Pages

16, జులై 2021, శుక్రవారం

కాసిని చల్లని కబుర్లు


నెల్లాళ్ళ నుంచీ ఎదురు చూస్తూ ఉండగా .......

ఇదిగో ఇవాళ కాస్త చెప్పుకోగలిగే విధంగా నాలుగు చుక్కలు విదిల్చింది ఆకాశం. 

చిన్న చిన్న జల్లులు వాతావరణాన్ని చల్లబరిచి, మనసు తేలిక పరిచాయి. 

హమ్మయ్య.. వర్షాలకి మనఃశ్శరీరాలని సిద్ధం చేసేసుకోవచ్చు అన్న నమ్మకం కుదిరింది.

 ఓ ఎనిమిది నెల్ల వరకూ ఈ ఎండల బాధ ఉండదింక. 

 నావరకూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయమే ఇది.

 ఎలా సెలబ్రేట్ చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నా. 


పొద్దుపొద్దున్నే వర్షాన్ని ఆస్వాదిస్తూ, కాఫీ తాగుతూ, పేపర్లు చదువుకుంటున్నానా?

నా ఆనందాన్ని భగ్నం చేస్తూ ఓ ఫోన్ కాల్.

నా సహా ఉద్యోగి... వాళ్ళ కాలనీ నీటిలో మునిగి పోయింది అని ... ఈ  రోజు సెలవు తీసుకుంటాను అని .

ఆ పని భారం కూడా నా మీద పడింది .

చికాకు తో ఆఫీస్ పని మొదలు పెట్టాను .. 

అస్సలే శుక్రవారం . 

పైగా వాతావరణ చల్లగా పనికి అస్సలు అనుకూలంగా లేదు ...  తప్పదు కదా .. 


భాగ్య నగరంలో నివాసం ఉంటున్న మిత్రులతో కొన్ని కాల్స్ మాట్లాడాను.

 ఏమిటో, అందరూ కరోనా మూడ్ లో ఉన్నారు. 

 కరోనా వల్ల ఎన్నెన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒకొక్కరూ వివరంగా చెప్పడం మొదలుపెట్టారు. 

 వీళ్ళంతా బొత్తిగా సామాన్య జనం అవ్వడం వల్ల కేవలం వాళ్ళ వాళ్ళ సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. 

 ఎవరైనా అంతే.. ముందర ఇల్లు చక్కబెట్టుకుని ఆతర్వాత ఇతర విషయాలు ఆలోచించాలి మరి. 


జల్లుల పుణ్యమాని కాఫీటీల సంఖ్య రోజూ కన్నా పెరిగింది. 

వర్షాకాలంలో వీటిని కొంచం అదుపులో పెట్టాలి, ఏదో ఒకటి చేసి. 

సరే నా చికాకు చికాకులాగే ఉండిపోయింది కదా.. దానిని పారదోలే ఉపాయం ఒక్కటే. 

అదే అమలుచేశాను. ....ఈ టపా  తో ....                                     మీ ఉషగిరిధర్ 



12, జులై 2021, సోమవారం

పంచ మహా కావ్యములు


తెలుగు భాషలో పంచ మహా కావ్యాలు 


1. మను చరిత్రము - (అల్లసాని పెద్దన) :

 మను చరిత్రము లేదా స్వారోచిష మనుసంభవము.

 అల్లసాని పెద్దన రచించిన ఒక ప్రబంధ కావ్యము. 

ఇది వరూధినీ, ప్రవరాఖ్యుల ప్రేమ కథతో మొదలై స్వారోచిషునితో ముగుస్తుంది. 

 

2. పాండురంగ మాహాత్మ్యము - (తెనాలి రామకృష్ణుడు)

 తెనాలి రామలింగడు రచించిన ఐదు అశ్వాసాల గద్య పద్య కావ్యము.

 ఈ కావ్యంలో గత కవులు ఎవరూ వాడని కొత్త వర్ణనలు, అందునా తాను గతంలో వాడినవి మళ్ళీ వాడకుండా కవిత్వం చెప్పడంతో రామలింగడికి వికటకవి అన్న పేరువచ్చింది.

ఇందు ఇతివృత్తము పాండురంగని కథ.

 

3. ఆముక్త మాల్యద - (కృష్ణదేవరాయలు)

  విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ఈ "ఆముక్తమాల్యద" గ్రంథం. దీనికే "విష్ణుచిత్తీయం" అని మరోపేరు. 

ఈ ప్రబంధంలో గోదాదేవి పెంపుడు తండ్రియైన విష్ణుచిత్తుడు శ్రీవిల్లిపుత్తూరులో మన్ననారుస్వామి కోవెలలో అర్చకుడిగా జీవిస్తున్నాడు. విష్ణుచిత్తునకు తులసీవనంలో స్త్రీశిశువు లభిస్తుంది.  సంతానం లేని తనకు విష్ణువే కరుణించి తనకీ శిశువును ఇచ్చాడని ఆమెకు గోదాదేవి అని నామకరణం చేసి పెంచుకోసాగాడు. ఆమె పూర్వజన్మలో భూదేవి.  తన తండ్రి స్వామి కోసం అల్లిన పూలమాలను చాటుగా ధరించి గోదాదేవి తన నీడను చూచుకొని ఆనందించి తిరిగి ఆ మాలను యథాస్థానంలో పెట్టేది.  ఆ మాలనే విష్ణుచిత్తుడు స్వామికి అర్పించేవాడు. ఆ కారణంగానే గోదాదేవికి ఆముక్తమాల్యద అను పేరు వచ్చింది.  తాను పూర్వజన్మలో సత్యభామా దేవిననే విషయం తెలుసుకుంది. అలనాటి శ్రీకృష్ణుడు ఇప్పుడు శ్రీరంగంలో వెలిసాడని, ఆ శ్రీరంగేశుని తన భర్తగా వలచింది. ఆ స్వామి ఆమెను వలచాడు. ఇరువురికి వివాహం జరుగుతుంది.

 

4. వసు చరిత్రము - (రామరాజ భూషణుడు.)


   రామరాజభూషణుడు గా పేరుగాంచిన భట్టుమూర్తి, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజాల లో ఒకడు.   వసు చరిత్రము భారతములోని ఉపరిచర వసువు కథ, ఇది కవిత్రయము రాసిన మహా భారతంలో 45 పద్యాలలో ఉన్నది,

   దీనిని రామరాజభూషణుడు విస్తరిస్తూ ఆరు ఆశ్వాసాలు కల ఒక ప్రత్యేక గ్రంథంగా మలిచారు, తిరుమల నాయునికి ఈ కృతి అంకితమివ్వబడింది.

