మార్పు అన్నది ఓ నిశ్శబ్ద పరిణామం..మన పని మనం చేసుకుంటూ పోతే, మనకు తెలియకుండానే మన జీవితాల్లో ఈ మార్పు ప్రవేశించేస్తూ ఉంటుంది.ఏ విషయంలోనూ మనం నిన్నలా మొన్నలా ఉండం.. ఉండడం సాధ్యపడదు కూడా. ఉదాహరణకి డబ్బు ఖర్చు పెట్టడం అనే విషయాన్నే తీసుకోండి. ఒకప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు వచ్చేసిందో.. 'ఆచి తూచి ఖర్చు పెట్టడం' అన్నది ఒకప్పుడు అలిఖిత నియమంగా ఉండేది. పిల్లలూ, పెద్దలూ అందరూ పాటించేవాళ్ళు. నిజానికి అప్పట్లో పిల్లలకి తమ చేత్తో ఖర్చు పెట్టే అవకాశమే ఉండేది కాదు. డబ్బు దాచుకున్న వాడు గొప్పవాడు అప్పట్లో.
మరి ఇప్పుడో? ఎవరెంత ఎక్కువగా ఖర్చు చేస్తే వాళ్ళంత గొప్పవాళ్ళు. దాచుకోవడం కన్నా ఖర్చు పెట్టడమే మిన్న అన్నది మనకి తెలియకుండానే ప్రవేశించిన సాంస్కృతిక విప్లవం. కాన్వెంట్ పిల్లల కనీస పాకెట్ మనీ యాభై నుంచి వంద రూపాయలిప్పుడు.. ఇంక కాలేజీ పిల్లలకైతే డబ్బివ్వడం, లెక్ఖలు చూడడం లాంటి తతంగం ఏమీ లేదు. ఓ క్రెడిట్ కార్డో, డెబిట్ కార్డో తీసివ్వడం, అకౌంట్లో క్రమం తప్పకుండా బాలన్స్ ఉండేలా చూసుకుంటూ ఉండడం. కేవలం పిల్లలేనా? పెద్దవాళ్ళకి మాత్రం, ఏమీ తోచకపోతే గుర్తొచ్చే మొదటి పని షాపింగ్. ఏ ప్రత్యేక సందర్భం వచ్చినా చేసే మొదటి పని కూడా షాపింగే..
ఈ షాపింగ్ కి ప్రస్తుతం ఉన్న, రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణకి నిదర్శనం కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు.. మన చుట్టూ పెరుగుతున్న షాపింగ్ మాల్స్ ని గమనిస్తే చాలు.. ఆ మాల్స్ ప్రకటనల మీద వచ్చిస్తున్న మొత్తాన్ని లెక్కకట్టినా చాలు. అవసరానికి తగ్గట్టుగా కొనుక్కోవడం స్థానంలో, ముందుగా కొని తర్వాత ఉపయోగించడాన్ని గురించి ఆలోచించడం అన్న కాన్సెప్ట్ చాలా వేగంగా మన జీవితాల్లోకి చొచ్చుకుని వచ్చేసింది. ఫలితం, "మా ఇంట్లో కేవలం పనికొచ్చే వస్తువులు మాత్రమే ఉన్నాయి" అని ఎవరూ కూడా గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పలేని పరిస్థితి.
రాను రాను, సేవింగ్స్ గురించి మాట్లాడడం కూడా అవుట్ డేటెడ్ అయిపోతోంది. ఒక్క మార్చి నెలలో ఇన్కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు మినహా, మిగిలిన సందర్భాలలో ఎక్కడా ఎప్పుడూ సేవింగ్స్ ప్రస్తావన రావడం లేదు. షేర్ మార్కెట్, మూచ్యువల్ ఫండ్ కబుర్లు మాత్రం అక్కడక్కడా వినిపిస్తున్నాయి.. షేర్స్ ని స్థిరమైన సేవింగ్స్ అనగలమా? ఇలా ఎందుకు జరుగుతోంది? ఈ సంస్కృతికి ఎక్కడి నుంచి వచ్చింది? కొద్దిగా ఆలోచిస్తే దొరికిన సమాధానం, వారం ఐదు రోజులూ కష్టపడి సంపాదించిన మొత్తాన్ని వారాంతం రెండు రోజులూ పూర్తిగా ఖర్చు చేసేసి కొత్త వారాన్ని తాజాగా మొదలు పెట్టడం అన్నది అమెరికన్ సంస్కృతి. దీనిని మనం అరువు తెచ్చుకోలేదు.. తనే వచ్చి మనతో కలిసిపోయింది.
జరుగుతున్న ఈ పరిణామం మంచికా, చెడుకా అన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. ఎందుకంటే ఇది కాలం మాత్రమే జవాబు చెప్పగలిగే ప్రశ్న. 'చీమ-మిడత' కథ వింటూ పెరిగిన తరాలకి ఈ పోకడ ఓ పట్టాన అర్ధం కాకపోవచ్చు. అర్ధమయ్యి ఆందోళన కలిగించనూవచ్చు.. కానైతే, రోజురోజుకీ విశ్వరూపం దాలుస్తున్న ఈ ఖర్చు సంస్కృతిని నిలువరించడం ఏ ఒక్కరి వల్లనో జరిగే పని కాదు.
ఇంతకీ మార్చి వచ్చింది ఇన్కం ట్యాక్స్ రిటర్న్స్ గురించి ఆలో చించారా .......అదే అండి సేవింగ్స్ గురించి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి