Pages

1, నవంబర్ 2021, సోమవారం

తిప్పుడు పొట్లం

అప్పుడు నాకు తొమ్మిది/పదేళ్ళు.
ఎప్పటిలాగే ఆ సంవత్సరం కూడా దీపావళి హడావిడి మొదలయ్యింది.
అప్పటి పరిస్థితి ఏమిటంటే మతాబులు, కాకర పువ్వొత్తులు కాల్చడం మరీ చిన్నతనం, టపాకాయలు కాల్చడం మరీ పెద్దతనం.
ఏం చెయ్యాలి మరి? అసలే దీపావళి అంటే నెల్లాళ్ళ ముందు నుంచే మతాబా గొట్టాలు చేసే పని మొదలైపోతుంది ఇంట్లో. మరో పక్క టపాకాయల హడావిడి.
మతాబా మందూ, సూరే కారం, మన్నూ మశానం.. మొత్తం కలిపి చిత్ర విచిత్రమైన వాసనలు.


నేనంత ఉత్సాహంగా ఉండకపోడం తాతయ్య దృష్టిలో పడింది.
ఒళ్లో కూర్చో పెట్టుకుని ఆ కబురూ, ఈ కబురూ చెప్పి నా బాధేమిటో కూపీ లాగారు.
"ఓస్.. ఇంతేనా.. నీకీ సంవత్సరం తిప్పుడు పొట్లం చేయిస్తాను కదా.." నాకేమో మిఠాయి పొట్లం తెలుసు కానీ తిప్పుడు పొట్లం ఏమిటో తెలీదు.
కనీసం ఆ పేరు కూడా వినలేదు. మా ఊళ్ళో నా ఈడు పిల్లలెవరూ అప్పటి వరకూ ఎవరూ తిప్పుడు పొట్లం కాల్చలేదని తెలిసి బోల్డంత గర్వ పడ్డాను.
ఇక అది మొదలు ఎప్పుడెప్పుడు దీపావళి వస్తుందా అని ఎదురు చూడడమే..


తాతయ్య చిన్నప్పుడు ఇంట్లో పిల్లలంతా తిప్పుడు పొట్లం తిప్పుకునే వాళ్లుట..
కావాల్సిన సరంజామా అంతా వాళ్ళే సమకూర్చుకునే వాళ్లుట..
"ఏమేం కావాలో చెబుతాను.. తెచ్చుకుని ఒక చోట పెట్టుకో" అని తాతయ్య చెప్పడం ఆలస్యం, మరుక్షణం నేను వేట మొదలు పెట్టాను.
తాతయ్య అభయ హస్తం ఉంది కాబట్టి నాన్న భయం లేదు.
ముందుగా డొక్క పొట్టు తెచ్చి ఎండబెట్టాలి.
కొబ్బరి పీచుతో డొక్క తాళ్ళు పేనే లక్ష్మమ్మ గారి ఇంటి చుట్టూ నాలుగైదు ప్రదక్షిణాలు చేసి తడి తడిగా ఉన్న డొక్క పొట్టు సంపాదించా.


నెక్స్ట్ ఐటెం చితుకులు.
 అర్ధమయ్యేలా చెప్పాలంటే తాటికాయల గుత్తి లో కాయలు రాలిపోయాక మిగిలి ఉండే ఖాళీ గుత్తులన్న మాట.
తాటి తోపు చుట్టూ తిరిగి ఎన్ని సంపాదించానంటే.. అవి చూసి అమ్మ బోల్డంత సంతోష పడింది.. తిప్పుడు పోట్లానికి పోను మిగిలిన వాటితో ఒక నెల్లాళ్ళ పాటు వేడి నీళ్ళు కాచుకోవచ్చని. తగుమాత్రం చితుకులని ఎండ బెట్టి, కాల్చి బొగ్గులు చేసి, ఆ బొగ్గులని మరీ మెత్తగా కాకుండా పొడి కొట్టి పక్కన పెట్టేసరికి నా శరీర చాయ కృష్ణ వర్ణానికి మారింది.

తిప్పుడు పొట్లం చేయడానికి కావాల్సిన మరో ముఖ్యమైన వస్తువు ఉప్పు. 
అదెలాగో ఇంట్లో పెద్ద జాడీ నిండా సమృద్ధిగా ఉంటుంది.
 "ఇదిగో.. రేప్పొద్దున్న మీరు ఏడాదికి కొన్న ఉప్పు అప్పుడే అయిపోయిందా అంటారు.. తాతా మనవళ్ళు వేరే ఉప్పు కొనుక్కోండి.. ఇంట్లోది ఇవ్వను" అని బామ్మ పేచీ పెట్టింది. 
 అలాంటివి పట్టించుకుంటే తాతయ్య గొప్పదనం ఏముంది?  పాత నేత చీర కనీసం సగం ముక్కైనా కావాలి.. బామ్మని అడుగుదాం అనుకున్నాను కానీ.. "నా దగ్గర ఉందిరా.." అని అమ్మ ఇచ్చేసింది. ఒక తాటాకు కావాలిట.. తాతయ్య భూషణం చేత తెప్పించారు.


తెల్లారితే దీపావళి..
అయినా ఇల్లలకగానే పండుగ కాదు కదా..
తిప్పుడు పొట్లం అలకడానికి పేడ, మట్టి కావాలనేసరికి, కొమ్ముల గేదె దగ్గరికి కొంచం భయం భయంగా వెళ్లి పేడ తెచ్చేశా.
తిప్పుడు పొట్లం ఎలా ఉంటుందో, ఎలా కాల్చాలో నా ఊహకి అస్సలు అందడం లేదు..
 తాతయ్యని అడిగినా "చేసి ఇస్తాను కదా.." అంటున్నారు తప్ప ఇంకేమీ చెప్పడం లేదు.
 ఇంక నేను చేసేదేముంది? తాతయ్య తిప్పుడు పొట్లం ఎలా చేస్తారో చూడడం తప్ప.


ముందుగా చీర ముక్కని అడ్డంగా మడతలు వేసి నిలువుగా పరిచారా.. దానిమీద ఎండబెట్టిన డొక్క పొట్టు, చితుకుల పొడి, ఉప్పు అన్నీ కలిపి సమంగా పరిచారు, తాతయ్య నాన్న కలిసి. ఇప్పుడు చీర ముక్కని రిబ్బన్ చుట్టినట్టుగా చుట్టుకుంటూ వెళ్ళారు, డొక్క పొట్టూ అవీ ఒలికి పోకుండా.. మొత్తం చుట్టేశాక పురికొస తాడుతో గట్టిగా కట్టేశారు.
అప్పుడు తాతయ్య అమ్మని కేకేసి ఆ మూట చుట్టూ రెండు సార్లు అలకమన్నారు.. "నాకు తెలుసండీ మావయ్య గారూ.. మా చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం" అని వినయంగా చెప్పింది అమ్మ. మొత్తానికి ఒక పేడముద్ద లా తయారైన ఆ వస్తువు ని చూడగానే సగం ఆసక్తి పోయింది నాకు.


"అప్పుడే అయిపోలేదురా.. ఇంకా బోల్డంత పని ఉంది.. దీన్ని బాగా ఎండ బెట్టు.." చెప్పారు తాతయ్య. వీధిలో మంచం వేసి మతాబాలు, చిచ్చు బుడ్లు, జువ్వలు వాటన్నింటితో పాటూ పొట్లాన్ని కూడా ఎండ బెట్టాను. "బాగుంది తిప్పుడు పొట్లం.. మిగిలిన వాటికి దిష్టి తగలకుండా.." తాతయ్య వినకుండా బామ్మ వెక్కిరించింది. దీపావళి రోజు మధ్యాహ్నానికి ఫెళఫెళ్ళాడుతూ ఎండిపోయింది ఆ తిప్పుడు పొట్లం. సాయంత్రం అవుతుండగా భూషణం వచ్చాడు. ఎండిన తాటాకులో కమ్మ మాత్రం ఉంచి, ఆకుని విడగొట్టేశాడు. ఆ కమ్మని ఒక ఉట్టిలా తయారు చేసి అందులో పొట్లాన్ని పెట్టి కదలకుండా కట్టేశాడు.


అది మొదలు నేను దివిటీలు కొట్టేస్తాననడం.. బామ్మేమో కాసేపు ఆగమనడం.. దివిటీలు కొట్టాక కూడా తిప్పుడు పొట్లం కాల్చడానికి తాతయ్య ఒప్పుకోలేదు.. "చీకటి పడ్డాక అయితే బాగుంటుంది" అనడంతో ఇష్టం లేకపోయినా మతాబాలూ అవీ కాల్చాను కాసేపు. చీకటి పడ్డాక తిప్పుడు పొట్లం లో పైన నిప్పు వేసి, ఓ రెండు తిప్పులు తిప్పి చూపించి పొట్లాన్ని నా చేతికి ఇచ్చారు తాతయ్య. తాటి కమ్మ పట్టుకుని వడిసెల తిప్పినట్టు గిరగిరా తిప్పితే పొట్లం లోపల నిప్పు రాజుకుని ఉప్పు కళ్ళు ఠాప్ ఠాప్ మని పేలడం.. బొగ్గు పొడి, కొబ్బరి పొట్టూ కలిసి మెరుపుల్లా బయటకి రావడం. ఎంత స్పీడుగా తిప్పితే అన్ని మెరుపులు.


మొదట్లో చాలా ఉత్సాహం గా ఉంది కానీ, రాను రానూ చెయ్యి నొప్పెట్టడం మొదలెట్టింది.. మెరుపులు బయటికి రావడం మినహా ఏ ప్రత్యేకతా లేదు తిప్పుడు పొట్లంలో.. ఎంత సేపు తిప్పినా ఎప్పటికీ అవ్వడం లేదన్న విసుగు.. అక్కడికీ 'కాసేపు మీరు కూడా తిప్పండి.. ఎంత బాగుందో' అని ఇంట్లో వాళ్ళని ఊరించా.. అబ్బే.. వింటేనా.. ఇలా కాదని "మిగిలింది రేపు మిగులు దీపావళి కి తిప్పుతా తాతయ్యా.." అన్నాను.. అలా కుదరదుట.. ఒకసారి వెలిగిస్తే పూర్తవ్వాల్సిందేట..


చేతులు మార్చుకుంటూ, స్పీడు బాగా తగ్గించి తిప్పుతుంటే చూసి కాసేపటికి తాతయ్య జాలి పడ్డారు.. "ఇంక చాల్లే.. పక్కన పడేయ్.." అనడంతో ప్రాణం లేచొచ్చింది. "ఇంతోటి సంబరానికి నా ఉప్పు జాడీ ఖాళీ చేసేశావా " అన్న బామ్మ మాటలు విన్నట్టు నటించా..

ఇంకా దీపావళి  కి నాలుగు రోజులు ఉంది కనుక కుదిరితే ట్రై చేయండి మీరు కూడా .... 

చేతులు నొప్పి పేడతాయి జాగ్రత్త సుమీ