Pages

11, ఫిబ్రవరి 2022, శుక్రవారం

కేశంతో క్లేశం!

   ప్రకృతి తన పని తాను చేసుకుంటూ పోయిన కాలంలో,
మనిషికి జుట్టు  తెల్లబడడం అన్నది ఒక సమస్యగా ఉండేది కాదనుకుంటాను.

 ముసలితనంతో బాటే, ఆ ముసలితనానికి సూచనగా మాత్రమే రావడమూ, పెద్దరికానికి గుర్తుగా గౌరవంగా ఉండడమూ అందుకు కారణం కావచ్చు. 

 అందుకే "తల పండడం" అంటే అనుభవంలోనో జ్ఞానంలోనో పరిపక్వత కలగడం అనే సదర్థంలో వాడేవారు. 

 ఈ కాలంలో పండిన తలబట్టి జ్ఞానాన్ని కాదు కదా కనీసం వయసునైనా అంచనా వెయ్యడవంతటి బుద్ధితక్కువ పని మరొకటి ఉండదు!

  పండితే పండింది కాని, తెల్లని కాంతులీనుతూ నిగనిగలాడే జుట్టు  మహా అందంగా ఉంటుంది. దాన్ని మన కవులు మరింత అందంగా వర్ణిస్తూ ఉంటారు.


తెల్లగా పండిన శబరి జుట్టుని విశ్వనాథ ముగ్గుబుట్టతో పోల్చారు. 

రాముడు శబరి ఇచ్చిన ఆతిధ్యాన్ని స్వీకరించి,
కుశల ప్రశ్నలు వేస్తూ, "అవ్వ! నీ తలంతా ముగ్గుబుట్టలా అయ్యిందేవిటీ?" అంటాడు.

దానికి శబరి, "ప్రభువ! నీ ఆత్మ వాకిట రంగవల్లి పెట్టడానికే ఇంతగా పండింది" అని జవాబిస్తుంది!

సగం సగం పండిన జుట్టుది మరో సొగసు. 

వ్యాసుడు కాశీమీద కోపంతో తన భిక్ష పాత్రని విసిరికొట్టినప్పుడు, అతనికి గడ్డిపెట్టడానికి పార్వతీదేవి ఒక ముత్తైదువు రూపంలో వస్తుంది. ఆ వచ్చే దేవిని శ్రీనాథుడు ఇలా వర్ణిస్తాడు:

"వేనలి పాటపాట నరవేండ్రుకతో తిల తండులాన్వయ

శ్రీ నటియింప..."

ఆమె వెండ్రుకలు బియ్యం నువ్వులూ కలబోసినట్లున్నాయిట!

 దేవతలకైతే ముసలితనం లేదు కాబట్టి వాళ్ళ జుట్టుప్పుడూ నల్లగానే ఉంటుంది (ఇందుకు దేవ మునులు, ఋషులు మినహాయింపు :-). 

 కానీ ఇక్కడ అమ్మవారు ముత్తైదువ రూపంలో వచ్చింది కాబట్టి ఆవిడ జుట్టుకూడా నెరిసిందన్నమాట!

పండు జుట్టు  గురించీ, పండే జుట్టు  గురించీ మన కావ్యాల్లో ఎలాంటెలాంటి వర్ణనలున్నాయో.


ఇంతకీ, ఇప్పుడీ కేశోపాఖ్యానం మొదలెట్టడానికి ప్రేరణ ఎమిటి అంటే ...
నేను ఈ  మధ్య ఒక సంగతి చదివాను 

ఒక  కవిగారు ఏకంగా ఒక కావ్యమే రాసారుట  !
దాని పేరు "పలిత కేశం". ఆ కవి దువ్వూరి రామిరెడ్డి. 

మొత్తానికి కుక్కపిల్లా, సబ్బుబిళ్ళే కాదు తెల్ల వెంట్రుక కూడా కవితకి అనర్హం కాదని ఈ కావ్యం నిరూపించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి