Pages

27, ఏప్రిల్ 2022, బుధవారం

లౌక్యం

లౌక్యము అంటే ఏమిటి? 

మోసానికీ, లౌక్యానికీ భేదాలేమిటి? ..
అదేమిటో కానీ ఈ ప్రశ్నలకి ఎప్పుడూ సంతృప్తికరమైన సమాధానం దొరకదు.


అవతలి వాళ్ళని నొప్పించకుండా,
మనకి కావాల్సిన విధంగా వాళ్ళని ఒప్పించడం లౌక్యం అనిపించుకుంటుందా? 

లౌక్యంలో యెంతో కొంత మోసం ఇమిడి ఉందా? 

 అబద్ధం చెప్పక పోవడానికీ, నిజం చెప్పకుండా ఉండడానికీ ఉన్న భేదం లాంటిదే ఏదన్నా మోసానికీ, లౌక్యానికీ మధ్యన ఉందా? ఇవన్నీ ఎడతెగని ప్రశ్నలు. 


"ఫలానా ఆయన చాలా లౌక్యుడు" అని ఎవరన్నా చెప్పినప్పుడు,
 సదరు వ్యక్తితో వ్యవహరించాల్సి వచ్చినప్పుడు యెంతో కొంత జాగ్రత్త పడిపోతాం కదా.. 

అయినప్పటికీ ఆయన మనకి తెలియకుండానే మనల్ని తన బుట్టలో వేసేసుకున్నప్పుడు, 

ఆ విషయం తర్వాతెప్పుడో మనకి తెలిసినప్పుడు ఆయన లౌక్యం ముందు మన జాగ్రత్త ఎందుకూ పనికి రాలేదు కదా అనిపించక మానదు. 

అలాంటప్పుడు సదరు లౌక్యాన్ని తెలియకుండానే అభినందించేస్తాం. 


నలుగురు మనుషులు కలిసిన ప్రతి చోటా రాజకీయం పుడుతుందని కదా నానుడి..

నిజానికి రాజకీయం కన్నా ముందు లౌక్యం పుడుతుంది. అసలు లౌక్యం ముదిరితే రాజకీయం అవుతుంది అనడానికి కూడా అవకాశం ఉందేమో.. 

 కొంచం పరిశోధనలు జరగాలిక్కడ. 

 

లౌక్యంగా బతికితే సౌఖ్యాలు పొందవచ్చా? వచ్చుననే అంటాడు దివాకరం. 

అదేనండీ, వంశీ 'ఏప్రిల్ 1 విడుదల' లో కథానాయకుడు. 

చుక్కలు తెమ్మన్నా కోసుకు తెచ్చేస్తానని భువనేశ్వరికి మాటిచ్చేశాడా?
ఆవిడేమో చుక్కలొద్దు, నువ్వు నెల్లాళ్ళ పాటు కేవలం నిజాలు మాత్రమే మాట్లాడు చాలు అనేసరికి ఎక్కిళ్ళు మొదలవుతాయి మనవాడికి.

 అప్పటివరకూ చూపించిన లౌక్యాలన్నీ వరుసగా ఎదురు దెబ్బ కొట్టడం మొదలైపోతుంది. సౌఖ్యాలన్నీ అట్టే పోయి కష్టాలు మొదలైపోతాయి. 


దివాకరాన్నీ చూడగానే ఒకటే సామెత గుర్తొస్తుంది. 'తాడిని తన్నేవాడుంటే వాడి తల దన్నేవాడు మరొకడు ఉంటాడు' అని.

 కానైతే ఆ వెంటే మరో ప్రశ్నా సర్రున దూసుకుని వచ్చేస్తుంది. అస్సలు లౌక్యం అనేదే చూపించకుండా బతకడం సాధ్యమా? అని. 

 నిస్సందేహంగా దీనికి జవాబు 'కాదు' అనే చెప్పాలి. కానైతే దేనికన్నా ఓ పరిమితి అన్నది ఉంటుందని గుర్తుపెట్టుకోవడం కూడా అవసరమే మరి. 

 ఇంతకీ లౌక్యము అంటే ఎదుటి వాళ్ళని మరీ ఎక్కువ మోసం చేయకుండా మనక్కావాల్సింది సాధించుకోడమేనా???

19, ఏప్రిల్ 2022, మంగళవారం

ఫోను కష్టాలు

 ఫోను కష్టాలు...........

