Pages

29, జనవరి 2021, శుక్రవారం

నా మొదట సైకిల్

మనకి వంశ పారం పర్యం గా సంస్కృతి, సంప్రదాయం,ఆస్తి కాకుండా కొన్ని వస్తువులు కూడా వస్తాయి ... 

అలా నాకు నా 9 వ తరగతి లో వచ్చింది ఒక సైకిల్ 🚲🚲🚲🚲

కోతికి కొబ్బరికాయ ఇస్తే ఏమవుతుందో , 

నా చేతికి ...క్షమించాలి .....కాలికి ....సైకిల్ ఇచ్చాక మా ఇంట్లో వాళ్ళకి తెలిసొచ్చింది.

”అందుగలడిందులేడను సందేహము వలదు” 

లాగా మా బుల్లి ఊరి లో ఎక్కడ చూసినా నేనే కనిపిస్తూ వుండేదాన్ని.

ఒక బజారులో పని ఉంటే మరి రెండు బజార్లు అదనంగా తిరిగి వచ్చేదాన్ని.


రోజూ ఉదయాన్నే లేవగానే మొహం కడుక్కుని మా అమ్మ మెత్తని చీర చెంగుతో మొహం తుడుచుకునే నేను.

మా అమ్మ మెత్తని చీరెలు చించి సైకిల్ తుడుచుకోవటం మొదలు పెట్టా.

ఐదు రూపాయలకి పొడవు గొట్టం ఉండే నూనె డబ్బా ఒకటి కొని దాన్లో కొబ్బరినూనె పోసి సైకిల్ చైన్లో,పెడల్స్ కి, బ్రేక్ వైర్స్ కి వేసుకోవడం.

విమానానికి  కూడా అంత సర్వీసింగ్ చేస్తారో లేదో మరి.✈✈✈✈😝😝


ఎప్పుడు కొంచెం ఖాళీ దొరికినా ఓ గుడ్డ ముక్క తీసుకుని సైకిల్ తుడుచుకోవటం.

స్టీల్ రిమ్ముల మీద నా ఫేస్ కనపడేలా మెరిసిందా లేదా చూసుకోవటం ఇలా ఉండేది నా సైకిల్ బానిసత్వం.

ఇంట్లో వాళ్ళకి నా కొత్తొక వింత రోత పుట్టినా సైకిల్ వలన బయట పనులు త్వరగా చేస్తున్నాను కదా అని భరించేవాళ్ళు పాపం.

నెమ్మదిగా ఆ సైకిల్ అనే యంత్రం నా జీవితంలో ఓ ముఖ్యభాగం అయిపోయింది.

మొదట్లో వింతగా గొప్పగా ఉన్న నా సైకిల్ రాను రాను నాకు మచ్చికైన పెంపుడు జంతువులా తయారైంది.

నేను కూడా కొంచం  పొడవు పెరిగినట్లు ఉన్నాను. కాళ్ళు నేలపై ఆనేవి. 

కాలేజీ కి వచ్చాక దానికి కొన్ని హంగులు అద్ది (కొత్త బుట్ట ,బెల్ ) నాన్న ఇచ్చారు ... 


నా సైకిల్ ఎంత గట్టి ది అంటే ... 

ఒక సారి  మా లెక్కలు ప్రవేటు లో ... పక్క సైకిల్ వచ్చి నా సైకిల్ మీద పడింది ... 

నేను నా సైకిల్ పైకి తీసి దులిపి .. తొక్కు కుంటూ ఇంటికి వెళ్లి పోయాను .. 

మరనాడు నాకు తెలిసింది ...పాపం ఆ సైకిల్ ఊసలు విరిగి పోయాయి అని  ... 


నా చదువు పూర్తి అయ్యే వరకు నేను చాల జాగరత గా చూసుకున్న నా సైకిల్ 

నాకు ఉద్యోగం వచ్చాక ముందు తరాల వారికి ఇచ్చేసారు మా నాన్న గారు... 

ఇంతకూ ఇది ఇప్పడు ఎందుకు రాస్తున్నాను అనుకుంటున్నారా ... 


ఈ  రోజు నేను మళ్ళి కొత్త సైకిల్ కొనుక్కున్నాను ... 

కానీ ... చిన్నప్పటి సైకిల్ కి దినికి చాల తేడా ఉంది 


అప్పుడు సైకిల్ తొక్కితే చెమట పట్టేది . 

ఇప్పడు చెమట పట్టడం కోసం సైకిల్ తొక్కుతున్నాను ... అది ఒక గది లో 


ఏమి చేస్తాం కాలం మారింది 😟😟

                                      


ఆరోగ్యమే మహా భాగ్యం

లోక సమస్త సుఖినో భవంతు
**** మీ ఉషగిరిధర్ ****

27, జనవరి 2021, బుధవారం

మెట్ట వంకాయతో ...ముద్ద పచ్చడి

ఆకుపచ్చ రంగులో మిలమిలా మెరుస్తూ, గుండ్రంగా, గుండుచెంబుల్లా ఉండే వంకాయలకి మెట్ట వంకాయలు అని పేరు.  

వీటిని అల్లం, పచ్చిమిర్చి,  కొత్తిమీర కారంతో కూర చేసుకోవచ్చు.

 అలాగే కాల్చి పచ్చడి కూడా చేసుకోవచ్చు. 

 ముద్ద పచ్చడి,బండ పచ్చడి, పులుసు పచ్చడి, పచ్చి పులుసు.. 

ఇలా కొద్దిపాటి మార్పులతో రకరకాల పచ్చళ్ళు చేసుకునే వీలు కూడా ఉంది. 

 జుట్టున్నమ్మ ఏకొప్పు చుట్టినా అందమే అన్నట్టుగా,!!!!!!!!!!!!!!

 అసలంటూ నవనవలాడే వంకాయలు దొరకాలే కానీ ఏ పచ్చడి చేసుకున్నా రుచే. 

మా చిన్నప్పుడు పెరట్లో నీళ్ళపొయ్యి మీద ఇంటిల్లిపాదికీ స్నానాలకి వేడి నీళ్లు కాచడం రోజూ ఓ మహా యజ్ఞం. 

పొద్దున్నే తోటకి వెళ్లిన నాన్న వస్తూ వస్తూ కూరలు తెచ్చేవాళ్ళు. 

వాటిలో ఈ వంకాయలు కనక ఉంటే, వాటిని పొయ్యిలో కాల్చే డ్యూటీ కూడా నీళ్లు కాచే వాళ్లదే. 

నీళ్ళపొయ్యి స్థానంలో గ్యాస్ స్టవ్ వచ్చినా, 

రోలు-రోకలి బండల్ని మిక్సీ రీప్లేస్ చేసినా

 మెట్ట వంకాయలు దొరికినప్పుడల్లా పచ్చడి చేసుకోవాల్సిందే. 

ముందుగా వంకాయలకి కాస్త నూనె పట్టించి, చిన్న బర్నర్ల ని లో ఫ్లేమ్ లో పెట్టి సమంగా కాల్చుకోవాలి. 

వంకాయ ఎంత వైనంగా కాలితే పచ్చడి అంత రుచిగా వస్తుందన్న మాట. 

వంకాయతో చేసే ఏ పచ్చడికైనా కాల్చడం కామనే.  

కాల్చిన వంకాయల్ని చల్లార్చి, 

మాడిన పైపొరని జాగ్రత్త తీసి,

 ముచికలు కోసేసి, గుజ్జుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.

 కాలిన నుసి పొరపాటున గుజ్జులో కలిసిపోకుండా చూసుకోడంతో పాటు,

 వంకాయలు చూడ్డానికి ఎంత అందంగా ఉన్నా పొట్టలో పురుగూ పుట్రా ఉండే ప్రమాదం ఉంది కాబట్టి, గుజ్జుని కొంచం జాగ్రత్తగా మెదిపి పరిశీలించుకోవడం అవసరం. 

 గుజ్జు మీద కాస్త పసుపు చల్లి, చెంచా సాయంతో మెత్తగా చేసుకోవాలి. 

ఈ  గుజ్జుని ఓ పక్కన పెట్టుకుని, ఏ రకం పచ్చడి చేసుకోవాలి అన్నది అప్పుడు తీరికగా ఆలోచించుకోవచ్చు. 

నేను ఇప్పుడు  ముద్ద పచ్చడి చేస్తూ నాను...పైన  చేసి పెట్టుకున్న గుజ్జుకి 

చక్కగా పోపు ===శనగ పప్పు , పొట్టు మినపప్పు , పచ్చిమిరపకాయలు ముఖ్యముగా గుమ్మడి వడియాలు  పెట్టుకుని . 

వారం వర్ధం ఏమి లేని రోజు  ఉల్లిపాయలు  చక్కగా వేయించి కలుపుకుంటే .....

ఆ రుచి అద్భుతః 😋😋😋😋😋

  చిన్నప్పుడు చేసే రోటి పచ్చడి ఎలా ఉండేదంటే కాల్చి, తొక్కతీసిన వంకాయలు రోట్లో వేసి బండతో నూరేవారు. 

  రుచిలో ప్రధానమైన తేడా ఇక్కడే వస్తుంది. 

మనం ఈ చెంచాలు అవీ వాడి ఎంత జాగ్రత్తగా చేసినా ఆ బండ తాలూకు రుచి రాదుగాక రాదు. 

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, రోళ్లలో వాడే పచ్చడి బండలు ఎర్ర చందనపు దుంగల నుంచి చేసేవాళ్ళు. 

  పైగా రోకలికి ఉన్నట్టుగా బండకి పొన్ను ఉండదు కాబట్టి, వద్దన్నా కాస్త ఎర్ర చందనం ఈ పచ్చళ్లలో కలుస్తూ ఉంటుంది. 

నాటి పచ్చళ్ళ రుచి తెలియని వాళ్లకి నేటి పచ్చడి రుచి మేటిగానే ఉంటుంది. 

తెలిసిన వాళ్ళు కూడా చేసేదేమీ ఉండదు,

 చిన్న నిట్టూర్పుతో సరిపెట్టేసుకోడం తప్ప!!!!!!!!!!!!!!!

ఇంతకు  ఇప్పుడు ఇది అంతా ఎందుకు చెపుతున్నాను అనుకుంటున్నారా .. 

ఈ  రోజే ఊరు నుంచి నాన్నగారు  మెట్ట వంకాయలు పంపారు 

నేను ముద్ద పచ్చడి చేసుకుంటు ఇలా మీతో కూడా పంచుకుంటున్నాను !!!!!!!!!!

మీకు కూడా దొరికితే కొంచం చేసుకుని రుచి చూడండి ...ముఖ్యముగా గుమ్మడి వడియాలు పోపు  పెట్టుకోవడం మరచి పోకండి . 





అన్నదాత సుఖీభవా 

లోక సమస్త సుఖినో భవంతు

**** మీ ఉషగిరిధర్ ****




26, జనవరి 2021, మంగళవారం

చిన్ననాటి గణతంత్ర దినోత్సవ౦

మేము గదిలో ఓ మూల కూర్చుని పాట ప్రాక్టీసు చేసుకుంటున్నా౦ చక్కగా. ....

మగపిల్లలు పురికొసలు కాలవలోకి పట్టుకెళ్లి  నానబెట్టి, ఆ తర్వాత ఎండబెట్టాలి.

రంగు  రంగుల జెండా కాయితాలు  కత్తిరించి  పురికొస తాడుని బడి బయట ఆ 

చివర నుంచి ఈ చివరికి వరసలుగా కట్టి,

 ఇంటి దగ్గరనుంచి తెచ్చిన వేడి వేడి ఉడికించిన మైదా తాడుకి పులమాలి.............

 జెండా కాగితాలు చిరిగిపోకుండా తాడుకి అతికించాలి 

 హమ్మయ్య పురికొస అంతా రంగురంగుల జెండా కాగితాలతో నిండిపోయింది..

 మిగిలిన జెండాలు గుమ్మాల పైనా, బోర్డు పైనా  అతికించేస్తే జెండాల పని అయిపోయినట్టే.

 ఈ పైన కట్టే పని మాత్రం పొడుగు పిల్లలదే. 

వొచ్చే ఏడాదికైనా వాళ్లంతా పొడుగైపోతే బాగుండును అనిపించేస్తుంది కొందరికి !!!!!!!

అక్కడితో మగ పిల్లల పని ఐపోతుంది  


సరే, ఇప్పుడింక మా  పని మొదలవుతుంది. 

మధ్యాహ్నం బళ్లోకి వచ్ఛేప్పుడే తెల్ల ముగ్గు, రంగు ముగ్గులూ తెచ్చేసుకుంటాం కదా 

 టీచర్స్ దగ్గరుండి జెండా కర్ర చుట్టూ రంగు ముగ్గు పెట్టించేస్తారు. 

ముగ్గులతోనూ, జెండాలతోనూ బడి భలే కొత్తగా అయిపోతుంది కదా. 


అప్పుడేమో మేష్టారు, 

మర్నాడు పొద్దున్నే జెండాలో వెయ్యడానికి పువ్వులు అవీ ఎవరెవరు తేవాలో  చెప్పేసి, 

పొద్దున్నే ఉతికిన బట్టలు కట్టుకుని ఆలీసం చెయ్యకుండా బడికొచ్చేయాలని, 

ఎవ్వరూ మానకూడదనీ చెప్పేసి ఇంటికి పంపిస్తారు. ఇంటికొచ్చేమంటే 

జెండా పండగ సగం అయిపోయినట్టే. 

ఇంక మర్నాడు తెల్లారిందంటే ఇంట్లో ఒకటే హడావిడి. 

మామూలు పండగల్లాగే తలంటేస్తుంది అమ్మ.

 కుంకుడు కాయ రసం కానీ కంట్లో పడిందంటే కళ్ళు ఎర్రగా అయిపోతాయి. 

"అబ్బే మా నాన్నగారు అస్సలు 

కొట్టలేదు.. కుంకుడ్రసం పడిందంతే"


ఇంక బళ్ళోకెళ్లింది మొదలూ ఎండలో 

నిలబెట్టి 'ఎటేంషన్' లు' 'స్టెండిటీజ్' లూను. సగం ముగ్గులు చెరిగిపోయి, 

మనకి కాళ్ళు నొప్పులు మొదలయ్యాక అప్పుడొస్తారు పెద్దమనుషులు,

జెండా ఎగరెయ్యడానికి. . 

ఓ నాలుగు 'ఎటేంషన్' లు' 'స్టెండిటీజ్' లూ అయ్యాక వచ్చే 'ఎటేంషన్' లో పెద్దమనుషులు జెండా కర్ర దగ్గర కొబ్బరి కాయలు కొట్టి,

 జెండా ఎగరేసేస్తారు. 

మేము పాటలు పాడేస్తా౦. 

ఈలోగా మేష్టారు కొబ్బరి చెక్కల్ని చిన్న చిన్న ముక్కలు చేసి వాళ్ళింట్లో బేసిన్లో 

తెచ్చుకున్న పంచదారలో కలిపేస్తారు. 

ఇంకో బేసిన్లో చాకలేట్లు, బిస్కట్లు కూడా కవర్లు చింపేసి పోసేస్తారు. 


అది మొదలు పెద్ద మనుషులు 

గణతంత్ర దినోత్సవ౦   గురంచి చాల చెపుతారు .. 

 

హమ్మయ్య! చిన్న 

చిన్న కాగితం ముక్కల్లో కొబ్బరి ముక్కలూ అవీ ఇచ్చేస్తారు.... ఎప్పటిలాగే మేష్టారు గారు

 "పడెయ్యకూడదు.. గాంధీ గారి ప్రసాదం" అని చెప్పి 

అక్కడితో జెండా పండగ ముగిసింది 



          గణతంత్ర దినోత్సవ౦ శుభాకాంక్షలు 


25, జనవరి 2021, సోమవారం

కృష్టుని మేలు కొలుపులు

 

1. కేశవ యని నిన్ను వాసిగ భక్తులు వర్ణించు చున్నారు మేలుకో,

వాసవ వందిత వసుదేవ నందన  వైకుంఠ వాసుడా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


2. నారాయణా నిన్ను - నమ్మిన భక్తుల  కరుణ బ్రోతువు వేగ మేలుకో,

శరణన్న రక్షణ బిరుదు నీకున్నది  శశిధర సన్నుతా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


