"ఇవ్వాళ శనగలు సాతాళించొద్దమ్మా.. మాటోళీ చేసుకుందాం. లేకపొతే
వడలేసినా సరే.."
అమ్మా, నేను పేరంటానికి వెళ్ళడానికి సిద్ధపడుతుండగానే
రాబోయే శనగలని ఏం చేయాలో నిర్ణయించేశాను నేను.
శనగలతో బోల్డన్ని వంటకాలు చేసుకోవచ్చు కదా మరి.
"మాటోళీ ఏవిటి మాటోళీ? పాటోళీ అనాలి.
వెనకటికి నీలాంటిదే ,
చదువుకి ముందు కాకరకాయ్, చదువయ్యాక కీకరకాయ్ అందిట
" అమ్మ ఏమో అనేదే కానీ నాన్న నన్ను రక్షించేశారు "
అది సరిగ్గానే చెప్పింది లేవే.. నువ్వు
చేసేదాన్ని మాటోళీ అనే అనాలి..."
అమ్మా మాట తిరగెయ్యబోయింది...
కానీ అప్పుడే గేటు దాటి లోపలికి వస్తున్న ఆడవాళ్ళని చూసి ఆగిపోయింది.
పట్టు చీరలు కట్టుకుని, బోల్డన్ని నగలు పెట్టుకుని వచ్చారు వాళ్ళు.
మరి పేరంటానికి వెళ్ళాలంటే అలాగే తయారవ్వాలి కదా.
అమ్మ, నేను కూడా తయారైపోయం .
అసలు శ్రావణ మాసం వస్తుందనగానే
నాకు ఉన్న రెండు పట్టు పరికినిలు రవణమ్మకి
వేసేస్తుంది అమ్మ, ఓ వంద జాగ్రత్తలు చెప్పి.
పేరంటానికి పట్టు పరికినిలే కట్టుకుని వెళ్లాలని అమ్మ సిద్ధాంతం.
పేరంటం అంటే అమ్మా ఎంత బాగా తయారవుతుందో.
అప్పటికే ముస్తాబులై వచ్చిన స్నేహితురాళ్ళు
"ఆలీసం అయిపోతోంది.. తొరగా వచ్చేయండి.."
అని తొందర పెట్టగానే.....
అమ్మా, నేను పేరంటానికి బయలుదేరతాము అన్న మాట .
శ్రావణ మంగళవారం అంటే కనీసం అరడజను పేరంటాలు తప్పకుండా
ఉంటాయి ఊళ్ళో.
ఇవి కాకుండా ఇంటికొచ్చి వాయినం ఇచ్చేవాళ్ళు సరేసరి.
ఇంటినిండా వద్దంటే శనగలు.
సాతాళింపు, వంకాయి-శనగల కూర, శనగ వడలు, పాటోళీ...
నెలంతా ఇవే వంటకాలు మాకు.
అసలు ఈ పేరంటానికి వెళ్ళడం ఓ పెద్ద ప్రహసనం. మధ్యాహ్నం
పేరంటానికి పొద్దున్న నుంచీ హడావిడి.
మధ్యాహ్నం కాఫీలవ్వగానే బయలుదేరతారా,
మళ్ళీ దీపాలు పెట్టే వేళకి ఇళ్ళు చేరేవాళ్ళు.
మామూలుగా అయితే మగ పిల్లలకి పేరంటాల్లో ప్రవేశం లేదు..
మరి మా తమ్ముడు కి ఎలా దొరికిందంటే..
బోల్డు బోల్డు శనగలు పట్టుకుని ఒక్కసారే
ఇంటికి రావడం అమ్మకీ, నాకు కష్టం కదా
అందుకని మా తమ్ముడు ప్రతి పేరంటానికీ వచ్చి
శనగలు ఇంటికి చేరేసే వాడన్న మాట.
మా తమ్ముడు అలా పేరంటాలకి వెళ్ళడం బామ్మకి నచ్చేది కాదు.
"వీడెందుకూ పోతు పేరంటాల్లా.." అనేది కానీ,
వాడెప్పుడు పట్టించుకునే వాడు కాదు.
అమ్మ తమ్ముడిని వద్దు అనేది కాదు కానీ బోల్డన్ని జాగ్రత్తలు చెప్పేది.
ముఖ్యంగా ఎవరు మాట్లాడుతున్నా
మధ్యలో వచ్చి తన అభిప్రాయాలు చెప్పొద్దని మరీ మరీ చెప్పేది.
అలా పిలవని పేరంటంలా మాట్లాడకూడదుట కదా, అందుకన్న మాట.
పేరంటం శనగల్లో వేసే కొబ్బరి ముక్కలు ఎంత బాగుంటాయో.
శనగలు ఇంటికి తెచ్చినప్పుడల్లా నేను,తమ్ముడు కొన్ని కొబ్బరి ముక్కలు నోట్లో
వేసుకుని (అన్నీ తీసేసుకుంటే అమ్మకి అనుమానంవస్తుంది)
దేవుడి గూట్లో నైవేద్యం కోసం పెట్టిన బెల్లం ముక్కలు
కూడా బుగ్గన వేసుకుంటూ ఉండేవాళ్ళం .
అలా నోట్లోనే కొబ్బరి లౌజు తయారు చేసుకునే ఏర్పాటు ఉండేది.
ఒక్కోసారి శనగలు మరీ ఎక్కువ వస్తే అమ్మ కొన్నింటిని ఆవుకి పెట్టేసేది.
"పాడు చేసుకునే కన్నా, దూడకి పెడితే పుణ్యం" అంటూ.
అసలు పేరంటంలో ఎన్నేసి విషయాలు మాట్లాడుకుంటారంటే..
కొత్తగా చేయించుకున్న నగల మొదలు,
టీవీలో వచ్చే నాటకాల వరకూ దొర్లని టాపిక్ ఉండదు.
పిల్లల చదువులు, పక్కింటి వాళ్ళతో గొడవలు..ఇవన్నీవినిపిస్తూ ఉండేవి.
ఎవరైనా పేరంటానికి రాకపోతే వాళ్ళ గురించి కొంచం
ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళు.
ఇప్పుడెక్కడా అలాంటి సందడి కనిపించడం లేదు..
కొన్నాళ్ళు పోతే "ఒకప్పుడిలా పేరంటాలు జరిగేవి" అని చెబితే నమ్మరేమో కూడా..