Pages

18, మార్చి 2021, గురువారం

బామ్మ గారా మజాకా!

ఒక చిన్న టౌన్ లో వున్న కోర్ట్ లో ,

ఒక కేసు విచారణ సందర్భంగా ఒక బామ్మ గారిని సాక్షిగా పిలిచి బోనెక్కించారు. 

పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆవిడ దగ్గరికి వెళ్ళి , 

" మామ్మ గారు నేనెవరో మీకు తెలుసా ?" అని అడిగాడు దర్పంగా నల్ల కోటు సర్దుకుంటూ...

ఆవిడ వెంటనే ," అయ్యో ,తెలియక పోవడమేంటీ..?

బాగా తెలుసును..

పెద్దపిచ్చయ్యగరి రెండో అబ్బాయి గోవిందానివి కదూ......

నీ చిన్నప్పటి నుండీ నిన్నూ ,మీ కుటుంబాన్నీ ఎరుగుదును నాయనా..! నిజంచెప్పాలంటే 
చిన్నప్పుడు నిన్ను ఎందుకూ పనికిరావు అనుకునేదాన్ని . 

అబధ్ధాలాడేవాడివి,జనాన్ని మోసం చేసేవాడివి ,

ఆఖరుకి నీ భార్యని కూడా మోసం చేసావ్ ..పైసాకా పనికిరాకపోయినా , 

గొప్పలు పోయేవాడివి .నాకు బాగా తెలుసు ను కదా !"  అంది.

P.P. గారు హడిలి పోయి ,బిక్క చచ్చి పోయారు. ఏం మాట్లాడాలో తెలియక , డిఫెన్సు లాయరు గారిని చూపించి , " వారు తెలుసా ..? "అని అడిగాడు.

బామ్మగారు ఠక్కున , "మాబాగా తెలుసును..జేబులు కత్తిరించే వీరదాసు కొడుకు

కుమారదాసు కదా .. చిన్నప్పుడు పనీ పాటాలేకుండా వీధులెంట బలాదూర్ తిరిగేవాడు.లేని దురలవాటులేదు..తాగుబోతు, తిరుగుబోతు కూడానూ !ఇతనిది 

అందరి కంటే చెత్త ప్రాక్టీసు అని ఊరంతా చెప్పుకుంటారు. పైగా ముగ్గురు స్త్రీలతో అక్రమ సంబంధం ..అందులోఒకరు మీ ఆవిడే కదా ! నాకు తెలీకేం , బాగా తెలుసు ...

" అంది గుక్క తిప్పుకోకుండా ."

డిఫెన్స్ గారికి చచ్చినంత పనైంది . 

జడ్జి గారు ఇద్దరు లాయర్లని తన దగ్గరికి పిలిచి ,రహస్యంగా , "మీ ఇద్దర్లో ఎవరైనా

తెలివి తక్కువగా , జడ్జి గారు తెలుసా అని ఆవిడని అడిగారంటే ,కోర్టు ధిక్కారం కేసు

కింద జైల్లో తోయించేస్తా ,జాగ్రత్త !!"అని బెదిరించాడు.

లాయర్లు షాక్ !! బామ్మ రాక్స్ !!



                                                                                                    (సేకరణ )

17, మార్చి 2021, బుధవారం

పచ్చదయినదమ్మా మా కోనసీమా కొండపల్లి బొమ్మా ఈ పల్లె భామా

కోనసీమనీ గోదారినీ తలచుకున్నప్పుడల్లా ఏదో తెలియని ఉద్వేగం. 

ఓవైపు గలగలా గోదారి, మరోవైపు గంభీర కెరటాల సముద్రం.. చుట్టూ ఆకుపచ్చని 

గొడుగులు పాతినట్టుగా ఆకాశంలో పచ్చాపచ్చని గూళ్ళు అల్లే కొబ్బరి చెట్లు.. 🌴🌴🌴

మధ్య మధ్యలో అరటి చెట్లు, అల్లంత దూరాన సరిహద్దులు గీసే తాడిచెట్లు, 

పచ్చని పొలాలకి పాపిడి తీసినట్టుండే గట్లు.. వాటి వెంబడి పూల మొక్కలూ, పళ్ళ

 చెట్లూ.. ఎంత భాష సరిపోతుంది కోనసీమని వర్ణించడానికి?!!

 

ఊహతెలిసినప్పటినుంచీ  తెలిసిన ప్రపంచం అంతా సప్తవర్ణ శోభితమే.🌈🌈

నిద్రలేస్తూనే మండువా లోకి వస్తే ఎదురుగా  ఉదయించే సూర్యుడు, 

తల పక్కకి తిప్పితే ఎత్తైన  కొబ్బరి అడవి. 

పెరట్లో అరటి చెట్లు, దబ్బ చెట్టు, కూరగాయ మడులు.. 

దాటి కొంచం ముందుకు వెడితే కొబ్బరి తోట. 

ఓ పక్క మావిడి చెట్టు, మరోపక్క వేప చెట్టు, ఇంకోపక్క వెలగచెట్టు. 

సరిహద్దులో పాముపుట్టని ఆనుకుని సంపెంగ పొద, అనాస పొదలూ.

 ఆవెంటే కనకాంబరాలలాంటి ఆకుపచ్చని పూలు పూసే పేరుతెలియని 

మొక్కలు. 


అటుగా ఓ అడుగేస్తే పక్క వాళ్ళ తోటలో ఈత చెట్లూ, నేరేడు 

చెట్లూ. కాకులు, చిలకలు, పాలపిట్టలతో పాటు పేరు తెలియని పక్షులెన్నో. ఇక 

సీతాకోకచిలుకలైతే ఏరకం పూలమీద ఏ చిలుక వాలుతుందో నిద్రలో లేపినా చెప్పేసేంత జ్ఞానం!! 

పసుపురంగు కోల రెక్కలుండే సీతాకోకచిలుకలైతే ఎలాంటి పూల మీదైనా 

వాలేస్తాయి. అదే నలుపు మీద తెలుపు, ఎరుపు చుక్కలుండే పెద్ద రెక్కలవైతే 

మందారాలని విడిచి పక్కకి చూడవు. నల్లరెక్కల మీద తెల్లని చారలుండే బుజ్జి 

పిట్టలు సీతాఫలాలని బతకనివ్వవు. పిందె పండుగా మారుతూ ఉండగానే ఈతాకు బుట్టలు కట్టేయాల్సిందే. 


దొండ పాదుకి రోజూ కోసినా కాయలు కాస్తూనే ఉంటాయి. 

పొట్ల పాదు పూత నిలబడగానే చిన్న చిన్న రాళ్ళకి పురికొస తాళ్ళు కట్టి సిద్ధం

పెట్టుకోవాలి, కాయలు వంకర్లు తిరిగిపోకుండా కాసుకోడం కోసం.

  • శీతాకాలపు ఉదయాలు --- మంచు తెరల్ని చీల్చుకుంటూ పచ్చని చెట్ల మీద ఉదయించే సూర్యుడూ
  • వేసవికాలపు సాయంత్రాలు --- రోజంతా గాడ్పుల తర్వాత ఒక్కసారిగా చల్లబడే సాయంత్రాలూ.
  •  వర్షాకాలపు మధ్యాహ్నాలు --- ముసుగేసుకుని పడుకోవాలనిపించే ముసురేసిన మధ్యాహ్నాలూ ఎక్కడైనా బావుంటాయి 

కానీ, కోనసీమలో అయితే అద్భుతంగా ఉంటాయి


మొదటిసారి గోదారిని చూసిన అనుభవం ఎప్పటికీ తడి ఆరని ఓ జ్ఞాపకం.

 సైకిలు మీద నాన్నతో కలిసి ఏటిగట్టు మీద ప్రయాణం.

 నాన్న సైకిలు తొక్కుతూ ఉంటే చెరువు కన్నా ఎన్నో 

రెట్లు పెద్దగా ఉన్న గోదారిని కళ్ళు విప్పార్చుకుని గోదారిని చూడడం బాల్య జ్ఞాపకం .


వినగలగాలే కానీ గోదారి ఎన్నెన్ని కబుర్లు చెబుతుందో. 

ఎంత చక్కని వక్తో, అంతకి మించిన శ్రోత కూడా. 

చెప్పడం చేతనవ్వాలి ఎటొచ్చీ.. చూడ్డానికి ఎంత ప్రశాంత 

గంభీరంగా ఉంటుందో, అంతకు అనేకరెట్లు లోతైన నది కదా మరి. 

వినగలగాలే కానీ గోదారి గలగలల్లో సంగీతం వినిపిస్తుంది.. 

చూడగలిగితే సాహిత్యం కనిపిస్తుంది. 

ఓ సంగీత రూపకం లానో, గేయ కావ్యంలాగో అనిపిస్తుంది. 

చూసే కళ్ళకి గోదారి నడకల్లో నాట్యం కనిపిస్తుంది. 

ఎన్నో పాటలు , కధలు కవితలు పుట్టుకకు స్ఫూర్తి మా గోదారమ్మ , కోనసీమ ..🙏🙏


      



లోక సమస్త సుఖినో భవంతు

**** మీ ఉషగిరిధర్ ***********


11, మార్చి 2021, గురువారం

🌼🌼దక్షిణ కైలాసం... శ్రీ కాళహస్తి🌼🌼

 ఎన్నో క్షేత్రాలను దక్షిణ కాశీగా పిలుస్తున్నా దక్షిణ కైలాసంగా పేరుగాంచింది మాత్రం ఒక్క శ్రీకాళహస్తీశ్వరాలయమే. 

పంచభూత లింగాలలో ఒకటైన వాయు లింగం కొలువై ఉన్న ఈ ఆలయంలో అడుగు పెట్టినంతనే భక్తులకు ముక్తి లభిస్తుందంటారు. 

అంతేకాదు, సర్పదోష, రాహుకేతు గ్రహ దోష నివారణలకు దేశంలోనే పేరుగాంచిన పుణ్యక్షేత్రమిది. 

న మఃశివాయలో... ‘న’ అంటే నభము (ఆకాశం), ‘మ’ మరుత్ (వాయువు), ‘శి’ శిఖి (అగ్ని), ‘వా’ వారి (జలం), ‘య’ అంటే యజ్ఞం (భూమి). 

ఈ అయిదింటికీ ఓంకార నామాన్ని చేర్చి ఉచ్చరించడం వల్ల ఆదిదేవుని అనుగ్రహం పొంది సర్వపాపాలూ హరించిపోతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి.

అలాంటి పంచ భూతాత్మకుడైన పరమశివుడు వాయులింగం రూపంలో ఉద్భవించిన క్షేత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలోని కాళహస్తిలో ఉన్న శ్రీ కాళహస్తీశ్వరాలయం.

 మిగిలిన నాలుగూ ఫృథ్వీలింగం (కాంచీపురం), జలలింగం (జంబుకేశ్వరం), అగ్నిలింగం (తిరువణ్నామలై), ఆకాశలింగం (చిదంబరం) తమిళనాడులో ఉన్నాయి. 

 కాళహస్తీశ్వరుడు వాయు లింగం రూపంలో ఉన్నాడనడానికి ప్రతీకగా గర్భాలయంలో లింగం పక్కన ఉన్న రెండు దీపాల్లో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుందట.


బ్రహ్మదేవుడు జ్ఞానం పొందిన క్షేత్రం


కృతయుగం ప్రారంభంలో బ్రహ్మ దేవుడు మహా శివుడి ఆజ్ఞను ధిక్కరించడం వల్ల అజ్ఞానంతో సృష్టి కార్య నిర్వహణలో విఫలమవుతాడు. 

పోగొట్టుకున్న జ్ఞానాన్ని తిరిగిపొందేందుకు కైలాసంలో తేజోవిరాజితమైన శివానందైక నిలయమనే శిఖరాన్ని తన భుజస్కంధాలపై తీసుకుని భూలోకంలో ఓ పవిత్ర ప్రదేశంలో ప్రతిష్ఠించి పూజించాలనుకుంటాడు.

 ఆ ప్రకారంగా శివానందైక శిఖరాన్ని కాశీ క్షేత్రానికి 190 యోజనాల దూరంలో దించుతాడు బ్రహ్మ. 

 అక్కడ పంచముఖాలతో కూడిన మహా శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసి, శాపం నుంచి విమోచనం పొందుతాడు. 

 అలా శ్రీకాళహస్తి క్షేత్రం దక్షిణ కైలాసంగా ప్రఖ్యాతి పొందింది. ప్రస్తుతం దాదాపు 5500 ఎకరాల్లో ఈ కైలాసగిం¹ులు విస్తరించి ఉన్నాయి. 

 బ్రహ్మదేవుడి మాదిరిగానే వాయులింగేశ్వరుడి దేవేరి అయిన పార్వతీ దేవి కూడా శివుడి కోసం తపస్సు చేసి జ్ఞానామృతాన్ని పొందడంతో ఈ క్షేత్రంలో జ్ఞాన ప్రసూనాంబికగా కొలువుదీరింది.


భక్తుల పేరుతోనే...


శ్రీ (సాలీడు), కాళము (సర్పం), హస్తి (ఏనుగు)... ఈ మూడు మూగ జీవాల భక్తికి మెచ్చి ముక్తిని ప్రసాదించిన శివుడు ఇక్కడ శ్రీ కాళహస్తీశ్వరుడిగా కొలువు దీరాడు. 

అదెలాగంటే... పూర్వం తామ్రపర్ణీ నదీ తీరంలో నివసించే కరబుడు చీరల అల్లకంలో దిట్ట. 

పుట్టినప్పట్నుంచీ శివ భక్తుడైన అతడు దుష్ట సావాసంతో శివారాధన విస్మరించి, వైదిక ధర్మాలను విడిచి పెట్టడంతో అనారోగ్యానికి గురై తనువు చాలించాడు. 

మరుజన్మలో సాలీడుగా దక్షిణ కైలాసంలో జన్మించాడు. ఈ సాలీడు తన దారాలతో వాయులింగేశ్వరుడికి కైలాసంలో ఉన్నట్లు వేదికలూ భవనాలను అల్లుతూ ఉండేదట. 

దాని భక్తిని పరీక్షించదలచి ఓరోజు శివయ్య ఆ అల్లికలను అగ్నికి ఆహుతి చేశాడట. అది చూసి భరించలేక అగ్నిలో దూకిన సాలీడుకి శివుడు సాయుజ్యాన్ని ప్రసాదించాడు.


కాళము(సర్పం)... హస్తి(ఏనుగు)ల కథ కూడా ఇలాంటిదే. లోగడ ఇద్దరు శివ భక్తులు పూర్వ జన్మ పాపాలతో అష్టకష్టాలూ పడుతూ వచ్చారు.

 ఆ ఇద్దరూ మరు జన్మలో దక్షిణ కైలాసంలో సర్పం, ఏనుగు రూపాల్లో జన్మించారు. పాము రోజూ ఓ మణిని తీసుకొచ్చి లింగానికి అర్పించి పూజలు చేస్తూ ఉండేది. 

 కొన్నాళ్లకు అక్కడ లింగాన్ని చూసిన ఏనుగు స్వర్ణముఖీ నదిలో స్నానమాచరించి తొండంతో నీళ్లు తెచ్చి లింగానికి అభిషేకం చేసి, మారేడు బిల్వ పత్రాలతో శివార్చన చెయ్యడం మొదలు పెట్టింది. 

 అయితే ఏనుగు మరుసటి రోజు వచ్చేసరికి మారేడు దళాలన్నీ కిందపడిపోయి ఉండేవి. అది చూసి ఏనుగు అసంతృప్తి చెందేది. 

 సర్పం కూడా తాను దేవుడికి అర్పిస్తున్న మణి కింద పడిపోయి ఉండటం వల్ల ఎందుకిలా జరుగుతోందని ఆలోచించింది. 

 విషయం తెలుసుకుందామని ఓరోజు లింగాన్ని చుట్టుకుని పడుకుంది. ఆ సమయంలో ఏనుగు రావడం, పూజ చేసేందుకు మణిని పక్కకు తొయ్యడం చూసిన పాము కోపంతో ఏనుగు తొండంలోకి దూరింది. 

 దాంతో బాధను తట్టుకోలేక ఏనుగు తన శిరస్సును కొండకు ఢీ కొట్టడంతో రెండు జీవులూ శివైక్యం పొందాయి. అలా ఈ క్షేత్రం శ్రీ కాళహస్తి అయింది.


మహా భక్తుడైన కన్నప్ప ఏకంగా తన కళ్లనే తీసిచ్చింది ఇక్కడి శివుడికే. అందుకే, కాళహస్తిలో తొలి పూజను అందుకుంటున్నాడు భక్త కన్నప్ప.


రాహు కేతు పూజలతో ఖ్యాతి


పుత్ర శోకానికి గురైన వశిష్ఠ మహర్షికి దక్షిణకైలాసంలోనే పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనిమిచ్చాడట శివయ్య. 

ఆ నాగరూపం కారణంగానే కాళహస్తి ‘రాహు కేతు క్షేత్రం’గా కూడా వర్ధిల్లుతోంది. 

సర్ప దోషం, రాహు కేతు గ్రహ దోషాల నుంచి నివారణ కోసం దేశ విదేశాల నుంచి ఎందరో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. 

క్రీస్తు శకం మూడో శతాబ్దం నుంచే అభివృద్ధి చెందినట్లు చారిత్రక ఆధారాలున్న ఈ ఆలయానికి వెళ్తే మహాదేవుడి దర్శనంతో పాటు అలనాటి శిల్పకళా వైభవాన్నీ దర్శించుకోవచ్చు. 

పాతాళ వినాయకుడు, శ్రీకృష్ణ దేవరాయల విజయస్తంభం, జలవినాయకుడి ఆలయం, భరద్వాజ తీర్థం, వేయి లింగాల తీర్థం, ఆలయానికి దక్షిణం వైపున ఉన్న బ్రహ్మ గుడి... ఇలా దర్శించుకోదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి కాళహస్తిలో.
 



                      లోక సమస్త సుఖినో భవంతు

                      **** మీ ఉషగిరిధర్ ****

10, మార్చి 2021, బుధవారం

మొదట ఉపోషం

అప్పుడు నేను మూడో తరగతి.
పండగలు వచ్చాయంటే కొత్త బట్టలు కుట్టిస్తారనీ, పిండి వంటలు చేస్తారనీ, బోయినాలు ఆలస్యమవుతాయనీ,
శివరాత్రి,కార్తీక సోమవారాలు "ఉపోషాలు" ఉంటారనీ మాత్రమే తెలిసిన రోజులు.

"అమ్మా.. రేపు నేనుకూడా మీతోపాటు ఉపోషం ఉంటానమ్మా..
అన్నం తినకూడదు, అంతే కదా.. నేనుండగలనమ్మా..
జొరం వచ్చినప్పుడు అన్నం తినకుండా ఉంటున్నానుకదా.."

 రోజంతా బతిమాలగా బతిమాలగా ఎట్టకేలకి సాయంత్రానికి నా శివరాత్రి  ఉపవాస వ్రతానికి అమ్మ అనుమతి దొరికేసింది. 

 "రేపు మళ్ళీ నువ్వు ఉపోషం కదా. అన్నం తినవు కదా.. పొద్దున్నే నీరసం వచ్చేస్తుంది. ఓ రెండు ముద్దలు ఎక్కువ తినాలి మరి.." 

అని ఆవేళ రాత్రి ఎప్పుడూ తినేదానికి డబుల్ కోటా తినిపించేసిందా.. ఓ పక్క నాకు ఆవులింతలొచ్చేస్తూ కళ్ళు బరువుగా వాలిపోతుంటే అప్పుడింక ఒకటే జాగ్రత్తలు.

 "ఇదిగో.. నువ్వు ఎప్పుడు ఉండలేకపోతే అప్పుడు నాకు చెప్పెయ్యాలి, తెలిసిందా. మధ్యాహ్నం ఆకలేసినా చెప్పెయ్యి. వంట చేసేస్తాను.." అంటూ.. నేను వింటూ వింటూ నిద్రలోకి జారుకున్నాను.

మర్నాడు పొద్దున్నే స్నానం చేసొచ్చేశామా.
ఇంక గుళ్ళోకెళ్ళి అభిషేకం చేయించుకుని రావాలి. 

ఎప్పుడూ ఖాళీగా ఉండే శివాలయం ఆవేళ ఒకటే హడావిడిగా ఉంది.
ఊళ్ళో వాళ్ళందరూ గుళ్ళోనే ఉన్నారు.

 "గుళ్ళో అభిషేకం ఆలస్యం అయ్యేలా ఉంది కదా చంటి . నువ్వు పాలు తాగెయ్యి," అంది అమ్మ, తను మాత్రం కాఫీ తాగలేదు. 

 అదే అడిగితే "కాఫీ తాక్కూడదమ్మా.. పాలు పర్వాలేదు.." అని చెప్పిందే కానీ,
తను మాత్రం పాలు కూడా తాగలేదు.
నాన్న నన్ను బడికి పంపాలనుకున్నారు కానీ, అమ్మ ఒప్పుకోలేదు, "ఉపోషం పూటా ఏం వెళ్తుంది .." అని.

గుళ్ళో అభిషేకం చేయించుకుంటే ప్రసాదం ఇవ్వకుండా ఉండరు కదా. 

అసలే పూజారిగారు మాకు బాగా తెలుసు కూడాను.
కొబ్బరి చెక్కలు, అరటిపళ్ళు పళ్ళెంలో పెట్టి ఇచ్చారు. 

గుడి బయటకి రావడం ఆలస్యం, అమ్మ కొబ్బరి చెక్క ముక్కలుగా కొట్టీ, అరటి పళ్ళు ఒలిచీ నాకు అందించేసింది..
"ప్రసాదం వద్దనకూడదమ్మా,  తినాలి" అని కూడా చెప్పింది. 

నేను భక్తిగా ప్రసాదాన్ని ఆరగిస్తుండగా,
 "ఇవాళ  మా 
చంటి కూడా ఉపోషం" అని మిగిలిన భక్తులకి  చెప్పింది అమ్మ.
వాళ్ళంతా నా భక్తిని ఎంతగానో మెచ్చుకున్నారు. అంత చిన్నపిల్లలెవరూ ఉపోషాలు ఉండరుట.

ఇంటికి రాగానే మళ్ళీ బోల్డన్ని పాలు కాచి వాటిలో పంచదార, అటుకులు వేసి ఇచ్చింది నాకు. 

"అటుకులు తినొచ్చు, అన్నం తినకూడదు కానీ," అని చెప్పెయ్యడంతో నేను ఆ పాలటుకుల పని పట్టాను. 

మధ్యాహ్నం అవుతుండగా చాలా ప్రేమగా మళ్ళీ అడిగింది
"అన్నం వండేయనా? చిన్న పిల్లలు ఉపోషం ఉండకపోయినా పర్వాలేదు" అని. 

నేనొప్పుకోలేదు. ఉపోషం ఉండాల్సిందే అనేశాను, కచ్చితంగా.
 "పిల్ల ఉపోషం ఉంది , ఎవర్నైనా పిలిచి బొండాలు తీయించండి" అని నాన్నకి పురమాయించేసింది.

