Pages

28, ఫిబ్రవరి 2025, శుక్రవారం

ఉత్తరానికో టపా

 


పూజ్యనీయులైన ఉత్తరం గారి పాదపద్మాలకు నమస్కారం...!!!

ఉభకుశలోపరి...!!!


చాల రోజుల తరవాత మీకు ఇలా ఉత్తరం రాయడానికి గల ముక్ష కారణం ...


నిన్న పుస్త కాలు సద్దు తుంటే నా స్నేహితురాలు రాసిన ఉత్తరాలు చదివాను ...

20 సంవత్సరాల క్రితం రాసిన ఉత్తరాలు ఇప్పుడు చదువుతుంటే ...

ఒక్క సారి కాలం వెనకకి వెల్లిపోయింది ..

ఎంత బాగుందో ... ఎన్నో జ్ణాపకాలు ,అనుభూతులు ....

రోజులు మల్లి రావు కానీ ....చదివినంత సేపు నేను రోజులకు వెళ్లి వచ్చాను ...


సెల్ టవర్ల దెబ్బకి పిచ్చుకలు మాయమైపోయినట్టు,

సెల్ ఫోన్ల దెబ్బకు తమరు ఎటు వెళ్లిపోయారో జాడ తెలియక అల్లాడుతున్నాం...


మీరున్నప్పుడే బాగుంది ఇక్కడ...

రాసేటప్పుడు చేతికి అబద్ధాలు వచ్చేవి కాదు...

ఇప్పుడన్నీ ఫోన్లో మాటలే కాబట్టి నోటికొచ్చిన అబద్ధాలు ఆడేస్తున్నాం...


'ఎక్కడున్నావ్' అంటే అమలాపురం లో ఉన్నా హైదరాబాద్ ఉన్నా' అని సిగ్గులేకుండా బొంకేస్తున్నాం...

ఈ నెట్ వర్క్లు మనుషుల్ని దగ్గర చేస్తాయంటే నమ్మి మిమ్మల్ని వదిలేసుకున్నాం...

కానీ ఇప్పుడు పక్కపక్కనే ఉన్నా మాట్లాడుకోకుండా, మెడలు వంచి ఫోన్లో తప్ప ముఖాముఖి మనసిప్పి మాట్లాడుకోవడం దాదాపు మానేసామ్...


దయచేసి మళ్ళోకసారి రండి ఉత్తరం గారు...!!!


మీరు లేకపోవడం వల్ల...


బామ్మ-తాతయ్యల ముసలి ప్రాణాలకు ఓదార్పునిచ్చే కుశల సమాచారం కరువైపోయింది...

భార్యాభర్తల వియోగం, విరహాల్లో ఉండే మాధుర్యం మాయమైపోయింది...

బిడ్డల క్షేమం అక్షరాల్లో చూసుకుని ఆప్యాయంగా చెమర్చే తల్లితండ్రుల కన్నీటి తడి ఆవిరైపోయింది...

ఉత్తరం కోసం వీధివాకిలి వైపు ఎదురుచూసి, రాగానే గబగబా చదివేసి, గుండెలు నింపుకుని, తిరిగి జాబు రాయడంలో ఉన్న ఆత్మ సంతృప్తి అడుగంటిపోయింది...


"అమ్మా... అన్నయ్య దగ్గర్నుంచి ఉత్తరం వచ్చిందే అని చెంగున గెంతి చెప్పే చెల్లాయిలకి కరువొచ్చింది...


"ఏమేవ్... అల్లుడు ఉత్తరం రాసాడు...అమ్మాయి నెల తప్పిందట" అని మురిసిపోయే కన్నవాళ్లు కనిపించడం లేదు...


మాటలు పెదాలనుండి తప్ప గుండెల్లో నుండి రావడం ఆగిపోయాయి...


ఈ ఉత్తరం కూడా నేను టైప్ చెయ్యడం వల్ల యధావిధిగా మనసులో ఉన్నదంతా చెప్పలేక, ఇంకా ఏదో ఆవేదన మిగిలిపోయి బాధపడుతున్నాను...!!!


సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా, ఉత్తరాల ఉనికిని కోరుకునే మీ అభిమానిని...!!!

13, ఫిబ్రవరి 2025, గురువారం

తిరిగి రాని రోజులు --- తిరుగు లేని రోజులు

  భలే మంచి రోజులులే


మా స్కూలంటే నాకిష్టం (ఎవరి స్కూలంటే ఎవరికిష్టముండదులెండి). నేను ఐదో తరగతికి వస్తూండగా మా ఈ స్కూల్లో చేరాను. పాత స్కూలు మానెయ్యడం వెనుక ఒక కథ ఉందండోయ్!


