Pages

28, ఫిబ్రవరి 2025, శుక్రవారం

ఉత్తరానికో టపా

 


పూజ్యనీయులైన ఉత్తరం గారి పాదపద్మాలకు నమస్కారం...!!!

ఉభకుశలోపరి...!!!


చాల రోజుల తరవాత మీకు ఇలా ఉత్తరం రాయడానికి గల ముక్ష కారణం ...


నిన్న పుస్త కాలు సద్దు తుంటే నా స్నేహితురాలు రాసిన ఉత్తరాలు చదివాను ...

20 సంవత్సరాల క్రితం రాసిన ఉత్తరాలు ఇప్పుడు చదువుతుంటే ...

ఒక్క సారి కాలం వెనకకి వెల్లిపోయింది ..

ఎంత బాగుందో ... ఎన్నో జ్ణాపకాలు ,అనుభూతులు ....

రోజులు మల్లి రావు కానీ ....చదివినంత సేపు నేను రోజులకు వెళ్లి వచ్చాను ...


సెల్ టవర్ల దెబ్బకి పిచ్చుకలు మాయమైపోయినట్టు,

సెల్ ఫోన్ల దెబ్బకు తమరు ఎటు వెళ్లిపోయారో జాడ తెలియక అల్లాడుతున్నాం...


మీరున్నప్పుడే బాగుంది ఇక్కడ...

రాసేటప్పుడు చేతికి అబద్ధాలు వచ్చేవి కాదు...

ఇప్పుడన్నీ ఫోన్లో మాటలే కాబట్టి నోటికొచ్చిన అబద్ధాలు ఆడేస్తున్నాం...


'ఎక్కడున్నావ్' అంటే అమలాపురం లో ఉన్నా హైదరాబాద్ ఉన్నా' అని సిగ్గులేకుండా బొంకేస్తున్నాం...

ఈ నెట్ వర్క్లు మనుషుల్ని దగ్గర చేస్తాయంటే నమ్మి మిమ్మల్ని వదిలేసుకున్నాం...

కానీ ఇప్పుడు పక్కపక్కనే ఉన్నా మాట్లాడుకోకుండా, మెడలు వంచి ఫోన్లో తప్ప ముఖాముఖి మనసిప్పి మాట్లాడుకోవడం దాదాపు మానేసామ్...


దయచేసి మళ్ళోకసారి రండి ఉత్తరం గారు...!!!


మీరు లేకపోవడం వల్ల...


బామ్మ-తాతయ్యల ముసలి ప్రాణాలకు ఓదార్పునిచ్చే కుశల సమాచారం కరువైపోయింది...

భార్యాభర్తల వియోగం, విరహాల్లో ఉండే మాధుర్యం మాయమైపోయింది...

బిడ్డల క్షేమం అక్షరాల్లో చూసుకుని ఆప్యాయంగా చెమర్చే తల్లితండ్రుల కన్నీటి తడి ఆవిరైపోయింది...

ఉత్తరం కోసం వీధివాకిలి వైపు ఎదురుచూసి, రాగానే గబగబా చదివేసి, గుండెలు నింపుకుని, తిరిగి జాబు రాయడంలో ఉన్న ఆత్మ సంతృప్తి అడుగంటిపోయింది...


"అమ్మా... అన్నయ్య దగ్గర్నుంచి ఉత్తరం వచ్చిందే అని చెంగున గెంతి చెప్పే చెల్లాయిలకి కరువొచ్చింది...


"ఏమేవ్... అల్లుడు ఉత్తరం రాసాడు...అమ్మాయి నెల తప్పిందట" అని మురిసిపోయే కన్నవాళ్లు కనిపించడం లేదు...


మాటలు పెదాలనుండి తప్ప గుండెల్లో నుండి రావడం ఆగిపోయాయి...


ఈ ఉత్తరం కూడా నేను టైప్ చెయ్యడం వల్ల యధావిధిగా మనసులో ఉన్నదంతా చెప్పలేక, ఇంకా ఏదో ఆవేదన మిగిలిపోయి బాధపడుతున్నాను...!!!


సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా, ఉత్తరాల ఉనికిని కోరుకునే మీ అభిమానిని...!!!

13, ఫిబ్రవరి 2025, గురువారం

తిరిగి రాని రోజులు --- తిరుగు లేని రోజులు

  భలే మంచి రోజులులే


మా స్కూలంటే నాకిష్టం (ఎవరి స్కూలంటే ఎవరికిష్టముండదులెండి). నేను ఐదో తరగతికి వస్తూండగా మా ఈ స్కూల్లో చేరాను. పాత స్కూలు మానెయ్యడం వెనుక ఒక కథ ఉందండోయ్!


అవి నా నాలుగో తరగతి పరీక్షలు జరుగుతున్న రోజులు..నేను దించిన తల ఎత్తకుండా బర బరా రాస్తూ తెల్ల కాగితం రంగు మార్చడానికి ప్రయత్నిస్తున్నా.ఇంతలో నా వీపు మీద ఎవరో గోకినట్టయింది. వెనక్కి తిరిగి చూస్తే సుబ్బలక్ష్మి దీనాతి దీనమైన మొహమేసుకుని కాస్త కూడా రంగు మారని దాని తెల్ల కాగితాన్ని చూపించి దాని కరాబు చేయడంలో నా సహాయం కోరింది. నేను ఆలోచిస్తే ప్రతి పరీక్షకు వెళ్ళే ముందు నాన్నా గారు చెప్పే మాటలు గుర్తొచ్చాయి, "నీకు తెలిసింది నువ్వు రాయి, ఒకర్ని అడక్కు, ఒకరికి చూపకు, రెండూ తప్పే!". దానితో సహాయ నిరాకరణ ప్రకటించా. అది మా ఇన్విజిలేటర్ (మా ప్రైవేట్ టీచర్ కూడా)కు పిర్యాదు చేసింది. ఆవిడ వచ్చి 'ఒకే ప్రైవేట్లో చదువుతున్నారు, ఆ మాత్రం ఇచ్చి పుచ్చుకోకపోతే ఎలా' అని నన్నే మందలించింది. నా పేపర్ తీసుకుని సుబ్బులు చేతికిచ్చింది. అది విజయగర్వంతో నా పేపర్ ముందెట్టుకుని జిరాక్స్ కంపెనీ వాళ్ళు సిగ్గుపడేలా జిరాక్స్ దించడం మొదలుపెట్టింది. ఆ అవమానానికి నా చిన్ని హృదయం బద్దలైంది. ముక్కలు తాపీగా ఏరుకుందామని అప్పటికి అక్కడ్నుంచి నిష్క్రమించి ఆ ఆవేదనంతా మా నాన్న ముందు వెళ్ళగక్కా. ఆయన అంతకన్నా ఆవేశపడి నన్ను తక్షణం స్కూలు మానిపించారు.


సరే కొత్త స్కూళ్ళ వేటలో పడి ఒకరోజు నన్ను ఒక స్కూలుకు తీసుకువెళ్ళారు.( మా ఊరి లో ఉన్నవే నాలుగు స్కూల్)లు) తొలి చూపులోనే విపరీతంగా నచ్చేసింది ఆ స్కూలు. పేద్ద ఆటస్థలం, ఆటస్థలానికి ఎడంపక్క చాలా పెద్ద తోట, కుడి పక్కన వరసగా తరగతి గదులు, వెనక మామిడి చెట్టు, దానికి వేలాడుతున్న మామిడి కాయలు, ముందు వైపు ఒక స్టేజ్, దాని వెనక ప్రార్థనా మందిరం, దాని వెనక చింత చెట్టు. ఇప్పటికీ నాకు చాలా గుర్తు, ఆ రోజు కొత్త స్కూలు చూడడానికి వెళ్ళబోతున్నానని నాకు ఎంతో ఇష్టమైన తెల్ల గౌను, దాని మీద నల్ల కోటు వేసుకున్నా.


అలా మా స్కూల్లోకొచ్చి పడ్డా. ఆడుతూ పాడుతూ ఆరో తరగతికొచ్చా, అప్పట్లో మాకు ప్రతి శుక్రవారం సాయంత్రం అసెంబ్లీ ఉండేది అంటే స్కూలు పిల్లలంతా ఒక చోట సమావేశమయ్యేవాళ్ళం, చింత చెట్టు కింద. ఒక చింత చెట్టు కింద అంతమంది ఎలా కూర్చునే వాళ్ళు, అదేమైనా పుష్పక విమానమా అని సందేహమొచ్చిందా? వచ్చే ఉంటుందిలెండి, మా చింత చెట్టు అంత పెద్దది కాదు కాని మా స్కూలు పిల్లల సంఖ్య చాలా తక్కువ.


ఆ శుక్రవారపు సమావేశాల్లో విద్యార్థులంతా ఒక్కో విధంగా తమ తమ ప్రతిభలను పైకి తీసి తక్కిన విద్యార్థుల మీదకు వదులుతూ ఉంటారు. ఒక్కోసారి బాలమురళి, ఎం.ఎస్.సుబ్బలక్ష్మి చెట్టు మీద చేరిన పిట్టల్ని బెదరగొడుతుంటే, ఇంకోసారి మైకేల్ జాక్సన్, ఎల్.విజయలక్ష్మి అక్కడ ప్రత్యక్షమౌతూ ఉంటారు. మేము సాధారణంగా చెవులకు దూదులు, కళ్ళకు గంతలు సందర్భానుసారంగా పెట్టుకుని వెళ్ళి క్లాస్ లో టీచర్ డిస్టర్బ్ చేయగా మధ్యలో ఆగిపోయిన మా చర్చలను కొనసాగించేవాళ్ళం.


ఒకనాటి సాయంకాలం అలాగే అందరం చెట్టు కింద కూర్చుని ఎప్పటిలా మామూలుగా గడ్డి పీక్కుంటూ, దేశకాలమాన పరిస్థితులను గూర్చి చర్చిస్తూ ఉన్నాం. అప్పుడు మాకు తెలియదు ఆ రోజు మేము చూడబోతున్నది ఒక మహత్తరమైన కార్యక్రమమని. 'న భూతో న భవిష్యతి ' అన్నది ఈ మధ్య అన్నిటికీ వాడేస్తున్నారు కానీ, సరిగ్గా ఆ కార్యక్రమానికి అతికినట్టు సరిపోతుంది.

ఇలాంటి సమావేశాల్లో మా విద్యార్థులంతా తమ తమ ప్రతిభలను విచ్చలవిడిగా ప్రదర్శించుకుంటారు అని చెప్పాను కదా, ఆ సాయంకాలపు వేళ మాకు చూపబోతున్న ప్రతిభ 'వ్యాపార ప్రకటనలు నటించి చూపుట '. అవాక్కయ్యారా? సినిమా వాళ్ళలాగే మా విధానం కూడా 'కాదేదీ ప్రదర్శనకనర్హం'.


ముందుగా అశ్విని హెయిర్ ఆయిల్ ప్రకటన..


'అశ్విని అశ్విని అశ్విని ...శిరోజాల సంరక్షిణి

దివి నుంచి భువికి దిగివచ్చిన అమృతవర్షిణి అశ్విని '

ఆ ప్రకటన చిన్నప్పుడు వచ్చేది..మీలో చాలా మంది చూసే ఉంటారు..

'రాలే జుట్టును అరికట్టునులే..' అన్నప్పుడు ఒకావిడ పాదాల పొడవు జుట్టేసుకుని గిర్రని బొంగరంలా తిరుగుతుంది...


ఈ ప్రకటన పూర్తయ్యేసరికి మాలో చాలా మందికి నవ్వి నవ్వి పొట్ట చెక్కలయ్యింది. ఇంతకీ సంగతేంటంటే..ఈ ప్రకటనలో నటించిన నివేదితది బాబ్ కట్. అది కనపడకుండా తనకు విగ్గు పెట్టారు. గిర్రని తిరిగినపుడు ఆ విగ్ కాస్తా కింద పడింది. తన్మయత్వంలో అది గ్రహించకుండా తను 'అశ్విని..అశ్విని...' అని పాడుతూనే పోయింది.


ఆ నవ్వుల నుండి కోలుకోకముందే ఇంకో ప్రకటన మొదలయ్యింది


అది ఫెవికాల్ యాడ్, ఒక ఫెవికాల్ డబ్బా తీసుకొచ్చి స్టేజ్ మీద మాకెదురుగా పెట్టారు, మళ్ళీ ఈ ప్రకటన మరోటి, మరోటి అనుకోకుండా. ఒక దళసరిగా ఉన్న తాడును ఇటో కొసా అటో కొసా పట్టుకున్నారు కొంతమంది. ఆ తాడు తెగి లేదు కాని తెగినది ఫెవికాల్ తో అంటించారు అని చెప్పడానికన్నట్టుగా ఒక ప్రదేశం లో ఒక చిన్న ముడి వేసి ఫెవికాల్ అని రాసి ఉన్న కాగితం అంటించారు. అంతా బాగానే ఉంది కాని తాడును ఒక వైపు లాగుతున్నవాళ్ళలో 'అభినవభీమ ' గా పేరుపొందిన శివప్రసాద్ కూడా ఉన్నాడు. వాడు ఒక వైపు లాగుతున్నాడనేసరికి మాకందరికీ ఆందోళన మొదలయ్యింది. అందులోనూ ఇరువైపుల సమాన బలం ఉండేలా చేయాలని నిర్వాహకులు ఒకరిద్దర్ని తప్పించి స్కూలు మొత్తాన్ని మరోవైపు నిల్చోపెట్టారు.

వాళ్ళు నటించడం మొదలుపెట్టారు..


"గట్టిగా లాగు హైస్సా

బలంగా లాగు హైస్సా

జోరుగా లాగు హైస్సా'



ఒక అరనిముషం నటించేసరికి నటన అన్న సంగతి మర్చిపోయి జీవంచడం మొదలుపెట్టాడు ప్రసాద్ . మేమేమీ తక్కువ తినలేదన్నట్టు అటు వైపు వాళ్ళు కూడా వాళ్ళ బలం కొద్దీ లాగారు. ఊహించినదే జరిగింది. తాడు సరిగ్గా కాగితం పెట్టిన చోటే తెగింది. అటు పడ్డ వాళ్ళు బాగానే ఉన్నారు, ఇటు వైపు మొదట నిల్చున్నది మన బాల బకాసుర్ కదా వాడు మీద పడేసరికి వెనక నిల్చున్న నలుగురు కోమాలోకి వెళ్ళినంత పనయ్యింది.

దానితో ఆ మహత్తర కార్యక్రమానికి తెర పడింది.


కథ కంచికి .....మేము ఇంటికి ......
ఇక్కడితో సమాప్తం .......