   

5. పారిజాతాపహరణం - (నంది) ముక్కు తిమ్మన.


ఐదు అశ్వాసాలు గల ప్రబంధం. సంస్కృత భాగవతములోని మూడు పద్యాల కథని అద్భుతముగా పెంచి రచించాడు.

నారదుడు పారిజాతం కృష్ణులవారికి ఇవ్వడం, ఆ సమయములో వారు రుక్మిణీదేవి మందిరములో ఉండటం, ఆ పారిజాతాన్ని రుక్మిణికి ఇవ్వడం, దానిని తెలుసుకొని సత్య ఆగ్రహించడం, అటుపై రకరకాల మలుపులు, పాద పీడనం, చివరకు దేవతలతో యుద్ధం, పారిజాత వృక్షం సత్య తీసుకొని రావడం, తులాభారంతో కథ సుఖాంతం.


సంస్కృత భాషలో పంచ మహా కావ్యాలు 


1.రఘువంశము ( కాళిదాసు రచన):

మహాకవి కాళిదాసు రాసిన సంస్కృత మహాకావ్యం. ఈ గ్రంథంలో 19 సర్గలలో రఘు రాజవంశానికి సంబంధించిన కథలు, దిలీపుని కుటుంబం, అగ్నివర్ణుని వరకు అతని వారసుల గూర్చి వివరించబడినది. వీరిలో రఘుమహరాజు, దశరథ మహారాజు, రాముడు ఉన్నారు.


2.కుమారసంభవము ( కాళిదాసు రచన):

పార్వతితో పరమేశ్వరుని వివాహం, అనంతరం కుమారస్వామి జననం తారకాసురుని వధ మొదలయిన విషయాలు మహాకవి కాళిదాసు చాలా చక్కగా వర్ణించాడు.


3.మేఘసందేశము ( కాళిదాసు రచన):

 కాళిదాసు రచించిన కావ్యత్రయం అని పేరు పొందిన మూడు కావ్యాలలో ఇది ఒకటి.కేవలం 111 శ్లోకాలతో కూడిన ఈ చిన్నకావ్యము కాళిదాసు రచనలలోను, సంస్కృత సాహిత్యంలోను విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది. 

 కుబేరుని కొలువులో ఉన్న ఒక యక్షుడు కొలువునుండి ఒక సంవత్సరం పాటు బహిష్కారానికి గురవుతాడు. ఆ యక్షుడు హిమాలయాలలోని కైలాసగిరికి పైన, అలకాపురిలో ఉన్న తన ప్రియురాలికి ఒక మేఘం ద్వారా సందేశం పంపుతాడు. మార్గసూచకంగా యక్షుడు ఆ మేఘానికి హిమాలయాలకు పోయే దారిలోనున్న పెక్కు దృశ్యాలను వర్ణిస్తాడు.మేఘ సందేశం కావ్యంలో కాళిదాసు వర్ణనా నైపుణ్యము, అలంకార పటిమ, పాత్ర చిత్రణ, శృంగార ప్రస్తావన అద్భుతంగా కనిపిస్తాయి. ఇంకా వివిధ భౌగోళిక అంశాలు చెప్పబడ్డాయి.


4.కిరాతార్జునీయము (భారవి రచన):

ఈ కావ్యం అర్జునుడు, మారు వేషంలో ఉన్న శివుని మధ్య జరిగిన యుద్ధాన్ని తెలుపుతూ రాయబడింది.ఇందులో కవి మహాభారతంలో వనపర్వంలోని ఒక చిన్న భాగాన్ని తీసుకుని వర్ణించాడు. 

5.శిశుపాలవధ (మాఘుని రచన)


శిశుపాల వధ 7 లేదా 8 వ శతాబ్దంలో మాఘ స్వరపరిచిన శాస్త్రీయ సంస్కృత కవితల రచన. ఇది సుమారు 1800 అత్యంత అలంకరించబడిన చరణాలలో 20 సర్గాలలో ఒక ఇతిహాసం.

1, జులై 2021, గురువారం

అల్లసాని వాని అల్లిక జిగిబిగి

ఈ టపా లో నేను స్కూల్ లో బాగా చెప్పి .....
మా తెలుగు మాస్టారు చేత మెప్పు పొందిన ..
ప్రసిద్ధమైన అల్లసాని పెద్దన గారి పద్యం గురంచి చెపుతాను :

అప్పుడు పద్యం మాత్రమే వచ్చు ... దాని అర్ధం ఇప్పుడు బాగా తెలిసింది .. 


అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ

పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన

స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్

గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్


మనుచరిత్ర అనగానే అందరికీ గుర్తొచ్చే పద్యం ఇది. 

అర్థం తెలిసినా తెలియకపోయినా, చదవగానే (వినగానే) "ఓహో!" అనిపించే పద్యం.


నిజానికి మనుచరిత్ర మనుచరిత్ర కాదు -
మను సంభవ చరిత్ర, "స్వారోచిష మను సంభవము". 

మనువుల్లో ఒకడైన స్వారోచిషుడి జన్మ వృత్తాంతం. 

అయితే మనుచరిత్ర అనగానే గుర్తొచ్చేది వరూధినీ ప్రవరాఖ్యులు.

వీళ్ళకీ ఆ స్వారోచిష మనువుకి ఉన్న సంబంధం యేమిటి? 

ఆ మనువు నాన్నమ్మ వరూధిని! అల్లసాని అక్కడనుంచి ప్రారంభించాడు కథని. 

ఆ భాగాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దాడంటే, అదే అసలు కథేమో అన్నంతగా ప్రచారం పొందింది. 

ఇదొక తమాషా అయిన కథ. ఇంతకీ ప్రవరుడెవరయ్యా, ఆ మనువు తాతగారేనా అంటే, కాదు. ఒక రకంగా అవును! అందికే ఇది విచిత్రమైన కథ అయ్యింది. 


ప్రవరుడి ఊరు అరుణాస్పదపురం. 

 అతను "ఆ పురి బాయకుండు", అంటే ఆ ఊరిని విడిచి ఎప్పుడూ వేరే ఊరికి వెళ్ళలేదు! 

అదేంటి, మరీ బొత్తిగా ఏ పెళ్ళికో పేరంటానికో అయినా పొరుగూరు వెళ్ళి ఉండడా అంటే అలా కాదు. 

వేరే ఊళ్ళో ఉద్యోగానికి కానీ tourist గా చూడ్డానికి కానీ ఎప్పుడూ వెళ్ళలేదని. 

కానీ యాత్రలు చెయ్యాలనే కోరిక మాత్రం ఉంది. 

యాత్రలంటే ప్రణయ యాత్రలో విహార యాత్రలో అనుకునేరు! తీర్థ యాత్రలు. 

మరి ఆ రోజుల్లో ఇప్పట్లా విమానాలూ అవీ లేవాయె, ఉన్నాయనుకొన్నా మానవులకి మాత్రం అందుబాటులో లేవాయె. 

తీర్థయాత్రలు చెయ్యడమంటే మాటలా మరి? కాబట్టి అతని కోరిక కోరికగానే ఉండిపోయింది. 

ఒక రోజు అనుకోకుండా ఓ సిద్ధుడు అతనింటికి వచ్చి, "నేను భూమంతా చుట్టేసాను, ఇది చూసాను అది చూసాను" అని ఓ చెప్పేసరికి,

పాపం ఈ ప్రవరుడికి కోరిక మరింత పెరిగిపోతుంది. 

ఎదోలాగ అతని దగ్గరనుంచి ఒక పాద లేపనం సంపాదిస్తాడు. 

సంపాదించిందే తడవుగా హుటాహుటిని హిమాలయాలకి బయలుదేరేస్తాడు, 

ఇంట్లో చెప్పకుండానే! మొదటిసారిగా, ఊరిని కూడా విడిచి వెళ్ళని ఆ ప్రవరుడు, హిమాలయాలని చూసినప్పుడు అవి ఎలా కనిపించాయో చెప్పే వర్ణన ఈ పద్యం.


ఈ పద్యం లో  అర్థం ముఖ్యం కాదు. పదాలూ, పదాల పొహళింపూ, శబ్ద సౌందర్యం, ఇవన్నీ మనలని మంత్రముగ్ధులని చేస్తాయి!

శబ్దం ప్రధానమైన ఇలాటి కవిత్వం అన్ని చోటలా అందాన్నివ్వదు. ఎక్కువైతే అజీర్తి చేస్తుంది కూడా! 

దీన్ని తగిన సందర్భంలో తగిన పాళ్ళలో వాడేడు కాబట్టే పెద్దన ఆంధ్రకవితా పితామహుడయ్యాడు.


 ఈ పద్యంలో ఛందస్సుకి సంబంధించిన విశేషాలు కూడా కొన్ని ఉన్నాయి.

 ఈ పద్యాన్ని చంపకమాలలో ఎందుకు రాసుంటాడు పెద్దన అని ఆలోచిస్తే, 

 "అటజని కాంచె" అన్న ప్రారంభం కోసం అని అనిపిస్తుంది. మొదటి నాలుగు లఘువులూ ఆ వెళ్ళడంలోని వేగాన్ని సూచించడం లేదూ! 

 ఇక మొదటి పాదంలో "అంబర చుంబి" దాకా చంపకమాల నడకతో సాగిన పద్యం,

 హఠాత్తుగా "శిరస్సరజ్ఝరీ" (తడక్-తడక్-తడక్) అన్న నడకలోకి మారిపోడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

 చంపకమాలతో ఇలాటి నడక సాధించవచ్చా అనిపిస్తుంది. అలానే రెండవ పాదంలో "అభంగ తరంగ మృదంగ" (తధింత-తధింత-తధింత) అన్న నడకకూడా!

ఇక ఇందులోని అర్థం విషయానికి వస్తే - 

"అటజని కాంచె భూమిసురుడు". ఏమిటి చూసాడు?

 "శీతశైలమున్" - హిమాలయాన్ని. ఎలాంటిదా హిమాలయం అన్నది మొత్తం పద్యం, రెండు పొడవైన సమాసాలు!

"అంబర చుంబి శిరః" - ఆకాశాన్ని ముద్దాడుతున్న శిఖరాలనుండి, 

"సరత్ ఝరీ పటల" - ప్రవహిస్తున్న సెలయేళ్ళ (జలపాతాల) గుంపులో, 

"ముహుర్ ముహుర్ లుఠత్" - మాటిమాటికీ దొరలుతున్న, 

"అభంగ తరంగ మృదంగ" - ఎడతెగని తరంగాలనెడి మద్దెలలు చేసే, 

"నిస్వన స్ఫుట నటన అనుకూల" - ధ్వనికి తగినట్లు నాట్యం చేసే, 

"పరిఫుల్ల కలాప" - విప్పారిన పింఛం కలిగిన, 

"కలాపి జాలమున్" - నెమళ్ళ గుంపుతో కూడినది. ఆకాశాన్నంటే పర్వత శిఖరాలనుంచి కిందకి ఉరుకుతున్న జలపాతాల తరంగాలు అనే మృదంగాలు చేసే ధ్వనికి అనుకూలంగా పురి విప్పి నాట్యం చేస్తున్న నెమ్మళ్ళ గుంపుతో ఉన్నది ఆ హిమాలయం. 

ఈ వర్ణనలో గొప్పతనం ఏమిటంటే, కవి హిమాలయ శిఖరాలనీ, జలపాతాలనీ, నెమళ్ళనీ అన్నిటినీ ఇక్కడ చిత్రించాడు. 

ఏదో వేరే వేరేగా చూపెట్టడం కాకుండా వాటన్నిటినీ చక్కగా లింక్ చేసాడు. అదీ కవి ఊహ అంటే! ఇంతకన్నా గొప్ప విషయం మరోటి ఉంది. 

నెమళ్ళు సాధారణంగా పురివిప్పి యెప్పుడాడతాయి? ఉరుముల శబ్దం విన్నప్పుడు, వాన పడేటప్పుడు. 

ఇక్కడ ఈ జలపాతాలు చేసే శబ్దానికి నాట్యం చేస్తున్నాయంటే, ఆ జలపాతాల హోరు మేఘ గర్జనలా ఉందన్నమాట! 

శిఖరాలు ఆకాశమంత యెత్తున్నాయి కాబట్టి, ఆకాశంలోని మేఘాలే వర్షిస్తున్నట్లుగా ఆ జలపాతాలున్నాయన్న మాట! ఇవేవీ పద్యంలో సూటిగా చెప్పలేదు, స్ఫురింప చేసాడు! దీనినే మనవాళ్ళు "అలంకార ధ్వని" అంటారు.

ఒక విషయాన్ని చెప్పకుండా చెప్పడమూ, చూపించకుండా చూపించడమే కదా కవిత్వమంటే!

ఇక, అక్కడ నెమళ్ళే కాక ఏనుగులు కూడా ఉన్నాయి. "కటక చరత్" - ఆ పర్వతాల మధ్యలో తిరిగే, "కరేణు కర" - ఏనుగుల తొండాల చేత, 

"కంపిత సాలము" - కదిలించి వెయ్యబడ్డ చెట్లు కలది, ఆ హిమాలయం. 