బొండాలు చెట్టు దిగడం ఆలస్యం, రెండు బొండాల్లో నీళ్ళు నాచేత తాగించడమే కాదు, కొబ్బరి మీగడ అంతా తినిపించేసింది అమ్మ.  

"ఉపోషాలు ఉండేవాళ్ళు బొండాలు తాగొచ్చు" అనడంతో నేనింకేమీ మాట్లాడలేదు. 

సాయంత్రం కాఫీల వేళ నాకు పెద్ద గ్లాసుడు పాలిచ్చి, బిస్కట్లైనా, రస్కులైనా ముంచుకుని తినమంది.
నేను "బిస్కట్లు తినొచ్చా?" అని సందేహం వెలిబుచ్చితే, 

"అన్నం తినకూడదు కానీ మిగిలినవి ఏవన్నా తినొచ్చు" అని మళ్ళీ హామీ ఇచ్చేసింది. పాలతో పాటు కాసిన్ని బిస్కట్లు నమిలాను.

దీపాల వేళ అయ్యిందో లేదో,   నేనేమో మండువాలో మంచం వాల్చుకుని కూర్చుని, నక్షత్రం కనిపిస్తుందేమో అని కొబ్బరాకుల మధ్యనుంచి కళ్ళు చికిలించుకుని ఆకాశంలోకి చూడడం. 

అలా చూస్తూ నేను కాసిని పాలు తాగేసరికి అమ్మ కొట్టక బుట్టలు , కొబ్బరి పచ్చడి , తిమ్మనం రడీ చేసింది , నక్షత్రం రావడం జరిగిపోయింది. 

ఇంకేముంది, నువ్వుల నూనె వేసుకుని ఫలహారం  చేసేశా.
"ఇంతేనా ఉపోషం ఆంటే.. బామ్మెప్పుడూ బోల్డు హడావిడి చేసేస్తుంది.
తను రాగానే చెప్పాలి, నేను ఉపోషం ఉన్నానని" అనుకుంటూ నిద్రపోయా.

మర్నాడు స్కూల్లో మేష్టారు అడిగారు, ముందు రోజు ఎందుకు రాలేదని. 

"శివరాత్రి కదండీ, ఉపోషం ఉన్నాను" అని చెప్పగానే ఆయన ఎంతగా మెచ్చుకున్నారంటే, నాకు ఫస్టు మార్కులొచ్చినప్పుడు కూడా ఆయనెప్పుడూ అంతగా మెచ్చుకోలేదు. అది మొదలు నేనెప్పుడూ ఉపోషం మిస్సవ్వలేదు.

లోక సమస్త సుఖినో భవంతు

**** మీ ఉషగిరిధర్ ****

24, ఫిబ్రవరి 2021, బుధవారం

చిలకమర్తి వారు పకోడీపై కొన్ని పద్యాలు

 చిలకమర్తి వారు పకోడీపై కొన్ని పద్యాలు ఆశువుగా చెప్పారు.

 పద్యాలు చదివి పకోడీ రుచి ఆస్వాదించండి.


వనితల పలుకులయందున
ననిముష లోకమున నున్న దమృతమటంచున్
జనులనుటె గాని, లేదట
కనుగొన నీయందమృతము గలదు పకోడీ !

ఎందుకు పరమాన్నంబులు
ఎందుకు పలు పిండివంటలెల్లను నాహా ! నీ
ముందర దిగదుడుపున కని
యందును సందియము కలుగ దరయ పకోడీ !

ఆ కమ్మదనము నా రుచి
యా కర కర యా ఘుమ ఘుమ, యా పొమకములా
రాకలు పోకలు వడుపులు
నీకేదగు నెందులేవు పకోడీ !

నీ కర కర నాదంబులు
మా కర్ణామృతములు, నీదు మహితాకృతియే
మా కనుల చందమామగ
నే కొనియాడెదను సుమ్ము నిన్ను పకోడీ!

ఆ రామానుజు డాగతి
పోరున మూర్చిల్ల దెచ్చె మును సంజీవిన్
మారుతి ఎరుగడు, గాక, య
య్యారె నిను గొనిన బ్రతుకడట పకోడీ !

హరపురుడు నిన్ను దిను నెడ
గరుగదె యొక వన్నె నలుపు గళమున, మరి చం
దురుడున్ దినిన కళంకము
గరుగక యిన్నాళ్లు నుండగలదె పకోడీ!


కోడికి బదులు పకోడీ తినమని బ్రాహ్మణులకు బ్రహ్మ వరమిచ్చాడని,
లక్ష్మణుడు మూర్చకు మారుతికి పకోడీ వుందని తెలియక సంజీవని కోసం పరిగెత్తాడని, చమత్కారంగా హాస్యంగా రచన చేశారు.
కందం చెప్పినవాడే కవి అన్న వాడుకను సార్ధకం చేశారు.

ఈ పకోడీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు గుర్తు తెచ్చుకుని రుచి ఆస్వాదించవచ్చు.. కానీయండి మరి.



23, ఫిబ్రవరి 2021, మంగళవారం

ఐదు నక్షత్రాలహోటల్ లో చద్దన్నం

మా చిన్నపటి  మా ఇంట్లో 'చద్దన్నాల గది' ఒకటి ఉండేది .  

అందులో రాచ్చిప్ప లో  చద్దన్నం  ఉండేది .

చద్దన్నాల గదిలో పిల్లల్ని వరసాగ్గా కూర్చోపెట్టి చద్దన్నాలు పెట్టేసేవాళ్ళ . 

అసలు చద్దన్నం తినడం ఒక కళ. 

ఈ చద్దన్నాన్ని సాధ్యమైనంత ఎక్కువ సేపు పెరుగులో కలపాలి. 

ఈ కలపడంలో పెరుగు మీగడ వేళ్ళకి  అంటుకుని వెన్నగా మారుతుంది. 

ముందుగా ఆ వెన్న పని పడితే, ఈలోగా పెరుగులో నానిన అన్నం తినడానికి అనువుగా ఉంటుంది.

అందులోకి ఏ మాగాయ టెంకో, ఆవకాయ పెచ్చో నంజుకుని తాపీగా తింటూ ఉంటే, 

చివరి ముద్దకి వచ్చేసరికి ఆవులింత వచ్చి, కళ్ళు మూతలు పడాలి,

అయినా బడికెళ్లడం తప్పదనుకో.

ఒక్కోసారి అమ్మే కలిపిచ్చేస్తుందనుకో.

శీతాకాలంలో గడ్డ పెరుగు భలేగా ఉంటుంది కానీ, వేసంకాలం వచ్చేసరికి కొంచం పులుపు తగులుతుంది. ఉప్పేసుకున్నా బాగోదు. 

వేసంకాలం తరవాణీ కి ఎక్కువ ప్రాధాన్య( గంజీ ఉప్పూ వేసి ఊరబెట్టి తరవాణీ చేస్తారు ఒక దెబ్బకు వేసి )

పెరుగు లేని రోజు ... గొంగూర పచ్చడి ,ఉల్లిపాయ , నువ్వల నూనె  లో తింటే ..

 స్లీపింగ్ టాబ్లెట్స్ ఎందుకు పనికి రావు .. అంత నిద్దర వస్తుంది 😴😴😴😴

వేసంకాలం చద్దన్నాల స్పెషలు మావిడిపళ్ళు. పళ్ళు ఎక్కడ ముగ్గేస్తారో తెలుసు కదా.. మనవే కావలసినవి ఏరుకుని తెచ్చుకోడం, చద్దన్నంతో పాటు తినేయడం. 

ఇంక, అమ్మ నోరు నొప్పెట్టేలా పిల్చే వరకూ మధ్యాహ్నం భోజనానికి వెళ్ళలేం. ఆకలనిపించదు కదా. 

మిగిలిన రోజుల్లో చక్రకేళి అరిటిపళ్ళూ అవీ ఉంటాయి కానీ, మావిడిపండు రుచి దేనికీ రాదు మరి. 

అందులోనూ చద్దన్నంతో అయితే ఒకటి తిందామనుకుని రెండు తినేస్తాం. 

పైగా ఇంట్లో వాళ్ళు కూడా, "ఇప్పుడు కాకపొతే, ఇంకో నెలపోయాకా తిందావన్నా దొరకవూ" అంజెప్పేసి, తినగలిగినన్ని తినెయ్యమంటారు. 

ఇప్పుడు  ఇంట్లో 'చద్దన్నాల గది' ,రాచ్చిప్ప లేక పోయిన ... 

బాధ పడక్కరలేదు ..ఐదు నక్షత్రాలహోటల్ లో దొరుకుతోంది అంట ....



18, ఫిబ్రవరి 2021, గురువారం

ఒకప్పటి "హర్షవల్లి" ఈ నాడు "అరసవిల్లి"

ఏడు గుర్రాల రథంలో సూర్య దేవుడు వస్తున్నాడు   

మాఘ మాసం శుక్ల పక్షం లో సూర్యుని ఉత్తరాయణ ప్రవేశం జరిగిన ఏడవ రోజు (సప్తమి) సూర్య జయంతి. 

ఇదే  రథ సప్తమి  

ఈ రోజు ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు ఏడు గుర్రాల రథంలో గగన వీధిన పయనిస్తాడు.

ఏడు గుర్రాలు ఇంద్ర ధనుస్సు లోని ఏడు రంగులకు,
వారం లోని ఏడు రోజులకు ప్రతీకలు. 


సూర్యుని రథ సారథి అరుణుడు.  
సూర్యోదయానికి ముందు వచ్చే అరుణకాంతి భానుని ఆగమనానినికి గుర్తు.
అరుణుడు కశ్యప మహర్షి-వినత ల పుత్రుడు.
తల్లి తొందరపాటు వలన అర్ధదేహం తో జన్మించాడు.
ఊరువులు (తొడలు) లేనివాడు గనుక అరుణుడిని 'అనూరుడు' అని కూడా అంటారు.


రథ సప్తమి నాడు జిల్లేడు ఆకు, రేగు పండు తలపై పెట్టుకుని ఉదయాన్నే స్నానం చేస్తారు. 

చిక్కుడు కాయలతో రథాలు చేసి, పరవాణ్ణం వండి చిక్కుడు ఆకులలో పెట్టి సూర్య భగవానునికి నివేదిస్తారు. 

  

    సప్తాశ్వ రథమారూఢమ్ ప్రచండం కశ్యపాత్మజం 

    శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

తాత్పర్యం: ఏడు గుర్రాల రథాన్ని అధిరోహించిన, మిక్కిలి తేజోవంతుడు, కశ్యప మహాముని పుత్రుడు, తెల్లని పద్మాన్ని ధరించిన సూర్య దేవా నీకు నేను నమస్కరిస్తున్నాను.

ప్రత్యక్షదేవుడు అయిన సూర్యుడు కశ్యప మహర్షి-అదితి ల పుత్రుడు.

అందువలన ఆదిత్యుడు అని కశ్యపాత్మజుడు లేదా కాశ్యపేయం అని అంటారు.  

తెలుగు వారికి చిరపరిచితమైన ప్రముఖ సూర్య దేవాలయం శ్రీకాకుళం జిల్లా లో శ్రీకాకుళం పట్టణానికి ఒక కిలోమీటరు దూరంలో గల "అరసవిల్లి". 

ఇక్కడ శ్రీ సూర్య నారాయణ మూర్తి ఉషా, ఛాయా, పద్మినీ సమేతంగా వెలిశాడు. 
ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు "రామలింగ స్వామి" గా వెలసిన పరమ శివుడు.
ఈ క్షేత్ర వర్ణన ఈ శ్లోకంలో చూడండి.


        హర్షవల్లీ పురీవాసం చాయోషా పద్మినీయుతం

        సూర్యనారాయణ దేవం నౌమి సర్వార్థదాయకం 


ఒకప్పటి "హర్షవల్లి" ఈ నాడు "అరసవిల్లి" గా పిలువబడుతున్నది. 

ఈ అరసవిల్లి దేవాలయం విశిష్టత  ఏమిటంటే ఆలయ నిర్మాణం జరిగిన తీరు అపూర్వం. 

ఎందుకంటే ప్రతి ఏడాది కేవలం ఆరు నెలల వ్యవధిలో రెండు సార్లు మాత్రం ప్రభాత సూర్యుని తొలి కిరణాలు ఆలయ గోపురం నుండి ధ్వజ స్థంభం మీదుగా వచ్చి నేరుగా స్వామివారి పాదాలను తాకుతాయి. 

వేరే రోజులలో ఇటువంటి ఘటన జరగదు. ఈ వింత చూడటానికి భక్తులు తండోపతండాలుగా అరసవిల్లి దేవాలయాన్ని ప్రాతః కాలమే దర్శిస్తారు. 
సూర్య నారాయణ స్వామి వారికి భక్తులు 'వెండి కన్ను', 'బంగారు కన్ను' సమర్పిస్తారు. 

అలా చేస్తే చర్మ మరియు నేత్ర సంబంధమైన జబ్బులు దూరమై ఆరోగ్యవంతులుతారని నమ్మకం. 

అరసవిల్లి దేవాలయం గోడలపై అగస్త్య మహర్షి శ్రీ రామునికి ఉపదేశించిన ఆదిత్య హృదయం మరియు గ్రహస్తుతిని తెలిపే నవగ్రహ స్తోత్రం భక్తులకు అనువుగా వ్రాయబడ్డాయి.
నవగ్రహ స్తోత్రం లో కూడా సూర్య దేవుని వర్ణన వుంది.

            జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం

            తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం 

రథ సప్తమి మొదలుకుని సగటు ఉష్ణోగ్రత రోజు రోజుకూ పెరుగుతూ వసంత ఋతువుకు దారి తీసి మనకు మరో ఉగాది  నిస్తుంది..



లోక సమస్త సుఖినో భవంతు

**** మీ ఉషగిరిధర్ ****