Pages

12, జనవరి 2021, మంగళవారం

జగ్గన్న తోటకు పోదామా రుద్రులు వస్తున్నారు ...


కోనసీమ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కొబ్బరి తోట ... 

అలాంటి కొబ్బరి తోటలో మన దేశ ప్రధాని మెచ్చిన ఒక తీర్థం  ...

అదే  అండి జగ్గన్నతోట ప్రభల తీర్థం.

సంక్రాంతి వస్తోంది కదా ఇంక మా కోనసీమ లో సందడి మాములుగా ఉండదు 

బోగి మంటలు  --- పిండి వంటలు 

ముగ్గులు --- గోబిల్లు 

వీటితో పాటు  జగ్గన్నతోట ప్రభల తీర్థం.కనుమనాడు ఈ ప్రభల తీర్థం జరుగుతుంది .

ఇక్కడ తోటే గుడి ..  ప్రభలే రుద్రులు .

ఏకాదశ రుద్రులు 11 ప్రభలు గా దర్శనం ఇస్తారు . 

1. గంగలకుర్రు అగ్రహారం - వీరేశ్వర స్వామి

2. గంగలకుర్రు – చెన్నమల్లేశ్వర స్వామి

3. వ్యాఘ్రేశ్వరం – వ్యాఘ్రేశ్వర స్వామి

4. ఇరుసుమండ - ఆనంద రామేశ్వరస్వామి

5. వక్కలంక – కాశీ విశ్వేశ్వరస్వామి

6. పెదపూడి – మేనకేశ్వరస్వామి

7. ముక్కామల – రాఘవేశ్వర స్వామి

8. మొసలపల్లి – మధుమానంత భోగేశ్వరస్వామి

9. నేదునూరు – చెన్నమల్లేశ్వరస్వామి

10. పాలగుమ్మి – చెన్నమల్లేశ్వరస్వామి

11. పుల్లేటికుర్రు – అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి


కోనసీమ చుట్టుపక్కనున్న 90 గ్రామాల ప్రజలు  ఈ తీర్థంలో పాలుపంచుకుంటారు

ఈ ప్రభలను ఒక్కసారి ఎత్తేకా క్రిందకి దింపకూడదు. కౌశిక నది దాటేటప్పుడు ప్రభ ఏ మాత్రం తడవకుండా తీసుకోస్తారు. 




యావత్ కోనసీమ వాసులందరికీ జగ్గన్నతోట ప్రభల తీర్థం ముందుగానే ఆహ్వానం పలుకుతోంది....

సమస్త జనులకు ఏకాదశ రుద్రుల అనుగ్రహ ప్రాప్తిరస్తు........

                                 సర్వేజనాః సుఖినోభవంతు

                                **** మీ ఉషగిరిధర్ ****



 

 




ఏకాదశ రుద్రులు


ఏకాదశ రుద్రులు:
శివుడు మనకు పదకొండు అవతారాలతో ఏకాదశ రుద్రులుగా దర్శనమిచ్చును. 

ఓంనమస్తేస్తు భగవన్ "విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయనమః"

అని రుద్రనమకంలో చెప్పబడినది. 

దీనిప్రకారం ఏకాదశ రుద్రులపేర్లు 1. విశ్వేశ్వరుడు, 2.మహాదేవుడు,3. త్ర్యంబకుడు, 4.త్రిపురాంతకుడు, 5.త్రికాగ్నికాలుడు, 6.కాలాగ్నిరుద్రుడు, 7.నీలకంఠుడు, 8.మృత్యుంజయుడు, 9.సర్వేశ్వరుడు,10. సదాశివుడు మరియు 11. శ్రీమన్మహాదేవుడు. ఏకాదశ రుద్రులు మరియు వారిభార్యలైన ఏకాదశ రుద్రాణుల పేర్లు క్రింద ఈయబడినవి. 

1.అజపాదుడు- ధీదేవి
2.అహిర్భుద్న్యుడు- వృత్తిదేవి
3.త్ర్యంబకుడు- ఆశనదేవి
4.వృషాకపి- ఉమాదేవి
5.శంభుడు- నియుత్ దేవి
6.కపాలి- సర్పిదేవి
7.దైవతుడు- ఇల దేవి
8.హరుడు- అంబికాదేవి
9.బహురూపుడు- ఇలావతీదేవి
10.ఉగ్రుడు- సుధాదేవి
11.విశ్వరూపుడు- దీక్షాదేవి 

అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ప్రభలతీర్థంలో ఏకాదశ రుద్రులతోకూడిన ప్రభలు సంక్రాంతి పండుగలలో కనుమరోజు భక్తజనులకు దర్శనమిచ్చి తరింపజేయుచున్నారు. వాటి వివరాలు మనంతెలుసుకుందాము.

1. విశ్వేశ్వర రుద్రుడు- వ్యాఘ్రేశ్వరం (శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వర స్వామి):
పూర్వకాలంలో ఒకబ్రాహ్మణోత్తముడు వ్యాఘ్రాన్ని (పులి) శివునిగా భావించి బిళ్వపత్రాలతో అర్చన చేయటంవల్ల ఆపులి శివలింగరూపాన్ని పొందిందని కధనము కలదు. వ్యాఘ్రము శివునిగా అవతరించుటచే వ్యాఘ్రేశ్వర స్వామి అని పిలువబడెను.

2. మహాదేవరుద్రుడు- కె. పెదపూడి (శ్రీపార్వతీ సమేత మేనకేశ్వర స్వామి):
పూర్వకాలంలో విశ్వామిత్రుని తపోభంగముకొరకు ఇంద్రుడు మేనకను పంపెను. విశ్వామిత్రునకు, మేనకకు శకుంతల జన్మించెను. తరువాత మేనక స్వర్గమునకు పోవుదమని ప్రయత్నించగా ఆమె వెళ్ళలేకపోయినది. అపుడు ఆమె శివుని ప్రార్ధించగా ఆయన ఒకశివలింగమును మేనకకు ఇచ్చి ఆప్రదేశములో ప్రతిష్ఠింపుమనెను. అపుడు మేనక కృష్ణరాయుడు పెదపూడి (కె.పెదపూడి) నందు శివలింగమును ప్రతిష్ఠించి స్వర్గమునకు పోయెనని కధనముకలదు. మేనకచే ప్రతిష్ఠింప బడుటచే మేనకేశ్వరస్వామి అని పిలువబడెను. 

3. త్ర్యంబకేశ్వరుడు- ఇరుసుమండ (శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత ఆనందరామేశ్వర స్వామి):
రావణుని సంహరించిన తరువాత శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై పుష్పకవిమానంలో అయోధ్యకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఇరుసుమండ వద్ద వారి పుష్పకవిమానం కదలకుండా నిలిచిపోయినది. అపుడు శ్రీరామచంద్రుడు శివుని ప్రార్ధించి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించెనని కధనము కలదు. అపుడు వారి పుష్పకవిమానము ముందుకు కదలగా వారందరూ ఆనందభరితులైరి. రామునిచే ప్రతిష్ఠింపబడినది కావున రామేశ్వరుడని, అందరికీ ఆనందదాయకమగుటచే ఆనందరామేశ్వరుడని పిలువబడెను. 

4. త్రిపురాంతక రుద్రుడు- వక్కలంక (శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి):
తారకాసురుని పుత్రులు ముగ్గురు మూడుపురములుగా మారి త్రిపురాసురులుగా పేరొందినారు. దేవతలందరూ త్రిపురాసురులను సంహరింపుమని శివుని ప్రార్ధించగా వారిని శివుడు సంహరించి వక్కలంక గ్రామము నందు శివలింగరూపంలో ఆవిర్భవించెనని కధనము కలదు. అపుడు ఆగ్రామపు బ్రాహ్మణోత్తములచే శివలింగము ప్రతిష్ఠింపబడి విశ్వేశ్వరునిగా పిలువబడెను.  

5. త్రికాగ్నికాల రుద్రుడు- నేదునూరు (సర్వమంగళా పార్వతీ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి):
మూడు అగ్నులయందు హోమము చేసిన ద్రవ్యములను స్వీకరించి శివుడు లింగరూపమును పొందుటచే త్రికాగ్ని కాలునిగా పిలువబడి అగస్త్యమహర్షిచే నేదునూరు గ్రామమున ఈశివలింగము ప్రతిష్ఠింపబడినది. శ్రీ ఉమాచెన్నమల్లేశ్వర స్వామిగా సర్వజనులచే కొలువబడుచున్నాడు.

6. కాలాగ్ని రుద్రుడు- ముక్కామల (బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ రాఘవేశ్వర స్వామి):
రావణ సంహారం తరువాత అగస్త్య మహాముని అయోధ్యకేగుచున్న రామునిచే ఈప్రదేశమున శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసెను. కాలాగ్ని రుద్రుడు శ్రీరామునకు దివ్యాస్త్రములను, ఖడ్గమును ప్రసాదించెను.  రాఘవునిచే ప్రతిష్ఠింపబడుట వల్ల రాఘవేశ్వరస్వామిగా పిలువబడెను.
పాండవ వనవాస కాలంలో శివుడు అర్జునుని పరీక్షింపదలచి కిరాతునివేషంలో అర్జునుని ధైర్యపరాక్రమములను చూచి పాశుపతాస్త్రమును ప్రసాదించెనని, ఆయనే ఈ కాలాగ్నిరుద్రుడని మరియొక కధనముకలదు. 

7. నీలకంఠ రుద్రుడు- మొసలపల్లి ( శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అనంత భోగేశ్వర స్వామి ):
దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మధన సమయంలో వెలువడిన విషవాయువులను ఎవ్వరికీ హానికలిగించకుండా చేయుటకు శివుడు తనకంఠమునందు నిక్షిప్తముచేసికొని నీలకంఠుడైనాడు. ఆగరళకంఠుడే మొసలపల్లి గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. తనను కొలిచినవారికి అనంతభోగాలను అందించేవాడు, మరియు అనేక భోగులను (పాములను) ఆభరణములుగా ధరించినవాడు అగుటవల్ల అనంత భోగేశ్వరస్వామిగా పిలువబడెను.

8. మృత్యుంజయ రుద్రుడు- పాలగుమ్మి (శ్యామలాంబా సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):
శివుడు అర్ధాయుష్కుడైన మార్కండేయుని మృత్యుముఖమునుండి రక్షించి, యముని జయించి "మృత్యుంజయుడు" అయ్యెను. ఈ మృత్యుంజయ రుద్రుడు పాలగుమ్మిగ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించి చెన్నమల్లేశ్వర స్వామిగా పిలువబడెను. 

9. సర్వేశ్వర రుద్రుడు- గంగలకుర్రు అగ్రహారం (ఉమాపార్వతీ సమేత శ్రీవీరేశ్వర స్వామి): 
దక్షుని యజ్ఞంలో సతీదేవి తనతండ్రి చేసిన అవమానాన్ని భరించలేక తనకాలితో నేలపై వ్రాయుటవల్ల ఏర్పడిన అగ్నిజ్వాలలందు కాలిబూడిద అయినపుడు శివుడు ఆగ్రహించి ఉగ్రరూపుడై నృత్యముచేసి తనజటాజూటములో ఒక జటను తీసి నేలపై కొట్టుటవల్ల శివాంశ సంభూతుడైన వీరభద్రుడు జన్మించెను. వీరభద్రుడు అపుడు దక్షయజ్ఞమును ధ్వంసముచేసెను. ఉగ్రరూపుడైన శివుడు వీరేశ్వరస్వామిగా లింగరూపమున గంగలకుర్రు అగ్రహారమునందు వేదపండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను. 

10. సదాశివ రుద్రుడు- గంగలకుర్రు (సర్వమంగళా పార్వతీ సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):
పూర్వం బ్రహ్మవిష్ణులు తమలో ఎవరుగొప్పవారని వాదనకుదిగి శివుని వద్దకు వచ్చిరి. అపుడు శివుడు ఆద్యంతములులేని లింగరూపమును ధరించి బ్రహ్మను తన శిరస్సును చూచిరమ్మని విష్ణువును తన పాదములను చూచిరమ్మని పంపెను. విష్ణువు శివుని పాదములను కనుగొనలేక తిరిగివచ్చి చూడలేకపోయితినని చెప్పెను. కాని బ్రహ్మమాత్రము శివుని శిరస్సును చూడకపోయినను ఒకఆవును, మొగలిపువ్వును సాక్ష్యము తెచ్చుకొని తాను చూచితినని చెప్పెను. శివునికి ఆగ్రహము వచ్చి బ్రహ్మకు పూజాపునస్కారములు లేకుండా శపించివిష్ణువే అగ్రగణ్యుడని చెప్పెను. ఆలింగధారియైన సదాశివుడు గంగలకుర్రు గ్రామములో వేదపండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను.
 
