Pages

28, డిసెంబర్ 2021, మంగళవారం

చందమామా ---- గొబ్బిళ్ళ పాట

చందమామ చందమామ ఓ చందమామా
చందమామ చందమామ ఓ చందమామా


చందమామ కూతుళ్ళు నీలగిరి కన్యలు

నీలగిరి కన్యలకు నిత్యమల్లె తోట

నిత్యమల్లె తోటలో నిర్మల్ల బావి

నిర్మల్ల బావికి గిలకల్ల తాడు

గిలకల్ల తాడుకి బుడికి బుడికి చెంబు

బుడికి బుడికి చెంబంటే అందరికి మనస్సు

బుడికి బుడికి  చెంబుకి పేడ ముద్ద దిష్టి 

పేడ ముద్ద దిష్టికి  పప్పు బెల్లం నైవేద్యం 



ఏల వచ్చెనమ్మ క్రిష్ణుడేల వచ్చెను


పల్లవి :

ఏల వచ్చెనమ్మ క్రిష్ణుడేల వచ్చెను

ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసేను.


చరణం :

ఉట్లమీద పాలు పెరుగు ఎట్ల దించెను.

అబ్బ కొట్టబోతే దొరకడమ్మ చిన్నికృష్ణుడు….ఏల వచ్చెనమ్మ...


కాళింది మడుగులోన కరిగినాడమ్మా

అబ్బ బాలుడు కాడమ్మా పెద్దవాడమ్మా….ఏల వచ్చెనమ్మ...


చీరలన్ని మూటకట్టి చిన్నికృష్ణుడు

రవికలన్ని మూటకట్టి రాధాకృష్ణుడు

ఆ పొన్నమావి పైన పెట్టి పంతమాడెను….ఏల వచ్చెనమ్మ...


గోవర్ధనా గిరి ఎత్తినాడమ్మా

గోవులను కాచిన గోపాలుడమ్మా  ….ఏల వచ్చెనమ్మ….


రక్కసుల మదమునే అణచినాడమ్మా

భగవద్గీతను చెప్పిన పరమాత్ముడమ్మా 


ఏల వచ్చెనమ్మ క్రిష్ణుడేల వచ్చెను

ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసేను.

ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసేను.


సుబ్బి గొబ్బెమ్మ --- గొబ్బిళ్ళ పాట

సుబ్బి గొబ్బెమ్మ
సుబ్బి నియ్యవే


చేమంతి పువ్వంటి చెల్లినియ్యవే !


తామర పువ్వంటి తమ్ముడినియ్యవే!


అరటి పువ్వంటి అన్నయ్యనియ్యవే!


మల్లె పువ్వంటి మామానియ్యవే!


బంతి పువ్వంటి బావానియ్యవే!


మొగలి పువ్వంటి మొగుణ్ణియ్యవే!

అటవీ స్థలములు .... గొబ్బిళ్ళ పాట

అటవీ స్థలములు కరుగుదమా
వట పత్రమ్ములు కోయుదమా


గుంటలు గుంటలు తవ్వుదమా
గోళీకాయలు ఆడుదమా


చింతా పిక్కెలు ఆడెదమా
సిరి సిరి నవ్వులు నవ్వెదమా


దాగుడు మూతలు ఆడెదమా
తలుపుల చాటునా దాగెదమా


కోతీ కొమ్మచ్చు లాడెదమా
కొమ్మల మాటున దాగెదమా


చల్లని గంధం తీయుదమా
సఖియా మెడకు పూయుదమా


సన్నాజాజులు గుచ్చెదమా
దేవుని మెడలో వేయుదమా

దుక్కల్ దుక్కుల్ దున్నారంట ........ గొబ్బిళ్ళ పాట


గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో

దుక్కుల్ దుక్కుల్ దున్నారంట.

ఏమి దుక్కుల్ దున్నారంట

రాజావారి తోటలో జామదుక్కుల్ దున్నారంట

ఔనాటె అక్కల్లారా చంద్రాగిరి భామల్లారా భామలగిరి  గొబ్బిళ్ళో

….గొబ్బియళ్ళో…గొబ్బియళ్ళో…….


విత్తనం విత్తనం వేశారంట ఏమి విత్తనం వేశారంట 

రాజావారి తోటలో జామవిత్తనం వేశారంట

ఔనాటె అక్కల్లారా చంద్రాగిరి భామల్లారా భామలగిరి  గొబ్బిళ్ళో

....గొబ్బియళ్ళో…గొబ్బియళ్ళో….


మొలకా మొలకా వచ్చిందంట ఏమి మొలకా వచ్చిందంట 

రాజావారి తోటలో జామ మొలకా వచ్చిందంట

ఔనాటె అక్కల్లారా చంద్రాగిరి భామల్లారా భామలగిరి  గొబ్బిళ్ళో

……గొబ్బియళ్ళో…గొబ్బియళ్ళో….


ఆకు ఆకు వేసిందంట ఏమి ఆకు  వేసిందంట

రాజావారి తోటలో జామా ఆకు వేసిందంట

ఔనాటె అక్కల్లారా చంద్రాగిరి భామల్లారా భామలగిరి  గొబ్బిళ్ళో

……గొబ్బియళ్ళో…గొబ్బియళ్ళో…


మొగ్గ మొగ్గ తొడిగిందంట ఏమి మొగ్గ తొడిగిందంట

రాజావారిలో జామ మొగ్గ తొడిగిందంట 

ఔనాటె అక్కల్లారా చంద్రాగిరి భామల్లారా భామలగిరి  గొబ్బిళ్ళో

....గొబ్బియళ్ళో…గొబ్బియళ్ళో…….


పువ్వు పువ్వు పూసిందంట

 ఏమి పువ్వు పూసిందంట 

రాజావారి తోటలో జామ పువ్వూ పూసిందంట

ఔనాటె అక్కల్లారా చంద్రాగిరి భామల్లారా భామలగిరి  గొబ్బిళ్ళో

....గొబ్బియళ్ళో…గొబ్బియళ్ళో…….


పిందె పిందె వేసిందంట ఏమి పిందె వేసిందంట.
రాజా వారి తోటలో జామ పిందె వేసిందంట

ఔనాటె అక్కల్లారా చంద్రాగిరి భామల్లారా భామలగిరి  గొబ్బిళ్ళో

....గొబ్బియళ్ళో…గొబ్బియళ్ళో…….


కాయ కాయ కాసిందంట ఏమి కాయ కాసిందంట.
తాజా తోటలో జసమకాయ కాసిందంట

ఔనాటె అక్కల్లారా చంద్రాగిరి భామల్లారా భామలగిరి  గొబ్బిళ్ళో

....గొబ్బియళ్ళో…గొబ్బియళ్ళో…….


పండు పండు పండిందంట 

ఏమి పండు పండిందంట రాజావారి తోటలో జామపండు పండిందంట

ఔనాటె అక్కల్లారా చంద్రాగిరి భామల్లారా భామలగిరి  గొబ్బిళ్ళో

....గొబ్బియళ్ళో…గొబ్బియళ్ళో…….


పండు పండు పెట్టారమ్మా 

నైవేద్యానికి పెట్టారమ్మా 

గొబ్బిగౌరికి జామపండు నైవేద్యంగా పెట్టారమ్మా

ఔనాటె అక్కల్లారా చంద్రాగిరి భామల్లారా భామలగిరి  గొబ్బిళ్ళో

....గొబ్బియళ్ళో…గొబ్బియళ్ళో……


పండు పండు తిన్నారంట 

ఏమి పండు తిన్నారంట

రాజావారి తోటలో జామపండు తిన్నారంట

ఔనాటె అక్కల్లారా చంద్రాగిరి భామల్లారా భామలగిరి  గొబ్బిళ్ళో

....గొబ్బియళ్ళో…గొబ్బియళ్ళో……

27, డిసెంబర్ 2021, సోమవారం

తోచీతోచని కబుర్లు

ఏమిటో.. ఏమీ తోచకుండా ఉంది. 

అలా అని పని లేకుండా లేదు. ఉంటూనే ఉంది.. అయినా తోచీతోచకుండా ఉంది.

ఏ తోడికోడలు పుట్టింటికన్నా  వెళ్దామంటే ఎవరూ లేరు మరి. 

'తోచీతోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళింది' అని కదా సామెత. 

మరి తోచీ తోచనమ్మ చేయాల్సింది ఇదే కదా. 

చదవాల్సిన పుస్తకాలు 'మా సంగతేమిటి?' అని ప్రశ్నిస్తున్నాయ్.

ఉన్నవి చాలనట్టు మొన్ననే ఓ చిన్న పుస్తక ప్రదర్శనకి వెళ్లి ఓ నాలుగు కొత్తవి తెచ్చా. లాభం లేదు, కొంచం స్పీడు పెంచాలి, చదివే విషయంలో.

"3రెడ్ వేవ్ వస్తుందా  మళ్ళి లాక్ డౌన్ ఉంటుందా ?" ఉదయాన్నే ఫోన్ పలకరింపు. 


కూరగాయలు కొనడానికి బజారుకి వెళ్తే వినబడ్డ వ్యాఖ్యానాలు నవ్వు తెప్పించాయ్. 

"ప్రభుత్వం  మారినా కూరల రేట్లు తగ్గలేదు.." అనుకుంటున్నారు జనం. 

"సొరాజ్జం వస్తే మా ఊరి కానిస్టీబుకి బదిలీ అవుతుందా బాబయ్యా" అంటూ 'కన్యాశుల్కం' లో బండి వాడి ప్రశ్న గుర్తొచ్చేసింది.  

ఎవరి సమస్యలు వాళ్ళవి మరి. 

ఎన్నో పనులల్లో బిజీ గా ఉన్న ముఖ్యమంత్రికి కూరల రేట్లు లాంటి చిన్న విషయాలు పట్టించుకునే తీరిక ఉంటుందా? వీళ్ళ పిచ్చి కానీ.


థియేటర్ కి వెళ్లి సినిమా చూసి చాలా రోజులయ్యింది. చూడాలనిపించే సినిమా ఏదీ కనిపించడం లేదు. 

నా టేస్ట్ లో ఏదో లోపం ఉందేమో మరి. కనీసం నిర్మాణం లో ఉన్న సినిమాలు కూడా ఏవీ చూడాలనే కుతూహలాన్ని కలిగించడం లేదు. 

కాలం అంతా ఒటిటిలతోనే కాలక్షేపం చేయాల్సి వచ్చేలా ఉంది.

ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాను కదా..

ఏమిటో ..ఏమీ తోచటం లేదు మరి !!!!!!!!