Pages

30, మే 2022, సోమవారం

శుభలేకొచ్చింది...

 

"అయ్యగారు సుభరేకంపారండి..." 

డొక్కు సైకిల్ని డొంకవార జారేసి, చెప్పులు అక్కడే విప్పేసి, లోపలికొచ్చి శుభలేఖ నా చేతికిచ్చిన అతన్ని ఆగమని చేత్తోనే సైగచేసి లోపలికి పరిగెత్తా. 

డబ్బాలో ఉన్న చిల్లర డబ్బుల్లోనుంచి ఓ నాణెం పట్టుకొచ్చి అతని చేతిలో వేశాను, ఎటూ అమ్మకి చెప్పినా డబ్బులిమ్మనే చెబుతుంది కదా అని.."సిత్తం" అనేసి వెళ్ళిపోయాడు.

ఘుమఘుమ లాడిపోతున్న శుభలేఖ చదువుదామని తీసేలోగా అమ్మ వచ్చేసింది,

"ఎవరిదీ శుభలేఖా?" అంటూ. వివరం చెప్పాను.
"డబ్బులిచ్చి పంపావా?" అని అడిగి, 

"నేనూ వెళ్తానమ్మా" అని ప్రయాణం అయిపోయాను. 

"ఊ..ఊ... మొదలైంది చీమకి పెళ్లి ప్రయాణం,
" అంటూనే "పైకి చదవరా శుభలేఖ నేనూ వింటాను.." అని అడిగింది,
కళాపి జల్లుతూ......


"యెంత మంచి వాసన వస్తోందో అమ్మా శుభలేఖ.. నాలుగు పక్కలా పసుపు బొట్టుతో పాటు, ప్రత్యేకం సెంటు కూడా రాశారు" అని నేను ఆశ్చర్యాలు పోతున్నానో లేదో...

"నీ మొహం... ఆ పసుపులోనే కాస్త సెంటు కూడా కలిపి ఉంటారు.. ప్రత్యేకం రాయడం ఎందుకూ?" అని అడిగింది. 

అమ్మ చెప్పింది విన్నాక, శుభలేఖని పరీక్షిస్తే నిజమే అని తేలింది..
పోన్లే.. ఓ కొత్త విషయం తెలిసింది..

రేప్పొద్దున్న నా పెళ్ళప్పుడు పనికొస్తుంది కదా అనుకున్నాను మనసులో.. ఆ మాటే పైకంటే క్షణం ఆలస్యం లేకుండా జరిగిపోతుంది పెళ్లి, ఏ చీపురు కట్టతోనో.

"అయిందా వాసన చూడ్డం? అక్షరాలు కూడబలుక్కుంటున్నావా?? ఎంతసేపూ చదవడం..." అంది అమ్మ కొంచం ధాటీగా.


పెళ్లి ఆలోచనల్లోనుంచి బయట పడి
"కూడబలుక్కోడం ఎందుకమ్మా? నాకు చదవడం వచ్చు కదా.."

అంటూనే శుభలేఖ చదవడం మొదలు పెట్టాను...
శ్రీరస్తు... శుభమస్తు.. అవిఘ్నమస్తు.. శ్లో.. ఇంతలో ఓ ఆలోచన వచ్చింది.. 

ఈ శ్లోకానికి అర్ధం చెప్పేసి అమ్మని మెప్పిస్తే?? చూడ్డానికి సులువుగానే ఉంది... అర్ధమవుతోంది కూడాను...ఇదేదో బాగానే ఉందనుకుంటూ శ్లోకం పైకి చదవడం మొదలుపెట్టాను.. 

"శ్రీరామ పత్నీ... జనకస్య పుత్రీ... అంటే... శ్రీరాముని యొక్క భార్య .. జనకుని యొక్క కుమార్తె... రైటే కదా అమ్మా?" ..."రైటే..రైటే ... మీ బళ్ళో చేప్పేరేవిట్రా?" ...

"లేదమ్మా.. నాకే అలా తోచింది... తర్వాత చదువుతా ఉండు.."

"సీతాంగనా... సుందర కోమలాంగీ.... అంటే అందమైన సీత అనే కదా అర్ధం?" ..."అవును...

 పెళ్లి ఎప్పుడో చెబితే, మీ నాన్నగారికి గుర్తు చేద్దాం అని నిన్ను శుభలేఖ చదవమన్నాను.. 

 కాస్త ఆ ముహూర్తం ఒక్కటీ ముందు చెప్పెయ్ ..." ..."ఉండమ్మా... వరసగా చదువుతున్నాను కదా...

 " ఈ అర్ధం చెప్పడం నాకు భలే సరదాగా ఉంది నిజానికి... 

 వేసంకాలం సెలవుల్లో 'గణపతి' పుస్తకం చదివానేమో ..

 స్కూలు మేష్టారు ఉద్యోగం చేసే రోజుల్లో కథా నాయకుడు గణపతి

 "శ్రీ రఘురామ.. చారు తులసీ దళధామ" పద్యానికి తాత్పర్యం చెబుతూ "వనవాసంలో శ్రీరాముడు చారు కాచుకొనెను.. 

 కర్వేపాకు దొరక్క పోవడంతో ఆయొక్క చారుని తులసీ దళాలతో కాచుకొనెను" అని చెప్పడం గుర్తొచ్చింది..


మళ్ళీ శుభలేఖలోకి వస్తూ "భూగర్భ జాతా... భువనైక మాతా.... అమ్మా.. భూగర్భ జాత అంటే సీతే కదా... భూమిలో దొరికింది కదా నాగలి దున్నుతూ ఉంటే?"

 అని నా పురాణ జ్ఞానం ప్రదర్శించేసరికి, అమ్మ బోల్డంత మురిసిపోయి, కళాపి చల్లిన వాకిట్లో  ముగ్గేయడం మొదలు పెట్టింది.. 

 "భువనైకజాత జాత అంటే ఏమిటో తెలియడం లేదు కానీ, సీతే అయి ఉంటుంది కదా అమ్మా..." అమ్మకి సహనం కొంచం తగ్గినట్టుంది.. 

 "అవతల బోల్డంత పని ఉంది.. తర్వాత ఏమిటో తొరగా చదువు న..." అంది, మరీ విసుక్కోకుండా, అలాగని మరీ ముద్దుచేసేయకుండా.. తర్వాత లైను తెలిసినట్టే ఉంది కానీ తెలియడం లేదు..


"వధూ వరాభ్యం వరదా భవంతు... అమ్మా... వధూ వరాభ్యం అంటే వధూ వరులు కదా..." నా ఉత్సాహం తగ్గడం అమ్మ కనిపెట్టేసింది... "

 అవును.. తర్వాత మాటకి కూడా అర్ధం చెప్పేసి, మిగిలిన శుభలేఖ చదువు..." ....ఏవిటి చదవడం?? "వరదా భవంతు అంటే... 

అమ్మా.. మరీ..." ఏమన్నా మాట సాయం అందుతుందేమో అని చూశా.. అబ్బే.. నాకు అమ్మ కదూ..

 "ఊ మరి? చెప్పూ" ... "అంటే.. వధూవరులిద్దరూ వరదల్లో కొట్టుకుపోకుండా ఉందురుగాక అని అయి ఉంటుంది" అన్నాను కొంచం అనుమానంగా... 

 అమ్మ అక్కడ నిలబడలేక, కొబ్బరి చెట్టుకి ఆనుకుని ఒకటే నవ్వడం... 

 "ఇంకా నయం.. వరదల్లో కొట్టుకుపోదురు గాక.. అన్నావు కాదు" అంటూ...

పెళ్లి శుభలేఖలో ఈ పద్యం చూసినప్పుడల్లా గుర్తొచ్చే జ్ఞాపకం ఇది..