3. మాధవ యని నిన్ను యాదవులందరు మమత జెందుతున్నారు మేలుకో,

చల్లని చూపుల తెల్లని నామము  నల్లని నాస్వామి మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


4. గోవింద యని నిన్ను గోపికలందరు  గొల్లవాడందురు మేలుకో,

గోపీమనోహర గోవర్ధనోద్ధార  గోపాలబాలుడా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


5. విష్ణు రూపముదాల్చి విభవము దర్శించి విష్ణు స్వరూపుడ మేలుకో,

దుష్టసంహారక దురితము లెడబాపు సృష్టి సంరక్షక మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


6. మధుసూదన నీవు మగువ తోడుత గూడి మరచి నిద్రించేవు మేలుకో,

ఉదయార్క బింబము ఉదయించు వేళాయె వనరుహ లోచన మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


7. త్రివిక్రమా యని శక్రాదులందరు విక్రమ మందురు మేలుకో,

శుక్రాది గ్రహములు సుందరరూపము చూడగోరుచున్నారు మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


8. వామన రూపమున భూదాన మడిగిన పుండరీకాక్షుడా మేలుకో,

బలిని నీ పాదమున బంధన జేసిన కశ్యప నందనా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


9. శ్రీధర గోవింద, రాధా మనోహర యాదవ కులతిలక మేలుకో,

రాధాపధూమణి రాజిల్క నంపింది పొడచూతువుగాని మేలుకో || కృష్ణ తెల్లవారవచ్చేను ||


10. హృషీకేశ యీ భువియందు ఋషులందరు వచ్చి కూర్చొన్నారు మేలుకో,

వచ్చినవారికి వరములు కావలె వైకుంఠ వాసుడా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


11. పద్మనాభ నీదు పత్ని - భాగాదులు వచ్చి కూర్చున్నారు మేలుకో,

పరమ తారకమైన పావన నామము పాడుచు వచ్చిరి మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను||


12. దామోదరా యని దేవతలందరు దర్శించ వచ్చిరి మేలుకో,

భూమి భారము మాన్ప బుధుల బ్రోవను రావె భూకాంత రమణుడా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


13. సంకర్షణ నీవు శత్రుసంహార మొనర్ప సమయమై యున్నది మేలుకో,

పంకజాక్షులు నీదు పావన నామము పాడుచు వచ్చిరి మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను||


14. వాసుదేవా నీకు భూసుర పత్నులు భుజియింప దెచ్చిరి మేలుకో,

భూసురంబుగ యాగసంరక్షణ కొరకు వర్ణింపు చున్నారు మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


15. ప్రద్యుమ్న రూపుడ అర్జున వరదుడ దుర్జన సంహార మేలుకో,

అబ్జవంశమునందు ఉద్భవించియు కుబ్జ నాదరించిన దేవ మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


16. అనిరుద్ధ యని నిన్ను అబ్జభవాదులు అనుసరింప వచ్చె మేలుకో,

అండజవాహన అబ్ధిసంహరణ దర్భశయన వేగ మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


17. పురుషోత్తమా యని పుణ్యాంగనలంతగ పూజలు జేతురు మేలుకో,

పురుహూతవందిత పురహర మిత్రుడ పూతన సంహార మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


18. అధోక్షజ మిమ్ము స్మరణ జేసినవారి దురితము నెడబాప మేలుకో,

వరుసతోడుత మిమ్ము స్మరణ జేసినవారి వందన మొసగెద మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


19. నారసింహ నిన్ను నమ్మిన భక్తుల కరుణబ్రోతువు వేగ మేలుకో,

శరణన్న రక్షణబిరుదు గల్గిన తండ్రి శశిధరసన్నుతా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


20. అచ్యుతా యని నిన్ను సత్యముగ వ్రతవిధులు కొనియాడవచ్చిరి మేలుకో,

పచ్చని చేలమూ అచ్చంగ దాల్చిన లక్ష్మీమనోహర మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


21. జనార్ధనా నీవు శత్రుసంహార మొనర్చ సమయమైయున్నది మేలుకో,

పంకజాక్షులు నీదు పావననామము పాడుచువచ్చిరి మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


