Pages

28, మార్చి 2022, సోమవారం

సూర్యని మేలుకొలుపులు


శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ


శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ


పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ

పొన్న పువ్వు మీద పొగడపువ్వు ఛాయ  ||2||   ||శ్రీ సూర్యనారాయణ మేలుకో||


ఉదయిస్తూ భానుడు ఉల్లీపువ్వు ఛాయ

ఉల్లీపువ్వుమీద ఉగ్రాంపు పొడిఛాయ ||2|| ||శ్రీ సూర్యనారాయణ మేలుకో||



గడియొక్కి భానుడు కంబపువ్వు ఛాయ

కంబపువ్వు మీద కాకారీ పూఛాయ  ||2|| ||శ్రీ సూర్యనారాయణ మేలుకో||


జామెక్కి భానుడు జాజిపువ్వు ఛాయ

జాజిపువ్వు మీద సంపంగి పూఛాయ  ||2|| ||శ్రీ సూర్యనారాయణ మేలుకో||


మధ్యాహ్న భానుడు మల్లేపువ్వు ఛాయ

మల్లేపువ్వు మీద మంకెన్న పూఛాయ ||2|| ||శ్రీ సూర్యనారాయణ మేలుకో||



మూడుజ్జాముల భానుడు ములగపువ్వు ఛాయ

ములగపువ్వు మీద ముత్యంపు పొడిఛాయ ||2|| ||శ్రీ సూర్యనారాయణ మేలుకో||



అస్తమాన భానుడు ఆవపువ్వు ఛాయ

ఆవపువ్వు మీద అద్దంపు పొడిఛాయ ||2|| ||శ్రీ సూర్యనారాయణ మేలుకో||



వాలుతూ భానుడు వంగపువ్వు ఛాయ

వంగపువ్వు మీద వజ్రంపు పొడిఛాయ ||2|| ||శ్రీ సూర్యనారాయణ మేలుకో||


గుంకుతూ భానుడు గుమ్మడి పూఛాయ

గుమ్మడీపువ్వు మీద కుంకంపు పొడిఛాయ ||2|| ||శ్రీ సూర్యనారాయణ మేలుకో||


శ్రీ సూర్యనారాయణ మేలుకో

హరిసూర్యనారాయణ


🙏🙏🙏🙏🙏🙏

11, మార్చి 2022, శుక్రవారం

అనవసరపు ఖర్చు...


                     మార్పు అన్నది ఓ నిశ్శబ్ద పరిణామం..మన పని మనం చేసుకుంటూ పోతే, మనకు తెలియకుండానే మన జీవితాల్లో ఈ మార్పు ప్రవేశించేస్తూ ఉంటుంది.ఏ విషయంలోనూ మనం నిన్నలా మొన్నలా ఉండం.. ఉండడం సాధ్యపడదు కూడా. ఉదాహరణకి డబ్బు ఖర్చు పెట్టడం అనే విషయాన్నే తీసుకోండి. ఒకప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు వచ్చేసిందో.. 'ఆచి తూచి ఖర్చు పెట్టడం' అన్నది ఒకప్పుడు అలిఖిత నియమంగా ఉండేది. పిల్లలూ, పెద్దలూ అందరూ పాటించేవాళ్ళు. నిజానికి అప్పట్లో పిల్లలకి తమ చేత్తో ఖర్చు పెట్టే అవకాశమే ఉండేది కాదు. డబ్బు దాచుకున్న వాడు గొప్పవాడు అప్పట్లో. 


                    మరి ఇప్పుడో? ఎవరెంత ఎక్కువగా ఖర్చు చేస్తే వాళ్ళంత గొప్పవాళ్ళు. దాచుకోవడం కన్నా ఖర్చు పెట్టడమే మిన్న అన్నది మనకి తెలియకుండానే ప్రవేశించిన సాంస్కృతిక విప్లవం.  కాన్వెంట్ పిల్లల కనీస పాకెట్ మనీ యాభై నుంచి వంద రూపాయలిప్పుడు..  ఇంక కాలేజీ పిల్లలకైతే డబ్బివ్వడం, లెక్ఖలు చూడడం లాంటి తతంగం ఏమీ లేదు. ఓ క్రెడిట్ కార్డో, డెబిట్ కార్డో తీసివ్వడం, అకౌంట్లో క్రమం తప్పకుండా బాలన్స్ ఉండేలా చూసుకుంటూ ఉండడం.  కేవలం పిల్లలేనా? పెద్దవాళ్ళకి మాత్రం, ఏమీ తోచకపోతే గుర్తొచ్చే మొదటి పని షాపింగ్. ఏ ప్రత్యేక సందర్భం వచ్చినా చేసే మొదటి పని కూడా షాపింగే.. 


                     ఈ షాపింగ్ కి ప్రస్తుతం ఉన్న, రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణకి నిదర్శనం కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు.. మన చుట్టూ పెరుగుతున్న షాపింగ్ మాల్స్ ని గమనిస్తే చాలు.. ఆ మాల్స్ ప్రకటనల మీద వచ్చిస్తున్న మొత్తాన్ని లెక్కకట్టినా చాలు.  అవసరానికి తగ్గట్టుగా కొనుక్కోవడం స్థానంలో, ముందుగా కొని తర్వాత ఉపయోగించడాన్ని గురించి ఆలోచించడం అన్న కాన్సెప్ట్ చాలా వేగంగా మన జీవితాల్లోకి చొచ్చుకుని వచ్చేసింది.  ఫలితం, "మా ఇంట్లో కేవలం పనికొచ్చే వస్తువులు మాత్రమే ఉన్నాయి" అని ఎవరూ కూడా గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పలేని పరిస్థితి. 

           రాను రాను, సేవింగ్స్ గురించి మాట్లాడడం కూడా అవుట్ డేటెడ్ అయిపోతోంది. ఒక్క మార్చి నెలలో ఇన్కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు మినహా, మిగిలిన సందర్భాలలో ఎక్కడా ఎప్పుడూ సేవింగ్స్ ప్రస్తావన రావడం లేదు. షేర్ మార్కెట్, మూచ్యువల్ ఫండ్ కబుర్లు మాత్రం అక్కడక్కడా వినిపిస్తున్నాయి.. షేర్స్ ని స్థిరమైన సేవింగ్స్ అనగలమా? ఇలా ఎందుకు జరుగుతోంది? ఈ సంస్కృతికి ఎక్కడి నుంచి వచ్చింది? కొద్దిగా ఆలోచిస్తే దొరికిన సమాధానం, వారం ఐదు రోజులూ కష్టపడి సంపాదించిన మొత్తాన్ని వారాంతం రెండు రోజులూ పూర్తిగా ఖర్చు చేసేసి కొత్త వారాన్ని తాజాగా మొదలు పెట్టడం అన్నది అమెరికన్ సంస్కృతి. దీనిని మనం అరువు తెచ్చుకోలేదు.. తనే వచ్చి మనతో కలిసిపోయింది. 


జరుగుతున్న ఈ పరిణామం మంచికా, చెడుకా అన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. ఎందుకంటే ఇది కాలం మాత్రమే జవాబు చెప్పగలిగే ప్రశ్న. 'చీమ-మిడత' కథ వింటూ పెరిగిన తరాలకి ఈ పోకడ ఓ పట్టాన అర్ధం కాకపోవచ్చు. అర్ధమయ్యి ఆందోళన కలిగించనూవచ్చు.. కానైతే, రోజురోజుకీ విశ్వరూపం దాలుస్తున్న ఈ ఖర్చు సంస్కృతిని నిలువరించడం ఏ ఒక్కరి వల్లనో జరిగే పని కాదు. 

ఇంతకీ మార్చి వచ్చింది ఇన్కం ట్యాక్స్ రిటర్న్స్ గురించి ఆలో చించారా .......అదే అండి సేవింగ్స్ గురించి 

3, మార్చి 2022, గురువారం

పాటలతో - పాట్లు

టైటిల్ కొంచం కన్ఫ్యూజింగ్ గా ఉంది కదూ.. 

పాటలతో పాట్లేమిటన్నదే కదా ప్రశ్న? 

నేను పాడితే వినే వాళ్లకి పాట్లు అని కొందరైనా ఊహించేసి ఉంటారు. 

కానీ అది పచ్చి అబద్ధమని నిరూపించడానికే ఈ టపా.

ఈ పాటలున్నాయి చూశారూ, ఇవి ఏదో సందర్భంలో తిప్పలు పెట్టేస్తూ ఉంటాయి.

పాపం వాటి తప్పేమీ లేదు. కానీ అలా అంటే తప్పు మనదే అని ఒప్పేసుకోవాల్సి వస్తుంది కదా.. అంతపని చేయలేం కాబట్టి, ష్.. గప్ చుప్.. 😶😶


సీరియస్ గా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటామా? 

ఏదో ఒక పాట గుర్తొచ్చి, అది ఏ సినిమాలోదో వివరం గుర్తురాదు. 

పాట మధ్యలో ఓ లైనో రెండు లైన్లో గుర్తొస్తాయి కానీ ఎంత గింజుకున్నా పల్లవి గుర్తుకురాదు. ఒకవేళ ఇవన్నీ గుర్తొచ్చినా.....
గీత రచన ఆచార్య ఆత్రేయా లేక సముద్రాలా?
అనో వేటూరా లేక సిరివెన్నెలా? 
ఆ పాటకి గాత్ర దానం చేసింది ఎవరు ?

అనో మరో డౌటు పట్టి పీడించడం మొదలుపెడుతుంది.

ఇవన్నీ కాకపొతే, అచ్చంగా ఇలాంటి ట్యూన్లోనే ఇంకేదో పాట విన్నాం, అదేమిటబ్బా? అన్న సందేహం.

కొంచం సంగీత జ్ఞానం ఉన్న వాళ్ళకి ఐతే ఏ రాగం, ఏ తాళం, ఎవరు రచించారు అని ఎన్నో ప్రశ్నలు .


వినడానికి ఇవన్నీ సిల్లీ సమస్యల్లా కనిపిస్తాయి కానీ, అనుభవించే వాళ్లకి తెలుస్తుంది ఇందులో ఉన్న కష్టం. 

మొన్నామధ్యన  మహా సీరియస్ గా, పదో తరగతి పరిక్ష రాసినంత శ్రద్ధగా మెయిల్ రాస్తున్నానా? ఒక ఫ్లో లో రాస్తూ రాస్తూ 

 "యదుకుమారుడే లేని వేళలో...వెతలు రగిలెనే రాధ గుండెలో" పాట బిగినింగ్ వెంటనే గుర్తు రావడం లేదు అని నిజాయితీగా ఒప్పేసుకున్నా.. 

 ఇంక, అక్కడినుంచి చూడాలి, నా జ్ఞాపకశక్తి మీద సందేహాలు, పరిక్షలు. 


ఈ లైన్లతో వచ్చిన చిక్కేమిటంటే.. ఏదో పాటలో ఒకటో రెండో లైన్లు పదే పదే బుర్రలో గింగిరాలు తిరుగుతూ ఉంటాయి.. అచ్చంగా అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డులాగా.

 అసలు ఈబాధలు పడలేక పాటలు వినడం మానేస్తే ఎలా ఉంటుందీ అన్న ఆలోచన కూడా కానీ, "ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకుంటామా?" అని నా అంతరాత్మ కొంచం నిష్టూరంగా ప్రశ్నించింది. 

ఈసమస్యకి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి, తప్పదు అనుకుని పుస్తకాల్లోలాగా గాఠిగా ఊపిరి పీల్చాను.


నాకు తోచిన పరిష్కారాలలో మొదటిది:
                ఇలా జరగడానికి కారణం, నాలో అందరి ఎదుటా పాడాలన్న కోరిక బలంగా ఉండి ఉండొచ్చు. 
అది తీర్చుకుంటే ఈ సమస్య తీరిపోవచ్చు. అయితే ఇందులో ఓ చిక్కుంది. అసలే "జీవహింస మహాపాపం" లాంటి పాఠాలు చదువుకుంటూ పెరిగి పెద్దైన దానిని . ఇంతటి హింసకి ఎలా పాల్పడను?


 ఇక రెండోది:
             బహుశా గత జన్మలో నేనో గో..ప్ప సంగీత విద్వాంసురాలిని  అయి ఉండొచ్చు.
 కాబట్టి ఆ వాసనల వల్ల ఇలా జరుగుతూ ఉండొచ్చు. నేను ఏదన్నా టీవీ ఛానల్ కి వెళ్తే, వాళ్ళు నన్ను నా గతజన్మలోకి తీసుకెళ్ళే వీలుంది. 

 

         అయితే ఇక్కడున్న చిక్కేమిటంటే, జీవితం బాగా కాంప్లికేటెడ్ అయిపోతుంది. నా గతజన్మ తెలిసిపోతే, రాయల్టీ కోసం మ్యూజిక్ కంపెనీల చుట్టూ తిరగాలి కదా మరి. అదీ కాకుండా వారసులతో సమస్యలూ అవీ కూడా వచ్చేస్తాయి, తప్పదు.  అందువల్ల ఈ రహస్యం తెలుసుకోకుండా ఉండడమే మంచిది.

 

 చివరాఖరిగా తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, నేనిలాగే ప్రోసీడయిపోతే, కొన్నాళ్ళకి ఈ అలవాటు దానంతట అదైనా పోతుంది....లేదా నాకూ, నా చుట్టూ వాళ్ళకీ అలవాటన్నా అయిపోతుంది. అప్పటివరకూ ఈ పాట్లు తప్పవు మరి.