Pages

15, ఏప్రిల్ 2021, గురువారం

బాలానాం రోదనం బలం

 

ఈ మధ్య అందరూ మిడి మిడి జ్ఞానం ఉన్న పండితులే అయిపొయారండీ . ,
మీరు మాటవరసకు 'జలుబు చేసింది, ' అన్నా సరే,
వంద చిట్కాలు, ఉపాయాలు చెప్పెస్తారు.
అటువంటి ఒక పండిత పుత్రుడు ఏమి చేసాడో ఈ కధ చెప్తోంది . 


"పద్మనాభానికి తానొక గొప్ప పండితుడినని నమ్మకం ."

అక్కడా ఇక్కడా గాలివాటుగా విన్న విషయాలు వల్లే వేస్తూ,
ఆచరణలో పెట్టేస్తూ అందరినీ ఇబ్బంది పెట్టేస్తుంటాడు . 

ఒక రోజు పద్మనాభం పొరుగింటి వాడయిన చెంచయ్యకు
పొద్దుటే పిల్లల ఏడుపులు వినబడ్డాయి . 

ఏమయ్యిందో అని వెళ్లి చుస్తే ,
నిద్రపోతున్న పిల్లలను ఒక్కక్కరినే లేపి,
నడ్డి మీద నాలుగు దేబ్బలేసి ఏడిపిస్తున్నాడు పద్మనాభం .

కారణం అడగ్గా,
'బాలానాం రోదనం బలం ' అన్నారు కదా, అందుకే కొడుతున్నా , అన్నాడు . .

'ఆహా, ఏమి పాండిత్యమయ్యా నీది,
ఆ వాక్యానికి అర్ధం అది కాదు,
పూర్తీ శ్లోకం విను,' అంటూ ఇలా వివరించాడు . 


"పక్షీణాం  బలమాకాశం 

మత్స్యానా ముదకం బలం 

దుర్బలస్య బలం రాజా 

బాలానాం రోదనం బలం "


ఎవరికేది బలమో ఈ శ్లోకం చెబుతోంది . 

ఆకాశమే పక్షులకు బలం . ఆపద వస్తే ఆకాశంలోకి యెగిరి తప్పించుకుంటాయి . 

అలాగే చేపలకు నీళ్ళు బలం . 

బలహీనులను రక్షించడం రాజ ధర్మం కనుక బలహీనులయిన ప్రజలకు రాజే బలం . 

చిన్నపిల్లలు తమకు కావలసినవన్నీ ఏడ్చి సాధిస్తారు . ఏడుపే వాళ్ళ ఆయుధం . 

ఎంతటి కర్కోటకుడయినా పిల్లల ఏడుపుకి లొంగిపోతాడు కనుక ,
 అదే వాళ్లకు శక్తి అన్న అర్ధంలో చెప్పిన శ్లోకం ఇది . 

అంతే  కాని, ఏడిస్తే పిల్లలకు బలం వస్తుందని కాదు . 

పిల్లల ఏడుపుకు లొంగిపోయి వాళ్ళను గారం చేసి చెడగొట్ట వద్దు
అని పెద్దలకు చేసిన హితవు,
అంతర్లీనంగా ఇందులో దాగి ఉంది,
అని వివరించాడు చెంచయ్య . మీకూ  తెలిసింది కదూ... 






14, ఏప్రిల్ 2021, బుధవారం

వసంత నవరాత్రులు

🌻. ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు 🌻

(సేకరణ )

చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి...అంటే ‘ఉగాది’ నుంచి మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. 

అలాగే ఋతువులలో తొలి ఋతువైన వసంతఋతువు మొదలవుతుంది.
ఈ వసంతఋతువుకు ఎంతో ప్రముఖ్యత ఉంది.
శిశిరంలో .... ఆకులు రాల్చి సర్వస్వం కోల్పోయిన ప్రకృతికాంత...నవ పల్లవాలతో చిగిర్చి , పూల సోయగాలతో కనువిందులు చేస్తూ , సుగంథాల  సేవలతో ప్రకృతి పురుషునకు మకరందాల విందులు అందించే..

 ఈ వసంతఋతువు అంటే గుణరహితుడైన ఆ పరమాత్మనకు కూడా ఇష్టమే. 

 అందుకే... ‘ఋతూనా కుసుమాతరః’ అని ‘గీత’లో చెప్పాడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు.

 అనంతమైన కాలంలో , కేవలం ఏడాదికో రెండు నెలలు ఆయుష్షు ఉండే ఈ వసంతఋతువుకు ఎందుకంత ప్రాధాన్యత ?


ఈ వసంత ఋతువులోనే దేవదేవుడైన శ్రీమహావిష్ణువు పరిపూర్ణ మానవునిగా అవనిపై అవతరించాడు.
అదే శ్రీరామావతారం. 

అంతవరకూ రాక్షసుల యుద్ధాలతో విసిగి వేసారిన సర్వలోకాలు శ్రీరామ జననంతో మంచి రోజులు వచ్చాయని సంతోషించాయి. 

పుడుతునే సకల జీవకోటికీ ఆనందాన్ని కలిగించినవాడు శ్రీరాముడు. 

అందుకే.. సంవత్సరంలో తొలి పండుగ అయిన ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ ‘వసంత నవరాత్రులు’ సంబరంగా జరుపుకోవడం ఆచారమైంది. 

భగవంతుని ఆరాధనలో ‘భక్తి’ తొమ్మిది రకాలు


   శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం

   అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనం


శ్రవణం - కీర్తనం - స్మరణం - పాదసేవనం - అర్చనం - వందనం - దాస్యం - సఖ్యం - ఆత్మనివేదనం. ఇవి నవవిధ భక్తిమార్గాలు. భాగవతోత్తములుగా ప్రసిద్ధిగాంచిన ఎందరో భక్తులు ఈ నవవిధ భక్తి మార్గలలో ఏదో ఒక మార్గాన్ని ఎంచకుని పరమాత్మని సన్నిధి చేరుకున్నవారే.   


నవరాత్రులు తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు , ఒక్కొక్క భక్తి మర్గాన్ని ఎంచుకుని , అలా తొమ్మిది రోజులు తొమ్మిది భక్తి మార్గాలతో భగవంతుని సేవించి తరించడానికే... ఈ నవరాత్రులను ఏర్పాటు చేసారు మన ఋషులు.


సంవత్సర చక్రంలో వసంత శరదృతువులు రెండూ ప్రాణులకు రోగకారకమైనవి. 

కోరలతో భయంకరంగా ఉన్న తన నోరు తెరుచుకొని వికటాట్టాహాసం చేస్తూ , ప్రాణులను మృత్యుదేవత కబళించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. 

అలా మృత్యుముఖంలో పడకుండా తప్పించుకోదలచిన వారు పరమేశ్వరిని సేవించి ఆమె అనుగ్రహాన్ని పొందాలి. 

అపమృత్యు వినాశినియై , సర్వాపద్లినివారిణియై విరాజిల్లే ఆ జగన్మాతను ప్రార్థించిన వారు ఆ యా ఋతువుల్లో రోగభాధలను , మృత్యుభయాన్ని జయించగలుగుతారని ,

 ఇందుకై నవరాత్రులలో పరమేశ్వరిని పూజించాలని వ్యాసుడు జనమేజయునకు నవరాత్రి పూజా విధానాన్ని వివరించాడు.


సంవత్సరారంభంలో చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులూ వసంత నవరాత్రాలు అని , 

అర్థ సంవత్సరం గడచిన తర్వాత శరదృతువు ఆరంభంలో ఆశ్వయుజు శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులూ శరన్నవరాత్రులు అని వ్యవహరింప బడతాయి.

 వసంత నవరాత్రులలో శ్రీరామచంద్రుని మనం ఆరాధిస్తాం. 

 రామచంద్రుడు పురుష రూపంలో ఉన్న లలిలతాదేవి అని సాధకుల విశ్వాసం. 

 "శ్రీరామో లలితాంబికా" అని పురాణాలు వివరిస్తున్నాయి. 

 నేటికీ ఉత్తర భారతదేశంలో రామలీలా మహోత్సవాలు అనే పేరుతో వసంత నవరాత్రులలో దేవీ పూజలు నిర్వహించే సంప్రదాయం ఆచరణలో ఉన్నది. 

శరన్నవరాత్రులలో దేవిని ఆరాధించడం అనూచారంగా వస్తున్న ఆచారం.


వసంత నవరాత్రులలో , శరన్నవరాత్రులలో పరాశక్తిని అరాధించి అబీష్టసిద్ధిని పొందినవారు ఎందరో ఉన్నారు.


రామచంద్రమూర్తి సీతాన్వేషణ ప్రయత్నంలో ఉండగా ఋష్యమూక పర్వతంపై సుగ్రీవునితో స్నేహం కలిసిన తర్వాత దేవిని ఆరాధించి సత్ఫలితం పొందాడు. 

అజ్ఞాతవాసం ఆరంభించబోతూ , పాండవులు విరాట నగరంలో ప్రవేశించే ముందు జగన్మాతను సేవించి నిర్విఘ్నంగా అజ్ఞాతవాసం నిర్వహించి కృతార్థులయ్యారు.


కనుక వసంత నవరాత్రులలో , శరన్నవరాత్రులలో మానవుడు ఆ పరాశక్తిని ఆరాధించి , ఐహిక , ఆముష్మిక సుఖ సంపదలను పొందవచ్చునని వ్యాసమహర్షి వివరించారు.


                                   సర్వే జనా సుఖినోభవంతు

13, ఏప్రిల్ 2021, మంగళవారం

మా ఊరి ఉగాది

అసలు అందరూ చైత్ర శుద్ధ పాడ్యమి నాడు 'ఉగాది' జరుపుకుంటారు కానీ, 

మా ఊరికి ఉగాది కళ ఓ రెండు రోజుల ముందు మొదలవుతుంది .. 

పంచాంగ శ్రవణం కోసం మా ఊరి రామాలయం పందిరితో రెడీ చేయడం.. 

పానకాలకి ఇత్తడి గుండిగ శుబ్బరంగా తోమి , స్టీల్ గ్లాసులు రెడీ చేయడం ... 

ఇలా ఎన్ని పనులో 

పిల్లలు అంటారుకాని  ఎన్ని పనులు ఉండేవో .... 


ఉగాది రోజు పోద్దినే కొత్త బట్టలతో రెడీ ఐపోయి .. 

అమ్మ చేసిన ఉగాది పచ్చడి తినేసి ..  

చదవడం పెద్దగా రాని వయసు ఐనా .. 

కొత్త పంచాంగం తీసి 

ఆదాయ ..వ్వయం 

రాజపూధ్యం .. అవమానం .....చూసుకుని 

కొంచం సేపు  పిల్లలు అందరం కూర్చుని  జాతకాల మీద చేర్చించుకొ౦టుండగా 

అమ్మ భోజనానికి పిలిచేసేది

అమ్మ చేసిన పిండివంటలు సంగతు చూసి.. 


ఇంక గుడిక బయలుదేరడం .. 

మా ఊరులో సుబ్బారావుగారు అని ఒక  మాస్టారు ఉండేవారు .. 

ప్రతి ఉగాదికి పంచాంగ  శ్రవణం అయన చదివేవారు .. 

పిల్లలు అందరం ముందు వరసలో కుర్చునేవారం ..

 బాగా వినిపిస్తుందిఅని .. 

మా గుడికి అప్పుడు స్పీకర్ , మైక్ లేదు లెండి ... 

కొత్త సవత్సరం లో జరిగే 

మంచి .. చెడు 

వ్యవసాయం .. వ్యాపారం 

పాడి .. పంట 

వానలు .. ఎండలు 

అన్ని చెప్పేవారు .. 

కానీ ఎప్పుడు మా పరీక్షలు .. మార్కులు గురంచి చెప్పలేదు  


మా రాశి ఐపోగానే మేము అక్కడినుంచి .. 

బెల్లం దంచే సావిడికి వెళ్లిపోయేవాళ్ళం .. 

వచ్చిన  ముక్షమైన పని ఆదికదా .. 


పెద్ద వాళ్ళు ఒకళ్లు ..

 ఒక ఇత్తడి చెంబులో దేవుడికి పానకం, శనగలు తీసుకుని గురువు గారికి ఇచ్చేవారు .. 

మా గోదారిరాముడికి నైవేద్యం పెట్టాక .. 

ముందు పిల్లలకి తరవాత పెద్దలకి .. శనగలు .. పానకం 

ఇక్కడ ఒక రూల్ ఉంది .. పానకం తాగక గ్లాస్ కడిగి నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వాలి .. 


ఇప్పటిలా ప్లాస్టిక్ గ్లాసులు కాదు ... 

మా ఊరి వాళ్ళకి ప్రకృతి మీద ప్రేమ ఎక్కువ అందుకని స్టీల్ గ్లాసులు వాడే వాళ్ళు ..

ఉగాదికి ఊరు వెళ్లి చాల సంవత్సరాలు గడిచింది .. కానీ అక్కడ పద్ధతులు ఏమి మారలేదు .. 


అందరికి ఉగాది శుబాకాంక్షలు 





               *********ఉషగిరిధర్ ********

12, ఏప్రిల్ 2021, సోమవారం

చంటి హాస్యకథ( ఉగాది స్పెషల్)

**********

ఎనిమిదేళ్ళ చంటి కి తలంటి,
కొత్త బట్టలేసి, దేవుడికి దణ్ణం పెట్టించి, 
అమ్మ  ఉగాది పచ్చడి పెట్టి తినమని పంపి
పిండి వంటలకి కావలసిన పదార్థాలు రెడీ చేసుకుంటోంది . 

చంటి చటుక్కున ఏడుపుతో తిరిగి వచ్చింది..
నాన్న గారాల కూతురు డెందుకు ఎడుస్తోందో అర్థం కాలేదు అమ్మకి.
“ఉగాది పచ్చడి నువ్వు చేస్తే బాగుండేది.
 ఈ మాటు అంతా చేదుగా ఉంది...” అని విషయం చెప్పి మళ్ళీ ఏడవ సాగింది  చంటి.


“పోనీలే, మహా నైవేద్యం అవగానే నీకు  బూర్లు పెడతాను”,
అంది అనునయంగా. 

చంటి ఏడుపు విని పూజ చేసుకుంటున్న మామ్మ గారు బయటికొచ్చి కారణమడిగారు. 

“ఏం లేదండీ,
 చంటికి ఉగాది పచ్చడి కొంచెం చేదుగా ఉందట”,
అని సర్ది చెప్పబోయింది అమ్మ. 

“ఏం కాదు మామ్మా,
పచ్చడి తిన్నపుడు మొదట ఏ టేస్ట్ వస్తుందో,
ఏడాది అంతా అలాగే ఉంటుందని నువ్వేగా చెప్పావ్?” అని కోపంగా అంది  చంటి. 

అవునన్నట్టు మామ్మగారు తల ఊపారు.
“చూడు, నేను చేదుని ఫస్ట్ టేస్ట్ చేశా. నెక్స్ట్ ఇయర్ అంతా చేదే!”
 అని మళ్ళీ ఏడుపు మొదలెటింది . 

ఆవిడ, “ఊరుకోరా వెర్రి తల్లి !
నీకు కాకరకాయంటే ఇష్టం కదూ!
దానివల్ల నీ జీవితమేమీ పాడవలేదుకదా!
ఏదో వేపపువ్వు కానీ ఖర్చు లేకుండా మనింట్లోంచే వచ్చింది
గనుక కాస్త ఎక్కువ వేశాను. 
దానికే ఇంత రాద్ధాంతం చేయాలా?

నీ అమాయకత్వం గానీ,
తలరాతని ఉగాది పచ్చడేం మర్చలేదురా!
ఇంతోటి దీనికోసమా ఇంత ఏడుపు?” అని మళ్ళీ పూజ గదిలోకి వెళ్ళారు.

ఆవిడన్న మాటలకి ఏదో స్ఫురించిన దానిలా వంటింట్లోకి వెళ్ళి,
అమ్మ చంటితో,
 “పెద్ద వాళ్ళ తిట్లు మనకి ఆశీర్వాదాలు.
అలాగే మామ్మగారు, నాన్నని, అత్తని పెంచి గొప్పవాళ్ళని చేశారు. 

ఆవిడ చేతి పచ్చడి తిని వాళ్ళు ఫస్ట్ రాంక్ తెచ్చుకున్నారు.
అయినా నువ్వు ఏడుస్తున్నావని దీన్ని తీపి చేయమని దేవుడికి దణ్ణం పెట్టుకున్నాను.

ఇప్పుడు చూడు,
దేవుడు పచ్చడిని తీపి చేశాడో, లేదో?”
 అని ఒక గిన్నెలో పచ్చడి పెట్టి చంటికిచ్చింది. 

“అవునమ్మా, దేవుడు దీన్ని తీపి చేశాడు.
 నా నెక్స్ట్ ఇయర్ తియ్యగా ఉంటుందోచ్”,
అని చంటి చకచకా తినేసి, ఆటకి పక్కింటికి వెళ్ళాడు.

 మహానైవేద్యం అయ్యిన తరువాత ఉగాది పచ్చడిని నోట్లో వేసుకున్న మామ్మగారు “ఇదేం చోద్యమే తల్లి!
 ఇంత తియ్యగా ఉంటే చంటిది  చేదని గోల చేసింది ?” అన్నారు. 

“అత్తయ్యా,
మీరన్నట్టు పచ్చడి తలరాతను ఎలాగూ మార్చలేదు కనుక
అందులో డజను అరటిపళ్ళ గుజ్జూ,
పావు కిలో బెల్లమూ కలిపానులెండి.
మరీ ఎక్కువయ్యిందంటారా?”, జవాబిచ్చింది కోడలు . 

“నైవేద్యం పెట్టిన పచ్చట్లోనా నువ్వు మార్పులు చేసింది?”
అని ముక్కు మీద వేలేసుకున్నారావిడ.


8, ఏప్రిల్ 2021, గురువారం

సూర్యుడు చూస్తున్నాడు...

*******************************

'ఎండలు మండిపోతున్నాయి...'
ప్రతి వేసవిలోనూ ప్రతి ఒక్కరూ అనుకునే మాట ఇది. అంతేనా? 

ఏడేళ్ళ పసి వాడు మొదలు,
ఎనభై ఏళ్ళ వృద్ధు వరకూ '
ఇంతలేసి ఎండలు ఎప్పుడూ చూడలేదు'
అనడం కూడా ప్రతి వేసవిలోనూ వినిపిస్తూ ఉంటుంది. 

'నక్క పుట్టి నాలుగు ఆదివారాలు అవ్వలేదు కానీ,
ఇంతటి గాలి వాన ఎప్పుడూ చూడలేదు అందిట' అని ఓ సామెత. 

గాలివాన మాట ఏమోగానీ, ఎండలకి మాత్రం ఇది తప్పకుండా వర్తించేస్తుంది. 

ఆబాల గోపాలమూ 'హమ్మో ఎంత ఎండా? ఎప్పుడూ చూడనే లేదమ్మా'
అన్న డయిలాగుని నాలుక చివర ఉంచుకునే కాలం వచ్చేసింది.
ఎప్పటి లాగే ఈసారి కూడా ఎండలు గట్టిగానే ఉన్నాయి మరి.


మనింట్లో కరెంట్ పోయినప్పుడు,
పక్క వాళ్ళ ఇంట్లో దీపాలు వెలుగుతూ,
ఫ్యాన్లు తిరుగుతూ ఉంటే
 మన హృదయం వెయ్యి ముక్కలు అయితీరుతుంది. 
అలాగే మన ఊళ్ళో మాత్రమే ఎండలు ఎక్కువగా ఉన్నాయి అని తెలిసినా అదే బాధ. 


ఇన్నాళ్ళూ లోపలి పేజీల్లో ఉండే 'ఉష్ణోగ్రత'లు
ఈ నాలుగు నెలలో న్యూస్ పేపర్ల మొదటి పేజీలోకి వచ్చేస్తాయి 
కాబట్టి, ఉదయాన్నే మనకన్నా వేడిగా ఉన్న వాళ్ళని చూసి జాలిపడి,
చల్లగా ఉన్నవాళ్ళ మీద అసూయ పడొచ్చు. 


ఎండాకాలంలో తరచూ మంచి నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, గ్లూకోజ్
లాంటివి తాగుతూ ఉండాలనీ,
వడదెబ్బ తగిలినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించీ
దూరదర్శన్ వాళ్ళు వివరంగా చెప్పేవాళ్ళు ఒకప్పుడు. 
ఇప్పుడూ చెబుతూనే ఉండి ఉంటారు కానీ,
కొత్త న్యూస్ చానల్ ఏదో మొదలైన సంరంభంలో
కేబుల్ అబ్బాయి దూరదర్శన్ ని తాత్కాలికంగా పక్కకి తప్పించినట్టు ఉన్నాడు.. 

న్యూస్ ఛానళ్ళు కూడా వార్తలు,
లైవుల మధ్యలో అప్పుడప్పుడూ ఎండల జాగ్రత్తలు చెబుతున్నాయి కానీ,
అవి కూడా మిగిలిన కమర్షియల్స్ లో కలిసిపోతున్నాయి. 
రోజంతా సాఫ్ట్ డ్రింక్ ప్రకటనలు చూపించి,
మధ్యలో ఎప్పుడో పాప పరిహారం కోసమా అన్నట్టు
 కొబ్బరి నీళ్ళు తాగండి అని ఓ ముక్క చెప్పడం
 చూసినప్పుడల్లా నవ్వొచ్చేస్తూ ఉంటుంది. 

వార్తలంటే గుర్తొచ్చింది... 

 పిల్లలకి పరిక్షల హడావిడి ముమ్మరంగా ఉంది. 
 కరెంట్ లేకపోవడంతో కొవ్వొత్తుల వెలుగులో చదువుకుంటున్నారు కాబట్టి వీళ్ళ భవిష్యత్తుకి మాంచి భరోసా కనిపిస్తోంది.
 అనుమానం ఉంటే గొప్ప గొప్పవాళ్ళ జీవిత చరిత్రలు తిరగేయండి.
వాళ్ళల్లో మెజారిటీ లాంతర్ల దగ్గరా, వీధి దీపాల దగ్గరా చదువుకున్న వాళ్ళే.

ఈ పరిక్షలు కాస్తా అయిపోయాయి అంటే,
నెలన్నా తిరక్క ముందే టీవీల్లో లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వాళ్ళ కొత్త డబ్బింగ్ సినిమా విడుదలవుతున్నంత హడావిడి మొదలైపోతుంది. 
అంకెలంటే విరక్తి పుట్టేలా ర్యాంకులు అరిచేస్తూ ఉంటారు, కొన్నాళ్ళ పాటు. 


ఆవకాయ తదాదిగా ఊరగాయలు పెట్టుకునే హడావిడి ఇంకా మొదలవ్వ లేదు. 
ఈసారి మామిడికాయ రావడం కొంచం ఆలస్యం కావొచ్చని మా పక్కవాళ్ళు చెప్పారు. 

మామిడిపళ్ళు అక్కడక్కడా మాత్రమే కనిపిస్తున్నాయి..
మే నెలలో చాలా పెళ్ళిళ్ళు జరగబోతున్నాయిట.
కానీ కరోనా పున్య మా అని ఎవ్వరూ పిలవటం లేదు 

  

మండే ఎండలని తట్టుకోడానికి మానసికంగా సిద్ధ పడిపోతే,

ఆ తర్వాత ఇక జల్లులే జల్లులు..
నాలుగు జల్లులు చాలు కదూ ఈ ఎండల బాధ మర్చిపోడానికి...
 తలచుకుంటేనే యెంత హాయిగా ఉందో...
ఎందుకూ ఆలస్యం.. మీరూ తల్చుకోండి..




6, ఏప్రిల్ 2021, మంగళవారం

వేసవి సెలవులు

***********************

వేసవి సెలవులు........... అదొక మదురాతి మధురమైన బాల్య జ్ఞాపకం.

వేసవి సెలవులంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు?

అసలు ....సెలవలకి ముందు ఇన్ని పరిక్షలు ఎందుకు పెడతారో? అని తెగ తిట్టుకుంటాను నేను.


పరీక్షలకు  పుస్తకాలు ముందేసుకొని కూర్చుంటామ చదువు అసలు బుర్ర కెక్కదు.

సెలవుల్లో ఎక్కడికేళ్ళలో ,ఏ మేమి చేయాలో,ఉహించుకోవడం తోనే సరిపోతుంది.

ఎగ్జామ్స్ కి చదువు కోమని నాన్న  పొద్దున్నే లేపుతుంటారు ,

టీ పెట్టి ఇచ్చి చదువుకోమని .. నాన్న అలా వెళ్లడం అల్లస్సమ్ నిద్దర ముంచుకు వచ్చేస్తుంది 

 "అబ్బ-ఇంకేన్నిరోజులని సున్నితంగా విసుక్కుంటూ సగం నిద్ర లోనే ఎన్ని రోజులని మల్లి లేక్కపెట్టుకునే వాళ్ళం.

తియ్యాతియ్యని మామిడి పల్లు ,నోరూరించే కొత్త ఆవయకాయ,పనస పళ్ళు , మామిడికాయ విత్ కారం .........ఇంటి  నిండా చుట్టాలు ..
వీటితో పాటు బోలెడు వేసంగి పనులు ( కొత్తావకాయ , చింత చెట్టు దులపడం ,తాటి ముంజలు ) ఇవన్ని కలిపితేనే వేసవి సెలవులు. 

 పరిక్షలు అవ్వంగానే .....పుస్తకాలు అన్ని బఠాణిలకి సద్దేయడం తోటే వేసవి సెలవుల అసలు హడావిడి మొదలవుతుంది.

  ఇంటి నిండా అన్నలు ,అక్కలు,చెల్లలు,తమ్ముళ్ళ .

  మా ఇంటి చుట్టూ మొక్కలు,చెట్లు పెద్దబావి.పక్కన వేపచేట్టుకి పెద్ద ఉయ్యాలా.

పెద్ద సన్నజాజి పందిరి,మల్లెపూల చెట్లు.ఎన్ని పూలో,కోయలేక ,మాల కట్టలేక మా అమ్మ చేతులు  నొప్పి పుట్టేవి.
ఆవులు,గేదలు.వాటి దూడలు,దొడ్డి నిండా ఎంత సందడో. 
ఆ టైం కి మా ఆవు ఈనింది అనుకొంది ఇంకాఎక్కువ పని ...
జున్ను కూడా ఉంటుంది అనుకొండి 

వేసవి సెలవులంటే మావిడి పళ్ళు ,తాటి ముంజలు,తెగలు,సిమచిన్తకాయలు,.......ఎన్నో.

అమ్మ వండే  పిండి వంటలు,అందరికి కలిపి ఒకే కంచంలో కొత్తావకాయ కలిపి అమ్మపెట్టె చద్దన్నం ముద్దలు.

కొబ్బరి బూరెలు,కారప్పుస,అరిసెలు,ఇంకా ఎన్నో!చిన్ననాటి స్నేహితులు,వారితో ఆడుకునే ఆటలు.

రాత్రిళ్ళు ఆరుబయట పడక,మడత మంచాలు,నవారు మంచాలు,వేసుకొని ఆకాశం వంక చూస్తూ చెప్పుకునే దయ్యాల కధలు, 

మధ్యలో  ఎక్కడికైనా సరదా ప్రయాణం కడితే  రైలు ఎక్కంగానే కిటికీ పక్కన సీట్ కోసం పిల్లల పోట్లాటలు.

మొత్తానికి తలా కాసేపు అని ఒప్పందం జరుగుతుంది.

పాపం అమ్మలందరూ ఎలా భరిస్తారో ఏమో?రైలు ప్రయాణం ఒక అద్భుతం .

రాత్రి అవ్వంగానే పై బెర్ట్ మిద పడుకోవడం,పొద్దున్నే లేవడం,
దిగినతర్వాట లగేజ్ లెక్కపెట్టుకోవడం,వాటితో పాటు పిల్లలని లెక్కపెట్టడంఆటో,టాక్సీ, కోసం పరుగులు,కులిల అరుపులు,  వారితో బేరాలు,హడావిడే హడావిడి. 

     ఇలా రాసుకుంటూ పొతే ఎన్నెన్నో జ్ఞాపకాలు .

     ఇంతలోనే సెలవులు ఐపోయాయి .

          వేపచెట్టు ఉయ్యాలను గుర్తుతేస్తుంది .వాన చినుకు మట్టి పడవలను గుర్తు తెస్తుంది ,మనసెప్పుడు బాల్యం వైపే పరుగెడుతుంది .అందుకే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మనసెప్పుడు పసిదే . 
     




  

30, మార్చి 2021, మంగళవారం

ఆంధ్ర పిత ఆవకాయ

 

"ఒక్క మాటు ఇలా తోట లోంచి వెళ్లి, మా బామ్మగారు రమ్మంటున్నారు అని అవ్వకి చెప్పు తల్లి .. అందరూ వచ్చేశారు, మీకోసమే చూస్తున్నారు అని కూడా చెప్పేం.. మర్చిపోవద్దు...

" ఓ నాలుగు సార్లు బామ్మచేత ఇలా బతిమాలించుకుని, అడ్డదారిన అవ్వవాళ్ల  ఇంటికి పరిగెత్తాను నేను.

 అప్పటికే అత్త వాళ్ళ  ఇంటికి, అమ్మమ్మ  గారి  ఇంటికి రెండేస్సార్లు వెళ్లి రావడం అయ్యింది, జల్లెడ కోసం.

 ఆ మధ్యలోనే మావిడికాయలన్నీ తుడిచేసి , ఆరబెట్టేశాను.
 చిన్నపిల్ల నన్న పేరే కానీ ఎన్నిపనులో. కొత్తావకాయ ఊరికే వస్తుందా మరి? 

 

నాకసలు అలా ఇంట్లోనుంచి బయటికి తిరగడం అంటే భలే సరదా.

రోజూ అలా తిరగడానికి ఉండదు కదా!!

అలా అని బామ్మ అడిగిన వెంటనే పని చేసేశామనుకో, ఇంక బతిమాలదు మనల్ని. అదే కాసేపు ఆగితే దార్లో తినడానికి ఏదో ఒకటి పెట్టి మరీ పంపిస్తుంది.

ఇట్టే వెళ్లి అట్టే అవ్వ గారిని తీసుకొచ్చేశాను. 

వేసంకాలం సెలవలు కదా, బడి లేదు. 

ఆవకాయ పనులకోసమని మధ్యాహ్నం భోజనాలు తొరగా అయిపోయాయి. 

అమ్మ, బామ్మ వరస చూస్తుంటే టీ  కూడా ఉండేలా లేవు.


కారాలు దంపడానికి మంగమ్మా, సుబ్బలక్ష్మీ వచ్చేశారు. 

అమ్మ అప్పటికే కుంది రోలు, రోకళ్ళు కడిగి పెట్టేసింది. 

పెద్ద పెద్ద పొట్లాల్లో ఉన్న ఎండు మిరపకాయలు, ఆవాలు పళ్ళాల్లో పోసి ఎండలో పెట్టేసింది. 

జాడీలో ఉన్న రాళ్లుప్పు కూడా విడిగా ఎండబెట్టేసింది.

కుంది రోలు తులసి కోట పక్కకి లాక్కుని,
 "ముందర కారం కొట్టేత్తావండి" అంటూ మిరపకాయలు అందుకున్నారు ఆడవాళ్ళిద్దరూ.

అమ్మేమో దంపిన కారం జల్లించడానికి సిద్ధంగా ఉంది.
చూస్తుండగానే ఖణేల్ ఖణేల్ మంటూ రోకలి చప్పుళ్ళు మొదలైపోయాయి పెరట్లో. 

"ఇదిగో మంగమ్మా, భద్రం. గతమాటు నీ విసురుకి రోకలి పొన్ను విరిగిపోయింది,"
 బామ్మ జాగ్రత్తలు మొదలు పెట్టేసింది. 


నాన్న గారు మావిడికాయలు తరగడానికి కూర్చున్నారు. 

నాకేమో తరిగిన ముక్కలు తుడిచే పని. 

అసలు ఆవకాయ పెట్టడంలో అన్ని పనులకన్నా కష్టమైనదీ,
జాగ్రత్తగా చేయాల్సిందీ ఇదే. 

ఓ పాత గుడ్డతో తరిగిన ప్రతీ ముక్కనీ జాగ్రత్తగా తుడవాలా. 

పెచ్చు మీద ఓ చిన్న మైకా కాగితం లాంటి పొర ఉంటుంది. 

అది ఊడి చేతిలోకి వచ్చేదాకా ఊరుకోకూడదు. గోకైనా తీసేయాలి. 

అలా తియ్యలేదనుకో, ఆవకాయ్ పాడైపోతుంది.

 నేనుఒక్కదానినే  అంత ముఖ్యమైన పని చేస్తున్నాననైనా లేకుండా, మధ్య మధ్యలో బామ్మ బోల్డన్ని ఆర్డర్లు. 


కారం ఓ నాలుగు దంపులు దంపేసరికి మంగమ్మ బుగ్గనేసుకోడానికి బెల్లమ్ముక్క అడిగింది. 

అలా వేసుకుంటే దంపడం సులువౌతుందిట. 

ఏమిటో, నా పనికే ఏ సులువులూ లేవు. 

"దేవుడు గదిలో నీలం మూత సీసాలో బెల్లం ముక్కలు ఉంటాయి, నిమ్మళంగా సీసా పట్టుకురా తల్లీ " అంది బామ్మ. 

అసలు ఎవరూ చెప్పకుండానే ఆ సీసా ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు. 

ఎలా తెలుసో ఎవరికీ చెప్పననుకో. 

ఓ బెల్లమ్ముక్క గుటుక్కుమనిపించి, సీసా తెచ్చి బుద్ధిగా బామ్మకిచ్చా. మంగమ్మతో  పాటు  బామ్మ నాకూ ఓ ముక్కిచ్చింది "మా తల్లే " అంటూ. ఈ ముక్క బుగ్గనేసేసుకున్నా. 


నేనెంత తొరగా తుడుస్తున్నా, నాన్న గారు గబాగబా  కోసేస్తున్నారు కదా. 

తుడవాల్సిన ముక్కలు పెరిగిపోతున్నాయి. దంపేవాళ్ళు ఉస్సు అస్సు అంటున్నారు.. అందరికీ చెమటలు కారిపోతున్నాయ్.

 ఇలాంటి పని ఏ రాత్రో పెట్టుకోవాలి కానీ, ఈబామ్మకేంటో ఏవీ తెలీదు, చెప్పినా వినదు. 

 చూస్తుండగానే అన్నేసి మిరపకాయలూ దంపడం అయిపోయింది. 

 మజ్జిగ తేట తాగేసి ఆవాలు రోట్లో పోసుకున్నారు వాళ్ళు. అవ్వ గారు చెప్పినట్టు వాళ్ళంత గబగబా చేయడం మనకి రాదు. 

 బామ్మ కూడా మధ్యలో ముక్కలు తుడవడానికి వచ్చింది కానీ, మళ్ళీ ఏదో పనుందని వెళ్ళింది. 


మొత్తానికి మా ముక్కల పని అయ్యేసరికి, వాళ్ళు ఆవపిండి, ఉప్పు కూడా దంపేసి, కూరా పులుసూ పట్టుకుని వెళ్ళిపోయారు. 

అమ్మ అప్పటికే కడిగి ఆరబెట్టిన పెద్ద జాడీని తులసికోట దగ్గరికి పట్టుకొచ్చింది. 

జాడీ ఎంత ఉంటుందంటే, అందులో నేను ములిగిపోతాను.

 అప్పటికి నీరెండ పడుతోంది. 

 బామ్మ, నేను తుడిచిన మావిడి ముక్కలు, ఉప్పు, కారం, ఆవపిండీ జాడీలోకి దింపి బాగా కలుపుతోంటే, అమ్మ నూని కేన్లు బయటికి పట్టుకొచ్చింది. 

 ఎంతనూనో! ఆ నూనితో ఎన్నేసి జంతికలూ, చేగోడీలూ, పాలకాయలూ చేసుకోవచ్చో నేను లెక్కలేసుకుంటుంటే, 

 అవ్వ గారి పర్యవేక్షణలో అమ్మ, బామ్మ కలిసి ఆ నూనంతా జాడీలోకి వంపేసి, బాగుచేసిన మెంతులు జాడీలో పోసి బాగా కలిపేశారు. 

 అంతే, ఆవకాయ పెట్టడం అయిపోయింది. జాడీని దేవుడి గదిలోకి సాయం పట్టేశారు. 


మూడో రోజు సాయంత్రం నేను అన్నం తింటోంటే "కాస్త రుచ్చూడు" అంటూ కొత్తావకాయ విస్తట్లో వేసింది బామ్మ. 

ఓ ముద్ద తిని, "కొంచం ఉప్పగా ఉంది" అన్నాన్నేను. 

అంతే, బామ్మకి కోపం వచ్చేసింది.
"దీపాలెట్టాక ఉప్పు ఉప్పు అనకూడదు.." అంటూ వాదించేసింది. 

మరి ఉప్పుడుపిండి కావాలంటే ఏమని అడగాలో? ????

రాత్రి అన్నంతిన్న నాన్న, కూడా అదే మాట, ఉప్పు తగులుతోందని. 

ఈసారి బామ్మకి కోపం రాలా. 

సాయంత్రం చంటిది  ఉప్పుంది  కానీ, దాని  మోహం దానికేం  తెలుసులే అనుకున్నాను" అంది, నేను నిద్రపోతున్నాననుకుని.

"రేపు తిరగేశాకా కూడా తగ్గకపోతే, ఓ నాలుక్కాయలు తరిగి పడేద్దావండత్తయ్యగారూ" అని అమ్మ అనడం కూడా వినిపించింది నాకు. 

పెచ్చులకి మాత్రం ఎవరూ పేరు పెట్టలా...
ఏడాదంతా అయ్యింది కానీ, ఒక్కళ్ళకీ విస్తట్లోకి మైకా కాయితంముక్క  రాలేదు.