22. ఉపేంద్రా యని నిను సువిదలందరు గూడి యమునతీర మందున్నారు మేలుకో,

గోపీకాంతలు నీదురాక గోరుచున్నారు మురళీనాదవినోద మేలుకో || కృష్ణా  తెల్లవారవచ్చేను||


23. హరి యని నిన్ను కొనియాడ గోపికా జనులంత వచ్చిరి మేలుకో,

అష్టభార్యలు నీదు రాకగోరుచున్నారు వనమాలికాధర మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను||


24. శ్రీకృష్ణా యని నిన్ను గోపాల బాలురు బంతులాడ వచ్చిరి మేలుకో,

కాళీయ మర్ధన కౌస్తుభ మణిహార కంససంహరణా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


25. శ్రీరామ యని మునులు స్థిరభక్తితో మిమ్ము సేవించుచున్నారు మేలుకో,

తాటకీసంహార ఖరదూషణాంతక కాకుత్థ్సకులరామా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


26. తెల్లవారవచ్చె దిక్కులు తెలుపొందె నల్లని నాస్వామి మేలుకో,

వేళాయె గోవులమందకు పోవలె గోపాల బాలుడా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


         


హరా కృష్ణ హరా కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

                                           



అతిరథ మహారథులు..అంటే..ఎవరు?

అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం. 

అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం 

మనకు అర్థమవుతుంది. 

అయితే ఆ పదాలకు సరైన అర్థం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. 

మహామహా గొప్పవాళ్ళు వచ్చారనే అర్థంలో వాడతామనేది అందరికీ తెలుసు. 

ఆ పదాలకు అర్థాలేమిటో చూద్దాం.

యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి. 

ఇందులో 5 స్థాయులున్నాయి. అవి..

రథి, అతిరథి, మహారథి, అతి మహారథి, మహామహారథి.


1) రథి..ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలడు.

సోమదత్తుడు, 

సుదక్షిణ, 

శకుని, 

శిశుపాల, 

ఉత్తర, 

కౌరవుల్లో 96మంది, 

శిఖండి, 

ఉత్తమౌజులు, 

ద్రౌపది కొడుకులు ---------------------వీరంతా..రథులు.


2) అతి రథి (రథికి 12రెట్లు)..60,000మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.


లవకుశులు, 

కృతవర్మ, 

శల్య, 

కృపాచార్య, 

భూరిశ్రవ, 

ద్రుపద, 

యుయుత్సు, 

విరాట, 

అకంపన, 

సాత్యకి, 

దృష్టద్యుమ్న, 

కుంతిభోజ, 

ఘటోత్కచ, 

ప్రహస్త, 

అంగద, 

దుర్యోధన, 

జయద్రథ, 

దుశ్శాసన, 

వికర్ణ, 

విరాట, 

యుధిష్ఠిర, 

నకుల, 

సహదేవ, 

ప్రద్యుమ్నులు--------------.వీరంతా..అతిరథులు.


3) మహారథి (అతిరథికి 12రెట్లు)....7,20,000 మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.


రాముడు, 

కృష్ణుడు, 

అభిమన్యుడు, 

వాలి, 

అంగద, 

అశ్వత్థామ, 

అతికాయ, 

భీమ, 

కర్ణ, 

అర్జున, 

భీష్మ, 

ద్రోణ, 

కుంభకర్ణ, 

సుగ్రీవ, 

జాంబవంత, 

రావణ, 

భగదత్త, 

నరకాసుర, 

లక్ష్మణ, 

బలరామ, 

జరాసంధులు ---------------వీరంతా..మహారథులు.


4) అతి మహారథి (మహారథికి 12రెట్లు)...86,40,000 (ఎనభై ఆరు లక్షల నలభైవేలు) మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు.


ఇంద్రజిత్తు, 

పరశురాముడు, 

ఆంజనేయుడు, 

వీరభద్రుడు, 

భైరవుడు ----------------వీరు..అతి మహారథులు.


రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతి మహారథులు, 

అటు ఇంద్రజిత్తు - 

ఇటు ఆంజనేయుడు. 

రామలక్ష్మణ రావణ కుంభకర్ణులు మహారథులు మాత్రమే.


5) మహామహారథి (అతిమహారథికి 24రెట్లు) ...ఏకకాలంలో 207,360,000

(ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేలు) మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలడు.


బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, 

దుర్గా దేవి, 

గణపతి మరియు 

సుబ్రహ్మణ్య స్వామి, -----------------వీరంతా..మహామహారథులు.




                                                          🙏🙏🙏🙏🙏


                                      జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 

" బద్ధకం..."

 "నాక్కొంచం బద్ధకం..." ఏదో ఒక సందర్భంలో ఈ మాట  అనని వాళ్ళు ఎవరూ ఉండరేమో కదా.. 

నావరకైతే మరీ తరచూ కాదు కానీ, అప్పుడప్పుడన్నా ఉపయోగిస్తూ ఉంటాను. 

బద్ధకం గొప్పదనం ఏమిటంటే ఇది మన దిన చర్యతో పాటే మొదలవుతుంది. 

చక్కగా ఉదయాన్నే లేవాలనుకుంటామా? మెలకువ రాగానే "

ఒక్క పది నిమిషాలు పడుకుని అప్పుడు లేద్దాం.....😴😴😴.....

ఈలోగా ప్రపంచం ఏమీ తలక్రిందులు అయిపోదు కదా.." అని అ శరీరవాణి చెబుతుంది. 

ఎప్పుడూ ఎవరి మాటా వినని వాళ్ళు కూడా ఈ మాటలు బుద్ధిగా వింటారు.

అది మొదలు మనం చేయాల్సిన ప్రతి పనినీ కాసేపైనా వాయిదా వేసేస్తూ ఉంటాం, 

కేవలం బద్ధకం వల్ల.

 అలా అని ఆ పని చేయడం ఏమన్నా తప్పుతుందా? ఆంటే అదీ లేదు.!!!!!!!

ఎందుకంటే అది మన జన్మ హక్కు. 

బద్ధకించినందుకు గాను ఏదో ఒక రూపంలో మూల్యం చెల్లిస్తూనే ఉంటామా..

అయినా కూడా బద్దకించడం మానం. అలా అలవాటైపోతుందన్న మాట.😞😞

ఉదాహరణకి, చిన్నప్పుడు బళ్ళో మేష్టారు, ఇంట్లో పెద్దోళ్ళు

 "ఎప్పటి పాఠాలు అప్పుడు చదివేసుకోండి.." అని మన చెవుల్లో బంగ్లాలు కట్టుకుని మరీ చెప్పినా మనం విన్నామా? లేదు..📚📚📚

 పరీక్షలప్పుడు బుద్ధిగా నైటౌట్లు చేసి, మనం టెన్షన్ పడి, వాళ్ళని టెన్షన్ పెట్టి, కాలక్రమేనా వాళ్ళని ఇలాంటి టెన్షన్లకి అలవాటు చేసి మన చదువు పూర్తి చేశాం. 

"మేమిలా అస్సలు చెయ్యలేదు" అని ఎవరన్నా అన్నారంటే వాళ్ళు అత్యంత బుద్ధిమంతులైనా అవ్వాలి లేక అతిపెద్ద అబద్ధాలకోరులైనా అవ్వాలి. 

ఇప్పుడు మళ్ళీ పిల్లలకి హితబోధలు చేయడానికి మనం అస్సలు మొహమాట పడం, అది వేరే విషయం.

నావరకు నేను కొన్ని విషయాల్లో అస్సలు బద్ధకించను.

 కాఫీ, టిఫిన్, బోయినం.. ఇలాటి విషయాల్లో అన్నమాట. ☕🍛🍛🍕

మన బద్ధకం కేవలం ఇంటికి మాత్రమే పరిమితం అయితే ఇంక మన గొప్పదనం ఏముంది??????

 కాబట్టి, ఆఫీసు పనిలో కూడా మనం బద్ధకిస్తూనే ఉంటాం. 

అది మన హక్కు$$$$$

 అయినా చెప్పిన పని వెంటనే చేసేస్తే, ఆ వెనుకే మరో పని వెతుక్కుంటూ వచ్చేయదూ?? ????????

అయితే ఇలా బద్దకించి పని వాయిదా వేయగలిగే అదృష్టం అందరికీ ఉండదు.

బద్ధకం కేవలం మనుషులకి మాత్రమే కాదు@@@@@@@

 జంతువులకీ, వస్తువులకీ కూడా సహజమే. 

ముఖ్యంగా పెంపుడు జంతువులకి ఉండే బద్ధకం వాటిని పెంచే వాళ్ళకే తెలుస్తుంది. 

వస్తువుల విషయానికి వస్తే, కొంచం వయసైపోయిన టీవీ ఆన్ చేయగానే దృశ్యం చూపించకుండా కాస్త నెమ్మదిగా ఆ పని చేస్తుంది. 

పాత కారు, ఫ్రిజ్జు.. ఏదైనా సరే.. ఇదే పరిస్థితి దాదాపుగా. 

ఈ పోస్ట్  రాద్దామని నేను మూడు రోజులుగా బద్దకించి వాయిదా వేస్తున్నాను. ....




**అందుకే అన్నారు 
జీవితం లో భయాన్ని మించిన శత్రువు
బద్ధకాన్ని మించిన అపకారి 
ఎవరూ ఉండరు అని**



                                  లోక సమస్త సుఖినో భవంతు

                                  **** మీ ఉషగిరిధర్ ****


24, జనవరి 2021, ఆదివారం

మార్నింగ్ వాక్ తెచ్చిపెట్టిన తంటాలు

ఈ రోజు ఆదివారం కదా అని పొద్దున్నే సరదాగా మా వీధిలో ఉన్న వనస్థలి (park) కి వెళ్లాను...

వెళ్ళిన దానిని నా వాకింగ్  నేను చేసుకోకుండా 

అక్కడ ఎవరో  కొందరు కూర్చుని ఏదో వ్యాయామం చేస్తుంటే చూద్దామని దగ్గరికి వెళ్ళా....

 ఈమధ్య మా వనస్థలి లో  కొన్ని వ్యాయామ పరికరాలు కొత్తగా పెట్టారట ..

 వాళ్ళందరూ వాటిని చేస్తున్నారు అని నాకు అర్థం అయింది .

కొంచెం దగ్గరికి వెళ్లి చూద్దామని వెళ్ళాను ...

అక్కడ వాళ్లు కింద కూర్చుని ఒక పెద్ద చక్రం లాంటిది దాన్ని చేత్తో తిప్పుతున్నారు....చూడడానికి మన ఇంట్లో రొలు లా ఉంది

 ఇంకొంచెం ముందుకు వెళితే కొంతమంది పెద్ద కర్ర లాంటి దాన్ని చేత్తో తిప్పుతున్నారు

చూడడానికి మన మజ్జిగ కవ్వ లా ఉంది...

అన్నీ నాకు తెలిసిన వస్తువు లేకదాన్ని నేను ఇంటికి తిరుగుముఖం పట్టాను

 ఇంటికి వచ్చి అత్యుత్సాహంతో  మిక్సీ మీద ఒక కవర్ కప్పి ...తులసి కోట దగ్గర ఉన్న రోలు ని వంటింట్లోకి తీసుకువచ్చి శుభ్రంగా కడిగాను కొత్తిమీర పచ్చిమిరపకాయలు   రోటిలో నూరాను.....

హ్యాండ్ బ్లెండర్  అట్టపెట్టెలో పెట్టేసి మజ్జిగ కవ్వంతో వెన్న తీశాను....

అందరినీ చూసి ఏదో ఉత్సాహంతో చేసాను కానీ కొద్దిసేపటికే భుజంనొప్పి మొదలైంది....😢😢😢😢

 పైకి చెప్తే ఏమంటారో అని భయంతో కుక్కిన పేనులా భుజానికి ముందు రాసుకున్నాను

మాట్లాడకుండా మిక్సీ మీద కవర్ తీసేసి కవ్వం అటక మీద పెట్టేసాను

 పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఉంది నా పరిస్థితి..


                    లోక సమస్త సుఖినో భవంతు

                       **** మీ ఉషగిరిధర్ ****