అవి నా నాలుగో తరగతి పరీక్షలు జరుగుతున్న రోజులు..నేను దించిన తల ఎత్తకుండా బర బరా రాస్తూ తెల్ల కాగితం రంగు మార్చడానికి ప్రయత్నిస్తున్నా.ఇంతలో నా వీపు మీద ఎవరో గోకినట్టయింది. వెనక్కి తిరిగి చూస్తే సుబ్బలక్ష్మి దీనాతి దీనమైన మొహమేసుకుని కాస్త కూడా రంగు మారని దాని తెల్ల కాగితాన్ని చూపించి దాని కరాబు చేయడంలో నా సహాయం కోరింది. నేను ఆలోచిస్తే ప్రతి పరీక్షకు వెళ్ళే ముందు నాన్నా గారు చెప్పే మాటలు గుర్తొచ్చాయి, "నీకు తెలిసింది నువ్వు రాయి, ఒకర్ని అడక్కు, ఒకరికి చూపకు, రెండూ తప్పే!". దానితో సహాయ నిరాకరణ ప్రకటించా. అది మా ఇన్విజిలేటర్ (మా ప్రైవేట్ టీచర్ కూడా)కు పిర్యాదు చేసింది. ఆవిడ వచ్చి 'ఒకే ప్రైవేట్లో చదువుతున్నారు, ఆ మాత్రం ఇచ్చి పుచ్చుకోకపోతే ఎలా' అని నన్నే మందలించింది. నా పేపర్ తీసుకుని సుబ్బులు చేతికిచ్చింది. అది విజయగర్వంతో నా పేపర్ ముందెట్టుకుని జిరాక్స్ కంపెనీ వాళ్ళు సిగ్గుపడేలా జిరాక్స్ దించడం మొదలుపెట్టింది. ఆ అవమానానికి నా చిన్ని హృదయం బద్దలైంది. ముక్కలు తాపీగా ఏరుకుందామని అప్పటికి అక్కడ్నుంచి నిష్క్రమించి ఆ ఆవేదనంతా మా నాన్న ముందు వెళ్ళగక్కా. ఆయన అంతకన్నా ఆవేశపడి నన్ను తక్షణం స్కూలు మానిపించారు.


సరే కొత్త స్కూళ్ళ వేటలో పడి ఒకరోజు నన్ను ఒక స్కూలుకు తీసుకువెళ్ళారు.( మా ఊరి లో ఉన్నవే నాలుగు స్కూల్)లు) తొలి చూపులోనే విపరీతంగా నచ్చేసింది ఆ స్కూలు. పేద్ద ఆటస్థలం, ఆటస్థలానికి ఎడంపక్క చాలా పెద్ద తోట, కుడి పక్కన వరసగా తరగతి గదులు, వెనక మామిడి చెట్టు, దానికి వేలాడుతున్న మామిడి కాయలు, ముందు వైపు ఒక స్టేజ్, దాని వెనక ప్రార్థనా మందిరం, దాని వెనక చింత చెట్టు. ఇప్పటికీ నాకు చాలా గుర్తు, ఆ రోజు కొత్త స్కూలు చూడడానికి వెళ్ళబోతున్నానని నాకు ఎంతో ఇష్టమైన తెల్ల గౌను, దాని మీద నల్ల కోటు వేసుకున్నా.


అలా మా స్కూల్లోకొచ్చి పడ్డా. ఆడుతూ పాడుతూ ఆరో తరగతికొచ్చా, అప్పట్లో మాకు ప్రతి శుక్రవారం సాయంత్రం అసెంబ్లీ ఉండేది అంటే స్కూలు పిల్లలంతా ఒక చోట సమావేశమయ్యేవాళ్ళం, చింత చెట్టు కింద. ఒక చింత చెట్టు కింద అంతమంది ఎలా కూర్చునే వాళ్ళు, అదేమైనా పుష్పక విమానమా అని సందేహమొచ్చిందా? వచ్చే ఉంటుందిలెండి, మా చింత చెట్టు అంత పెద్దది కాదు కాని మా స్కూలు పిల్లల సంఖ్య చాలా తక్కువ.


ఆ శుక్రవారపు సమావేశాల్లో విద్యార్థులంతా ఒక్కో విధంగా తమ తమ ప్రతిభలను పైకి తీసి తక్కిన విద్యార్థుల మీదకు వదులుతూ ఉంటారు. ఒక్కోసారి బాలమురళి, ఎం.ఎస్.సుబ్బలక్ష్మి చెట్టు మీద చేరిన పిట్టల్ని బెదరగొడుతుంటే, ఇంకోసారి మైకేల్ జాక్సన్, ఎల్.విజయలక్ష్మి అక్కడ ప్రత్యక్షమౌతూ ఉంటారు. మేము సాధారణంగా చెవులకు దూదులు, కళ్ళకు గంతలు సందర్భానుసారంగా పెట్టుకుని వెళ్ళి క్లాస్ లో టీచర్ డిస్టర్బ్ చేయగా మధ్యలో ఆగిపోయిన మా చర్చలను కొనసాగించేవాళ్ళం.


ఒకనాటి సాయంకాలం అలాగే అందరం చెట్టు కింద కూర్చుని ఎప్పటిలా మామూలుగా గడ్డి పీక్కుంటూ, దేశకాలమాన పరిస్థితులను గూర్చి చర్చిస్తూ ఉన్నాం. అప్పుడు మాకు తెలియదు ఆ రోజు మేము చూడబోతున్నది ఒక మహత్తరమైన కార్యక్రమమని. 'న భూతో న భవిష్యతి ' అన్నది ఈ మధ్య అన్నిటికీ వాడేస్తున్నారు కానీ, సరిగ్గా ఆ కార్యక్రమానికి అతికినట్టు సరిపోతుంది.

ఇలాంటి సమావేశాల్లో మా విద్యార్థులంతా తమ తమ ప్రతిభలను విచ్చలవిడిగా ప్రదర్శించుకుంటారు అని చెప్పాను కదా, ఆ సాయంకాలపు వేళ మాకు చూపబోతున్న ప్రతిభ 'వ్యాపార ప్రకటనలు నటించి చూపుట '. అవాక్కయ్యారా? సినిమా వాళ్ళలాగే మా విధానం కూడా 'కాదేదీ ప్రదర్శనకనర్హం'.


ముందుగా అశ్విని హెయిర్ ఆయిల్ ప్రకటన..


'అశ్విని అశ్విని అశ్విని ...శిరోజాల సంరక్షిణి

దివి నుంచి భువికి దిగివచ్చిన అమృతవర్షిణి అశ్విని '

ఆ ప్రకటన చిన్నప్పుడు వచ్చేది..మీలో చాలా మంది చూసే ఉంటారు..

'రాలే జుట్టును అరికట్టునులే..' అన్నప్పుడు ఒకావిడ పాదాల పొడవు జుట్టేసుకుని గిర్రని బొంగరంలా తిరుగుతుంది...


ఈ ప్రకటన పూర్తయ్యేసరికి మాలో చాలా మందికి నవ్వి నవ్వి పొట్ట చెక్కలయ్యింది. ఇంతకీ సంగతేంటంటే..ఈ ప్రకటనలో నటించిన నివేదితది బాబ్ కట్. అది కనపడకుండా తనకు విగ్గు పెట్టారు. గిర్రని తిరిగినపుడు ఆ విగ్ కాస్తా కింద పడింది. తన్మయత్వంలో అది గ్రహించకుండా తను 'అశ్విని..అశ్విని...' అని పాడుతూనే పోయింది.


ఆ నవ్వుల నుండి కోలుకోకముందే ఇంకో ప్రకటన మొదలయ్యింది


అది ఫెవికాల్ యాడ్, ఒక ఫెవికాల్ డబ్బా తీసుకొచ్చి స్టేజ్ మీద మాకెదురుగా పెట్టారు, మళ్ళీ ఈ ప్రకటన మరోటి, మరోటి అనుకోకుండా. ఒక దళసరిగా ఉన్న తాడును ఇటో కొసా అటో కొసా పట్టుకున్నారు కొంతమంది. ఆ తాడు తెగి లేదు కాని తెగినది ఫెవికాల్ తో అంటించారు అని చెప్పడానికన్నట్టుగా ఒక ప్రదేశం లో ఒక చిన్న ముడి వేసి ఫెవికాల్ అని రాసి ఉన్న కాగితం అంటించారు. అంతా బాగానే ఉంది కాని తాడును ఒక వైపు లాగుతున్నవాళ్ళలో 'అభినవభీమ ' గా పేరుపొందిన శివప్రసాద్ కూడా ఉన్నాడు. వాడు ఒక వైపు లాగుతున్నాడనేసరికి మాకందరికీ ఆందోళన మొదలయ్యింది. అందులోనూ ఇరువైపుల సమాన బలం ఉండేలా చేయాలని నిర్వాహకులు ఒకరిద్దర్ని తప్పించి స్కూలు మొత్తాన్ని మరోవైపు నిల్చోపెట్టారు.

వాళ్ళు నటించడం మొదలుపెట్టారు..


"గట్టిగా లాగు హైస్సా

బలంగా లాగు హైస్సా

జోరుగా లాగు హైస్సా'



ఒక అరనిముషం నటించేసరికి నటన అన్న సంగతి మర్చిపోయి జీవంచడం మొదలుపెట్టాడు ప్రసాద్ . మేమేమీ తక్కువ తినలేదన్నట్టు అటు వైపు వాళ్ళు కూడా వాళ్ళ బలం కొద్దీ లాగారు. ఊహించినదే జరిగింది. తాడు సరిగ్గా కాగితం పెట్టిన చోటే తెగింది. అటు పడ్డ వాళ్ళు బాగానే ఉన్నారు, ఇటు వైపు మొదట నిల్చున్నది మన బాల బకాసుర్ కదా వాడు మీద పడేసరికి వెనక నిల్చున్న నలుగురు కోమాలోకి వెళ్ళినంత పనయ్యింది.

దానితో ఆ మహత్తర కార్యక్రమానికి తెర పడింది.


కథ కంచికి .....మేము ఇంటికి ......
ఇక్కడితో సమాప్తం .......

3, జనవరి 2025, శుక్రవారం

చిన్న బుడుగు ...చిన్న అల్లుడి కథ



ఈ మధ్య మా family కి promotions వచ్చింది :)

మా తమ్ముడికి బాబు పుట్టాడు... చూడటానికి వెళ్ళినప్పుడు వచ్చిన ఆలోచనతో ఒక 'చిన్న బుడుగు' లాంటి కధ రాశా...

నిజానికి బుడుగు లాంటి character ని అనుకరించటం ఒకింత సాహసమే అని తెలుసు...

hope you like it....


బుడుగు:

నా పేరు జూనియర్ బుడుగు...నేను పుట్టి రేపటికి మొన్న....

మా అమ్మ పేరు అమ్మ ...నాన్న పేరు నాన్న...


నాకు నవ్వటం కొంచం వచ్చు... మాట్టాడటం అస్సలు రాదు... యాడవటమే బాగా వచ్చు

అందరూ నేను బాగా ఏడుస్తా అని మెచ్చుకుని ముద్దులు పెట్టుకుంటారు.... నాకు అది నచ్చదు... ఏడవటం కాదు వాళ్ళు నన్ను ముద్దులు పెట్టుకోటం....

అందుకే ఇంకా గట్టిగ ఏడ్చేస్తాను... అప్పుడు ఇంకా గట్టిగ ముద్దులు పెట్టేస్కుని... జో జో బజ్జో...ఒళళళళళా హాయమ్మా ..హాయివారబ్బాయి ఆపదలుగాయి ...చిన్ని తండ్రినిగాయి సీవెంకటేశా!...అని పాడి బెదిరించుతారు

అందుకే మనం ఇలాంటి పాట మొదలవ్వగానే యాడవటం ఆపి నవ్వాలి లేదంటే వాళ్ళు ఆపరు...


నేను ఎందుకు ఏడుస్తానో నాకు తెలీదు.... మా అమ్మకి కూడా తెలీదు... మహా మహా మా అమ్మమ్మకి కూడా తెలీదు.. నిజ్జానికి డాక్టరుకి కూడా నేను ఎందుకు ఏడుస్తానో తెలీదు..

అసలు పెద్దవాళ్ళకి ఏమీ తెలియదు...

నేను ఉచ్చపోచ్చుకొని ఏడిస్తే... పాల పీక తెచ్చి నోట్లో పెట్టేస్తారు... వద్దన్నా కాని తాగు తాగమ్మ...చీ చీ...పోచ్చి అంటారు.. పోనీలే అని మనం కుంచెం తాగటానికి ట్రయ్ చేస్తామా...

మొత్తం తాగెయ్యమంటారు..

పాలు వేస్టు అయిపోతయ్ అంటారు... నేనేమైనా పాలు కావాలి అని ఏడ్చానా... పాలు వద్దని ఏడిచానా... ఉచ్చపోచ్చుకుని లంగోటి తడిసిపోయిందని ఏడిచాను.. పాలు పట్టేసినాక నా లంగోటి చెక్ చేసి... అరే వీడు ఇప్పుడే పాలు తాగి అప్పుడే పోసేశాడే అని నవ్వుతారు... అప్పుడు నాకు నవ్వు వస్తుంది... కాని నేను నవ్వను ఎందుకంటే నాకు నవ్వటం బాగా రాదు


నాకు యాడవటం బాగా వచ్చు... అమ్మకి బయపడటం అమ్మమ్మకి జోల పాడటం వచ్చు... డాక్టరుకి కవర్ చెయ్యటం వచ్చు... మెడికల్ షాపు వాడికి బిల్లు వెయ్యటం వచ్చు... నర్సుకి ఇంజెక్షను చెయ్యటం వచ్చు....

అందుకే నర్సు వచ్చినప్పుడు మనం యాడవకూడదు.. ఎత్తుకుంటే మాత్రం గట్టిగ ఏడ్చెయ్యాలి...


నాకు పాలు పట్టుతారు... అది నాకు నచ్చకపోతే నేను గుక్కపట్టుతాను... నిజ్జం ఏడుపులా నటించుతాను

అప్పుడు అమ్మ భయపడి...అమ్మా! అమ్మా! :( అని అమ్మమ్మని పిలుచుకుంటుంది.....

నేను ఇలా అమ్మకి కుంచెం భయం పెట్టుతాను.... లేదంటే పెద్దవాళ్ళు మనమీద అజమాయిషీ చేసేస్తారు...

చిన్నపిల్లల కింద లోకువ కట్టేసి పాలు పట్టేస్తారు

మా అమ్మ అప్పుడెప్పుడో పుట్టింది..అయినా నేను మా అమ్మకి నిన్నటి వరకు తెలీదు....

నాకైతే పుట్టినప్పటినుంచి మా అమ్మ తెల్సు...


నాకు AC అన్నా లంగోటి అన్నా... చాలా ఇష్టం రెండూ చల్లగా ఉంటయ్.... ఇంకా మా అత్త కొనుక్కొచ్చిన జుబ్బా వేచుకుని కళ్ళూ మూచుకుని దోమతెర అంబ్రిల్లా లో పడుకోటం ఇంకా ఇష్టం


మా నాన్నకి సెలవలు లేవంట... మా అత్తకి,మావయ్యకి ,పెద్ద నాన్నకి కూడా లేవంట...

నా దగ్గర మాత్రం ఉన్నయ్యా ఏంటి నాకు అసలు సెలవంటే ఏంటో కూడా తెలీదు ఇంక నా దగ్గర ఎలా ఉంటయ్

నా దగ్గర ఉంటే కొంచం ఇచ్చేవాడినే ఎందుకంటే నేను మంచివాడిని... చాల మంచి వాడిని...పండు వాడిని..


నాకు అమ్మ పోలికా?..నాన్న పోలికా?... ఎవరిపోలిక అని అంటూ ఉంటారు కాని నాకు అస్సలు మా తాత పోలిక

నిన్నే ఈ విషయం కనిపెట్టా .....


2, జనవరి 2025, గురువారం

మనిషి శకునం (బల్లి మాటల్లో )


పోదున్నే లేగానే మీద బల్లి పడింది

బల్లి శకునం పుస్తకం తిప్పుతుంటే ......... అక్కడ బల్లి బాష కూడా కనిపిస్తోంది


సీన్ కట్ చేస్తే.....


మీద పడ్డ బల్లి కుడా కంగారు కంగారు గా తమ బల్లి పెద్ద దగ్గరికి వెళ్లి

"పోదున్నే మనిషి మీద పడ్డ నాకేమవుతోంది అని అంటోంది

(పొద్దునే బల్లి బాష చదివా కాబట్టీ వాటి మాటలు అర్ధం అవుతున్నై ... )


బల్లి :ఇప్పుడు ఏమవుతుంది నాకు చాలా భయం గా ఉంది


బల్లి పెద్ద : నువ్వు ఎవరు మీద పడ్డావ్ .. ... .

పుస్తకం లోకి చూస్తూ ....

వాడు

రాజకీయ నాయకుడు ఐతే నువ్వు "నీ మీద రెండు పత్రికలలో మంచి కవేరేజి వస్తుంది ...""


సినిమా హీరో ఐతే " సినిమా సైట్ ల నిండా నీ ఫోటోలు పడతాయి "


బల్లి పెద్ద : ఇంతకీ నువ్వు పడింది ఎవరి మీద ?


బల్లి: తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ !! ఇప్పుడు నా పరిస్తితి ఏంటండి అంది బయపడుతూ ..


బల్లి పెద్ద : ముసి ముసి నవ్వులు నవ్వుతూ ...

ఐతే ఈ పాటికి నువ్వే ఏ తెలుగు బ్లాగ్ లో అచ్చు ఐపోతావ్ అంది !!





31, డిసెంబర్ 2024, మంగళవారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు

 

              నిన్నకాక మొన్ననే గోడలకి కేలండర్లు తగిలించినట్టు, అందుకున్న డైరీలు ఒక చోట సర్దినట్టూ ఉంది.. అప్పుడే వాటిని మార్చేసే రోజు వచ్చేసింది. 

             గోడ మీదికి చేరేందుకు కొత్త కేలండర్ తహతహలాడుతోంది.. డైరీలు రావడం మొదలయ్యింది.  చూస్తుండగానే ఒక సంవత్సరం పూర్తయిపోయి, కొత్త సంవత్సరం వచ్చేస్తోంది.


         న్యూ ఇయర్ రిజల్యూషన్స్ చేసుకోవడం, నెలన్నా గడవక ముందే వాటిని మర్చిపోవడం చాలా సార్లు జరిగాక, చాలా ఏళ్ళ క్రితమే ఇంక రిజల్యూషన్స్ చేసుకోకూడదనే రిజల్యూషన్ చేసుకుని దానిని మాత్రం విజయవంతంగా అమలు చేస్తున్నాను. 😉😉😉

            వ్యక్తి గత జీవితం ఎప్పటిలాగే సాగింది.. కొన్ని విజయాలు, మరి కొన్ని ఓటములు.. ఒత్తిళ్ళు, చికాకులు, మధ్య మధ్యలో మెరిసి మాయమయ్యే చిన్న చిన్న సంతోషాలు.. ఎప్పుడూ సంతోషాన్నే కోరుకోడం మన స్వార్ధం.. తను ఇవ్వదల్చుకున్న వాటిని మాత్రమే ఇవ్వడం కాలం చేసే మాయాజాలం. అన్నీ మనం అనుకున్నట్టే జరిగిపోతే ప్రపంచం తలకిందులైపోదూ??


      'తలచుకుంటే కానిదేముంది?' 'ఏదీ మన చేతుల్లో లేదు..' అనే ద్వంద్వ భావాల మధ్య కాలం కరిగిపోయింది.. బహుశా జీవితపు నడక ఇలాగే ఉంటుందేమో.. వెళ్ళిపోతున్న సంవత్సరానికి వీడ్కోలు చెప్పి, కొత్తగా వస్తున్న సంవత్సరానికి స్వాగతం చెప్పాలి. మనం చెప్పక పోయినంతమాత్రాన కొత్త సంవత్సరం రాక మానదు. కానీ వస్తున్న అతిధిని ఆహ్వానించాలి.


      జరగాల్సింది జగరక మానదన్న వేదాంతాన్ని కాసేపు పక్కన పెట్టి కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని కోరుకుందాం. ఇంటా, బయటా ఉన్న సమస్యలు ఒక్కొక్కటీ పరిష్కారమైపోతాయని ఆశిద్దాం.. నూతన సంవత్సరాన్ని మనస్పూర్తిగా ఆహ్వానిద్దాం..  

నూతన సంవత్సర శుభాకాంక్షలు.


17, డిసెంబర్ 2024, మంగళవారం

గడచిన కాలం..గోడకు సున్నం


కాలం…చానా చిత్రమైనది.....
నన్ను సరిగ్గా ఉపయోగించుకోవడం నీ వల్ల కాదోయి అని ఎప్పుడూ మనకు సవాలు విసురుతుంది.
ఈ సవాలులో చాలా మందిది ఎప్పుడూ ఓటమే......
జీవితంలో ఏ సమయం ఎలా గడపాలో అలా గడపము…
అదే సమయం గడచిపోయిన తరవాత దాని గురించి భాధపడతాము.

చిన్నప్పుడు కారు బొమ్మలతో ఆడుకోవాలని చాలా ఆశగా ఉండేది.
నా స్నేహితుడి మామయ్య ఎక్కడ నుండో వానికి కారు బొమ్మలు తెచ్చాడు.
ఆ కార్లు పట్టుకొని కొద్దిగా వెనక్కి లాగితే..జుయ్య్య్ మని ముందరికి దూసుకెళ్ళేది.
ఆ కార్లను వాడు తప్ప ఎవ్వరినీ తాకనిచ్చే వాడు కాదు. అది చూసినప్పట్టి నుండి నాకు ఆ కార్లు కావాలని విపరీతమైన ఆశ, కానీ తల్లి తండ్రులతో కొనివ్వమని అడగాలని తెలియదు.కానీ లోపల వాటితో ఆడుకోవాలన్న ఆశ మాత్రం ఉండేది.  ఎవరైనా కారు బొమ్మలతో ఆడుకొంటూంటే చాలా అసూయగా ఉండేది. నా వయసు పెరిగే కొద్దీ ఆ కోరిక నాలోనే సమాధి అయిపోయింది.

ఈ మధ్యే మా పాపకి బొమ్మలు తేవడానికి ఒక షాపింగ్ మాల్ వెళ్ళాను.ఎన్ని రకాల బొమ్మలో…అన్నీ ఆటోమేటెడే …. ఆడేటివి ..పాడేటివి..పరిగెత్తేవి..గెంతేవి..ఎగిరేవి…చిత్రమైన చేష్టలు చేసేవి చాలా ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత…ఎప్పుడో సమాధైపోయిన ఆ కారు కోరిక మళ్ళీ గుర్తొచ్చింది. 

ఏమి లాభం…ఇప్పటికే ఒక జీవితకాలం లేటైపోయింది. ఇప్పుడు అలాంటి కార్లు వెయ్యి కొనగల్ను..కానీ అదే ఆనందం పొందుతానన్న నమ్మకం నాకు లేదు. ఏ వయసులో కోరిక ఆ వయసులో తీరిపోతేనే అనందం. ఎవరికైనా ఇది చాలా చిన్న విషయంగా సిల్లీగా అనిపించవచ్చు…కానీ చాలా దుఃఖం వేసింది. కోరికున్నప్పుడు కార్లు లేవు….కార్లున్నప్పుడు కోరిక లేదు. 

అలాగే ఇంకా ఎవేవో కోరికలుండేటివి..వర్షంలో నీటి గుంటలలో దూకాలని..ఇసుకలో పొర్లాడాలని..తూనిగల్ని పట్టుకోవాని..మా ఇంట్లో ఉన్న నీటి తొట్టే లో మునకెలెయ్యాలని…. ఇప్పుడు నేను గుంటల్లో దూక గలనా? ఇసుకలో పొర్లగలనా? అలా చేస్తే..బ్యాక్టీర్యా చే ఇన్ఫెక్షన్ వస్తుంది …జబ్బు చేస్తుంది అన్నంతగా విఙ్ఞానం సంపాదించాను మరి, ఎలా చెయ్యగలను? ఒక వేళ చేస్తే..నన్నో మెంటల్ కేసుగా ముద్రెయ్యటం ఖాయం.

   ఏది ఏమైనా…కాలాన్ని సద్వినియోగపరచుకుని..సదా ఆనందంగా ఉండే వారు ధన్య జీవులు.




12, డిసెంబర్ 2024, గురువారం

మామిడి తాండ్ర - భీషణ ప్రతిజ్ఞ

 ఆ వేసవి మధ్యాహ్నం నేను, మా అన్నయ్య డాబా మెట్ల మీద కూర్చుని ఉన్నాం. మా ఎదురుంగా నోరూరించే నూజివీడు రసాలు నాలుగు. మా ఇద్దరి మొహాలు ఎర్రగా ఉన్నాయి. అవి పగతో ప్రతీకారంతో రగిలిపోతున్న మా మనస్సులను ప్రతిబింబిస్తున్నాయి. దానికి కారణం క్రితం రోజు సాయంత్రం డాబా మీద మాకు జరిగిన అవమానమే..

ఓ పద్దెనిమిది గంటలు వెనక్కి వెళ్తే..


సెలవులకని మా పక్కింటి పండు గాడింటికి వాళ్ళ బాబాయి వాళ్ళు ఏల రావలె?

వచ్చితిరిపో ఉత్త చేతులతో రాక మామిడి తాండ్రను ఏల తేవలె?

తెచ్చితిరిపో వాడు డాబా పైకి వచ్చి మేము చూస్తుండగా, మాకు పెట్టకుండా ఏల తినవలె?

తినెనుపో మమ్మల్ని చూసి ఊరూరుట్ట అని ఏల అనవలె?


                 అహో ఇది భరించలేని అవమానం, అది తట్టుకోలేని మా చిన్ని హృదయాలు ఏ నిముషంలో ఐనా బద్దలయ్యే అగ్ని పర్వతాల్లా కుతకుతమంటున్నాయి..అప్పుడే ప్రతిజ్ఞ చేసుకున్నాము..ఎలా ఐనా మామిడి తాండ్రను తయారు చేసి, పండు గాడి తాండ్ర అయిపోయే దాకా ఆగి, అప్పుడు మా తాండ్రను తీసి వాడ్ని ఊరిస్తూ తినాలని..


              ఆ రోజు రాత్రి నూటముప్పయ్యోసారి నాన్నగారికి మరుసటిరోజు పొద్దున్న మామిడిపండ్లు తేవాలని గుర్తు చేసి పడుకున్నాం. ఆ రాత్రంతా తాండ్రను గురించిన కలలే!! మేము కష్టపడి చేసిన తాండ్రను పండు గాడు దొంగతనంగా తినేసినట్టు నాకు కల వస్తే, వాడి తాండ్రను మేము దొంగలించి తెచ్చినట్టు అన్నయ్యకు కల వచ్చింది. పొద్దున్న కోడి కూయక ముందే నిద్ర లేచి నాన్నగారిని లేపి అప్పటికి బజారు తెరవరని ఆయన చెబుతున్నా వినకుండా సంచీ చేతికిచ్చి ఆయన్ను పంపించి, నాన్నారు కోసం ఎదురు చూస్తూ వీధి గుమ్మానికి చెరో వైపు కూర్చున్నాం.


                              మనం ఎదురు చూస్తున్నప్పుడే కాలం పగబట్టిన దానిలా మరింత మెల్లిగా సాగుతుంది. అప్పటికీ అన్నయ్య లోపలికి వెళ్ళి మా గడియారంలో చిన్న ముల్లును రెండంకెలు ముందుకు జరిపాడు కూడా. అయిన ఫలితం లేకపోయింది. మా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నాన్న గారు రెండు సంచులతో వీధిలోకి అడుగుపెట్టారు.. మేము పరిగేట్టుకుని వెళ్ళి ఆయన్ను అక్కడే ఆపి, సంచీలు దించి, మాకు కావలసినవి అందులో ఉన్నాయని రూఢి చేసుకున్నాక ఇంటికి రానిచ్చాం. ఇంటికి రాగానే పండ్ల మీదకు పడబోయేసరికి అమ్మ ఆపి, భోజనం చేసాకే ఏదైనా అని, మా ఉత్సాహానికి బ్రేకులు వేసింది. పైకి తన్నుకొస్తున్న కోపంతో కూడిన కన్నీళ్ళను లోపలికి నెట్టి, పండ్లకేసి ఆశగా చూస్తూ, వంట ఎప్పుడౌతుందా అని చకోర పక్షుల్లా ఎదురు చూస్తూ కూర్చున్నాం. వంట అయీ అవ్వడంతోనే కంచాలు తెచ్చేసుకుని అమ్మ ఏది పెడితే అది గబగబా తినేసి ఒలంపిక్స్ లో గెలుచుకున్న బంగారు పతకం పట్టుకున్నంత అపురూపంగా మామిడి పండ్లను పట్టుకుని మెట్ల మీదకు చేరాము..