ఇది అష్టకష్టాల జాబితాలో లేని కష్టం. 

అష్టకష్టాల లెక్క రాసిన రోజుల్లో లేని కష్టం. 

ఎందుకంటే ఫోనున్న ప్రతి ఒక్కరికీ ఏదో సమయంలో ఎదురయ్యే సమస్యే ఇది. 

రెండు వారాల క్రితం నా సెల్ ఫోన్ పాడయింది. 

నిజానికి ఇది చాలా ఆనందంగా ప్రకటించాల్సిన విషయం. 

కాని ఇక్కడ రెండు సమస్యలు.
ఆ ఫోన్ వయసు కేవలం ఆరు నెలలు.
రెండో సమస్య ఏమిటంటే ఇరవై నాలుగంటల్లో ఫోన్ లేకుండా ఒక్క గంట కూడా గడవని పరిస్థితి.

సెల్ ఫోన్ నిత్యావసర వస్తువుగా మారిన నాటినుంచీ నేను ఎంచుకున్తున్నది బేసిక్ మోడల్ హ్యాండ్ సెట్ నే.
స్నేహితులంతా రకరకాల ఫీచర్లున్న ఫోన్లు వాడుతుంటే "కుక్క పని కుక్క, గాడిద పని గాడిద, ఫోన్పని ఫోన్ చేయాలి" అని వాదించిన రోజులున్నాయి.

ఐతే ఎప్పుడూ ఒకేలా గడిస్తే కాలం గొప్పదనం ఏముంది?
ఓ బలహీన క్షణంలో ఫోన్ గురించి నా అభిప్రాయం మార్చుకున్నాను. 

ఇంకొకర్ని ఇబ్బంది పెట్టకుండా నచ్చిన పాటలు ఇయర్ ఫోన్స్ తో వినొచ్చు,
ఫోటోగ్రఫీ లో మన టాలెంట్ 'భంగిమా' అయినా ఫోనులో కెమెరా ఉంటె ఎప్పుడైనా ఫోటోలు తీయొచ్చు... ఇలా ఓ లిస్టు వేశాను.

వాడుతున్న ఫోన్ పనిచేయకపోవడం తో కొత్త ఫోన్ కొనాల్సిన సందర్భం రానే వచ్చింది. 

అప్పటికే ఓ నిర్ణయం తీసేసుకోవడంతో ఓ 'పెద్ద' పేరున్న షాపుకెళ్ళి కాసేపు రకరకాల సెట్లు చూసి ఒకటి ఎంపిక చేసేసుకున్నా.. ఫీచర్ల గురించి సేల్స్ వాళ్ళని కాసేపు విసిగించి బిల్లు కట్టేశాను. 

సరే.. కొన్నాళ్ళు బాగానే గడిచింది. నెమ్మదిగా ఫోన్ మెమరీ లో డాటా పెరుగుతోంది. 

మెమరీ పుణ్యమా అని ఓ పుస్తకంలో ఫోన్ నంబర్లు రాసుకునే అలవాటు కూడా మానేశా. 

డాటాని బ్యాకప్ తీసుకునే పనిని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చాను. 

ఎప్పుడో కొంప మునుగుతుందని నా సిక్స్త్ సెన్స్ పాపం అప్పుడప్పుడూ హెచ్చరిస్తూనే ఉంది. 'ఇదెంత..పది నిమిషాల పని..' అని ఎప్పటికప్పుడు దాని నోరు నొక్కేశాను.


ఆవేల్టి శుభ తిధి, నక్షత్రం గుర్తు లేవు కానీ ఒక రోజు ఉదయం నా ఫోన్ నోరు పడి పోయింది.
బిల్లులో అడ్రస్ చూసుకుని రిపేరు షాప్ కెళ్లా.
వాళ్ళు పదిహేను రోజుల తర్వాత రమ్మన్నారు.
 ఓ ఐదారు గంటలు ఫోన్ పనిచేయక పోయేసరికి మనుషులు నన్ను వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి వచ్చింది. (నేనెవరికీ బాకీలు లేనని మనవి చేసుకుంటున్నాను) అన్నాళ్ళ ఫోన్ వియోగం కుదరని పని అని అర్ధమై ఓ ఫ్రెండు దగ్గర స్పేర్ లో ఉన్న ఫోన్ తాత్కాలికంగా తీసుకున్నాను. అది మొదలు 'ఈ ఫోన్ కి ఏమైనా ఐతే..' అన్న భయమే.


నంబర్లన్నీ పోవడం మరో సమస్య. ఇదివరకేవరైనా 'మీ నెంబర్ మిస్ ఐంది.. ఫోన్ మార్చాను..' అంటే అప నమ్మకంగా చూసేదానిని .  నిజంగా మీకు ఆసక్తి ఉంటే అలా పోగొట్టుకుంటారా? అన్నట్టు.  ఇప్పుడు అదే వివరణ నేను ఇవ్వాల్సి రావడం, అందరూ నా గురించి అలాగే అనుకుంటున్నారేమో అని సదేహం.  ఇదో రకం కష్టం. ఇలా కథ సాగుతుండగా ఇవాల్టి ఉదయం ఫోన్ రిపేరు షాపు వాళ్ళు సంక్షిప్త సందేశం పంపారు.  రిపేర్ పూర్తయ్యింది, వచ్చి ఫోన్ తీసుకెళ్ళమని. ఫోన్ తీసుకోగానే చేసిన మొదటి పని.  ఫ్రెండు ఫోన్ తిరిగి అప్పచెప్పడం. ఫోన్ భద్రంగా ఇచ్చేస్తున్నానన్న ఆనందంలో పువ్వుల్లో పెట్టి ఇవ్వడం మర్చిపోయాను.


ఫోన్ మెమరీ లో ఒక్క నంబరూ, ఒక్క మెసేజీ లేక పోయినా నా ఫోను నాకు వచ్చేసిందన్న సంతోషం మిగిలింది. ....................


18, ఏప్రిల్ 2022, సోమవారం

మా అమ్మ పేపరు చదవటం.!

అమ్మ గొప్పతనాన్ని,
అమ్మతనం లోని విలువను మరోసారి గుర్తుకు తెచ్చిన చందమామ అలనాటి కథకు జోహార్లు.

ఆ అలనాటి అపురూప కథ పూర్తి పాఠాన్ని ఇక్కడ చదవండి.

మా అమ్మ పేపరు చదవటం

మా అమ్మ సాయంత్రం పూట పేపరు ఎలా చదువుతుందో ఎప్పుడైనా చూశారూ? ఏ సంగతి మరిచినా అమ్మ పేపరు చదవడం మాత్రం మరవదు. పాపం, ఇంటిపనంతా ముగించుకుని అమ్మ హాల్లోకి వచ్చేసరికి పేపరు పేజీలన్నీ ఒక్క చోటున ఉండవు. నాలుగు వేపులా నాలుగు కాగితాలూ ఇంట్లో పడి ఉంటాయి. మేడమీద అన్నయ్య చదివి అక్కడే పారేసిన మొదటి పేజీ, అక్కయ్య చదివిన మధ్యపేజీ, ఇవన్నీ ఏరుకుని వచ్చి అమ్మ పడుకుని చదవడానికని ఆసక్తితో పరుపుమీదకు వెళుతుంది.

అమ్మకప్పుడు జ్ఞాపకమొస్తుంంది. తన కళ్లద్దాలు మరచిపోయనట్లు. వాటికోసరం ఇల్లంతా వెతుకుతుంది. ఇటు అటు ఇల్లంతా ఒక పదిహేను నిమిషాలు గాలించిన తర్వాత అమ్మకు అప్పుడు జ్ఞాపకమొస్తుంది ఎక్కడుంచిందీ, ఎలాగో కళ్లద్దాల పెట్టె దొరుకుతుంది. కాని, అది తీసి చూసేసరికి అందులో కళ్లద్దాలు ఉండవు. మళ్లీ ఐదు నిమిషాలు గాలించుతే కళ్లద్దాలు దొరుకుతాయి. ఆఖరుకి పరుపు దగ్గిరికి వెళితే, పేపర్లు ఏవి! ఇక్కడే పెట్టానే అనుకుంటుంది.

కొంత సేవు వెతికిన తర్వాత కళ్లద్దాల కోసం వెళ్లేముందు ఆ పేపర్లు తలగడ కిందనే పెట్టానని అప్పుడు జ్ఞాపకమొస్తుంది. ఇన్ని బాధలు పడి. ఎలాగో పేపరు చదవడానికి మొదలు పెడుతుంది. ఒక్క ఘడియ చదువుతుందో లేదో చేతిలో పేపరూ, ముక్కుమీద కళ్లద్దాలూ పెట్టుకుని హాయిగా నిద్రపోతుంది.

