Pages

31, డిసెంబర్ 2024, మంగళవారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు

 

              నిన్నకాక మొన్ననే గోడలకి కేలండర్లు తగిలించినట్టు, అందుకున్న డైరీలు ఒక చోట సర్దినట్టూ ఉంది.. అప్పుడే వాటిని మార్చేసే రోజు వచ్చేసింది. 

             గోడ మీదికి చేరేందుకు కొత్త కేలండర్ తహతహలాడుతోంది.. డైరీలు రావడం మొదలయ్యింది.  చూస్తుండగానే ఒక సంవత్సరం పూర్తయిపోయి, కొత్త సంవత్సరం వచ్చేస్తోంది.


         న్యూ ఇయర్ రిజల్యూషన్స్ చేసుకోవడం, నెలన్నా గడవక ముందే వాటిని మర్చిపోవడం చాలా సార్లు జరిగాక, చాలా ఏళ్ళ క్రితమే ఇంక రిజల్యూషన్స్ చేసుకోకూడదనే రిజల్యూషన్ చేసుకుని దానిని మాత్రం విజయవంతంగా అమలు చేస్తున్నాను. 😉😉😉

            వ్యక్తి గత జీవితం ఎప్పటిలాగే సాగింది.. కొన్ని విజయాలు, మరి కొన్ని ఓటములు.. ఒత్తిళ్ళు, చికాకులు, మధ్య మధ్యలో మెరిసి మాయమయ్యే చిన్న చిన్న సంతోషాలు.. ఎప్పుడూ సంతోషాన్నే కోరుకోడం మన స్వార్ధం.. తను ఇవ్వదల్చుకున్న వాటిని మాత్రమే ఇవ్వడం కాలం చేసే మాయాజాలం. అన్నీ మనం అనుకున్నట్టే జరిగిపోతే ప్రపంచం తలకిందులైపోదూ??


      'తలచుకుంటే కానిదేముంది?' 'ఏదీ మన చేతుల్లో లేదు..' అనే ద్వంద్వ భావాల మధ్య కాలం కరిగిపోయింది.. బహుశా జీవితపు నడక ఇలాగే ఉంటుందేమో.. వెళ్ళిపోతున్న సంవత్సరానికి వీడ్కోలు చెప్పి, కొత్తగా వస్తున్న సంవత్సరానికి స్వాగతం చెప్పాలి. మనం చెప్పక పోయినంతమాత్రాన కొత్త సంవత్సరం రాక మానదు. కానీ వస్తున్న అతిధిని ఆహ్వానించాలి.


      జరగాల్సింది జగరక మానదన్న వేదాంతాన్ని కాసేపు పక్కన పెట్టి కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని కోరుకుందాం. ఇంటా, బయటా ఉన్న సమస్యలు ఒక్కొక్కటీ పరిష్కారమైపోతాయని ఆశిద్దాం.. నూతన సంవత్సరాన్ని మనస్పూర్తిగా ఆహ్వానిద్దాం..  

నూతన సంవత్సర శుభాకాంక్షలు.


17, డిసెంబర్ 2024, మంగళవారం

గడచిన కాలం..గోడకు సున్నం


కాలం…చానా చిత్రమైనది.....
నన్ను సరిగ్గా ఉపయోగించుకోవడం నీ వల్ల కాదోయి అని ఎప్పుడూ మనకు సవాలు విసురుతుంది.
ఈ సవాలులో చాలా మందిది ఎప్పుడూ ఓటమే......
జీవితంలో ఏ సమయం ఎలా గడపాలో అలా గడపము…
అదే సమయం గడచిపోయిన తరవాత దాని గురించి భాధపడతాము.

చిన్నప్పుడు కారు బొమ్మలతో ఆడుకోవాలని చాలా ఆశగా ఉండేది.
నా స్నేహితుడి మామయ్య ఎక్కడ నుండో వానికి కారు బొమ్మలు తెచ్చాడు.
ఆ కార్లు పట్టుకొని కొద్దిగా వెనక్కి లాగితే..జుయ్య్య్ మని ముందరికి దూసుకెళ్ళేది.
ఆ కార్లను వాడు తప్ప ఎవ్వరినీ తాకనిచ్చే వాడు కాదు. అది చూసినప్పట్టి నుండి నాకు ఆ కార్లు కావాలని విపరీతమైన ఆశ, కానీ తల్లి తండ్రులతో కొనివ్వమని అడగాలని తెలియదు.కానీ లోపల వాటితో ఆడుకోవాలన్న ఆశ మాత్రం ఉండేది.  ఎవరైనా కారు బొమ్మలతో ఆడుకొంటూంటే చాలా అసూయగా ఉండేది. నా వయసు పెరిగే కొద్దీ ఆ కోరిక నాలోనే సమాధి అయిపోయింది.

ఈ మధ్యే మా పాపకి బొమ్మలు తేవడానికి ఒక షాపింగ్ మాల్ వెళ్ళాను.ఎన్ని రకాల బొమ్మలో…అన్నీ ఆటోమేటెడే …. ఆడేటివి ..పాడేటివి..పరిగెత్తేవి..గెంతేవి..ఎగిరేవి…చిత్రమైన చేష్టలు చేసేవి చాలా ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత…ఎప్పుడో సమాధైపోయిన ఆ కారు కోరిక మళ్ళీ గుర్తొచ్చింది. 

ఏమి లాభం…ఇప్పటికే ఒక జీవితకాలం లేటైపోయింది. ఇప్పుడు అలాంటి కార్లు వెయ్యి కొనగల్ను..కానీ అదే ఆనందం పొందుతానన్న నమ్మకం నాకు లేదు. ఏ వయసులో కోరిక ఆ వయసులో తీరిపోతేనే అనందం. ఎవరికైనా ఇది చాలా చిన్న విషయంగా సిల్లీగా అనిపించవచ్చు…కానీ చాలా దుఃఖం వేసింది. కోరికున్నప్పుడు కార్లు లేవు….కార్లున్నప్పుడు కోరిక లేదు. 

అలాగే ఇంకా ఎవేవో కోరికలుండేటివి..వర్షంలో నీటి గుంటలలో దూకాలని..ఇసుకలో పొర్లాడాలని..తూనిగల్ని పట్టుకోవాని..మా ఇంట్లో ఉన్న నీటి తొట్టే లో మునకెలెయ్యాలని…. ఇప్పుడు నేను గుంటల్లో దూక గలనా? ఇసుకలో పొర్లగలనా? అలా చేస్తే..బ్యాక్టీర్యా చే ఇన్ఫెక్షన్ వస్తుంది …జబ్బు చేస్తుంది అన్నంతగా విఙ్ఞానం సంపాదించాను మరి, ఎలా చెయ్యగలను? ఒక వేళ చేస్తే..నన్నో మెంటల్ కేసుగా ముద్రెయ్యటం ఖాయం.

   ఏది ఏమైనా…కాలాన్ని సద్వినియోగపరచుకుని..సదా ఆనందంగా ఉండే వారు ధన్య జీవులు.




12, డిసెంబర్ 2024, గురువారం

మామిడి తాండ్ర - భీషణ ప్రతిజ్ఞ

 ఆ వేసవి మధ్యాహ్నం నేను, మా అన్నయ్య డాబా మెట్ల మీద కూర్చుని ఉన్నాం. మా ఎదురుంగా నోరూరించే నూజివీడు రసాలు నాలుగు. మా ఇద్దరి మొహాలు ఎర్రగా ఉన్నాయి. అవి పగతో ప్రతీకారంతో రగిలిపోతున్న మా మనస్సులను ప్రతిబింబిస్తున్నాయి. దానికి కారణం క్రితం రోజు సాయంత్రం డాబా మీద మాకు జరిగిన అవమానమే..

ఓ పద్దెనిమిది గంటలు వెనక్కి వెళ్తే..


సెలవులకని మా పక్కింటి పండు గాడింటికి వాళ్ళ బాబాయి వాళ్ళు ఏల రావలె?

వచ్చితిరిపో ఉత్త చేతులతో రాక మామిడి తాండ్రను ఏల తేవలె?

తెచ్చితిరిపో వాడు డాబా పైకి వచ్చి మేము చూస్తుండగా, మాకు పెట్టకుండా ఏల తినవలె?

తినెనుపో మమ్మల్ని చూసి ఊరూరుట్ట అని ఏల అనవలె?


                 అహో ఇది భరించలేని అవమానం, అది తట్టుకోలేని మా చిన్ని హృదయాలు ఏ నిముషంలో ఐనా బద్దలయ్యే అగ్ని పర్వతాల్లా కుతకుతమంటున్నాయి..అప్పుడే ప్రతిజ్ఞ చేసుకున్నాము..ఎలా ఐనా మామిడి తాండ్రను తయారు చేసి, పండు గాడి తాండ్ర అయిపోయే దాకా ఆగి, అప్పుడు మా తాండ్రను తీసి వాడ్ని ఊరిస్తూ తినాలని..


              ఆ రోజు రాత్రి నూటముప్పయ్యోసారి నాన్నగారికి మరుసటిరోజు పొద్దున్న మామిడిపండ్లు తేవాలని గుర్తు చేసి పడుకున్నాం. ఆ రాత్రంతా తాండ్రను గురించిన కలలే!! మేము కష్టపడి చేసిన తాండ్రను పండు గాడు దొంగతనంగా తినేసినట్టు నాకు కల వస్తే, వాడి తాండ్రను మేము దొంగలించి తెచ్చినట్టు అన్నయ్యకు కల వచ్చింది. పొద్దున్న కోడి కూయక ముందే నిద్ర లేచి నాన్నగారిని లేపి అప్పటికి బజారు తెరవరని ఆయన చెబుతున్నా వినకుండా సంచీ చేతికిచ్చి ఆయన్ను పంపించి, నాన్నారు కోసం ఎదురు చూస్తూ వీధి గుమ్మానికి చెరో వైపు కూర్చున్నాం.


                              మనం ఎదురు చూస్తున్నప్పుడే కాలం పగబట్టిన దానిలా మరింత మెల్లిగా సాగుతుంది. అప్పటికీ అన్నయ్య లోపలికి వెళ్ళి మా గడియారంలో చిన్న ముల్లును రెండంకెలు ముందుకు జరిపాడు కూడా. అయిన ఫలితం లేకపోయింది. మా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నాన్న గారు రెండు సంచులతో వీధిలోకి అడుగుపెట్టారు.. మేము పరిగేట్టుకుని వెళ్ళి ఆయన్ను అక్కడే ఆపి, సంచీలు దించి, మాకు కావలసినవి అందులో ఉన్నాయని రూఢి చేసుకున్నాక ఇంటికి రానిచ్చాం. ఇంటికి రాగానే పండ్ల మీదకు పడబోయేసరికి అమ్మ ఆపి, భోజనం చేసాకే ఏదైనా అని, మా ఉత్సాహానికి బ్రేకులు వేసింది. పైకి తన్నుకొస్తున్న కోపంతో కూడిన కన్నీళ్ళను లోపలికి నెట్టి, పండ్లకేసి ఆశగా చూస్తూ, వంట ఎప్పుడౌతుందా అని చకోర పక్షుల్లా ఎదురు చూస్తూ కూర్చున్నాం. వంట అయీ అవ్వడంతోనే కంచాలు తెచ్చేసుకుని అమ్మ ఏది పెడితే అది గబగబా తినేసి ఒలంపిక్స్ లో గెలుచుకున్న బంగారు పతకం పట్టుకున్నంత అపురూపంగా మామిడి పండ్లను పట్టుకుని మెట్ల మీదకు చేరాము..


                             అవే ఇప్పుడు మా కళ్ళ ముందున్నాయి. ఆ రసాలను చూస్తూనే అమాంతంగా నోట్లో వేసుకుని గుటుక్కుమనిపించాలని బలంగా అనిపిస్తున్నా మా ప్రతిజ్ఞను ఒకరికి ఒకరం గుర్తు చేసుకుంటూ బలవంతం మీద నిగ్రహించుకున్నాం. మామిడి పండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కావలసినవి ఏంటి? అవి దొరికాక తాండ్రను ఎలా చేయాలి..అవి మా ముందున్న ప్రశ్నలు..కాని మా అన్నయ్య ఉన్నాడే!! తనకు తెలియంది లేదు (అని అనుకునేదాన్ని అప్పట్లో). ఏది చెప్పినా అది నిజం, అదే నిజం, అది మాత్రమే నిజం అనుకునేలా చెప్తాడు. అప్పట్లో వచ్చే బూస్ట్ ఏడ్ చూపించి సునీల్ గవాస్కర్ కొడుకు సచిన్ టెండుల్కర్ అని చెప్పాడు. అదే నిజమని చాలా కాలం నమ్మాను కూడా. అది పక్కన పెడితే కర్తవ్యం తెలియక కంగారు పడుతున్న నా భుజం మీద చెయ్యి వేసి, 'పిచ్చిదానా ఎంటీవోడంతటి అన్నయ్య నీకుండగా నీకేల బెంగ ' అన్నట్లు ఒక నవ్వు నవ్వి, 'నాకు తాండ్ర ఎలా చేయాలో తెల్సు. ఏముంది ముందు మామిడి పండ్ల రసం తీసి, దాన్లో ఒక కేజీ ఓ పది కేజీలో పంచదార పోసి మిక్సీలో పావుగంట తిప్పి కంచంలో ఆరబోసి ఎండలో నాలుగు రోజులు పెడితే నోట్లో వెన్నలా కరిగిపోయే తాండ్ర రెడీ' అని నాకు ధైర్యం చెప్పాడు.


                      మరుసటి రోజు అమ్మానాన్న బైటకి వెళ్ళేదాక గోతి కాడ నక్కల్లా ఎదురుచూసి, వాళ్ళు వెళ్ళడమేమిటి మా ప్రయోగం మొదలుపెట్టాం. మిక్సీ చేసాక పళ్ళెంలో ఆ రసాన్ని పోసి, దాని వైపు ఆశగా చూస్తూ 'మామిడి వంటి పండుయు..' అని అశువుగా కవిత్వం చెప్పబోతూంటే 'తాండ్ర వంటి స్వీటుయు..' అని అన్నయ్య అందుకున్నాడు. ఆ పళ్ళాన్ని మేడ మీద ఎండబెట్టి దాన్నే చూస్తూ కూర్చున్నాం. మాలో ఏ ఒక్కరు మంచి నీళ్ళ కోసమో, మరో దాని కోసమో కిందకు దిగినా తక్కిన వాళ్ళు వెంట వెళ్ళాల్సిందే, ఈలోగా ఇంకొకరు ఎక్కడ దాన్ని గుటకాయం స్వాహః చేస్తారేమో అన్న భయంతో. రాత్రుళ్ళు మాకు మాత్రమే తెలిసిన రహస్య ప్రదేశాల్లో దాస్తూ, పొద్దున్న రెప్ప వేయకుండా కాపలాలు కాస్తూ నాలుగు రోజులు గడిపాం. నాలుగో రోజు 'ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి..' అని పాడుకుంటూ మా స్వహస్తాలతో చేసుకున్న ఆ అమృతాన్ని మా మధ్యలో ఉంచుకుని ఒకొక్క ముక్క నోట్లో వేసుకున్నాం. వెంటనే ఒకరి మొహంలోకి ఒకరం చూసుకున్నాం, మా మొహాల్లో రంగులు మారాయి. కాజాలో మాగాయి ముక్క పెట్టుకుని దాన్ని సాస్ లో ముంచుకుని తింటే ఎలా ఉంటుందో దాని కన్నా అధ్వానంగా ఉంది మా వంటకం. ఎంతైనా మేము చేసుకున్నది కదా, పారెయ్యడానికి చేతులు రాక మరో రెండు ముక్కలు నోట్లో వేసుకోవడానికి ప్రయత్నించాం. ఊహు! వల్ల కాలేదు. గుడ్ల నీరు కక్కుకుంటూ మా అమృతాన్ని, మా పంచదార గుళికను, మా వజ్రాల తునకను కాలువలో జారవిడిచాం. ఆ తర్వాత కరువు తీరా ఏడ్చి, అమ్మ రాకముందే మొహాలు కడుకున్ని కూర్చున్నాం. ఆ రాత్రి ఒకటే వాంతులు. 'ఏం తిన్నార్రా' అని అమ్మ అడిగితే నోరు మెదిపితేనా. ఎలా చెప్తాం! తేలు కుట్టిన దొంగలం కదా!!