Pages

22, జనవరి 2021, శుక్రవారం

వంకాయ తో వెంకాయమ్మ గారి ముచ్చట్లు

వంకాయ : వెంకాయమ్మ గారు ఎలా ఉన్నారు 

వెంకాయమ్మ గారు :ఆ వంకాయ రా రా  ... నేను బాగున్నాను . నువ్వు ఎలా ఉన్నావు .

వంకాయ :ఏదో ఇలా ఉన్నాను అండి ..

వెంకాయమ్మ గారు : అది ఏమిటి అలా అంటావు ... ఎన్ని తరాలు మారిన .. ఎన్ని  కొత్త రకాలు వచ్చిన నీకు ఆదరణ ఏమాత్రం తగ్గ లేదు కదా ....

వంకాయ : ఏమి ఆధరణ లేండి ... మీ రోజులలో ఐతే చక్కగా 

చిన్న వంకాయల తో : వంకాయ కారం పెట్టి కూర, వంకాయ కొత్తి మీరి కారం కూర, వంకాయ వేపుడు ,వంకాయ బజ్జి (అమలాపురం లో చాల ఫేమస్ )

తెల్ల వంకాయల తో : వంకాయ జీడి పప్పు  ముద్ద  కూర,వంకాయ  చిక్కుడుకాయ ముద్ద  కూర,వంకాయ  పనస గింజలు ముద్ద  కూర,వంకాయ  శనగలు ముద్ద  కూర ...

పెద్ద వంకాయ తో : వంకాయ  ముద్ద పచ్చడి ,వంకాయ  పెరుగు పచ్చడి 

ఇలా ఎన్నో రకాలు  వండేవారు .... 

 కానీ ఇప్పటివాళ్లు ఇంత ఉల్లి ముద్దో, మషాలా ముద్దో నా పొట్ట లో కూరి ... 

ఏమిటో రక రకాలు వండుతున్నారు ... పోనీ పిల్లలు కదా అని అనుకుందామా అంటే .. 

కంచంలో కూర అంతా తినేసి ..ఈ వంకాయ లో ఏమి ఉంది బలం ..అని వెలిపోతున్నారు.

ఆ ఆఖరి మాట వింటుంటే గుండెలో చివుక్కు మంటోంది .. 

వెంకాయమ్మ గారు :పోనిలే చిన్న పిల్లలు  వాళ్లే తెలుసు కుంటారు

 మషాలా వద్దు ...ముద్ద కూర ముద్దు అని 

నువ్వు ఏమి బాధపడకు 

వంకాయ : మీ మాట చలవ ...అలా జరిగితే ఎంత బాగుంటుందో .. 

నేను వెళ్లి వస్తాను .. పక్క వీధిలో శర్మ గారు వాళ్ల అమ్మాయి పెళ్లికి వచ్చాను 

అని వంకాయ వెళ్ళిపోఇంది .!!!!!!!!!!!!!!!!!!!!!


ఈ లోపు విధి లొంచి వెంకయ్య గారు ... 

చేతిలో  ఒక  సంచీలో  వంకాయ  లు తెస్తూ  ... 

వెంకాయమ్మ ఏమి వండావు ఇవాళ అని అడిగారు !!

వంకాయ కూర అన్నారు వెంకాయమ్మ గారు.

అలా వెంకయ్య గారు,వెంకాయమ్మ గారు ....

వంకాయ కూర తో భోజనం ముగించారు ....



                         లోక సమస్త సుఖినో భవంతు

                       **** మీ ఉషగిరిధర్ ****

21, జనవరి 2021, గురువారం

ఎక్కాల పుస్తకం

 

మీకు ఈ  రోజు ఒక కథ చెపుతాను 

కథ అంటే పెద్దబాలశిక్ష  అంత పెద్దది కాదు 

ఎక్కాల పుస్తకం  అంత  చిన్నదే !!!!!

'పదమూడు' అని వినగానే చాలా మంది కంగారు పడతారు. 

ఎందుకో ఈ సంఖ్య అంత శుభసూచకం కాదని చాలామంది నమ్మకం.

 ఈ సంగతి నాకు తెలియడానికి చాలా రోజుల ముందే, అంటే నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడే 'పదమూడు' నాతో ఆడుకుంది. 

చాలా తిప్పలు పెట్టించింది..ఎన్నో దెబ్బలు కొట్టించింది. 😢😢😢

చిన్నప్పుడు నాకు బళ్ళో చదువు కన్నా ఇంట్లో చదువు ఎక్కువగా ఉండేది. 

అమ్మ  బాలశిక్ష నేర్పించి, నాన్న బళ్ళో చెరిపించారు . 

 మామూలుగానే నాన్నకి సహనం కొంచం తక్కువ. 

తను చెప్పింది చెప్పినట్టు చెయ్యకపోతే విపరీతమైన కోపం వచ్చేది. 

అలా చేస్తే ఇంక నా గొప్పదనం ఏముంది?

అమ్మ వేసిన పునాది పుణ్యమా అని ఒకటి, రెండు తరగతులు ఆడుతూ పాడుతూ గడిచి పోయాయి. 

మూడో తరగతి కి వచ్చేసరికి ఎక్కాల బాధ మొదలయ్యింది.

 ఓ రోజు సాయంత్రం నాన్న ఎక్కాల పుస్తకం తెచ్చి, దానికో అట్ట వేసి నా చేతికిచ్చారు. 

తెలుగు వాచకం కన్నా చాలా చాలా చిన్నది.. దీనిని చదవడం పెద్ద పనా? అనుకున్నాను. 

దిగితేనే కదా లోతు తెలిసేది!!!!

ఒక రెండు రెండు...
రెండ్రెళ్ళు నాలుగు..
 మూడ్రెళ్ళు ఆరు... మొదటి ఎక్కం కదా..సరదాగానే ఉంది. పన్నెండు రెళ్ళు ఇరవైనాలుగు వరకు అప్పచెబితే చాలు. 

ఇది కూడా రోజుకో ఎక్కం లెక్క కాదు.

 ఉన్నట్టుండి ఓ రోజు పొద్దున్నే నాన్నకి నా చదువు గురించి గుర్తొస్తుంది. 'ఎక్కాల పుస్తకం తియ్యమన్నారు'  ఎక్కడివరకు వచ్చిందో అడిగి, 

ఏదో ఒక ప్రశ్న అడుగుతారు.. అంటే ఏ ఏడు రెళ్ళు యెంత అనో అన్నమాట.

సరిగ్గా సమాధానం చెబితే తర్వాతి ఎక్కం చదవమని ఆర్డరేసి బయటికి వెళ్తారు. 

తను బయటినుంచి రాగానే ముందుగా ఎక్కం అప్పచెప్పించుకుని కానీ మంచి నీళ్ళు కూడా తాగేవాళ్లు కాదు. 

పన్నెండైదులు అరవై  వరకు నల్లేరు మీద బండిలా సాగిపోయింది. 

నేను చాలా సులువుగా చదివేస్తున్నాన్న విషయం నాన్నకి అర్ధమై ఇంకో కొత్త పని అప్పచెప్పారు.

అప్పట్లో ఎక్కాల పుస్తకాలు ఎలా ఉండేవంటే, ఒక పేజి లో రెండు ఎక్కాలు, వాటికింద సుమతి, వేమన శతకాల నుంచి ఒక్కొక్క పద్యం ప్రచురించేవారు. 

ఎక్కం తో పాటు ఒక పద్యం కూడా చదవమని ఆర్డరు. చేసేదేముంది.. 

'ఉప్పు కప్పురంబు..' 'కూరిమి గల దినములలో..' కూడా బట్టీ కొట్టడం, అప్పజెప్పడం. 

ఆరో ఎక్కం నుంచి సమస్యలు మొదలయ్యాయి. అప్పజెప్పడం లో తడబాట్లు రావడంతో..

నాన్న ఇంటికి రాగానే మంచి నీళ్ళ గ్లాసు, ఎక్కాల పుస్తకం, ఒక చీపురు పుల్ల పట్టికెళ్ళి ఇవ్వాలి. నీళ్ళు తాగగానే ఎక్కం అప్పచెప్పాలి  

ఎక్కడైనా నట్టు పడిందంటే చీపురు పుల్ల గాలి లో విదిలించేవారు....

 తప్పులు ఎక్కువయ్యాయంటే రెండోరోజూ అదే ఎక్కం చదవాలి. 

రెండోసారి కూడా తప్పులోస్తే చీపురు పుల్ల బదులు వెదురు పుల్ల అందుకునే వాళ్ళు. 

ఇది కొంచం గట్టిగా తగులుతుంది. దద్దురు కూడా బాగా తేలుతుంది.

రానురాను ఈ పద్యాలు నాకు తలనొప్పిగా తయారయ్యాయి. 

ఎక్కం తప్పుల్లేకుండా అప్పచెప్పానన్న ఆనందాన్ని పద్యం మింగేసేది. 😢😢😢😢

పన్నెండు పన్నెండ్లు నూట నలభై నాలుగు తో మూడో తరగతి పూర్తయ్యింది. !!!!!!!!!!!

నాలుగో తరగతిలో పదమూడో ఎక్కం. 13❌13 = ?

పైగా ఇరవై పదమూళ్ళు వరకు.. చీపురు పుల్ల, వెదురు బెత్తం అయిపోయాయి.. 

నిద్రగన్నేరు కొమ్మ వంతూ వచ్చింది. ఊదా రంగు అందమైన పూలు పూసే ఈ చెట్టులో నాకు నచ్చనిది కొమ్మే.

దెబ్బ కొంచం గట్టిగానే తగులుతుంది, పైగా దెబ్బ పడగానే మన చేతిమీదే కొమ్మ రెండుగా చీలిపోతుంది. 

సైకలాజికల్ గా 'చాలా గట్టి దెబ్బ' అనిపించేది. 

చేతిలో బెత్తంతో, ఎర్రటి పెద్ద కళ్ళతో నాన్నని చూడగానే సగం ఎక్కం మర్చిపోయే దానిని . పద్నాలుగు పదమూళ్ళు దగ్గర కొన్నాళ్ళు, 14❌13 = ? 

పదహారు పదమూళ్ళు దగ్గర కొన్నాళ్ళు ఆగాను.  16❌13 = ?

గజనీ దండయాత్రలు కొనసాగించి, మొత్తానికి ఓ మద్యాహ్నం వెక్కిళ్ళ మధ్య పదమూడో ఎక్కం అప్పచేప్పేశాను.

కానీ తర్వాత ఎప్పుడు లెక్కల్లో పదమూడో ఎక్కం అవసరం వచ్చినా పేజి లో పక్కన గుణకారం చేసుకోవాల్సి వచ్చేది, ఎక్కం గుర్తు రాక.

 అదేమిటో తెలీదు కాని పద్నాలుగు, పదిహేను ఎక్కాలు నన్నేమీ ఇబ్బంది పెట్టలేదు.

అక్కడితో నా ఎక్కాల చదువు ముగిసింది.

 మిగిలిన నాలుగు ఎక్కాలు చదివాను కాని, అప్పజెప్ప మని నాన్న అడగలేదు, నాకు నేనుగా అలాంటి ప్రయత్నం చెయ్యలేదు. 

తెలిసి తెలిసి అంత రిస్కు నేనెందుకు తీసుకుంటాను?


                                                లోక సమస్త సుఖినో భవంతు

                                                  **** మీ ఉషగిరిధర్ ****


20, జనవరి 2021, బుధవారం

కుంటి "స "....మెలిక "శ"

చిన్నపుడు  చేతి రాత బాగుంటే తల రాత బాగుంటుంది అనేది అమ్మ  ... 

అది నా బాలశిక్ష చదువు సాగుతున్న రోజులు. 

అమ్మ ప్రశ్న నోటితో అడుగుతుంది. జవాబు నేను పలక మీద రాయాలి. 

"శ్రీరాముడి భార్య పేరు ఏమిటి?" నేను 'శీత' అని రాశాను, హుషారుగా. 

"వర్షాకాలం తర్వాత ఏ కాలం వస్తుంది?" తెలిసిన ప్రశ్నే కావడంతో నాలో హుషారు ద్విగుణీకృతం అయ్యింది. 'సీతాకాలం' అని రాసేశా. 

"ఏ చంటి .. మెలిక శ కీ, కుంటి స కీ తేడా తెలియకపోతే ఎలాగ నీకూ?" చెవి మెలేస్తూ అమ్మ అడిగిన ప్రశ్న ఇది. 

నేను రాసిన పది జవాబుల్లోనూ ఈ రెండే తప్పులు. 


అదిగో అప్పుడు విన్నాను ఈ మెలిక శ, కుంటి స గురించి.

 'మెలిక శ' అనే మాట వినగానే భలేగా నచ్చేసింది. 

ఎందుకో కానీ, 'కుంటి స' అస్సలు నచ్చలేదు. 

'కుంటేమిటీ?' అనుకున్నాను కానీ, పైకనలేదు. 

మొత్తానికి ఈరెండు అక్షరాలతో వచ్చే పదాలు మళ్ళీ మళ్ళీ రాయించీ రాయించీ ఏ అక్షరం ఎక్కడ వాడాలో బాగా అర్ధమయ్యేలా చెప్పింది అమ్మ. 

చాలామంది పిల్లలు హైస్కూలుకి వచ్చేసినా ఈ 'శ' 'స' లతో కుస్తీలు పడుతూనే ఉంటారన్న సంగతి నేను హైస్కూల్లో ప్రవేశిస్తేనే కానీ తెలియలేదు. 

అక్కడ మా మేష్టారు మెలిక, కుంటి అనకుండా 'సీత స' 'శకుంతల శ' అని చెప్పారు. 

ఇదేదో చాలా బాగుందనిపించింది నాకు. 

చక్కగా సీతనీ, శకుంతలనీ గుర్తు పెట్టుకుంటే చాలు. 

పైగా అవేమీ మరిచిపోగలిగే పేర్లు కాదు, రామాయణం, శాకుంతలం అప్పటికే చాలాసార్లు విని ఉండడం వల్ల. 

కాకపొతే ఒక కొత్త సమస్య వచ్చింది. 

కొందరు మేష్టర్లు మెలిక శ - అదే శకుంతల శ - ని 'ష' అని పలికేవాళ్ళు. 

ఉదాహరణకి, శాంతి ని షాంతి అని. 

కాలేజీలో కూడా ఈ శ, స లు వదలలేదు. ఓసారి అనుకోకుండా, ఒక  నోట్సు చూసి, ఈ శ, స లని సరిచేయడం కోసం "ఇక్కడ సీత స కాదు, శకుంతల శ ఉండాలి" అన్నాను.

సంభాషణ భాష గురించి కాక, కాలేజీలో సీత గురించీ, శకుంతల గురించీ జరిగిందని ప్రత్యేకంగా చెప్పాలా?

 వాళ్లు మా సీనియర్స్..

ఎదో వాళ్లకి సమయ స్ఫూర్తి తో నచ్చచెప్పి అక్కడ నుండి తపించుకున్నాను ......


ఇప్పుడు  కాగితం మీద రాసే పని ఉండడం లేదు. అందులోనూ తెలుగు రాసే పని అసలే లేదు. 


నా చేతిరాత ఎలా ఉందో ఏమిటో...😞😞😞

                                                   


                                             లోక సమస్త సుఖినో భవంతు

                                           **** మీ ఉషగిరిధర్ ****

19, జనవరి 2021, మంగళవారం

ఆదివారం దింపు ... భూషణం కొట్టి ఇచ్చిన బొండం

ఆ రోజు ఆదివారం ...నాన్న పోద్దిన్నే అమ్మ తో ఈరోజు దింపు ఉంది ..నలుగురు భోజనానికి ఉంటారు అని చెప్పి తోటలోకి వెళ్లారు . 

అది స్థంభం పక్కన ఉన్న నేను విని ... పరిగెత్తుకు వెల్లి మా అన్న తో . తమ్ముడు తో చెప్పాను . 

మా ముగ్గురికి దింపు  అంటే బలే సరదా .. గబగబా చద్దన్నం తినేసి తోట లోకి పరుగు అందుకున్నాము .

నేను భూషణం ఉన్న చెట్లు దగ్గరకి వెళ్ళాను (మా మామ్మ  భూషిగాడు అనే వారు .. పెద్ద వాలు కదా .. నేను చిన్న  పిల్లని  అలా అన కూడదు అని అమ్మ చెప్పింది) 

భూషణం  తన నడుము చుట్టూ పెట్టుకున్న పెద్ద బెల్టుకి తగిలించిన బంధం తీసుకుని జాగ్రత్తగా తన రెండు కాళ్ళకీ వేసుకున్నాడు. 

మరో పట్టీ తీసుకుని దానిని తన నడుము చుట్టూ తిప్పుకుని, కొబ్బరిచెట్టు చుట్టూ తిప్పి ముడేశాడు. బెల్ట్ కి కత్తి ఉంది. 

పట్టీ నెమ్మది నెమ్మదిగా పైకి జరుపుకుంటూ, బంధం వేసుకున్న కాళ్ళతో మెల్ల మెల్లగా చెట్టు పైపైకి ఎక్కుతున్నాడు.నిచ్చెన మెట్లన్నీ ఎక్కేసి, చెట్టు చివర ఆగాడు భూషణం.

 అబ్బా... మెడ నొప్పెడుతోంది. కానీ చూడకపోతే ఎలా, ఒకవేళ భూషణం గబుక్కున జారుతున్నాడనుకో గట్టిగా అరిచి జాగ్రత్త చెప్పొద్దూ. 

ఇంకో నలుగురు దింపు వాళ్ళు కూడా చెట్ల మీద ఉన్నారు కానీ, నేనెప్పుడూ భూషణం వెనకాలే తిరుగుతాను.

 కొబ్బరి తోటలో దింపు తీయిస్తున్నామంటే నాన్నలతో పాటు నేనూ ఉండాల్సిందే. 

దింపు వాళ్ళు తిరిగి నిచ్చెన మీదకి వచ్చే వరకూ ఆగి, అప్పుడు వెళ్ళాలి చెట్టు కిందకి. 

ఒక్కో చేత్తో ఒక్క కాయకన్నా ఎక్కువ పట్టుకోలేం.

 నాన్నయితే రెండేసీ, మూడేసీ పట్టుకుంటారనుకో.....

కానీ ఒక్కో కాయా ఎంత బరువుంటుందో.

 ఆ ముచిక చుట్టూ బిగించి పట్టుకోవడంలో అరిచేతులు ఎర్రగా అయిపోతాయి కూడాను.

 వాటిని తీసుకు వచ్చి మండువాలో వెయ్యాలి.

కాయలొకటేనా? అడ్డుగా ఉన్నఎండు కొబ్బరాకులు, డొలకలు ఇంకా దెయ్యపు తొట్లూ కూడా కత్తితో కొట్టేస్తారు కదా. 

అవన్నీ కూడా కింద పడతాయి. 

జాగ్రత్తగా కొబ్బరికాయలో రాశి, డొలకలొకటి, ఆకులొకటి, ఇలా వేరువేరుగా రాశులు పొయ్యాలి. 

మనం ఒక్కళ్ళమే కాదులే. 

దింపు తీస్తున్నారంటే ఇద్దరో ముగ్గురో అప్పటికప్పుడు వచ్చేసి, పని సాయం చేసేసి వెళ్తూ వెళ్తూ డొలకలో, ఒకటో రెండో కాయలో నాన్నని  అడిగి పట్టుకెడతారు. 

ఆకులు మనం మోయ్యలేం. డొలకలేమో కొంచం మట్టిగా ఉంటాయి. అందుకని కాయలైతే కొంచం బరువైనా పని సులువన్నమాట. 

భూషణానికి నేనంటే ముద్దు.

 అలా ఎండల్లో నేను కాయలు మొయ్యడం తనకి నచ్చేది కాదు. నేను ఎర్రగా అయిపోయిన చేతులు మధ్యమధ్యలో ఊదుకుంటుంటే చూసి, "మీరలా కూకోండి అమ్మాయిగారు .. శానామందున్నారు కదా" అనేవాడు ప్రేమగా. 

