Pages

18, అక్టోబర్ 2021, సోమవారం

అమ్మకి కోపం వస్తే..

                     ఇంట్లో అందరికీ మనమీద కోపం రావడం ఒక ఎత్తైతే, అమ్మకి కోపం రావడం మరో ఎత్తు. ఇంకెవరి కోపాన్నీ పెద్దగా పట్టించుకోక పోయినా పర్లేదు కానీ, అమ్మతో అలా కుదరదు. బోయినం మాట అటుంచి, మంచి నీళ్ళు కూడా సరిగా ముట్టవు.  నాన్నకి కోపం వస్తే నాలుగు దెబ్బలు వేస్తారు. ఆ వెంటనే కోపం మర్చిపోతారు.  కానీ అమ్మ అలా కాదు, ఏమీ అనదు కానీ అస్సలు మాటాడదు. మనం వెనక వెనకే తిరిగినా సరే అస్సలు మన వంక చూడనన్నా చూడదు. 


            అసలు అమ్మకి కోపం ఎందుకు వస్తుంది? మనం ఏదో ఒక పిచ్చి పని చేస్తేనే కదా?? 'వెర్రిదీ అమ్మేరా... పిచ్చిదాని కోపంరా..' అన్నాడు కదా ఓ సినిమా కవి.  మనం తెలిసో తెలియకో చేసే పిచ్చి పనులు అమ్మకి మన మీద పిచ్చి కోపం రప్పిస్తాయన్న మాట.  నాలుగు కొట్టాలనిపించినా గబుక్కున చేతులు రావు కదా, అందుకని ఏవీ అనకుండా ఊరుకుంటుంది. 


            ఒకసారి నేను  అమ్మతో పేరంటానికి వెళ్లాను. ఆ పేరంటానికి రాజ్యంగారమ్మాయి కొత్త చీర కట్టుకుని వచ్చింది. అందరూ ఆ చీరని ఒకటే మెచ్చుకోవడం. ఇంతలో నేను చేసిన ఓ పొరపాటు వల్ల ఆ చీరమీద మరక పడింది.చిన్న మరకే అయిన కొత్త చీర కదా, పైగా ఆ అమ్మాయి మొదటిసారి చీర కట్టుకుంది కూడాను, పేరంటానికి వచ్చిన అందరూ 'అయ్యో పాపం' అనడవే. ఏం చెయ్యాలో తెలీక నేను ఇంటికెళ్ళిపోయాను. తర్వాత కాసేపటికి అమ్మొచ్చింది. ఏవీ మాటాడలేదు.. ఒకటీ రెండూ కాదు ఏకంగా మూడు రోజులు. 


         అది మొదలు అమ్మకి చాలా సార్లే కోపం వచ్చింది నా మీద. ఎక్కువగా అల్లరి చేసినప్పుడూ, ఆటల్లో దెబ్బలు తిని వచ్చినప్పుడూ, బళ్ళో మేష్టారు నామీద కోప్పడ్డప్పుడూ, బామ్మ గట్టిగా గసిరినప్పుడూ, పరీక్షల్లో మంచి మార్కులు రానప్పుడూ ఇలా.. ఒక్కోసారి అమ్మకి నామీద ఎందుకు కోపం వచ్చిందో కూడా తెలిసేది కాదు. కోపం వచ్చినదని మాత్రం తన ముఖం చూడగానే తెలిసిపోయేది.. కారణం తర్వాతెప్పుడో తెలిసేది. నేను అల్లరేక్కువ చేస్తున్నానో, ఇంకోటనో ఎవరన్నా అమ్మకి చెప్పినా అమ్మకి నామీదే కోపం వచ్చేసేది మరి. 


           నేను బడి నుంచి ఇంటికి వచ్చేసరికి ఎప్పటిలాగా నవ్వుతూ ఎదుర్రాకుండా ముఖం గంటు పెట్టుకుని తన పన్లు తను చేసుకుంటోందంటే అమ్మకి  నామీద కోపం వచ్చేసినట్టే. ఇంక నేనెంత వెంటబడి మాటాడినా విననట్టు నటిస్తుంది. నాకేవీ పనులు చెప్పదు. నేను చెయ్యబోయినా చెయ్యనివ్వదు. మొదట్లో అమ్మకి కోపం వస్తే నాకు భయం, బాధా వచ్చేసేవి కానీ, రాన్రాను అమ్మ కోపం పోగెట్టే ఉపాయం తెలిసిపోయింది. ఏవీలేదు, అమ్మకి కోపం రాగానే అన్నం ఎప్పుడూ తినేంత కాకుండా కొంచమే తినడం. 


             మొత్తం మానేస్తే నాన్న తంతారు కానీ, ఆకల్లేదు అని కొంచం తిని ఊరుకుంటే ఏవీ అనలేరు కదా. ఈ ఉపాయం మాత్రం బ్రహ్మాండంగా పనిచేసింది. ఓ పూటో రోజో చూసి అమ్మ వెంటనే మాటాడేసేది.  తర్వాతేవో మంచి మాటలు చెప్పేది. నేను బుద్ధిగా వినేదానిని. మళ్ళీ కథ మామూలే. 

3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

ముసురేసింది ....

          "దేవుడా దేవుడా గాట్టి వర్షం కురిపించు.." పొద్దు పొద్దున్నే నిద్ర లేవగానే ఆకాశంలో  మబ్బులు కనిపిస్తే నేను దేవుణ్ణి కోరుకునే చిన్న కోరిక ఇది. 

             బాగా వర్షం వస్తే బడికి  వెళ్ళక్కర్లేదు కదా మరి. మా బళ్ళో ఉండే రెండు గదుల్లోనూ ఒకటి బంగాళా పెంకులది,  రెండోది తాటాకుతో కప్పింది. వానొచ్చిందంటే నీళ్లన్నీ మామీదే. అందుకని పెద్ద  వర్షమొస్తే బడికి సెలవన్న మాట. అసలు బళ్ళో కూర్చోడం మాటెలా ఉన్నా, మేష్టార్లు బడికి  రావాలన్నా వీలు పడదు.  బురద రోడ్ల మీద సైకిలు దొర్లించుకుంటూ రావడం చాలా కష్టం మరి.  



         బడికి సెలవిచ్చేస్తే ఎంచక్కా ఎంత బాగుంటుందో. మామూలుగా ఆదివారం నాడు  సెలవిస్తారనుకో. అయినా కానీ ఇలా మధ్య మధ్యలో సెలవులోస్తే భలేగా ఉంటుంది.  మనం  చద్దన్నం తినేసి బడికి బయలుదేరే లోపే ఎవరో ఒకరు "ఇవాళ బళ్ళేదు" అని చెప్పేస్తారు  కదా. 

       అప్పుడు పుస్తకాల సంచీని అమ్మకీ, నాన్నకీ కనిపించకుండా దాచేయాలి. ఎదురుకుండా  సంచీ కనిపిస్తుంటే "చదువుకో" అని ప్రాణాలు తోడెయ్యరూ, అందుకన్న మాట.  పాఠాలన్నీ  వచ్చేశాయ్ అన్నా వినిపించుకోకుండా, "మళ్ళీ చదువుకో" అనో "ఎక్కాలు నేర్చుకో" అనో  ఆర్డర్లేస్తారు. 


         బయట బాగా వర్షం పడుతోందనుకో, మూల గదిలోకి వెళ్లి కిటికీ దగ్గరకి తలొచ్చేలా  పెద్ద మంచం మీద పడుకోవాలి.  అప్పుడైతే వర్షం ఎలా కురుస్తోందో బాగా చూడొచ్చు.  

ఒక్కోసారి ఊరంతా చీకటిగా అయిపోయి, ఉరుములూ అవీ వస్తూ, లావు లావు ధారలుగా వర్షం  కురుస్తుంది చూడు, అలాంటప్పుడైతే భయమేస్తుంది కానీ, మామూలు వర్షమైతేనా ఎంతసేపైనా  అలా చూస్తూ ఉండిపోవచ్చు. మధ్య మధ్యలో వచ్చే మెరుపులు భలేగా ఉంటాయి. చూరు మీద నుంచి  నీళ్ళు ధారలు ధారలుగా పడ్డప్పుడు కింద నేలంతా చిల్లులు పడి చిన్న చిన్న చెరువుల్లా  అయిపోతుంది. అప్పుడు కనక వర్షం తగ్గిందంటే ఆ నీళ్ళలో పడవలు ఆడుకోవచ్చు. 


             చెరువంటే గుర్తొచ్చింది. మూల గదిలో కూర్చున్నామంటే తోట   లో  వర్షం కురవడం  చూడొచ్చు. అసలే తోట నిండా నీళ్ళా? ఆ నీళ్ళలో మళ్ళీ బోల్డు బోల్డు నీళ్లన్న మాట.  ఒక్కోసారి తోట పొంగిపోతుందేమో అని భయమేస్తుంది కానీ, అలా వర్షం కురవడం మాత్రం  ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది. బాగా దూరంగా చూస్తే అక్కడ  వర్షం కూడా మంచులాగే కనిపిస్తుంది.

 

         వానొచ్చిందంటే తోట తిరిగే నీరుకట్లూ,  బురదపాములూ మండువాలోకి  వచ్చేస్తాయి. కర్రుంది కదా అని వాటిని చంపెయ్యకూడదు.తాచుపామైతేనే చంపాలి. కానీ హమ్మో.. తాచుపాముని చంపడం అంత సులువేంటి? నాన్నైతే ఒక్క  దెబ్బకి చంపేస్తారనుకో. కాకపొతే ఈ బుడత పాముల్ని చూసి 'పాము' 'పాము' అని అరిచి కాసేపు బామ్మని ఖంగారు  పెట్టొచ్చు. 


       ఎంత చద్దన్నం తిని ఊరికే కూర్చున్నా టైంకి  ఆకలెయ్యక మానదు కదా.

 అలా  అని "తినడానికి ఏవన్నా పెట్టు" అని అమ్మని పీక్కు తినకూడదు. తనకి చెయ్యి ఖాళీ  అయ్యాక తనే పెడుతుంది. పొద్దున్నైతే ఒకటే హడావిడిగా ఉంటుంది కానీ, మధ్యాన్నం  బోజనాలైపోయాక అమ్మక్కొంచం ఖాళీ దొరుకుతుంది కదా.. 

             అప్పుడు ఏ వేరుశనగ గుళ్ళో వేయించి  పెడుతుంది. కొంచం బెల్లమ్ముక్క కూడా తనే ఇస్తుందిలే, మళ్ళీ పైత్యం చేయకుండా. 


             బామ్మైతే వర్షం వచ్చినప్పుడల్లా తన చిన్నప్పటి ఫ్రెండ్సులకి ఎవరెవరికి  వర్షాల్లో ఏమేం దొరికాయో కథలు కథలుగా చెప్పేస్తుంది. వర్షం తగ్గిపోయాక బురదగా  ఉంటుంది కదా. బామ్మ ఫ్రెండ్సులు ఆ బురదలో కర్రతో తవ్వే ఆట ఆడుతుంటే ఒకళ్ళకి గొలుసూ,  మరొకళ్ళకి ఉంగరమూ (రెండూ నిజం బంగారమే) దొరికాయిట. వాళ్లకి అదృష్టం ఉందిట. నేను  వెతుకుదామనుకున్నా తను పడనివ్వలేదు. ఎప్పుడూ ఉండే గొడవే జొరం వస్తుందని. అయినా ఎవరూ  చూడకుండా నేను వెతికాననుకో. కానీ నాకు అదృష్టం లేదు.


      మామూలప్పుడైతే అన్నం వేడి వేడిగా ఉంటే అస్సలు తినలేమా.. అదే వర్షం  వచ్చినప్పుడైతే వేడన్నం ఊదుకుంటూ తింటే ఉంటుందీ..  అది అరిటాకులో .అదే రాత్రప్పుడైతే పెరుగన్నం  అవుతుండగానే నిద్ర ముంచుకొచ్చేస్తుంది. కడుపులో వేడి వేడిగా ఉంటుంది కదా మరి.  అప్పుడు నిండా రగ్గు కప్పేసుకుని గాట్టిగా కళ్ళు మూసేసుకుంటే వర్షం చప్పుడు,మధ్యలో  తోట లొంచి కప్పల బెకబెకలు వినిపించీ అలా అలా నిద్రలోకెళ్లిపోతాం. 

తెల్లారిందంటే మళ్ళీ  బళ్ళోకెళ్ళాల్సిందే. ....................... 

ఎంత మనం రోజూ దండం పెట్టుకుంటే మాత్రం, 

వానదేవుడు మనూళ్ళోనే  రోజూ వర్షం కురిపించెయ్యడు కదా. 

మిగిలిన ఊళ్లలో కూడా మనలాంటి పిల్లలుంటారు కదా మరి!!!!!!!!!! 




30, ఆగస్టు 2021, సోమవారం

కృష్ణం కలయ సఖి సుందరం(ముఖారి రాగం - ఆది తాళం )

ఈ  కీర్తన సుప్రసిద్ధ వాగ్గేయకారుడు నారాయణ తీర్ధులు
 రచించిన శ్రీ కృష్ణ లీలా తరంగిణి   అనే భక్తి కావ్యం లోనిది . 
దీనిని భాగవతం లోని దశమ స్కందంలోని ప్రధాన ఘట్టాలను ప్రాతిపదికగా తీసుకొని రచనచేశారు . దీనిలో 12 తరంగాలు, 156 కీర్తన లు ఉన్నాయి. దీనికోసం 36 రాగాలు వాడారు. 

______________________________________________


కృష్ణం కలయ సఖి సుందరం
బాల కృష్ణం కలయ సఖి సుందరం||


కృష్ణం కథవిషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం
సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం|


నృత్యంతమిహ ముహురత్యంతమపరిమిత భృత్యానుకూలం అఖిల సత్యం
సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం |


ధీరం భవజలభారం సకల వేద సారం సమస్తయోగిధారం
సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం |


శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరికేళ సంగం
సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం |

 

రాధారుణాధర సుతాపం సచ్చిదానందరూపం జగత్రయభూపం
సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం |

దామోదరం అఖిల కామాకరంగన శ్యామాకృతిం అసుర భీమం
సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం |

అర్థం శితిలీకృతానర్థం శ్రీ నారాయణ తీర్థం పరమపురుషార్థం
సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం |

 

మా గురువు గారు శ్రీమతి గిరిజా కుమారి గారి గాత్రం లో  ఈ పాట .. 




  



కస్తూరి రంగ రంగా


కస్తూరి రంగరంగా - నాయన్న కావేటిరంగరంగా

శ్రీరంగ రంగరంగా నినుబాసి - యెట్లునే మరచుందురా


కంసుణ్ణి సంహరింపా - సద్గురుడు - అవతారమెత్తెనపుడూ

దేవకీ గర్భముననూ - కృష్ణావ - తారమై జన్మించెనూ

యేడు రాత్రులు చేరిచీ - ఒకరాత్రి - యేకరాత్రిగజేసెను

ఆదివారము పూటనూ - అష్టమీ - దినమందు జన్మించెనూ


తలతోను జన్మమైతె - తనకు బహు - మోసంబు వచ్చుననుచు

ఎదురుకాళ్ళను బుట్టెను - ఏడుగురు - దాదులను చంపెనపుడు

నెత్తురుతొవుండి యపుడూ - ఆబాల - కావుకావున యేడ్చుచు

నన్నేల యెత్తుకొనవే - ఓతల్లి - దేవకీ వందనంబు


ఒళ్లెల హీనంబుతో - ఈరీతి - నున్నాను కన్నతండ్రి

నిన్నెట్లు ఎత్తుకుందూ - నీవొక్క - నిమిషంబు తాళరన్నా

గంగనూ ప్రార్ధించెనూ - జలనిధుల - గంగతా నుప్పొంగెను

గంగనదిలో నప్పుడూ - దేవకీ - జలకంబులాడె నపుడు


ఇకనైన యెత్తుకొనవే - నాతల్లి - దేవకీ వందనంబు

కాని బాలుని వలెను - నన్నిట్లు - యెడబాసి యుండతగునా

నీపుణ్యమాయె కొడుకా - యింకొక్క - నిమిషంబు తాళుమనుచూ

కామధేనువు నప్పుడూ - దేవకీ - కడగి ప్రార్థించగానూ


పాలవర్షము గురిసెను - అప్పుడా - బాలుపై చల్లగానూ

తడివస్త్రములు విడిచెనూ - దేవకి - పొడివస్త్రమును కట్టెను

పొత్తిళ్ళమీద నపుడూ - బాలుండు - చక్కగా పవళించెను

తనరెండు హస్తములతో - దేవకి - తనయుణ్ణి యెత్తుకొనెను


అడ్డాలపై వేసుక - ఆబాలు - నందచందము చూచెను

వసుదేవు పుత్రుడమ్మా - ఈబిడ్డ - వైకుంఠ వాసుడమ్మా

నవనీత చోరుడమ్మా - ఈబిడ్డ - నందగోపాలుడమ్మ

సితపత్రనేత్రుడమ్మా - ఈబిడ్డ - శ్రీరామ చంద్రుడమ్మ


శిరమున చింతామణి - నాతండ్రి - నాలుకను నక్షత్రము

పండ్లను పరుసవేది - భుజమున - శంఖుచక్రములు గలవు

వీపున వింజామరం - నాతండ్రి - బొడ్డున పారిజాతం

అరికాళ్ళ పద్మములును - అన్నియూ - అమరెను కన్నతండ్రీ


నీరూపు నీచక్కనా - ఆ బ్రహ్మ - యెన్నాళ్లు వ్రాసెతండ్రీ

అన్నెకారి కడుపునా - ఓ అయ్య - ఏల జన్మిస్తివయ్య

మా యన్న కంసరాజు - ఇప్పుడూ - వచ్చు వేళాయెరన్నా

నిన్ను నే నెత్తుకోని - ఏత్రోవ - నేగుదుర కన్నతండ్రి


ఆ చక్కదనము జూచి - దేవకి - శోకింపసాగె నపుడు

తల్లి శోకము మాన్పగా - మాధవుడు తంత్ర మొక్కటి చేసెను.

