Pages

12, జులై 2021, సోమవారం

పంచ మహా కావ్యములు


తెలుగు భాషలో పంచ మహా కావ్యాలు 


1. మను చరిత్రము - (అల్లసాని పెద్దన) :

 మను చరిత్రము లేదా స్వారోచిష మనుసంభవము.

 అల్లసాని పెద్దన రచించిన ఒక ప్రబంధ కావ్యము. 

ఇది వరూధినీ, ప్రవరాఖ్యుల ప్రేమ కథతో మొదలై స్వారోచిషునితో ముగుస్తుంది. 

 

2. పాండురంగ మాహాత్మ్యము - (తెనాలి రామకృష్ణుడు)

 తెనాలి రామలింగడు రచించిన ఐదు అశ్వాసాల గద్య పద్య కావ్యము.

 ఈ కావ్యంలో గత కవులు ఎవరూ వాడని కొత్త వర్ణనలు, అందునా తాను గతంలో వాడినవి మళ్ళీ వాడకుండా కవిత్వం చెప్పడంతో రామలింగడికి వికటకవి అన్న పేరువచ్చింది.

ఇందు ఇతివృత్తము పాండురంగని కథ.

 

3. ఆముక్త మాల్యద - (కృష్ణదేవరాయలు)

  విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ఈ "ఆముక్తమాల్యద" గ్రంథం. దీనికే "విష్ణుచిత్తీయం" అని మరోపేరు. 

ఈ ప్రబంధంలో గోదాదేవి పెంపుడు తండ్రియైన విష్ణుచిత్తుడు శ్రీవిల్లిపుత్తూరులో మన్ననారుస్వామి కోవెలలో అర్చకుడిగా జీవిస్తున్నాడు. విష్ణుచిత్తునకు తులసీవనంలో స్త్రీశిశువు లభిస్తుంది.  సంతానం లేని తనకు విష్ణువే కరుణించి తనకీ శిశువును ఇచ్చాడని ఆమెకు గోదాదేవి అని నామకరణం చేసి పెంచుకోసాగాడు. ఆమె పూర్వజన్మలో భూదేవి.  తన తండ్రి స్వామి కోసం అల్లిన పూలమాలను చాటుగా ధరించి గోదాదేవి తన నీడను చూచుకొని ఆనందించి తిరిగి ఆ మాలను యథాస్థానంలో పెట్టేది.  ఆ మాలనే విష్ణుచిత్తుడు స్వామికి అర్పించేవాడు. ఆ కారణంగానే గోదాదేవికి ఆముక్తమాల్యద అను పేరు వచ్చింది.  తాను పూర్వజన్మలో సత్యభామా దేవిననే విషయం తెలుసుకుంది. అలనాటి శ్రీకృష్ణుడు ఇప్పుడు శ్రీరంగంలో వెలిసాడని, ఆ శ్రీరంగేశుని తన భర్తగా వలచింది. ఆ స్వామి ఆమెను వలచాడు. ఇరువురికి వివాహం జరుగుతుంది.

 

4. వసు చరిత్రము - (రామరాజ భూషణుడు.)


   రామరాజభూషణుడు గా పేరుగాంచిన భట్టుమూర్తి, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజాల లో ఒకడు.   వసు చరిత్రము భారతములోని ఉపరిచర వసువు కథ, ఇది కవిత్రయము రాసిన మహా భారతంలో 45 పద్యాలలో ఉన్నది,

   దీనిని రామరాజభూషణుడు విస్తరిస్తూ ఆరు ఆశ్వాసాలు కల ఒక ప్రత్యేక గ్రంథంగా మలిచారు, తిరుమల నాయునికి ఈ కృతి అంకితమివ్వబడింది.

   

5. పారిజాతాపహరణం - (నంది) ముక్కు తిమ్మన.


ఐదు అశ్వాసాలు గల ప్రబంధం. సంస్కృత భాగవతములోని మూడు పద్యాల కథని అద్భుతముగా పెంచి రచించాడు.

నారదుడు పారిజాతం కృష్ణులవారికి ఇవ్వడం, ఆ సమయములో వారు రుక్మిణీదేవి మందిరములో ఉండటం, ఆ పారిజాతాన్ని రుక్మిణికి ఇవ్వడం, దానిని తెలుసుకొని సత్య ఆగ్రహించడం, అటుపై రకరకాల మలుపులు, పాద పీడనం, చివరకు దేవతలతో యుద్ధం, పారిజాత వృక్షం సత్య తీసుకొని రావడం, తులాభారంతో కథ సుఖాంతం.


సంస్కృత భాషలో పంచ మహా కావ్యాలు 


1.రఘువంశము ( కాళిదాసు రచన):

మహాకవి కాళిదాసు రాసిన సంస్కృత మహాకావ్యం. ఈ గ్రంథంలో 19 సర్గలలో రఘు రాజవంశానికి సంబంధించిన కథలు, దిలీపుని కుటుంబం, అగ్నివర్ణుని వరకు అతని వారసుల గూర్చి వివరించబడినది. వీరిలో రఘుమహరాజు, దశరథ మహారాజు, రాముడు ఉన్నారు.


2.కుమారసంభవము ( కాళిదాసు రచన):

పార్వతితో పరమేశ్వరుని వివాహం, అనంతరం కుమారస్వామి జననం తారకాసురుని వధ మొదలయిన విషయాలు మహాకవి కాళిదాసు చాలా చక్కగా వర్ణించాడు.


3.మేఘసందేశము ( కాళిదాసు రచన):

 కాళిదాసు రచించిన కావ్యత్రయం అని పేరు పొందిన మూడు కావ్యాలలో ఇది ఒకటి.కేవలం 111 శ్లోకాలతో కూడిన ఈ చిన్నకావ్యము కాళిదాసు రచనలలోను, సంస్కృత సాహిత్యంలోను విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది. 

 కుబేరుని కొలువులో ఉన్న ఒక యక్షుడు కొలువునుండి ఒక సంవత్సరం పాటు బహిష్కారానికి గురవుతాడు. ఆ యక్షుడు హిమాలయాలలోని కైలాసగిరికి పైన, అలకాపురిలో ఉన్న తన ప్రియురాలికి ఒక మేఘం ద్వారా సందేశం పంపుతాడు. మార్గసూచకంగా యక్షుడు ఆ మేఘానికి హిమాలయాలకు పోయే దారిలోనున్న పెక్కు దృశ్యాలను వర్ణిస్తాడు.మేఘ సందేశం కావ్యంలో కాళిదాసు వర్ణనా నైపుణ్యము, అలంకార పటిమ, పాత్ర చిత్రణ, శృంగార ప్రస్తావన అద్భుతంగా కనిపిస్తాయి. ఇంకా వివిధ భౌగోళిక అంశాలు చెప్పబడ్డాయి.


4.కిరాతార్జునీయము (భారవి రచన):

ఈ కావ్యం అర్జునుడు, మారు వేషంలో ఉన్న శివుని మధ్య జరిగిన యుద్ధాన్ని తెలుపుతూ రాయబడింది.ఇందులో కవి మహాభారతంలో వనపర్వంలోని ఒక చిన్న భాగాన్ని తీసుకుని వర్ణించాడు. 

5.శిశుపాలవధ (మాఘుని రచన)


శిశుపాల వధ 7 లేదా 8 వ శతాబ్దంలో మాఘ స్వరపరిచిన శాస్త్రీయ సంస్కృత కవితల రచన. ఇది సుమారు 1800 అత్యంత అలంకరించబడిన చరణాలలో 20 సర్గాలలో ఒక ఇతిహాసం.

2 కామెంట్‌లు: