"దేవుడా దేవుడా గాట్టి వర్షం కురిపించు.." పొద్దు పొద్దున్నే నిద్ర లేవగానే ఆకాశంలో మబ్బులు కనిపిస్తే నేను దేవుణ్ణి కోరుకునే చిన్న కోరిక ఇది.
బాగా వర్షం వస్తే బడికి వెళ్ళక్కర్లేదు కదా మరి. మా బళ్ళో ఉండే రెండు గదుల్లోనూ ఒకటి బంగాళా పెంకులది, రెండోది తాటాకుతో కప్పింది. వానొచ్చిందంటే నీళ్లన్నీ మామీదే. అందుకని పెద్ద వర్షమొస్తే బడికి సెలవన్న మాట. అసలు బళ్ళో కూర్చోడం మాటెలా ఉన్నా, మేష్టార్లు బడికి రావాలన్నా వీలు పడదు. బురద రోడ్ల మీద సైకిలు దొర్లించుకుంటూ రావడం చాలా కష్టం మరి.
బడికి సెలవిచ్చేస్తే ఎంచక్కా ఎంత బాగుంటుందో. మామూలుగా ఆదివారం నాడు సెలవిస్తారనుకో. అయినా కానీ ఇలా మధ్య మధ్యలో సెలవులోస్తే భలేగా ఉంటుంది. మనం చద్దన్నం తినేసి బడికి బయలుదేరే లోపే ఎవరో ఒకరు "ఇవాళ బళ్ళేదు" అని చెప్పేస్తారు కదా.
అప్పుడు పుస్తకాల సంచీని అమ్మకీ, నాన్నకీ కనిపించకుండా దాచేయాలి. ఎదురుకుండా సంచీ కనిపిస్తుంటే "చదువుకో" అని ప్రాణాలు తోడెయ్యరూ, అందుకన్న మాట. పాఠాలన్నీ వచ్చేశాయ్ అన్నా వినిపించుకోకుండా, "మళ్ళీ చదువుకో" అనో "ఎక్కాలు నేర్చుకో" అనో ఆర్డర్లేస్తారు.
బయట బాగా వర్షం పడుతోందనుకో, మూల గదిలోకి వెళ్లి కిటికీ దగ్గరకి తలొచ్చేలా పెద్ద మంచం మీద పడుకోవాలి. అప్పుడైతే వర్షం ఎలా కురుస్తోందో బాగా చూడొచ్చు.
ఒక్కోసారి ఊరంతా చీకటిగా అయిపోయి, ఉరుములూ అవీ వస్తూ, లావు లావు ధారలుగా వర్షం కురుస్తుంది చూడు, అలాంటప్పుడైతే భయమేస్తుంది కానీ, మామూలు వర్షమైతేనా ఎంతసేపైనా అలా చూస్తూ ఉండిపోవచ్చు. మధ్య మధ్యలో వచ్చే మెరుపులు భలేగా ఉంటాయి. చూరు మీద నుంచి నీళ్ళు ధారలు ధారలుగా పడ్డప్పుడు కింద నేలంతా చిల్లులు పడి చిన్న చిన్న చెరువుల్లా అయిపోతుంది. అప్పుడు కనక వర్షం తగ్గిందంటే ఆ నీళ్ళలో పడవలు ఆడుకోవచ్చు.
చెరువంటే గుర్తొచ్చింది. మూల గదిలో కూర్చున్నామంటే తోట లో వర్షం కురవడం చూడొచ్చు. అసలే తోట నిండా నీళ్ళా? ఆ నీళ్ళలో మళ్ళీ బోల్డు బోల్డు నీళ్లన్న మాట. ఒక్కోసారి తోట పొంగిపోతుందేమో అని భయమేస్తుంది కానీ, అలా వర్షం కురవడం మాత్రం ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది. బాగా దూరంగా చూస్తే అక్కడ వర్షం కూడా మంచులాగే కనిపిస్తుంది.
వానొచ్చిందంటే తోట తిరిగే నీరుకట్లూ, బురదపాములూ మండువాలోకి వచ్చేస్తాయి. కర్రుంది కదా అని వాటిని చంపెయ్యకూడదు.తాచుపామైతేనే చంపాలి. కానీ హమ్మో.. తాచుపాముని చంపడం అంత సులువేంటి? నాన్నైతే ఒక్క దెబ్బకి చంపేస్తారనుకో. కాకపొతే ఈ బుడత పాముల్ని చూసి 'పాము' 'పాము' అని అరిచి కాసేపు బామ్మని ఖంగారు పెట్టొచ్చు.
ఎంత చద్దన్నం తిని ఊరికే కూర్చున్నా టైంకి ఆకలెయ్యక మానదు కదా.
అలా అని "తినడానికి ఏవన్నా పెట్టు" అని అమ్మని పీక్కు తినకూడదు. తనకి చెయ్యి ఖాళీ అయ్యాక తనే పెడుతుంది. పొద్దున్నైతే ఒకటే హడావిడిగా ఉంటుంది కానీ, మధ్యాన్నం బోజనాలైపోయాక అమ్మక్కొంచం ఖాళీ దొరుకుతుంది కదా..
అప్పుడు ఏ వేరుశనగ గుళ్ళో వేయించి పెడుతుంది. కొంచం బెల్లమ్ముక్క కూడా తనే ఇస్తుందిలే, మళ్ళీ పైత్యం చేయకుండా.
బామ్మైతే వర్షం వచ్చినప్పుడల్లా తన చిన్నప్పటి ఫ్రెండ్సులకి ఎవరెవరికి వర్షాల్లో ఏమేం దొరికాయో కథలు కథలుగా చెప్పేస్తుంది. వర్షం తగ్గిపోయాక బురదగా ఉంటుంది కదా. బామ్మ ఫ్రెండ్సులు ఆ బురదలో కర్రతో తవ్వే ఆట ఆడుతుంటే ఒకళ్ళకి గొలుసూ, మరొకళ్ళకి ఉంగరమూ (రెండూ నిజం బంగారమే) దొరికాయిట. వాళ్లకి అదృష్టం ఉందిట. నేను వెతుకుదామనుకున్నా తను పడనివ్వలేదు. ఎప్పుడూ ఉండే గొడవే జొరం వస్తుందని. అయినా ఎవరూ చూడకుండా నేను వెతికాననుకో. కానీ నాకు అదృష్టం లేదు.
మామూలప్పుడైతే అన్నం వేడి వేడిగా ఉంటే అస్సలు తినలేమా.. అదే వర్షం వచ్చినప్పుడైతే వేడన్నం ఊదుకుంటూ తింటే ఉంటుందీ.. అది అరిటాకులో .అదే రాత్రప్పుడైతే పెరుగన్నం అవుతుండగానే నిద్ర ముంచుకొచ్చేస్తుంది. కడుపులో వేడి వేడిగా ఉంటుంది కదా మరి. అప్పుడు నిండా రగ్గు కప్పేసుకుని గాట్టిగా కళ్ళు మూసేసుకుంటే వర్షం చప్పుడు,మధ్యలో తోట లొంచి కప్పల బెకబెకలు వినిపించీ అలా అలా నిద్రలోకెళ్లిపోతాం.
తెల్లారిందంటే మళ్ళీ బళ్ళోకెళ్ళాల్సిందే. .......................
ఎంత మనం రోజూ దండం పెట్టుకుంటే మాత్రం,
వానదేవుడు మనూళ్ళోనే రోజూ వర్షం కురిపించెయ్యడు కదా.
మిగిలిన ఊళ్లలో కూడా మనలాంటి పిల్లలుంటారు కదా మరి!!!!!!!!!!