ఇక్కడకూడా కవి మనకి ఒక still photograph కాకుండా videoని చూపిస్తున్నాడు. ఏనుగులని మాత్రం చెప్పి ఊరుకుంటే అది still photograph అయి ఉండేది. 

అవి కదిపి కుదిపేస్తున్న చేట్లని కూడా చూపించి దీన్ని videoగా మార్చాడు అల్లసాని.

ఇదే "అల్లసాని వాని అల్లిక జిగిబిగి"!

28, జూన్ 2021, సోమవారం

కొన్ని తెలుగు సామెతలు ( Just For Recalling )

1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు

2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా

3. అతి రహస్యం బట్టబయలు

4. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ

5. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు

6. అనువు గాని చోట అధికులమనరాదు

7. అభ్యాసం కూసు విద్య

8. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి

9. అయితే ఆదివారం కాకుంటే సోమవారం

10. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం

11. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత

12. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు

13. ఇంట గెలిచి రచ్చ గెలువు

14. ఇల్లు పీకి పందిరేసినట్టు

15. ఎనుబోతు మీద వాన కురిసినట్టు

16. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు

17. కందకు లేని దురద కత్తిపీటకెందుకు

18. కత్తిపోటు తప్పినాక కలంపోటు తప్పదు

19. కుక్క కాటుకు చెప్పుదెబ్బ

20. కోటి విద్యలు కూటి కొరకే

21. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు

22. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం

23. పిట్ట కొంచెము కూత ఘనము

24. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు

25. వాన రాకడ ప్రాణపోకడ

26. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు

27. మీసాలకు సంపంగి నూనె

28. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు

29. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు

30. ఆది లొనే హంస పాదు

31. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము

32. ఆకలి రుచి యెరుగదు, నిద్ర సుఖమెరుగదు

33. ఆకాశానికి హద్దే లేదు

34. ఆలస్యం అమృతం విషం

35. ఆరే దీపానికి వెలుగు యెక్కువ

36. ఆరోగ్యమే మహాభాగ్యము

37. ఆత్రానికి బుద్ధి మట్టు

38. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని, తుమ్ముకు తమ్ముడు లేడంట

39. ఆవు చేను మేస్తే, దూడ గట్టు మేస్తుందా?

40. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి

41. అడగందే అమ్మైనా అన్నమ్ పెట్టదు

42. అడ్డాల నాడు బిడ్డలు కాని, గడ్డాల నాడు కాదు

43. ఏ ఎండకు ఆ గొడుగు

44. అగడ్తలొ పడ్డ పిల్లికి అదే వైకున్ఠం

45. అగ్నికి వాయువు తొడైనట్లు

46. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమనేవాడు

47. అందని మ్రానిపండ్లకు అర్రులు చాచుట

48. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు

49. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు

50. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేధు

51. అప్పు చేసి పప్పు కూడు

52. అయ్య వచే వరకు అమావాస్య ఆగుతుందా

53. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు

54. బతికుంటే బలుసాకు తినవచ్చు

55. బెల్లం కొట్టిన రాయిలా

56. భక్తి లేని పూజ పత్రి చేటు

57. బూడిదలో పోసిన పన్నీరు

58. చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే యేడుస్తాడు

59. చాప కింద నీరులా

60. చచ్చినవాని కండ్లు చారెడు

61. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు

62. విద్య లేని వాడు వింత పశువు

63. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ

64. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు

65. చక్కనమ్మ చిక్కినా అందమే

66. చెడపకురా చెడేవు

67. చీకటి కొన్నాళ్ళు, వెలుగు కొన్నాళ్ళు

68. చెరువుకి నీటి ఆశ, నీటికి చెరువు ఆశ

69. చింత చచ్చినా పులుపు చావ లేదు

70. చిలికి చిలికి గాలివాన అయినట్లు

71. డబ్బుకు లోకం దాసోహం

72. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు

73. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన

74. దాసుని తప్పు దండంతో సరి

75. దెయ్యాలు వేదాలు పలికినట్లు

76. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు

77. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి

78. దొంగకు తేలు కుట్టినట్లు

79. దూరపు కొండలు నునుపు

80. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు

81. దురాశ దుఃఖమునకు చెటు

82. ఈతకు మించిన లోతే లేదు

83. ఎవరికి వారే యమునా తీరే

84. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు

85. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట

86. గాజుల బేరం భోజనానికి సరి

87. గంతకు తగ్గ బొంత

88. గతి లేనమ్మకు గంజే పానకము

89. గోరు చుట్టు మీద రోకలి పోటు

90. గొంతెమ్మ కోరికలు

91. గుడ్డి కన్నా మెల్ల మేలు

92. గుడ్డి యెద్దు జొన్న చేలో పడినట్లు

93. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు

94. గుడి మింగే వాడికి నంది పిండీమిరియం

95. గుడినీ గుడిలో లింగాన్నీ మింగినట్లు

96. గుడ్ల మీద కోడిపెట్ట వలే

97. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట

98. గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు

99. గురువుకు పంగనామాలు పెట్టినట్లు

100. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు

101. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు

102. ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు

103. ఇంటికన్న గుడి పదిలం

104. ఇసుక తక్కెడ పేడ తక్కెడ

105. జోగి జోగి రాజుకుంటే బూడిద రాలిందంట

106. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు

107. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు

108. కాకి ముక్కుకు దొండ పండు

109. కాకి పిల్ల కాకికి ముద్దు

110. కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది

111. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా

112. కాసుంటే మార్గముంటుంది

113. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు

114. కలకాలపు దొంగ ఒకనాడు దొరుకును

115. కలిమి లేములు కావడి కుండలు

116. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుదతాదు

117. కంచే చేను మేసినట్లు

118. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా!

119. కందకు కత్తి పీట లోకువ

120. కందెన వేయని బండికి కావలసినంత సంగీతం

121. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం

122. కీడెంచి మేలెంచమన్నారు

123. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు

124. కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు

125. కొండను తవ్వి యెలుకను పట్టినట్లు

126. కొన్న దగ్గిర కొసరు గాని కోరిన దగ్గర కొసరా

127. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట

128. కూటికి పేదైతే కులానికి పేదా

129. కొరివితో తల గోక్కున్నట్లు

130. కోతి పుండు బ్రహ్మాండం

131. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు

132. కొత్తొక వింత పాతొక రోత

133. కోతి విద్యలు కూటి కొరకే

134. కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట

135. కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు

136. కృషితో నాస్తి దుర్భిక్షం

137. క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము

138. కుడుము చేతికిస్తే పండగ అనేవాడు

139. కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు

140. లేని దాత కంటే ఉన్న లోభి నయం

141. లోగుట్టు పెరుమాళ్ళకెరుక

142. మెరిసేదంతా బంగారం కాదు

143. మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో

144. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది

145. మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు

146. మనిషి మర్మము మాను చేవ బయటకు తెలియవు

147. మనిషి పేద అయితే మాటకు పేదా

148. మనిషికి మాటే అలంకారం

149. మనిషికొక మాట పశువుకొక దెబ్బ

150. మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు

151. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా

152. మీ బోడి సంపాదనకు ఇద్దరు పెళ్ళాలా

153. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట

154. మొక్కై వంగనిది మానై వంగునా

155. మొరిగే కుక్క కరవదు

156. మొసేవానికి తెలుసు కావడి బరువు

157. ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి

158. ముండా కాదు ముత్తైదువా కాదు

159. ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు

160. ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి

161. ముంజేతి కంకణముకు అద్దము యెందుకు

162. నడమంత్రపు సిరి నరాల మీద పుండు

163. నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది

164. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా

165. నవ్వు నాలుగు విధాలా చేటు

166. నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు

167. నిదానమే ప్రధానము

168. నిజం నిప్పు లాంటిది

169. నిమ్మకు నీరెత్తినట్లు

170. నిండు కుండ తొణకదు

171. నిప్పు ముట్టనిది చేయి కాలదు

172. నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు

173. నూరు గుర్రాలకు అధికారి ఐనా భార్యకు యెండు పూరి

174. నెల్లాళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు

175. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు

176. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు

177. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు

178. ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు

179. ఊరు మొహం గోడలు చెపుతాయి

180. పాకి దానితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు

181. పాము కాళ్ళు పామునకెరుక

182. పానకంలో పుడక

183. పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట

184. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనపడినట్లు

185. పండిత పుత్రః శుంఠ

186. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు

187. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు

188. పట్టి పట్టి పంగనామం పెడితే గోడ చాటుకు వెళ్ళి చెరిపి వేసుకున్నాడట

189. పెదిమ దాటితే పృథివి దాటును

190. పెళ్ళంటే నూరేళ్ళ పంట

191. పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు

192. పేనుకు పెత్తనమిస్తే తల అంతా కొరికిందట

193. పెరుగు తోట కూరలో పెరుగు యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది

194. పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు

195. పిచ్చోడి చేతిలో రాయిలా

196. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా

197. పిల్లికి చెలగాటం యెలుకకు ప్రాణ సంకటం

198. పిండి కొద్దీ రొట్టె

199. పిట్ట కొంచెము కూత ఘనము

200. పోరు నష్టము పొందు లాభము

201. పోరాని చోట్లకు పోతే రారాని మాటలు రాకపోవు

202. పొర్లించి పొర్లించి కొట్టిన మీసాలకు మన్ను కాలేదన్నదట

203. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు

204. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు

205. రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము

206. రామాయణంలో పిడకల వేట

207. రమాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు

208. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు

209. రెడ్డి వచ్చే మొదలు పెట్టు అన్నట్టు

210. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు

211. రౌతు కొద్దీ గుర్రము

212. ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు

213. చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు

214. సంతొషమే సగం బలం

215. సిగ్గు విడిస్తే శ్రీరంగమే

216. సింగడు అద్దంకి పోనూ పొయ్యాడు రానూ వచ్చాడు

217. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు

218. శుభం పలకరా యెంకన్నా అంటే పెళ్ళి కూతురు ముండ ఎక్కడ అన్నాడంట!

219. శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుంది

220. తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందట

221. తాడి తన్ను వాని తల తన్నేవాడు ఉంటాడు

222. తాళిబొట్టు బలం వల్ల తలంబ్రాల వరకు బతికాడు

223. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు

224. తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురుతాయా

225. తాతకు దగ్గులు నేర్పినట్టు

226. తేలుకు పెత్తనమిస్తే తెల్లవార్లూ కుట్టిందట

227. తన కోపమే తన శత్రువు

228. తన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము

229. తంతే గారెల బుట్టలో పడ్డట్లు

230. తప్పులు వెదికే వాడు తండ్రి ఒప్పులు వెదికేవాడు వోర్వలేనివాడు

231. తీగ లాగితే డొంక అంతా కదిలినట్లు

232. తెగేదాక లాగవద్దు

233. తిక్కలోడు తిరణాళ్ళకు వెలితే ఎక్కా దిగా సరిపొయిందంట

234. తినే ముందు రుచి అడుగకు వినే ముందు కథ అడుగకు

235. తినగా తినగా గారెలు చేదు

236. తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి

237. తియ్యటి తేనె నిండిన నోటితోనే తేనెటీగ కుట్టేది

238. ఉల్లి చేసిన మేలు తల్లి కూడ చేయదు

239. ఉపకారానికి పోతే అపకారమెదురైనట్లు

240. ఉరుము ఉరుమి మంగళం మీద పడ్డట్టు

241. ఉత్తికెక్కలేనమ్మ స్వర్గానికెక్కినట్టు

242. వాపును చూసి బలము అనుకున్నాడట

243. వీపుమీద కొట్టవచ్చు కాని కడుపు మీద కొట్టరాదు

244. వెర్రి వెయ్యి విధాలు

245. వినాశకాలే విపరీత బుద్ధి

246. యే ఎండకు ఆ గొడుగు

247. యే గాలికి ఆ చాప

248. యెద్దు పుండు కాకికి ముద్దు

249. యేకులు పెడితే బుట్టలు చిరుగునా

250. యెప్పుడూ ఆడంబరంగా పలికే వాడు అల్పుడు


15, జూన్ 2021, మంగళవారం

బజ్జీతో అనుబంధం

ఉదయాన్నే అల్పాహారం..
మధ్యాహ్నం సుష్టుగా భోజనం..
అదయ్యాక మళ్ళీ రాత్రెప్పుడో రెండోపూట భోజనం.

మరి ఈ మధ్యలో ఉదయం అల్పాహారం లాగానే తినడానికి ఏదన్నా ఉండాలి కదా. 
ఈవినింగ్ స్నాక్స్ అని ముద్దుగా పిల్చుకోడానికి రకరకాల వంటకాలున్నాయ్. 

నాకు తెలిసి తెలుగువారందరి తొలి ఎంపిక మిరపకాయ బజ్జీ. 

వేడివేడిగా కొంచం కమ్మగా మరికొంచం ఖారంగా నోరూరించే బజ్జీలు కనిపిస్తే తినకుండా ఉండగలమా? 


మిరపకాయ బజ్జీని చూడగానే 'ఈనాటి ఈబంధమేనాటిదో..'
అని పాడేసుకుంటాను నేను. 
అంత అనుబంధం ఉంది నాకీ బజ్జీతో. 


నేను మా ఊరి ఎలిమెంటరీ స్కూల్లో చదివేటప్పుడు,
మా బడి పక్కనే  పాక హోటలుండేది. 
ఉదయం పూట ఇడ్డెన్లూ, మినప రొట్లూ, సర్వకాల సర్వావస్థల్లోనూ టీ, కాఫీలూ అమ్మేవాళ్ళక్కడ. 
మధ్యాహ్నం బళ్ళో మేం లెక్కలు చేసుకుంటుండగానే బజ్జీలు వేగుతున్న వాసన ముక్కుకి తగిలి నోట్లో నీళ్లూరేవి.


ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఐదేళ్ళ పాటు కేవలం ఆ వాసన పీల్చి సంతృప్తి పడ్డాను నేను. 

నాదగ్గర డబ్బులుండేవి.
ఇంట్లో డిబ్బీలో కూడా డబ్బులుండేవి నాకు.
కానీ ఏం లాభం, బయట ఏమీ కొనుక్కోరాదని ఇంట్లో ఆర్డర్. 
తెగించి కొనుక్కున్నా, ఐదో నిమిషంలో ఆ విషయం ఇంట్లో తెలిసిపోతుంది. 
ఇంట్లో అమ్మ అప్పుడప్పుడూ బజ్జీలేసేది.
ఎందుకో గానీ పాక హోటలు బజ్జీల్లో కనిపించే సొగసు వీటికి ఉండేది కాదు.
అందని బజ్జీలదే అందం.


తినగలిగినన్ని బజ్జీలని ఇష్టంగా తిన్నది కాలేజీ రోజుల్లో. 

కాలేజీ దగ్గర  రాముడి  బజ్జీల కొట్టు ఉండేది.
ఆయన బంధువెవరో వేగిస్తూ ఉంటే, 

ఈయన చకచకా ఒక్కో బజ్జీనీ నిలువుగా చీరి, కారం కలిపిన ఉల్లిపాయ ముక్కలు కూరి, పైన నిమ్మరసం పిండి, అందంగా ఓ కాగితంలో పెట్టి మాకు అందించేసే వాడు. 

మిర్చి బజ్జి , వంకాయ బజ్జి , టమోటా బజ్జి ....

వీటితో పాటు అరటికాయ , ఆలు కూడ ఉండేవి ... 

నేను ఎప్పుడు ముందు వంకాయ బజ్జి ప్రాముఖ్యత  ఇచ్చేదానిని ....
కానీ మిత్రులు మాత్రం మిర్చి బజ్జి కి ప్రాముఖ్యత ఇచ్చేవారు .. 


లెక్చరర్లందరూ మా బుర్రల్లో దూరి మరీ పాఠాలు చెప్పెసేవాళ్ళేమో,
క్లాసులయ్యేసరికి కడుపు ఖాళీ అయిపోయేది. 
అందరం కలిసి బజ్జీల కొట్టు మీద  దండయాత్ర.
ఎప్పుడన్నా తొలి వాయి నాలుగు బజ్జీలూ ఖాళీ చేసేశాక,
అన్ని తలో ఒకటి రుచి చేసి   నెమ్మదిగా  ఇంటికి సైకిల్ లు ఎక్కి బయలుదేరేవాళ్ళం 


కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు, ఆ ఆఫీసు కాంటీన్ లో  బజ్జీల ఉండేది.
ఓ సాయంత్రం సన్నగా చినుకులు పడుతుండగా,
ఇంటికెళ్లబోతూ "బజ్జీలు తిందామాండీ?" అనడిగా కొలీగుని. 

మా కొలీగుకి కూడా బజ్జి లమీద మక్కువ ఉండటంతో ...
ఆ కంపెనీ లో పని చేసినన్ని రోజులు 
బాగానే తినేవాళ్ళం ...
కానీ ఏ మాట కా మాట చెప్పుకోవాలి రాముడి  బజ్జీల రుచి వీటికి లేదు !!!!


రాన్రాను ఆ ఆనందం కూడా లేకుండా పోయింది. ........

కొత్త కంపెనీ కాంటీన్ లో  బజ్జీలు ... మెనూ లో లేవు 

ఈ కరోనా టైం లో బైట వి తినకూడదు అని ఒక పక్క .........
కారానికో ఏమో కానీ బజ్జీ తినగానే కడుపు మండుతుంటే ఎసిడిటీ ఏమోనని అనుమానించడం,

డాక్టరిచ్చే సుదీర్ఘ ఉపన్యాసాలు వినడం వల్ల, సరిగ్గా వేడి వేడి బజ్జీని కొరికే వేళ అవి గుర్తు రావడం.. 

ఇలా బజ్జీ అంటే ఇష్టం బదులుగా భయం మొదలవుతోందేమో అనిపిస్తోంది అప్పుడప్పుడూ.. '

భూమి గుండ్రంగా ఉంటుంది' అనే మాట చాలా సార్లు విన్నాను నేను. 

మిరపకాయ బజ్జీకి అన్వయించుకుంటే నిజమే అనిపిస్తోంది..
ఎదురుగా బజ్జీలు నోరూరిస్తున్నా తినలేకపోవడం, చిన్నప్పుడూ, ఇప్పుడూ కూడా...


భయం వేస్తోది కదా అని తినడం ఏమి మానలేము కదా చిన్నప్పటి నుంచి చాల ప్రియమైన ఈవినింగ్ స్నాక్స... 

కొన్ని జాగరతలు తీసుకుంటూ తినేయడమే....😃😃😃😃




3, జూన్ 2021, గురువారం

దోశాయణం

గుండ్రంగా ఉండే వాటిని గురించి తల్చుకోమంటే కొందరికి భూమాత గుర్తు రావచ్చు కానీ, ఎక్కువమందికి మొదట గుర్తొచ్చేది దోశే అవుతుంది. 

అవును మరి, ఎన్ని రకాలుగా తినొచ్చు అసలూ... 

వేడి వేడిగా, చల్ల చల్లగా, మెత్త మెత్తగా, కరకర్లాడుతూ... 

చట్నీతో, సాంబారుతో, సంబారు కారంతో ఇంకా పంచదారతో. 

నూనె పోసుకుని కాల్చుకుని, నూనె లేకుండా కాల్చుకునీ... 

ఎప్పుడు తినొచ్చూ అంటే... ఎప్పుడైనా తినేయచ్చు. 

ఉదయం బ్రేక్ఫాస్ట్ మొదలుకుని, 

మధ్యాహ్నం లంచికి బదులు, 

రాత్రి బోయినానికి బదులుగానూ కూడా ఆరగించగల దక్షిణ భారతదేశపు వంటకం ఇది.


దోశ అసలు పేరు దోసై అట.. 

దీని వెనుక ఓ కథ కూడా ఉంది. 

నేను చదివిన ఆ కథ ఏమిటీ అంటే.. 


"అనగనగా ఓ రాజు గారు.

ఆయనకి ఉదయాన్నే ఇడ్డెన్లు ఉంటే చాలు.. ఇంకేమీ అక్కర్లేదు. 

చట్నీలు, కారప్పొడి, సాంబారు... వీటన్నింటి తోనూ తలో నాలుగూ భోంచేసి బ్రేక్ఫాస్ట్ అయిందీ అనిపిస్తారు. 

పాపం, వంటవాడికి విసుగ్గా ఉన్నా తినేది రాజు గారు కాబట్టి, రోజూ రుచికరంగా వండి వడ్డించక తప్పదు. 

ఒకరోజు, ఓ చిన్న పొరపాటు వల్ల ఇడ్లీ పిండిలో నీళ్ళు కలిసిపోయి పల్చగా అయిపోతుంది.

ఓ పక్క రాజు గారు భోజన శాలకి వస్తున్నట్టు కబురు వచ్చేసింది. 

అప్పటికప్పుడు ఏం చేయడానికీ తోచక, ఓ రేకు కాల్చి దానిమీద ఈ పల్చని పిండి పోయగానే 'సుయ్' మని శబ్దం వస్తుంది.. 

తిరగేసినప్పుడు మళ్ళీ అదే శబ్దం.. 

శిరశ్చేధానికి సిద్ధపడిపోయిన వంటవాడు, శిక్ష తగ్గక పోతుందా అన్న ఆశతో, ఆ కొత్త వంటకం రాజుకి వడ్డిస్తాడు. 

వంటవాడి అదృష్టం బాగుండి రాజుగారికి ఆ వంటకం మహా నచ్చేసి, దాని పేరు ఏమిటని అడుగుతాడు. 

వంటవాడికి రెండు సార్లు సుయ్ మన్న శబ్దం గుర్తొచ్చి, 'దోసై' అంటాడు. 

ఆవేల్టి నుంచీ ఆస్థాన టిఫిన్ గా స్థిరపడ్డ దోసై రాన్రానూ దోశ గా పేరు మార్చుకుందన్న మాట."


దోశల్లో రకాలు కేవలం కాల్చడాన్ని బట్టి మాత్రమే కాక, వాడే పిండిని బట్టీ, మధ్యలో చేర్చే 'స్టఫ్' బట్టీ,వేసే  సైజు ని బట్టి  కూడా మారిపోతూ ఉంటాయి. 

మన అచ్చతెలుగు పెసరట్టుని కాసేపు పక్కన పెట్టి - అవసరమైతే ఈ అట్టుని గురించి ప్రత్యేకం మాట్లాడుకుందాం ఎప్పుడైనా - 

కేవలం దొశలనే తీసుకున్నా సాదా, ఉల్లి, మసాలా ఇలా ఎన్ని రకాలో.

వంట చెయ్యడమే ఒక కళ అనుకుంటే, అందులో దోశలు కాల్చడం మరో ఉప కళ. 

మంచి పెనాన్ని ఎంచుకుని, మరీ ఎక్కువగానూ తక్కువగానూ కాకుండా వేడెక్క నిచ్చి, ఫ్రిజ్ నుంచి నార్మల్ టెంపరేచర్ కి వచ్చిన పిండి ని గరిట తో తీసి, కళాత్మకంగా తిప్పేసి, తిరగేస్తే దోశ రెడీ.


'మాడిపోయిన మసాలా దోశ' అన్నది ఇప్పుడో మంచి తిట్టుగా చెలామణీ అవుతోంది.

దీని నుంచి తెలుసుకోవాల్సింది ఏమిటీ అంటే, దోశ మాడిపోకూడదు. 

అసలు పొగలు కక్కుతూ, బంగారు వర్ణంలో మెరిసిపోయే దోశని చూడగానే ఆకలి, ఆదిశేషుడి లాగా పడగ విప్పుకోదూ? 

ఇక, చట్నీల్లోకి వస్తే..దోశ లోకి అన్ని రకాల చట్నీలూ పనికిరావు. 

 ప్రత్యేకంగా, కమ్మగా, కొంచం కారంగా ఉండాలి.. సాంబారు అయితే పొగలు సెగలుగా ఉండాలి. 

అప్పుడైతేనే దోశ కి రుచి పెరుగుతుంది మరి. పంచదారతో పిల్లలే కాదు, కొందరు పెద్దవాళ్ళూ తింటారు దోశని.


కొన్ని కొన్ని హోటళ్ళు, రెస్టారెంట్లు దోశలకి బాగా ఫేమస్. 

భాగ్యనగర వాసులలో దోశ ప్రియులు 'చట్నీస్' దోశని రుచి చూసే ఉంటారు. 

ఇవి మాత్రమేనా... ఉడిపి హోటళ్ళ మొదలు, గోదారొడ్డున రావి చెట్టుకింద ఉండే పుల్లట్ల 'ఒటేళ్ళ' వరకూ ఎవరి దోశ వాళ్ళదే. 

ఒక్కొక్కరి దోశదీ ఒక్కో ప్రత్యేకత.

 అన్నట్టు, 'అందాల రాముడు' మొదలు 'గోదావరి' వరకూ చాలా సినిమాల్లో అట్లమ్మిలు తగుమాత్రం పాత్ర పోషించారు. 

 ఏతా వాతా చెప్పొచ్చేది ఏమిటంటే... దోశని ఎంతమాత్రం చిన్నచూపు చూడకండి.





31, మే 2021, సోమవారం

బామ్మ రాక్స్ .... మేనేజర్ షాక్

 వర్క్ ఫ్రం హోం లో భాగంగా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంటినుంచి రోజుకు 20 గంటలు పనిచేస్తున్నాడు..

అయినా వాళ్ళ ప్రాజెక్ట్ మానేజర్ సంతృప్తి చెందడం లేదు..

మీటింగ్ మధ్యలో వచ్చే ఇంటి శబ్దాలూ....
పిల్లల అరుపులు......
తల్లి మధ్య మధ్యలో ఇచ్చే కాఫీ......
ఇంకా పడుకోలేదా అంటూ నాయనమ్మ గబాల్న మీటింగు మధ్యలో రూం లోకి రావడం ఇవన్నీ ఆ ప్రాజెక్ట్ మానేజర్ కు చికాకు తెప్పిస్తున్నాయి..

 ఆదివారం సాఫ్ట్వేర్ ఉద్యోగులకు జనరల్ గా సెలవే కానీ ....
ప్రాజెక్ట్ మానేజర్ ఉదయం 7 గంటలకే లైన్లోకి వచ్చేశాడు..
వచ్చేముందే చెప్పాడు ' ఇంట్లో నాయిస్ ' లేకుండా చూసుకో అని..
అబ్బే అస్సలు ఉపయోగం లేదు..ఇంట్లో ఎవరి గోల వాళ్ళదే..

మానేజర్ కొద్దిగా ఇరిటెడ్ అయ్యి
" ఆల్రెడీ చెప్పానుగా " నాయిస్ లేకుండా చూసుకోమని అని మొహం మాడ్చేసుకున్నాడు..
ఆ మాట బామ్మగారు వినేసి "ఒరే నేను మీ మానేజర్ తో ఒకసారి మాట్లాడతా అన్నది"..

అసలే ముక్కోపి పైగా టెన్షన్ లో ఉన్నాడు ......
ఆ మానేజర్ ఇప్పుడు ఈ మాట వింటే నిప్పు తొక్కిన కోతి అవుతాడని ..
వద్దులే నానమ్మా అన్నాడు మనోడు..
కానీ వాడి దురదృష్టవశాత్తూ మైక్ అన్-మ్యూట్ అయ్యుంది మానేజర్ బామ్మగారి మాట వినేశాడు.. ఏకళ నున్నాడో గానీ ' 

ఇదిగో ఆ బామ్మగారు నాతో ఏదో మాట్లాడతానని అంటున్నారు కదా!!
ఒకసారి ఆవిడ చేత మాట్లాడించు ' అన్నాడా మానేజర్..

అప్పుడే కబాసుర కషాయం తాగిందేమో బామ్మగారి గొంతు ఖంగున మోగింది..
ఒరే నువ్వా కుర్చీలోంచి ఇవతలకిరా అంటూ మానవాడ్ని పక్కకు తోసి మానేజర్ తో సంభాషణ మొదలు పెట్టింది పెద్దావిడ..

ఇదిగో మానేజరూ .. ముందుగా నమస్తే..
నువ్వు చూడబోతే బాగా అప్ సెట్ అయినట్టు ఉన్నావు నేను నీకు ఏమైనా హెల్ప్ చేయగలనా?????
అడిగారు పెద్దావిడ..

ఏం లేదమ్మా మీటింగ్ జరుగుతున్నప్పుడు మీ ఇంట్లో కొద్దిగా శబ్ధం ఎక్కువతుంది.....
దానివలన మా ఏకాగ్రత దెబ్బతింటుంది ఇదే మాసమస్య అన్నాడాయన..

నాయనమ్మ చిన్నగా నవ్వి ఒక్క 10 నిమిషాలు నీ టైమ్ నాకిస్తావా నాయనమ్మని కదా చిన్న కధ చెప్తా అన్నది..

పెద్దావిడ పైగా కొద్దిగా రిలీఫ్ గా కూడా ఉంటుంది..
తర్వాత ఆవిడని కన్విన్స్ చేసి disturbance లేకుండా కూడా చూసుకోవచ్చు అని మానేజర్ ఓకే చెప్పాడు..

నానమ్మ కధ మొదలు పెట్టింది..

"ఒక మాంచి మానేజర్ ప్రశాంతత కోసం ధ్యానం చేసుకుందామని ఊరి చివర చెట్టు కిందకి వెళ్ళి కూర్చుని కళ్ళు మూసుకొని ధ్యానం మొదలెట్టగానే చిటారు కొమ్మనున్న కోయిల కూయడం మొదలెట్టింది..

ఈయన ధ్యానానికి ఇబ్బందయింది..కోపంతో కోయిలను అడిగాడు..
కాసేపు కూయడం ఆపుతావా?? నాకు ధ్యానానికి ఇబ్బందిగా ఉంది అని..

కోయిల రెట్టించిన గొంతుతో మరోసారి కూ అని కూసి  ' అరే అబ్బీ నువ్వు నా ఇంటికొచ్చావు..ఇక్కడ ఇలానే ఉంటుంది..నేను ఆపితే మిగతా పక్షులు రాగాలు తీస్తాయి..నేనేమీ నీ ఇంటికొచ్చి కిలకిలలు చేయడం లేదు.. 

నీకిష్టం లేకపోతే వెళ్లిపోవచ్చు అనేసింది..పాపం దానికి తెలియదు కదా!!
అతను పే...ద్ద మానేజర్ అని..

నానమ్మ నవ్వుతూ ముగింపు టచ్ ఇవ్వడానికి గొంతు సవరించుకుంది..

బాబూ మేము మీ ఆఫీస్ కు వచ్చి మీ పని కి ఆటంకం కలిగించామా?? లేదు కదా!!..

ఇల్లు అంటే ఇలానే ఉంటుంది నాయనా!!
ఇంట్లోని మేమంతా సహకరించబట్టే మీ కార్పోరేట్ కార్యకలాపాలు మా ఇళ్ళలోంచి కూడా సజావుగా సాగుతున్నాయి కనుక మీరే అడ్జస్ట్ కావాలి అంటూ మేనేజర్ వంక చూసింది..

లాప్టాప్ లో కెమెరా బాగా పని చేస్తుందేమో!!..
నానమ్మ గారి మొహంలో వెటకారం.......
చిరు కోపం అన్నీ చూసిన మానేజర్ కు జ్ణానోదయం అయింది..

ముందు చిన్నగా మొదలైన నవ్వు 30 సెకన్లలో పెద్దదయింది..

నానమ్మగారూ మీ సందేశం అర్ధమైంది.....
మీ రాజ్యంలో మీరే క్వీన్.....
మీ మాటే శిరోదార్యం ఇకపై మేమే ఒళ్ళు దగ్గరపెట్టుకొని
" చెట్టు కింద ధ్యానం చేసుకుంటాం" అలాగే వర్క్ ఫ్రం హోం కూడా చేసుకుంటాం..
అంటూ ఒక నమస్కారం పెట్టి మీటింగ్ ముగించాడు..


బామ్మా రాక్స్ .... మేనేజర్ షాక్ !!!!!!!!!!!!