Pages

27, జనవరి 2022, గురువారం

ఋణ గీత !


సుమతి శతక కర్త అప్పిచ్చువాడు లేని వూళ్ళో వుండ వద్దన్నాడు. 

ఏమి చిత్రమో గానీ మరీ యిదే కవి
'అప్పుగొని చేయు విభవము
తెప్పరమై కీడు తెచ్చుర సుమతీ అన్నాడు.

మరి అప్పిచ్చే వాడిని వూర్లో పెట్టుకోవడం ఎందుకు?

మళ్ళీ ఈ కవిగారే బంగారు కుదువ బెట్టకు అంగడిలో సరుకులు అరువు తేకు అన్నారు.

ఈకాలం లో బంగారు కుదువ బెట్టకపోతే పిల్లాడిని చదివించడ మెలా?
మధ్య తరగతి వారి బాధలు అర్థం చేసుకోవాలి మరి! "అర్థం చేసుకోరూ!"

.

'అప్పులేనివాడే అధిక సంపన్నుండు' అంటాడు వేమన, 

"తీర్చినట్టి బకాయి తెచ్చిపెట్టును హాయి అప్పు మెడ లో రాయి ఓ!కూనలమ్మా!అన్నారు ఆరుద్ర.

మరి పింగళి నాగేంద్రరావు గారు
"అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ!నరుడా గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా'
 అని సూక్తి ముక్తావళి బోధించారు.

ఎవరి మాట వినాలి?

వున్నవారు లేనివారు రెండే రెండు జాతులురా 
వున్నచోట తెచ్చుకొనుట లేనివారి హక్కురా"

అన్నారు పింగళి వారు.

అప్పుల అప్పారావు ఓ విరుగుడు చెప్పారు.

ఐ.పి పెట్టిన వాడే వి.ఐ.పి జగాన" అప్పిచ్చిన వాడు మన బాగే కోరతాడన్నది పెద్దల వాక్యం 

'అప్పిచ్చిచూడు ఆడపిల్లనిచ్చి చూడు' అన్నట్టు 

ఎవరి కష్టాలు వాళ్ళవి.
అప్పులుచేయడం లో మనకు ఆదర్శం మన వెంకన్న బాబు, మరియు మన ప్రభుత్వ.మే కదా!


'ఋణానంద లహరి'.వ్రాసిన ముళ్ళపూడి వారికి నమస్కరిస్తే 

"నీకు అడగ్గానే అప్పుదొరకా" అని ఆశీర్వ దిస్తారట.

ఇంతకీ అప్పు నిప్పా?పప్పా?ఏమో ఒకటి మాత్రం నిజం

'అప్పు ఆరు తెన్నులు ముప్పు మూడు తెన్నులు' ఆ తరువాత తీసుకున్న వాళ్ళ తలరాత.

"అప్పుతీసుకున్నవాడే అధిక సంపన్నుండు' అంటాడు ఆధునిక కవి.ఎందుకు కాడు.

అప్పు చేసి తెచ్చిన డబ్బు వడ్డీలకు తిప్పితే అధిక సంపన్నుడు కాడా?
అప్పుచేసి కారు కొనరా ఓ! నరుడా! యిదే కలికాలపు తీరురా నరుడా! 

ఏదో తమాషాకు కాసేపు నవ్వుకుందామని వ్రాశాను.అప్పుచేయకండి.

అయినా నేను చెప్తే మానేస్తారా ఏమిటి?

18, జనవరి 2022, మంగళవారం

అచ్చ తెలుగు...అర్ధం చేసుకోవడం కష్టం సుమీ .... !


ఇదిచదివి అనందించండి. ....... అర్ధం  చేసుకొని కామెంట్ చేయండి 


ఒకానొక సమయంలో ఉభయ భాషాప్రవీణులు పండిత ......... అవదానిగారు 

రాజమహేంద్రవరంలో ధూమశకట గమనాగమన ప్రదేశ ప్రాంగణ మందున్న

శకటాధిరోహణ అనుజ్ఞాపత్ర విక్రేత మహాశయా 

బెజవాడ ప్రయాణమునకు వలయు విత్తమును గైకొని

శీఘ్రమే అనుజ్ఞా పత్రమును నొసగుమా.......

అని విన్నవించి వలయు పైకము తీయ ప్రయత్నిచుచున్న వేళ. 

ధుమశకటాగమన నిర్గమనములు సమాప్తమాయెను. 

తదుపరి వచ్చు ధూమశటమునకై నిరీక్షణ కొనసాగెను, 

అంతలో సూర్యాస్తమానముకావచ్చెను. 

సాయంధ్యానుష్టానమునకు అవధానిగారు గృహోన్ముఖులైరి.




28, డిసెంబర్ 2021, మంగళవారం

చందమామా ---- గొబ్బిళ్ళ పాట

చందమామ చందమామ ఓ చందమామా
చందమామ చందమామ ఓ చందమామా


చందమామ కూతుళ్ళు నీలగిరి కన్యలు

నీలగిరి కన్యలకు నిత్యమల్లె తోట

నిత్యమల్లె తోటలో నిర్మల్ల బావి

నిర్మల్ల బావికి గిలకల్ల తాడు

గిలకల్ల తాడుకి బుడికి బుడికి చెంబు

బుడికి బుడికి చెంబంటే అందరికి మనస్సు

బుడికి బుడికి  చెంబుకి పేడ ముద్ద దిష్టి 

పేడ ముద్ద దిష్టికి  పప్పు బెల్లం నైవేద్యం 



ఏల వచ్చెనమ్మ క్రిష్ణుడేల వచ్చెను


పల్లవి :

ఏల వచ్చెనమ్మ క్రిష్ణుడేల వచ్చెను

ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసేను.


చరణం :

ఉట్లమీద పాలు పెరుగు ఎట్ల దించెను.

అబ్బ కొట్టబోతే దొరకడమ్మ చిన్నికృష్ణుడు….ఏల వచ్చెనమ్మ...


కాళింది మడుగులోన కరిగినాడమ్మా

అబ్బ బాలుడు కాడమ్మా పెద్దవాడమ్మా….ఏల వచ్చెనమ్మ...


చీరలన్ని మూటకట్టి చిన్నికృష్ణుడు

రవికలన్ని మూటకట్టి రాధాకృష్ణుడు

ఆ పొన్నమావి పైన పెట్టి పంతమాడెను….ఏల వచ్చెనమ్మ...


గోవర్ధనా గిరి ఎత్తినాడమ్మా

గోవులను కాచిన గోపాలుడమ్మా  ….ఏల వచ్చెనమ్మ….


రక్కసుల మదమునే అణచినాడమ్మా

భగవద్గీతను చెప్పిన పరమాత్ముడమ్మా 


ఏల వచ్చెనమ్మ క్రిష్ణుడేల వచ్చెను

ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసేను.

ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసేను.


సుబ్బి గొబ్బెమ్మ --- గొబ్బిళ్ళ పాట

సుబ్బి గొబ్బెమ్మ
సుబ్బి నియ్యవే


చేమంతి పువ్వంటి చెల్లినియ్యవే !


తామర పువ్వంటి తమ్ముడినియ్యవే!


అరటి పువ్వంటి అన్నయ్యనియ్యవే!


మల్లె పువ్వంటి మామానియ్యవే!


బంతి పువ్వంటి బావానియ్యవే!


మొగలి పువ్వంటి మొగుణ్ణియ్యవే!

అటవీ స్థలములు .... గొబ్బిళ్ళ పాట

అటవీ స్థలములు కరుగుదమా
వట పత్రమ్ములు కోయుదమా


గుంటలు గుంటలు తవ్వుదమా
గోళీకాయలు ఆడుదమా


చింతా పిక్కెలు ఆడెదమా
సిరి సిరి నవ్వులు నవ్వెదమా


దాగుడు మూతలు ఆడెదమా
తలుపుల చాటునా దాగెదమా


కోతీ కొమ్మచ్చు లాడెదమా
కొమ్మల మాటున దాగెదమా


చల్లని గంధం తీయుదమా
సఖియా మెడకు పూయుదమా


సన్నాజాజులు గుచ్చెదమా
దేవుని మెడలో వేయుదమా

దుక్కల్ దుక్కుల్ దున్నారంట ........ గొబ్బిళ్ళ పాట


గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో

దుక్కుల్ దుక్కుల్ దున్నారంట.

ఏమి దుక్కుల్ దున్నారంట

రాజావారి తోటలో జామదుక్కుల్ దున్నారంట

ఔనాటె అక్కల్లారా చంద్రాగిరి భామల్లారా భామలగిరి  గొబ్బిళ్ళో

….గొబ్బియళ్ళో…గొబ్బియళ్ళో…….


విత్తనం విత్తనం వేశారంట ఏమి విత్తనం వేశారంట 

రాజావారి తోటలో జామవిత్తనం వేశారంట

ఔనాటె అక్కల్లారా చంద్రాగిరి భామల్లారా భామలగిరి  గొబ్బిళ్ళో

....గొబ్బియళ్ళో…గొబ్బియళ్ళో….


మొలకా మొలకా వచ్చిందంట ఏమి మొలకా వచ్చిందంట 

రాజావారి తోటలో జామ మొలకా వచ్చిందంట

ఔనాటె అక్కల్లారా చంద్రాగిరి భామల్లారా భామలగిరి  గొబ్బిళ్ళో

……గొబ్బియళ్ళో…గొబ్బియళ్ళో….


ఆకు ఆకు వేసిందంట ఏమి ఆకు  వేసిందంట

రాజావారి తోటలో జామా ఆకు వేసిందంట

ఔనాటె అక్కల్లారా చంద్రాగిరి భామల్లారా భామలగిరి  గొబ్బిళ్ళో

……గొబ్బియళ్ళో…గొబ్బియళ్ళో…


మొగ్గ మొగ్గ తొడిగిందంట ఏమి మొగ్గ తొడిగిందంట

రాజావారిలో జామ మొగ్గ తొడిగిందంట 

ఔనాటె అక్కల్లారా చంద్రాగిరి భామల్లారా భామలగిరి  గొబ్బిళ్ళో

....గొబ్బియళ్ళో…గొబ్బియళ్ళో…….


పువ్వు పువ్వు పూసిందంట

 ఏమి పువ్వు పూసిందంట 

రాజావారి తోటలో జామ పువ్వూ పూసిందంట

ఔనాటె అక్కల్లారా చంద్రాగిరి భామల్లారా భామలగిరి  గొబ్బిళ్ళో

....గొబ్బియళ్ళో…గొబ్బియళ్ళో…….


పిందె పిందె వేసిందంట ఏమి పిందె వేసిందంట.
రాజా వారి తోటలో జామ పిందె వేసిందంట

ఔనాటె అక్కల్లారా చంద్రాగిరి భామల్లారా భామలగిరి  గొబ్బిళ్ళో

....గొబ్బియళ్ళో…గొబ్బియళ్ళో…….


కాయ కాయ కాసిందంట ఏమి కాయ కాసిందంట.
తాజా తోటలో జసమకాయ కాసిందంట

ఔనాటె అక్కల్లారా చంద్రాగిరి భామల్లారా భామలగిరి  గొబ్బిళ్ళో

....గొబ్బియళ్ళో…గొబ్బియళ్ళో…….


పండు పండు పండిందంట 

ఏమి పండు పండిందంట రాజావారి తోటలో జామపండు పండిందంట

ఔనాటె అక్కల్లారా చంద్రాగిరి భామల్లారా భామలగిరి  గొబ్బిళ్ళో

....గొబ్బియళ్ళో…గొబ్బియళ్ళో…….


పండు పండు పెట్టారమ్మా 

నైవేద్యానికి పెట్టారమ్మా 

గొబ్బిగౌరికి జామపండు నైవేద్యంగా పెట్టారమ్మా

ఔనాటె అక్కల్లారా చంద్రాగిరి భామల్లారా భామలగిరి  గొబ్బిళ్ళో

....గొబ్బియళ్ళో…గొబ్బియళ్ళో……


పండు పండు తిన్నారంట 

ఏమి పండు తిన్నారంట

రాజావారి తోటలో జామపండు తిన్నారంట

ఔనాటె అక్కల్లారా చంద్రాగిరి భామల్లారా భామలగిరి  గొబ్బిళ్ళో

....గొబ్బియళ్ళో…గొబ్బియళ్ళో……