11. శ్రీమన్మహాదేవ రుద్రుడు- పుల్లేటికుర్రు (శ్రీబాలాత్రిపురసుందరీ సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడు):
పూర్వకాలంలో విష్ణుమూర్తి శివుని సహస్రకమలాలతో సహస్రనామాలతో పూజించెను. దానికి సంతసించిన మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహూకరించెను. ఆమహాదేవుడు పుల్లేటికుర్రు గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. పుల్లేటికుర్రు గ్రామానికి "పుండరీకపురము" అని పూర్వకాలంలో పేరు ఉండెడిది. పుండరీకము అనగా వ్యాఘ్రము(పులి) అని అర్ధము కలదు. వ్యాఘ్రేశ్వరమునందు వ్యాఘ్రేశ్వరస్వామి ఉండుటచేత ఈ గ్రామమునందు శివుడు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి అనుపేరుతో పిలువబడెను.


                                    లోక సమస్త సుఖినో భవంతు
                                        **** మీ ఉషగిరిధర్ ****

11, జనవరి 2021, సోమవారం

గృహంలో అలక

గృహంలో అలక
=============

ఏమిటి అలక గృహం  అనకుండా గృహంలో అలక అంటున్నాను అనుకుంటున్నారా..నిజమేనండి....
గత 10 నెలల నుంచి మా గృహంలో అన్ని అలక పూనాయి

లంచ్ బాక్స్ ====  అలిగి అటక ఎక్కింది
ఐరన్ బాక్స్ ====   అలిగి మూల కూర్చుంది
వాచ్              ====   అలిగి తిరగడమే మానేసింది⌚
షూస్             ==== అలిగి దుమ్ము దుప్పటి కప్పుకుని మూల కూర్చున్నాయి.
పెర్ఫ్యూమ్, ఫేస్ క్రీమ్స్   ==== అలిగి ఎక్కడికో వెలిపోయాయి

ఇలా కోన్ని వాడక అలిగితే...
 కోన్ని వాడకం ఎక్కువై అలిగాయి...

వాటిలో  వాషింగ్ మెషిన్ , సోఫా,టీవీ   ...
వంటిల్లు అయితే మరీ  అలిగింది బాగా ఎక్కువగా వాడుతున్నాను అని 

ఇన్ని అలకల మధ్య నాకు అలక వచ్చినా అలగ లేక పోతున్నాను....😟😟😟

ఈ అలకలు అన్ని ఎప్పటికి తీరే్నో...

ఇది చదివి మీరు అలగ కండి ప్లీజ్ ...😝😝😝



                                            లోక సమస్త సుఖినో భవంతు
                                        ******* మీ ఉషగిరిధర్ ***********


7, జనవరి 2021, గురువారం

పండగకి వలస వచ్చిన పిండివంటలు

పండగకి   వలస వచ్చిన పిండివంటలు 


మరలో బియ్యం పిండి పట్టించి

దుకాణం  లో నూనె  కట్టించి

నువ్వులు బాగా  దట్టించి

నాన్న  తో గుండ్రంగా చుట్టించి

అమ్మ ఎర్ర గా వేయించిన జంతికలు....

మినుగులు వేయించి

దుకాణం  లో బెల్లం  కట్టించి 

నెయ్యి బాగా  దట్టించి

అమ్మ గుండ్రంగా చేసిన సునుండలు...

బండెక్కి నాతో పాటు వలస వచ్చాయి.

నాలుగు రోజులు నా పంటికింద నలిగాయి....

నాలుగు నెలలు నా కంట్లో మెదిలాయి

పెద్ద డబ్బాలో తియ్యదనం , చిన్న సంచీలో కమ్మదనం

వలస వచ్చిన జ్ఞాపకాలు ఎంతో తీయ్యగా, కమ్మగా ఉన్నాయి..




(పండగ వస్తోంది మీ జ్ఞాపకాలు కూడా పంచుకోండి  కింద కామెంట్స్ లో )

                            లోక సమస్త సుఖినో భవంతు
                     ****** మీ ఉషగిరిధర్ ***********

6, జనవరి 2021, బుధవారం

ఎన్ని రోజులు అయిందో...

ఎన్ని రోజులు అయిందో..

పుట్టిన ఊరు వెళ్లి..🚍
ఆఫీసుకు వెళ్లి...💻
సినిమాకెళ్ళి..🎥
ఇంటికి పెళ్లి కార్డు వచ్చి..💒
పట్టు చీర కట్టి...
 నగలు పెట్టి...
బంతి భోజనం తిని..🍴
పానీపూరి తిని...
ట్రాఫిక్ సిగ్నల్ చూసి...🚦
అమ్మలతో కలిసి భుజాన బస్తా బాగులతో బడికెళ్తున్న 
పిల్లల్ని చూసి..🏫
కిటకిటలాడే బస్సుల్లో 
ఫుట్ బోర్డు పట్టుకు వేలాడే కుర్రకారును తిట్టి..🚌🚌
రైల్వేస్టేషన్లలో అనౌన్స్మెంట్ ఆలకించి..📢
ఆకశాన రివ్వున ఎగిరెళ్లే విమానాన్ని చూసి అబ్బురపడి..✈
అంతెందుకు తనివితీరా తుమ్మి
బాధ తీరేలా దగ్గి..
*ఎన్ని రోజులు అయిందో......😞😞😞

కరోనా ఎంత పని చేసావే..
సంఘజీవిని ఒంటరిని చేసావు
గత పది నెలలుగా 
ఎక్కడ విన్నా 
నీ మాటే..
నీ కాటే..
పాజిటివ్..నెగిటివ్..
టెస్టులు..రెస్టులు..
క్వారెంటైన్లు..ఐసొలేషన్లు..
ఆంబులెన్సు మోతలు..
పోలీసు లాఠీల వాతలు..
అంటరానితనం అలవాటై..
జీవితమే గ్రహపాటై..
సాటి మనిషిని కలవడమే పొరపాటై..
ఇల్లే ఖైదై..బ్రతుకు చేదై..
ఎంత పని చేసావే.. కరోనా

సరేలే..
ఎన్నాళ్లులే నీ విలయం..
నీ ఆయువు మూడదా..
జగతిన మళ్లీ 
తొలి పొద్దు పొడవదా..


                                            లోక సమస్త సుఖినో భవంతు
                                    ********* మీ ఉషగిరిధర్ ***********

4, జనవరి 2021, సోమవారం

సులోచనాలు ....నేత్ర భూషనాలు





కొందరు  చూడడానికి వాడతారు
కొందరు చదవడానికి వాడతారు 
కొందరు అందానికి వాడతారు

కొందరు తల మీద పెట్టుకుంటే 
కొందరు ముక్కు మీద పెట్టుకుంటారు 
కొందరు ముక్కు చివర పెట్టుకుంటారు

కొందరు అవసరానికి కొంటే ..
కొందరు హాబీ కొంటారు---- మన ఆంధ్రుల అభిమాన అత్తగారు సూర్యకాంతం గారికి ఈ హాబీ ఉందిట.

 సులోచనాలు ఉంటే బాగా తెలివైన వాళ్ళని
 బాగా చదువుతారు అని కొందరి అభిప్రాయం.------ అందులో నేను ఒక దానిని

ఆ ఉద్దేశం తోనే  చిన్న తనంలో ఒకరోజు మా నాన్నగారిని సులోచనాలు కావాలి అని అడిగాను "రోగం  కొని తెచ్చుకోవడం ఏంటి దరిద్రం " అని అక్షతలు  వేయించుకోవడం తప్ప   సులోచనధారణ  భాగ్యం మాత్రం కలగలేదు..  
ఇప్పుడు  సాఫ్ట్వేర్ ఉద్యోగం పుణ్యమా అని సులోచనధారణ  భాగ్యం కలిగింది.....😎😎😎😎

రెండు రెళ్ళు నాలుగు అంటే మనకున్న రెండు కళ్ళకు రెండు అద్ధాలు జత పడితే నాలుగు కళ్ళు అన్నమాట...ఈ చతురాక్షులంటే నాకు చిన్నప్పటి నుంచి భలే సరదా... మరి మీకు....


 



లోక సమస్త సుఖినో భవంతు
********** మీ ఉషగిరిధర్ ***********

3, జనవరి 2021, ఆదివారం

అర్ధమా..... భావమా

 మనిషి నవ్వుతూ ఉన్నాడు అంటే కష్టాలు లేవు అని కాదు దాని అర్థం..

కష్టాలు తట్టుకునే శక్తి ఉంది అని దాని భావం


నీకు నచ్చినది దక్కలేదు అంటే నువ్వు దురదృష్టవంతుడవని కాదు దాని అర్థం..

దాని కంటే గోప్పది నీకు దక్కుతందని దాని భావం


పెద్దలు మందలిస్తె నువ్వు అంటే కోపం అని కాదు దాని అర్థం..

నిన్ను ఉన్నత  స్థితిలో చూడదలచారని దాని భావం


మౌనం గా ఉన్నారు అంటే ఎదిరించే శక్తి లేదు అని  కాదు అర్థం..

శాంతి ని కోరుతున్నారు అని భావం...

                                                        జై శ్రీరామ్

                                              ***మీ ఉషగిరిధర్***