పెద్ద బొబ్బలు పెట్టుచూ, మాధవుడు - గట్టిగా యేడ్వసాగె

శోకంబు చాలించియూ - దేవకి - బాలుణ్ణి యెత్తుకొనెను


నాయన్న వూరుకోరా - నాతండ్రి - గోపాల పవళించరా

అల్లడుగొ బూచివాడు - నాతండ్రి - వస్తాడు పవళించరా

బూచులను మర్దించనూ - నలినాక్షి - బుద్ధిమంతుడను అమ్మా

బూచేమి చేసునమ్మా - నాతల్లి - బూచి నన్నెరుగు నమ్మా


నీ పుణ్యమాయె కొడుకా - నీ వొక్క - నిమిషంబు తాళుమనుచు

అల్లడుగొ జోగివాడూ - నా తండ్రి - వస్తాడు పవళించరా

జోగి మందుల సంచులూ - ఏ వేళ - నా చంక నుండగాను

జోగేమి చేసునమ్మ - నా తల్లి - జోగి నన్నెరుగునమ్మా


నీ పుణ్యమాయె కొడుకా - నీ వొక్క - నిమిషంబు తాళుమనుచు

అల్లదుగొ పాము వచ్చె - నా తండ్రి - గోపాల పవళించరా

పాముల్ల రాజె అయినా - శేషుండు - పాన్పుపై యుండగానూ

పామేమి చేసునమ్మా - నలినాక్షి - భయము నీ కేలనమ్మా


నీలమేఘపు చాయలూ - నీమేను - నీలాల హారములునూ

సద్గురుడు వ్రాసెనాడు - నా తండ్రి - నీరూపు నీచక్కన

నిన్ను నేనెత్తుకోనీ - యేత్రోవ - పోదురా కన్నతండ్రి

నాకేమి భయములేదే - నాతల్లి - నాకేమి కొదువలేదే


మా మామ కంసుకుండు - ఈ వేళ - నన్ను చంపగ వచ్చినా

మా మామ నాచేతనూ - మరణమై - పొయేది నిజము సుమ్మూ

వచ్చు వేళాయెననుచూ - నా తల్లి - వసుదేవు పిలువనంపూ


గోపెమ్మ బిడ్డ నిపుడూ - శీఘ్రముగ - తెచ్చి నీవుంచవమ్మా

అంతలో వసుదేవుడూ - బాలుణ్ణి - తలమీద ఎత్తుకొనెనూ

రేపల్లె వాడలోనూ - గోపెమ్మ - ఇంటనూ వచ్చె నపుడూ

గోపెమ్మ పుత్రినపుడూ - వసుదేవు - భుజముపై నెక్కించుకూ


అతి త్వరితముగ వచ్చెనూ - దేవకి - హస్తముల నుంచె నపుడు

దేవకికి - తనయు డపుడూ - పుట్టెనని - కంసునకు కబురాయెను

ఝల్లుమని గుండెలదర - కంసుండు - పీఠంబు దుమికె నపుడూ

జాతకంబులు చూచెనూ - గండంబు - తగిలెనని కంసుకుండు


చంద్రాయుధము దూసుకా - శీఘ్రముగ - దేవకి వద్దకొచ్చె

తెమ్మని సుతునడిగెనూ - దేవకి - అన్నదీ అన్నతోనూ

మగవాడు కాదురన్నా - ఈ పిల్ల - ఆడపిల్ల నమ్మరా

ఉపవాసములు నోములూ - నోచి యీ - పుత్రికను గంటినన్నా


పుత్రి దానము చేయరా - నాయన్న - పుణ్యవంతుడవురన్నా

దేవాదిదేవులైన - బ్రహ్మ రు - ద్రాదులకు పూజచేసి

పూజ ఫలముచేతనూ - వారి కృప - వల్ల పుత్రికను గంటీ

నీ పుణ్యమాయెరన్నా - నీవు పు - త్రికను దయచేయుమన్నా


నిర్దయాత్మకుడవగుచు - నీవిట్లు - చేయుట తగదు రన్నా

ప్రేమతో చెల్లెలపుడు - అన్నను - చెయిపట్టి బ్రతిమాలెనూ

గంగాది నదులయందూ - పుత్ర దా - నము చేయమని వేడెనూ

కాదుకాదని కంసుడూ - దేవకి - పుత్రికను అడిగె నపుడు


అడ్డాలపై బాలనూ - పుచ్చుకొని - ఎగరేశి నరకబోయె

అంబరమునకు ఎగురగా - వేయనపు - డా బాల కంసు జూచి

నన్నేల చంపెదవురా - నీ యబ్బ - రేపల్లె వాడలోను

పెరుగుతున్నాడు వినరా - కృష్ణావ - తారమై జన్మించెనూ


నిజముగా దోచెనపుడూ - కంసుడు - యేతెంచి పవళించెనూ

రేపల్లె వాడలోనూ - పెరుగుచు - న్నాడనీ దిగులొందెను

నీ యబ్బ నీ తాతరా - కంసుడా - కృష్ణుండు పుట్టెననుచూ

చల్లమ్ము వారలెల్లా - ఆకబురు - చక్కగా చెప్పగాను


పూతకికి కబురాయెను - అప్పుడా - పూతకి చనుదెంచెను

శృంగారముగ పూతకీ - స్తనములకు - విషధార పూసుకొనెను

రేపల్లె వాడలందూ - కృష్ణుడు - తిరుగుచున్నా చోటుకూ

చనుదెంచి విషపుపాలూ - ఇవ్వగా - సమకట్టి ఇవ్వగానూ


బాలురతో బంతులాడ - కృష్ణుని - బాలరందరు కొట్టగా

కావుకావున ఏడ్చుచు - పరుగెత్తి - వీధి నడుమను నిలచెనూ

ప్రేమ కృష్ణుణ్ణి చూచీ - పూతకి - ప్రియముతో బుజ్జగించి

నా యన్న వూరుకోర - నా తండ్రి - పాలు యిచ్చెదను రార


మూడు గుక్కలు పీల్చగా - పూతకి - భూమిపై కొరిగి పడగా

గోపెమ్మ జూచి అపుడూ - బంగారు - గిన్నెలో బువ్వపెట్టి

ప్రొద్దున్న వుగ్గుపోసి - కృష్ణుణ్ణి - ఒడిలోను పండవేసె[1]