కానీ కాయలు మొయ్యకపోతే తోటలో ఉండడానికి ఉండదు, 

ఇంట్లోకి వెళ్లి చదువుకోవాలి. 

అప్పుడు భూషణం వాళ్ళూ చెప్పే కబుర్లు వినడానికి ఉండదు.

 ఇంట్లోకి వినిపించవు కదా మరి. 

ఇంకో కారణం కూడా ఉంది కానీ, అది తర్వాత చెబుతాను.

 భూషణం వాళ్ళూ రోజూ ఎక్కడో అక్కడికి దింపుకి వెళ్తారు. దింపు అయ్యాక పడ్డ కాయల్ని బట్టి వందకిన్ని అని కాయలో, డబ్బులో తీసుకుంటారు. 

దింపుకెళ్ళిన ఊళ్లలో ఎక్కడెక్కడ ఏమేం జరిగాయో భూషణం చెబుతూంటే వినాలంతే.

 తను నాన్న కన్నా పెద్దవాడు కబుర్లు మొదలు పెట్టాడంటే మాత్రం నా అంత చిన్న పిల్ల అయిపోతాడు . 

ఏ ఊళ్ళో ఎవరికి ఎన్నెన్ని కాయలు పడ్డాయో, ఎవరి కొబ్బరికాయల రాశిలోకి ఎంత పెద్ద పామొచ్చిందో చెప్పేవాడు

 "ఈ భూషణం కబుర్ల పోగు. పని తెవల్చడు" అని  నాన్న తిట్టుకునే వాళ్ళు కానీ, పైకేమీ అనేవాళ్ళు కాదు. దింపు వాళ్ళందరికీ భూషణమే పెద్ద మరి. 

మామూలు చెట్లు ఎవరన్నా ఎక్కేవాళ్ళు కానీ, ముచ్చెట్లు మాత్రం భూషణానికే వదిలేసేవాళ్ళు. 

మామూలు కొబ్బరి చెట్టు కన్నా రెట్టింపు పొడుగుండే ముచ్చెట్లు కొబ్బరి చెట్లలో ముసలివన్నమాట. 

అలా ఎక్కుతూ ఎక్కుతూ నలకలా అయి, మాయమై పోయేవాడు భూషణం. ముచ్చెట్టు ఎక్కితే పైనుంచి తన గొంతు కూడా వినిపించేది కాదు. 

ముచ్చెట్లే కాదు, 'నా చెట్టు' కూడా భూషణమే ఎక్కేవాడు. !!

నా చెట్టు అంటే నేను పాతిన మొక్క పెరిగి పెద్దై, చెట్టయ్యిందని కాదు. 

ఆ చెట్టు బొండాలు చాలా బాగుంటాయి. మిగిలిన బొండాల కన్నా ఆ బొండాలంటేనే నాకు ఎక్కువ ఇష్టం. 

ఈ రహస్యం తెలుసు భూషణానికి. ఇంకో రహస్యం కూడా ఉంది మా ఇద్దరికీ. తనా చెట్టు ఎక్కుతుంటే నేను "భూషణం, బొండము తియ్యవూ" అని అడగాలి. 

 నేనిలా అడగ్గానే "పిల్లలికి  నాలుగు బొండాలు తియ్యరా" అన్న నాన్న ఆర్డరూ, నాన్న తోటలో ఏమూల ఉన్నా వినిపించేవి. 

అప్పటికే కాయలు చేరేసీ, చేరేసీ అలిసిపోయే వాళ్ళం , 

బొండాలు చెట్టు దిగడం ఆలస్యం, తాగడానికి రెడీ అయిపోయే వాళ్ళం మేము ముగ్గురం  .

 తనే చెలిగి, కొట్టి ఇచ్చేవాడు భూషణం. 

నీళ్లన్నీ తాగాక, బొండాన్ని రెండు ముక్కలు చేసిచ్చేవాడు, మీగడ తినడానికి వీలుగా.

 "ఇంకోటి కొట్టమంటారా?" తనెంత మెల్లిగా అడిగినా,  నాన్నకో వినపడిపోయేది. 

"అక్కర్లేదు. వాళ్ళు ఇంక  అన్నం తినరు .. మిగిలినవి నూతిలో పడేయ్.. రేపు కొట్టిద్దాం" 

అనేసేవాళ్ళు. 

అక్కడితో దింపు వదిలేసి మేము ఇంట్లోకి పరిగెత్తే  వాళ్ళం , మా  పని అయిపోయినట్టే కదా మరి. 

 బొండం కొట్టిస్తూ భూషణం ఎప్పుడూ ఒకటే మాట అడిగేవాడు.... "పెద్దోరయ్యాక నన్ను గుర్తెట్టుకుంటారా ?" .....అని 

ఇప్పుడు భూషణం లేడు ...  కానీ ఊరు వెల్లినప్పుడు నాన్న  ఆ కొబ్బరి చెట్ట బొండాలు కొట్టిస్తారు.. వాటి రుచి మాత్రం ఏమి మారలేదు .






                                లోక సమస్త సుఖినో భవంతు

                                   **** మీ ఉషగిరిధర్ ****

16, జనవరి 2021, శనివారం

ముగిశాయి సంక్రాంతి సంబరాలు

 పసుపు పులిమిన గడపల పవిత్రత

సన్నాయి గీతాలు తెచ్చిన ప్రశాంతత

రంగవల్లుల తో వచ్చిన రమణీయత 

ధూప దీపాల వలన వచ్చిన సుందరత

తోరణాల తో వచ్చిన  స్వచ్ఛత తో  వెలిగిన మా లోగిలి


పట్టుచీరలు, కొత్తనగల పరిచయాలతో

వంటింట్లో యుద్ధ సరాగలతో

తృప్తినొందిన అతిధుల త్రేన్పులతో

కలలు పండుతాయన్న ఆకాంక్షలతో

అందరి కష్టాలు తీరుతాయన్న ఆశలతో


అందుకు సాక్షిగా పండిన మానోళ్ళతో

మా ఇంట ముగిశాయి సంక్రాంతి  సంబరాలు 


                                        లోక సమస్త సుఖినో భవంతు

                                              ** మీ ఉషగిరిధర్ **

14, జనవరి 2021, గురువారం

సంక్రాంతి శుభాకాంక్షలు

మార్గశిరం ముగిసింది 

పుష్యమి  పురుడు పోసుకుంది

ధనుర్మాసం ధాన్యలక్ష్మిని ఇచ్చింది.

పండగ పరిమళం పొగమంచులా కమ్మేస్తోంది

సంక్రాంతి సూర్యుడు గమనం మార్చి గోరువెచ్చని కిరణాలతో

తెలుగువారి లోగిళ్లలో నులివెచ్చని అనుభూతిని అందిస్తున్నాడు!


అందుకే అన్నారు.

మకర సంక్రమణం

మధురానుభూతుల సమ్మేళనం అని !


అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు



                        సర్వేజనాః సుఖినోభవంతు

                            **** మీ ఉషగిరిధర్ ****

13, జనవరి 2021, బుధవారం

భోగి శుభాకాంక్షలు



అగ్ని దేవుని ప్రార్థన జేసి భోగి మంట రాజేసిన  పెద్దలకు  
రంగవల్లులు, గొబ్బెమ్మలు  పెట్టిన అక్కాచెలెళ్లుకు 
బోగి దండలతో , గాలి పటాలతో  సందడి చేసిన అన్నదమ్ములకు 


శ్రీమద్రమణ గోవిందో హరంటూ వచ్చిన  హరిదాసులుకు 
అయ్యవారికి దండం బెట్టంటు వచ్చిన  గంగిరెద్దులోళ్లూకు

కొత్త ధాన్యపు బస్తాల బండ్లతో ఇళ్ల్లకు చేర్చిన రైతులకు 

"వానల్లు కురియలి 
వరి చెను పండాలి 
మా దాసు దంచాలి 
మా అమ్మ వండాలి 
మా కడుపు నిండాలి ...బుడుగో బుడుగు "
అని పాటలు పాడిన పిల్లలకి  

అందరికి  భోగి  శుభాకాంక్షలు 






                                            లోక సమస్త సుఖినో భవంతు
                                            ***** మీ ఉషగిరిధర్ *****