                             అవే ఇప్పుడు మా కళ్ళ ముందున్నాయి. ఆ రసాలను చూస్తూనే అమాంతంగా నోట్లో వేసుకుని గుటుక్కుమనిపించాలని బలంగా అనిపిస్తున్నా మా ప్రతిజ్ఞను ఒకరికి ఒకరం గుర్తు చేసుకుంటూ బలవంతం మీద నిగ్రహించుకున్నాం. మామిడి పండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కావలసినవి ఏంటి? అవి దొరికాక తాండ్రను ఎలా చేయాలి..అవి మా ముందున్న ప్రశ్నలు..కాని మా అన్నయ్య ఉన్నాడే!! తనకు తెలియంది లేదు (అని అనుకునేదాన్ని అప్పట్లో). ఏది చెప్పినా అది నిజం, అదే నిజం, అది మాత్రమే నిజం అనుకునేలా చెప్తాడు. అప్పట్లో వచ్చే బూస్ట్ ఏడ్ చూపించి సునీల్ గవాస్కర్ కొడుకు సచిన్ టెండుల్కర్ అని చెప్పాడు. అదే నిజమని చాలా కాలం నమ్మాను కూడా. అది పక్కన పెడితే కర్తవ్యం తెలియక కంగారు పడుతున్న నా భుజం మీద చెయ్యి వేసి, 'పిచ్చిదానా ఎంటీవోడంతటి అన్నయ్య నీకుండగా నీకేల బెంగ ' అన్నట్లు ఒక నవ్వు నవ్వి, 'నాకు తాండ్ర ఎలా చేయాలో తెల్సు. ఏముంది ముందు మామిడి పండ్ల రసం తీసి, దాన్లో ఒక కేజీ ఓ పది కేజీలో పంచదార పోసి మిక్సీలో పావుగంట తిప్పి కంచంలో ఆరబోసి ఎండలో నాలుగు రోజులు పెడితే నోట్లో వెన్నలా కరిగిపోయే తాండ్ర రెడీ' అని నాకు ధైర్యం చెప్పాడు.


                      మరుసటి రోజు అమ్మానాన్న బైటకి వెళ్ళేదాక గోతి కాడ నక్కల్లా ఎదురుచూసి, వాళ్ళు వెళ్ళడమేమిటి మా ప్రయోగం మొదలుపెట్టాం. మిక్సీ చేసాక పళ్ళెంలో ఆ రసాన్ని పోసి, దాని వైపు ఆశగా చూస్తూ 'మామిడి వంటి పండుయు..' అని అశువుగా కవిత్వం చెప్పబోతూంటే 'తాండ్ర వంటి స్వీటుయు..' అని అన్నయ్య అందుకున్నాడు. ఆ పళ్ళాన్ని మేడ మీద ఎండబెట్టి దాన్నే చూస్తూ కూర్చున్నాం. మాలో ఏ ఒక్కరు మంచి నీళ్ళ కోసమో, మరో దాని కోసమో కిందకు దిగినా తక్కిన వాళ్ళు వెంట వెళ్ళాల్సిందే, ఈలోగా ఇంకొకరు ఎక్కడ దాన్ని గుటకాయం స్వాహః చేస్తారేమో అన్న భయంతో. రాత్రుళ్ళు మాకు మాత్రమే తెలిసిన రహస్య ప్రదేశాల్లో దాస్తూ, పొద్దున్న రెప్ప వేయకుండా కాపలాలు కాస్తూ నాలుగు రోజులు గడిపాం. నాలుగో రోజు 'ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి..' అని పాడుకుంటూ మా స్వహస్తాలతో చేసుకున్న ఆ అమృతాన్ని మా మధ్యలో ఉంచుకుని ఒకొక్క ముక్క నోట్లో వేసుకున్నాం. వెంటనే ఒకరి మొహంలోకి ఒకరం చూసుకున్నాం, మా మొహాల్లో రంగులు మారాయి. కాజాలో మాగాయి ముక్క పెట్టుకుని దాన్ని సాస్ లో ముంచుకుని తింటే ఎలా ఉంటుందో దాని కన్నా అధ్వానంగా ఉంది మా వంటకం. ఎంతైనా మేము చేసుకున్నది కదా, పారెయ్యడానికి చేతులు రాక మరో రెండు ముక్కలు నోట్లో వేసుకోవడానికి ప్రయత్నించాం. ఊహు! వల్ల కాలేదు. గుడ్ల నీరు కక్కుకుంటూ మా అమృతాన్ని, మా పంచదార గుళికను, మా వజ్రాల తునకను కాలువలో జారవిడిచాం. ఆ తర్వాత కరువు తీరా ఏడ్చి, అమ్మ రాకముందే మొహాలు కడుకున్ని కూర్చున్నాం. ఆ రాత్రి ఒకటే వాంతులు. 'ఏం తిన్నార్రా' అని అమ్మ అడిగితే నోరు మెదిపితేనా. ఎలా చెప్తాం! తేలు కుట్టిన దొంగలం కదా!!