అంతలో కంసహితుడూ - బండిరూ - పై - యెదురుగావచ్చెనూ


పాదములు రెండు పిడుగు - లావలే - దడదడా విసిరెనపుడూ

వృషభమై వచ్చి నిలువ - ఒక్కలఘు - వున చంపివేసెనపుడూ

చల్లమ్ము వారలెల్లా - ఈ కబురు - చల్లగా చెప్పిరపుడు

రేపల్లె వాడలోను - ఉన్నట్టి - గోపికలు గుంపుగూడి


మాయిళ్ళ కొచ్చునమ్మా - కృష్ణుడు - మమురవ్వ చేసునమ్మా

తాళలేమమ్మ మేము - నీ సుతుడు - తాలిమితో వుండడమ్మా

ఇకనైన బుద్ధిచెప్పీ - ఇంతిరో - పదిలమ్ము సేయుమమ్మా"

అనుచునూ గట్టిగాను - మనమంత - గోపెమ్మ కడకుబోయి


చెప్పుదామనుచు వారు - గోపెమ్మ - చెంతకేగగ నప్పుడు

గోపాలకృష్ణు డపుడూ - అచటనే - పాలుత్రాగుచు నుండెనూ

ఇదియేమి యాశ్చర్యమే - ఓ చెలియ - ఇదియేమి చోద్యమమ్మ

కనుపాపలను దీసునే - కృష్ణుడు - దొంగతనములు చేసునే


ఇకనేమి చేసునోను - మనము బులు - పాటమున వస్తిమమ్మా

అమ్మనే నెరుగనమ్మా - నాత్రోవ - నేబోవు చుండగాను

ననురవ్వ చేసిరమ్మా - నేనంత - భయపడీ వస్తినమ్మా

కొబ్బరి కుడకలనుచు - గోపికలు - గొబ్బున పిలువబోవ


కొబ్బరి కుడకలనుచు - గోపికలు - గుబ్బలను చూపినారు

పౌర్ణమి రోజులందు - జలజాక్షు - లందరూ కూడకోనీ

చీరలటు తీసివేసి - గోపికలు - జలకమాడుచు నుండగా

తీసివుంచిన చీరలు - కృష్ణుండు - వేసె ఆ పొన్నమీద


వేసియా వేణునాదం - వూదుచూ - వుండె నా మాధవుండూ

జలకమ్ము చాలించియూ - గోపికలు - మనచీర లేమాయెనే

నమ్మరాదే కృష్ణుని - ఇకను ఈ - చినగొల్లవాని నెపుడూ

ఎంతపని చేసెనమ్మా - ఓ చెలియ - ఏమి యాశ్చర్యమమ్మా


వెదకుచూ కొందరుండీ - నీళ్ళలో - మునిగియుండిరి కొందరూ

అప్పుడూ గోపికలలో - ఒకయింతి - తాజూచి శ్రీకృష్ణునీ

రారె ఓ అమ్మలార - ఈ పొన్న - మీదున్న శ్రీకృష్ణునీ

ఇవ్వరా మా చీరలూ - ఓ కృష్ణ - ఇవ్వరా మా రవికెలూ


దండంబు పెట్టెదమురా - కృష్ణయ్య - దయయుంచి దయచెయ్యరా

అందరూ ఒకచేతితో దండంబు - పెట్టగా చూచితాను

పొందుగా మీరందరూ - దండంబు - రెండుచేతుల బెట్టరే

ఎంతపని వచ్చెననుచూ - గోపికలు - మానభంగము నొందిరీ


వసుదేవ తనయునకునూ - దండంబు - రెండుచేతుల బెట్టిరీ

పొందుగా వలువలన్నీ - కృష్ణుండు - పేరుపేరున ఇచ్చెను

నాయత్త తిట్టునేమో - యనుచు నొక - రొకరితో వగచిరపుడూ

మాయాడు బిడ్డ యిపుడూ - కొట్టునో - నా బావ దండించునో

నా మగడు బ్రతుకనీడు- ఓయమ్మా నీనేమి చేతునమ్మా


కస్తూరి రంగరంగా - నాయన్న కావేటిరంగరంగా

శ్రీరంగ రంగరంగా నినుబాసి - యెట్లునే మరచుందురా



కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏

23, ఆగస్టు 2021, సోమవారం

సుత్తుల్లో పలు రకములు 🔨🔨


ఒకడు ఠంగు ఠంగుమని గడియారం గంట కొట్టినట్లు సుత్తేస్తాడు. . 

హ హ హ. దాన్ని ' ఇనప సుత్తి ' అంటారు. 

అంటే ' ఐరన్ హేమరింగ్ 'అన్నమాట. 


ఇంకోడు సుత్తేస్తున్నట్లు తెలియకుండా మెత్తగా వేస్తాడు-

రబ్బరు సుత్తి. అంటే ' రబ్బర్ హేమరింగ్ ' అన్నమాట.


ఇంకోడు ప్రజలందరికీ కలిపి సామూహికంగా సుత్తేస్తాడు -

'సామూహిక సుత్తి ' దీన్నే 'మాస్ హేమరింగ్' అంటారన్నమాట. 

అంటే రాజకీయ నాయకుల మీటింగులూ ఉపన్యాసాలు ఈ టైపు. 


పోతే ఇంకో టైపుంది. 

ఎవరైనా  నీకు సుత్తేద్దామని వచ్చారనుకో, నువ్వు తిరిగి వాళ్ళకి  సుత్తేశాననుకో- 

అహ, ఉత్తినే అనుకుందాం. 

దాన్నే ఎదురు సుత్తి అంటారు. అంటే ' రివర్స్ హేమరింగ్ ' అన్నమాట. 


ఇలా చెప్పుకుంటూ పోతే, నాది సుదీర్ఘ సుత్తి అవుతుంది...................

అంటే ' ప్రొలాంగ్డ్ హేమరింగ్ 'అన్నమాట. 

17, ఆగస్టు 2021, మంగళవారం

శ్రీ కనకవల్లికి సిరుల మా తల్లికిి

శ్రీకనకవల్లికి సిరుల మా తల్లికి సౌభాగ్యవతికిదే జయమంగళం|

చక్కని మోమునకు శ్రీకాంత శోభితకు శ్రీమహాలక్ష్మికి శుభమంగళం||

                                                                 |శ్రీకనకవల్లికి|

ఘల్లు ఘల్లున గజ్జె లందెలు మ్రోగేటి పాదపద్మములకు ఇదే మంగళం|

కనకధారలతోడ గాజుల సవ్వడితో హస్త కమలంబులకు ఇదే మంగళం|

                                                                                      |శ్రీకనకవల్లికి|

కరుణా కటాక్ష వీక్షణంతో చూసేటి అరవిందలోచనకు జయమంగళం|

సకల శుభ కళలతో అలరాలుచున్న మా పద్మనాభ ప్రియకు ఇదె మంగళం|

                                                                                                  |శ్రీకనకవల్లికి|

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకియగు జయ జగజ్జననికిదె మంగళం|

కోరినదే తడవుగా వరములిచ్చే తల్లి హరి పట్టపురాణికిదె మంగళం|

                                                |శ్రీకనకవల్లికి|






9, ఆగస్టు 2021, సోమవారం

శనగలమాసం


"ఇవ్వాళ శనగలు సాతాళించొద్దమ్మా.. మాటోళీ చేసుకుందాం. లేకపొతే

వడలేసినా సరే.." 

అమ్మా, నేను  పేరంటానికి వెళ్ళడానికి సిద్ధపడుతుండగానే

రాబోయే శనగలని ఏం చేయాలో నిర్ణయించేశాను నేను. 

శనగలతో బోల్డన్ని వంటకాలు చేసుకోవచ్చు కదా మరి. 

"మాటోళీ ఏవిటి మాటోళీ? పాటోళీ అనాలి. 

వెనకటికి నీలాంటిదే 

చదువుకి ముందు కాకరకాయ్, చదువయ్యాక కీకరకాయ్ అందిట 

" అమ్మ  ఏమో అనేదే కానీ నాన్న  నన్ను రక్షించేశారు "

అది  సరిగ్గానే చెప్పింది  లేవే.. నువ్వు 

చేసేదాన్ని మాటోళీ అనే అనాలి..."


అమ్మా మాట తిరగెయ్యబోయింది...

కానీ అప్పుడే గేటు దాటి లోపలికి వస్తున్న ఆడవాళ్ళని చూసి ఆగిపోయింది. 

పట్టు చీరలు కట్టుకుని, బోల్డన్ని నగలు పెట్టుకుని వచ్చారు వాళ్ళు.

మరి పేరంటానికి వెళ్ళాలంటే అలాగే తయారవ్వాలి కదా. 

అమ్మ, నేను కూడా తయారైపోయం . 

అసలు శ్రావణ మాసం వస్తుందనగానే

నాకు ఉన్న రెండు పట్టు పరికినిలు రవణమ్మకి 

వేసేస్తుంది అమ్మ, ఓ వంద జాగ్రత్తలు చెప్పి. 

పేరంటానికి పట్టు పరికినిలే కట్టుకుని వెళ్లాలని అమ్మ సిద్ధాంతం. 


పేరంటం అంటే అమ్మా ఎంత బాగా తయారవుతుందో. 

అప్పటికే ముస్తాబులై  వచ్చిన స్నేహితురాళ్ళు 

"ఆలీసం అయిపోతోంది.. తొరగా వచ్చేయండి.." 

అని తొందర పెట్టగానే.....

అమ్మా, నేను  పేరంటానికి బయలుదేరతాము అన్న మాట .


  శ్రావణ మంగళవారం అంటే కనీసం అరడజను పేరంటాలు తప్పకుండా 

ఉంటాయి ఊళ్ళో. 

ఇవి కాకుండా ఇంటికొచ్చి వాయినం ఇచ్చేవాళ్ళు సరేసరి. 

ఇంటినిండా వద్దంటే శనగలు. 

సాతాళింపు, వంకాయి-శనగల కూర, శనగ వడలు, పాటోళీ...

నెలంతా ఇవే వంటకాలు మాకు. 

 అసలు ఈ పేరంటానికి వెళ్ళడం ఓ పెద్ద ప్రహసనం. మధ్యాహ్నం 

పేరంటానికి పొద్దున్న నుంచీ  హడావిడి. 

మధ్యాహ్నం కాఫీలవ్వగానే బయలుదేరతారా, 

మళ్ళీ దీపాలు పెట్టే వేళకి ఇళ్ళు చేరేవాళ్ళు. 


మామూలుగా అయితే మగ పిల్లలకి పేరంటాల్లో ప్రవేశం లేదు.. 

మరి మా తమ్ముడు కి  ఎలా   దొరికిందంటే.. 

బోల్డు బోల్డు శనగలు పట్టుకుని ఒక్కసారే

 ఇంటికి రావడం అమ్మకీ, నాకు  కష్టం కదా

 అందుకని మా తమ్ముడు ప్రతి పేరంటానికీ వచ్చి  

శనగలు ఇంటికి చేరేసే వాడన్న మాట.


 మా తమ్ముడు అలా  పేరంటాలకి వెళ్ళడం బామ్మకి నచ్చేది కాదు. 

"వీడెందుకూ పోతు పేరంటాల్లా.." అనేది కానీ, 

వాడెప్పుడు  పట్టించుకునే వాడు  కాదు.  

అమ్మ తమ్ముడిని  వద్దు అనేది కాదు కానీ బోల్డన్ని జాగ్రత్తలు చెప్పేది.

 ముఖ్యంగా ఎవరు మాట్లాడుతున్నా

 మధ్యలో వచ్చి తన  అభిప్రాయాలు చెప్పొద్దని మరీ మరీ చెప్పేది. 

 అలా పిలవని పేరంటంలా మాట్లాడకూడదుట కదా, అందుకన్న మాట. 


పేరంటం శనగల్లో వేసే కొబ్బరి ముక్కలు ఎంత బాగుంటాయో. 

శనగలు ఇంటికి తెచ్చినప్పుడల్లా నేను,తమ్ముడు కొన్ని కొబ్బరి ముక్కలు నోట్లో 

వేసుకుని (అన్నీ తీసేసుకుంటే అమ్మకి అనుమానంవస్తుంది)

దేవుడి గూట్లో నైవేద్యం కోసం పెట్టిన బెల్లం ముక్కలు

 కూడా బుగ్గన వేసుకుంటూ ఉండేవాళ్ళం . 

అలా నోట్లోనే కొబ్బరి లౌజు తయారు చేసుకునే ఏర్పాటు ఉండేది.

 ఒక్కోసారి  శనగలు మరీ ఎక్కువ వస్తే అమ్మ కొన్నింటిని ఆవుకి పెట్టేసేది.

 "పాడు చేసుకునే కన్నా, దూడకి పెడితే పుణ్యం" అంటూ.


 అసలు పేరంటంలో ఎన్నేసి విషయాలు మాట్లాడుకుంటారంటే.. 

కొత్తగా చేయించుకున్న నగల మొదలు,

 టీవీలో వచ్చే నాటకాల వరకూ దొర్లని టాపిక్ ఉండదు. 

పిల్లల చదువులు, పక్కింటి వాళ్ళతో గొడవలు..ఇవన్నీవినిపిస్తూ ఉండేవి.  

ఎవరైనా పేరంటానికి రాకపోతే వాళ్ళ గురించి కొంచం 

ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళు. 


 ఇప్పుడెక్కడా అలాంటి సందడి  కనిపించడం లేదు.. 

కొన్నాళ్ళు పోతే "ఒకప్పుడిలా పేరంటాలు జరిగేవి" అని చెబితే నమ్మరేమో కూడా..