోజు ముందు లిస్ట్  రాసి నాన్న కి ఇచ్చేవారు 

అది ఒక ఆనందం .. పసుపు , కుంకుమ తో ఆ లిస్ట్ మొదలు .. 


శ్రీ రామ నవమి రోజు తొందరగా పట్టు బట్టలు కట్టుకుని రెడీ ఐపోయేవాళ్ళం 

పెళ్లివారం కదూ ... 

మేము ఆడ పెళ్లి వారం అందుకని అమ్మ .. 

తలంబ్రాలు , జీలకర్ర బెల్లం , సీత రాములకి పట్టు బట్టలు .. 

గుమ్మడి పండు , అరటి పళ్ళ అత్తమ్ , గంధపు చక్క ,ఉత్తర ధన్యాలు

పూలు పళ్ళు  అన్ని ఇత్తడి పల్లాలలో సద్ది రెడీగా ఉంచేది 

లిస్ట్ ప్రకారం అన్ని వచ్చాయా లేదో చెక్ చేయడం నా పని ..


భాజాలు చప్పుడు వినిపించగానే ఏదో తెలియని సంతోషం . 

కళ్యణనికి ముందు ఊరేగింపు ఉంటుంది ... 


కాగడాలు పట్టుకోవడానికి పిల్లల పోట్లాటలు

మొత్తానికి తలా కాసేపు అని ఒప్పందం జరిగేది .


పల్లకి గుడికి చేరగానే గుడి చుట్టూ మూడు ప్రదక్షణలు చేసి

రాముని కళ్యణ పీఠం మీద కూర్చో పెడతారు ..

ఆడ వాళ్ళు ఒక వైపు .. మగ వాళ్ళు ఒక వైపు  కింద కుర్చునేవాళ్ళు .. 

కింద కూర్చోలేని వాళ్ళకి వెనకాల కుర్చీలు 


మా గుడి లో రాముని కళ్యాణానికి ఒక అనామయాత ఉంది .. 

కళ్యాణం జరిగిన అంత సెపు కర్పూరం హారతి వెలుగుతూ ఉండాలి .. 

మా ఊరిలో రాముడు గారు అని ఒక తాత గారు ఉండేవారు 

పిల్లల అందరిచేత కొంచం , కొంచం కర్పూరం వేయించేవారు ..

అది వేసినంత సెపు రామ నామం చెప్పాలి  అది రూల్ ..


ఈలోగా గురువు గారు కళ్యణమ్ మొదలు పెడతారు ....

"సీత రాములు ఇద్దరూ  పట్టు బట్టల్లో మెరిసిపోతున్నారు. 

మండపం నిండుగా జనం ఉన్నా అంతా నిశ్శబ్దంగా ఉంది. 

అందరూ భక్తి శ్రద్ధలతో చూస్తున్నారు. 

పంతులుగారికి కూడా ఉత్సాహం వచ్చినట్టు ఉంది. 

మంత్రాలకి అర్ధం చెబుతూ, జరుగుతున్న తంతు ఎందుకో వివరిస్తూ చాలా ఓపికగా జరిపించారు. 

పాదుకలని ఇత్తడి పళ్ళెంలో పెట్టి నీళ్ళతో కడిగారు..
కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం అన్నమాట. 

ఆ తర్వాత జీలకర్ర-బెల్లం.
పంతులు గారు, మా పూజారి గారు సీత రాముల తలలపై వాటిని ఉంచారు. 

వధూవరుల తాత , తండ్రుల వివరాలు, వారి గోత్రాలు, ఋషులు అన్నీ ప్రవర రూపంలో చదివారు. '

చదువుతుంటే వినడానికి భలే ముచ్చటగా అనిపించింది. 

తలంబ్రాలు పోస్తుంటే వీరణాల వాళ్ళు, బ్యాండు వాళ్ళు పోటీ పడ్డారు.
మరో పక్క బాణాసంచా. 

తరవాత చదివింపుల కార్యక్రమం .. "

అక్కడితో కళ్యాణం ముగిసింది .. 


తలంబ్రాల బియ్యం కోసం భక్తులు పోటీ పడ్డారు..

ఈలోపు గుడి పక్కన సావిడి లో పానకాల రెడీ ఐపోయేవి .. 

కళ్యణమ్ రోజు రాముడు గారిది వైశాఖ పూజ .. 

పచ్చి శనగలు దేవుడికి .. ఉడికించిన శనగలు భక్తులకు .. 


తొమిది రోజులు వైశాఖ పూజలు ఉంటాయి ..
రోజు పానకాల .. ప్రసాదాలు .. పల్లకి ఊరేగింపు 
ఐదవ రోజు చక్ర స్థానం .

మా చిన్నపుడు ఐతే వైశాఖ పూజలకి  తాటాకు విసిన కర్రలు ఇచ్చేవారు 

తరువాత ప్లాస్టిక్ విసిన కర్రలు

ఇప్పుడు ఏమి ఇవ్వటం లేదు అందరి ఇల్లల్లో ఇన్వెర్టర్ ఉన్నాయి .. 

కానీ  కొన్ని పద్ధతులు ఏమి మారలేదు  ఇత్తడి పల్లకి .. కర్పూర హారతి .. 

మా గోదారి రాముడి ... సీత రాముడు .. మా అగ్రహారం రాముడు .. లోకాభి రాముడు .




               జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 

                                సర్వేజనా సుఖినోభవంతు