ఇంట్లో అందరికీ మనమీద కోపం రావడం ఒక ఎత్తైతే, అమ్మకి కోపం రావడం మరో ఎత్తు. ఇంకెవరి కోపాన్నీ పెద్దగా పట్టించుకోక పోయినా పర్లేదు కానీ, అమ్మతో అలా కుదరదు. బోయినం మాట అటుంచి, మంచి నీళ్ళు కూడా సరిగా ముట్టవు. నాన్నకి కోపం వస్తే నాలుగు దెబ్బలు వేస్తారు. ఆ వెంటనే కోపం మర్చిపోతారు. కానీ అమ్మ అలా కాదు, ఏమీ అనదు కానీ అస్సలు మాటాడదు. మనం వెనక వెనకే తిరిగినా సరే అస్సలు మన వంక చూడనన్నా చూడదు.
అసలు అమ్మకి కోపం ఎందుకు వస్తుంది? మనం ఏదో ఒక పిచ్చి పని చేస్తేనే కదా?? 'వెర్రిదీ అమ్మేరా... పిచ్చిదాని కోపంరా..' అన్నాడు కదా ఓ సినిమా కవి. మనం తెలిసో తెలియకో చేసే పిచ్చి పనులు అమ్మకి మన మీద పిచ్చి కోపం రప్పిస్తాయన్న మాట. నాలుగు కొట్టాలనిపించినా గబుక్కున చేతులు రావు కదా, అందుకని ఏవీ అనకుండా ఊరుకుంటుంది.
ఒకసారి నేను అమ్మతో పేరంటానికి వెళ్లాను. ఆ పేరంటానికి రాజ్యంగారమ్మాయి కొత్త చీర కట్టుకుని వచ్చింది. అందరూ ఆ చీరని ఒకటే మెచ్చుకోవడం. ఇంతలో నేను చేసిన ఓ పొరపాటు వల్ల ఆ చీరమీద మరక పడింది.చిన్న మరకే అయిన కొత్త చీర కదా, పైగా ఆ అమ్మాయి మొదటిసారి చీర కట్టుకుంది కూడాను, పేరంటానికి వచ్చిన అందరూ 'అయ్యో పాపం' అనడవే. ఏం చెయ్యాలో తెలీక నేను ఇంటికెళ్ళిపోయాను. తర్వాత కాసేపటికి అమ్మొచ్చింది. ఏవీ మాటాడలేదు.. ఒకటీ రెండూ కాదు ఏకంగా మూడు రోజులు.
అది మొదలు అమ్మకి చాలా సార్లే కోపం వచ్చింది నా మీద. ఎక్కువగా అల్లరి చేసినప్పుడూ, ఆటల్లో దెబ్బలు తిని వచ్చినప్పుడూ, బళ్ళో మేష్టారు నామీద కోప్పడ్డప్పుడూ, బామ్మ గట్టిగా గసిరినప్పుడూ, పరీక్షల్లో మంచి మార్కులు రానప్పుడూ ఇలా.. ఒక్కోసారి అమ్మకి నామీద ఎందుకు కోపం వచ్చిందో కూడా తెలిసేది కాదు. కోపం వచ్చినదని మాత్రం తన ముఖం చూడగానే తెలిసిపోయేది.. కారణం తర్వాతెప్పుడో తెలిసేది. నేను అల్లరేక్కువ చేస్తున్నానో, ఇంకోటనో ఎవరన్నా అమ్మకి చెప్పినా అమ్మకి నామీదే కోపం వచ్చేసేది మరి.
నేను బడి నుంచి ఇంటికి వచ్చేసరికి ఎప్పటిలాగా నవ్వుతూ ఎదుర్రాకుండా ముఖం గంటు పెట్టుకుని తన పన్లు తను చేసుకుంటోందంటే అమ్మకి నామీద కోపం వచ్చేసినట్టే. ఇంక నేనెంత వెంటబడి మాటాడినా విననట్టు నటిస్తుంది. నాకేవీ పనులు చెప్పదు. నేను చెయ్యబోయినా చెయ్యనివ్వదు. మొదట్లో అమ్మకి కోపం వస్తే నాకు భయం, బాధా వచ్చేసేవి కానీ, రాన్రాను అమ్మ కోపం పోగెట్టే ఉపాయం తెలిసిపోయింది. ఏవీలేదు, అమ్మకి కోపం రాగానే అన్నం ఎప్పుడూ తినేంత కాకుండా కొంచమే తినడం.
మొత్తం మానేస్తే నాన్న తంతారు కానీ, ఆకల్లేదు అని కొంచం తిని ఊరుకుంటే ఏవీ అనలేరు కదా. ఈ ఉపాయం మాత్రం బ్రహ్మాండంగా పనిచేసింది. ఓ పూటో రోజో చూసి అమ్మ వెంటనే మాటాడేసేది. తర్వాతేవో మంచి మాటలు చెప్పేది. నేను బుద్ధిగా వినేదానిని. మళ్ళీ కథ మామూలే.