ఇంతలో మానాన్న వస్తారు. మమ్మల్ని అందరినీ పిలిచి, ఒక్కసారిలా వచ్చి చూడండి, అంటారు ఆ దృశ్యం చూసేసరికి మాకు నవ్వాగదు. ఇంతకూ అసలా పేపరు ఆ రోజుదే కాదు. నిన్నటిదో, మొన్నటిదో తారీకు చూడకుండానే అమ్మ అంత ఆసక్తితో పాత పేపర్లే చదివేస్తూ ఉంటుంది.

అన్నిటికంటే ముఖ్యమైన విష యం ఏమిటంటే, ఆ మర్నాడు అమ్మ మాతో పేపర్లో ఉండే వింతలూ, విశేషాలూ, వార్తలూ చక్కా పూసగుచ్చినట్లు చెపుతుంది. మరి ఎలా చెప్పగలుగుతుంమదో ఏమో..!

14, ఏప్రిల్ 2022, గురువారం

మనసు బాగోనప్పుడు...

 

మనసు బాగోకపోవడం అన్నది అందరికీ ఏదో ఒక సమయంలో వచ్చే సమస్య. 
బాగుండక పోడానికి ఒక్కోసారి కారణాలు ఉంటాయి. 
చాలా సార్లు ఉండవు.. కొన్ని సార్లు కారణాలు ఉన్నా మనకి వెంటనే తోచవు. 

పాడైన మనసుకు సాధ్యమైనంత తొందరగా మరమ్మతు చేయకపోతే ఫలితాలు దారుణంగా ఉంటాయన్నది స్వానుభవం. మరి ఈ మరమ్మతు చేయడం ఎలా?


నావరకైతే చాలా ఉన్నాయి.

ఏకాంతంగా గడపడం, పాటలు వినడం(అప్పుడప్పుడు పాడటం ), సినిమా చూడడం, పుస్తకాలు చదవడం, గతంలో జరిగిన మంచి విషయాలు జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం, కుటుంబ సభ్యులతోనో మనసుకు దగ్గరగా ఉండే స్నేహితులతోనో మాట్లాడడం.. ఇలా ఏదో ఒకటి చేసి మామూలై పోయేందుకు ప్రయత్నిస్తూ ఉంటాను.


ఏకాంతంగా గడపడం వల్ల మన చిరాకుని మరొకరి మీద చూపించ కుండా తప్పించుకోవచ్చు. దానితో పాటు సమస్య గురించి కొంచం జాగ్రత్తగా ఆలోచించి పరిష్కారం వెతుక్కోడానికీ కృషి చేయచ్చు.  ఒంటరిగా ఉండలేకపోయినప్పుడు ఇష్టమైన పాటల్ని తోడు తెచ్చుకోవచ్చు. టీనో కాఫీనో తాగుతూ నచ్చిన పాటల్ని వింటుంటే మూడ్ సగం బాగుపడుతుంది.


మూడ్ బాగోనప్పుడు సినిమా చూడడంలో ఓ చిన్న రిస్కు ఉంది. సినిమా బాగుంటే మూడ్ బాగుపడడానికి ఎంత ఛాన్స్ ఉందో, సినిమా చెత్త ఐతే మూడ్ మరింతగా దిగజారే ప్రమాదమూ ఉంది.  ఇలాంటప్పుడు చూడడానికి నేను ఓసారి చూసి బాగుంది అనుకున్న సినిమాలనే ప్రిఫర్ చేస్తాను.


పుస్తకాలూ అంతే.. అసలు ఇలాంటప్పుడు చదవడానికి నవలల కన్నా కథలు బాగుంటాయి. కుటుంబ సభ్యులతో, మిత్రులతో మాట్లాడడం అన్నది అవతలి వాళ్ళ మూడ్ మీద ఆధారపడి ఉంటుంది. పరిస్తితులు అనుకూలంగా లేనప్పుడు మనం మౌనంగా ఉండడమే ఉత్తమమన్నది నా అనుభవం. 


విచిత్రం ఏమిటంటే కొన్ని సార్లు వీటిలో ఏపనీ చేయబుద్ధి కాదు.

 కాసేపు నిద్రపోయే ప్రయత్నం చేస్తూ ఉంటా.. 😴😴
ఇది చాల ఉత్తమమైన పద్దతి అని నా అభిప్రాయం ...