కాలం…చానా చిత్రమైనది.....
నన్ను సరిగ్గా ఉపయోగించుకోవడం నీ వల్ల కాదోయి అని ఎప్పుడూ మనకు సవాలు విసురుతుంది.
ఈ సవాలులో చాలా మందిది ఎప్పుడూ ఓటమే......
జీవితంలో ఏ సమయం ఎలా గడపాలో అలా గడపము…
అదే సమయం గడచిపోయిన తరవాత దాని గురించి భాధపడతాము.
చిన్నప్పుడు కారు బొమ్మలతో ఆడుకోవాలని చాలా ఆశగా ఉండేది.
నా స్నేహితుడి మామయ్య ఎక్కడ నుండో వానికి కారు బొమ్మలు తెచ్చాడు.
ఆ కార్లు పట్టుకొని కొద్దిగా వెనక్కి లాగితే..జుయ్య్య్ మని ముందరికి దూసుకెళ్ళేది.
ఆ కార్లను వాడు తప్ప ఎవ్వరినీ తాకనిచ్చే వాడు కాదు. అది చూసినప్పట్టి నుండి నాకు ఆ కార్లు కావాలని విపరీతమైన ఆశ, కానీ తల్లి తండ్రులతో కొనివ్వమని అడగాలని తెలియదు.కానీ లోపల వాటితో ఆడుకోవాలన్న ఆశ మాత్రం ఉండేది. ఎవరైనా కారు బొమ్మలతో ఆడుకొంటూంటే చాలా అసూయగా ఉండేది. నా వయసు పెరిగే కొద్దీ ఆ కోరిక నాలోనే సమాధి అయిపోయింది.
ఈ మధ్యే మా పాపకి బొమ్మలు తేవడానికి ఒక షాపింగ్ మాల్ వెళ్ళాను.ఎన్ని రకాల బొమ్మలో…అన్నీ ఆటోమేటెడే …. ఆడేటివి ..పాడేటివి..పరిగెత్తేవి..గెంతేవి..ఎగిరేవి…చిత్రమైన చేష్టలు చేసేవి చాలా ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత…ఎప్పుడో సమాధైపోయిన ఆ కారు కోరిక మళ్ళీ గుర్తొచ్చింది.
ఏమి లాభం…ఇప్పటికే ఒక జీవితకాలం లేటైపోయింది. ఇప్పుడు అలాంటి కార్లు వెయ్యి కొనగల్ను..కానీ అదే ఆనందం పొందుతానన్న నమ్మకం నాకు లేదు. ఏ వయసులో కోరిక ఆ వయసులో తీరిపోతేనే అనందం. ఎవరికైనా ఇది చాలా చిన్న విషయంగా సిల్లీగా అనిపించవచ్చు…కానీ చాలా దుఃఖం వేసింది. కోరికున్నప్పుడు కార్లు లేవు….కార్లున్నప్పుడు కోరిక లేదు.
అలాగే ఇంకా ఎవేవో కోరికలుండేటివి..వర్షంలో నీటి గుంటలలో దూకాలని..ఇసుకలో పొర్లాడాలని..తూనిగల్ని పట్టుకోవాని..మా ఇంట్లో ఉన్న నీటి తొట్టే లో మునకెలెయ్యాలని…. ఇప్పుడు నేను గుంటల్లో దూక గలనా? ఇసుకలో పొర్లగలనా? అలా చేస్తే..బ్యాక్టీర్యా చే ఇన్ఫెక్షన్ వస్తుంది …జబ్బు చేస్తుంది అన్నంతగా విఙ్ఞానం సంపాదించాను మరి, ఎలా చెయ్యగలను? ఒక వేళ చేస్తే..నన్నో మెంటల్ కేసుగా ముద్రెయ్యటం ఖాయం.
ఏది ఏమైనా…కాలాన్ని సద్వినియోగపరచుకుని..సదా ఆనందంగా ఉండే వారు ధన్య జీవులు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి